కర్ణాటక : జిల్లాలోని హుణసూరు పట్టణంలో హృదయ విదారక సంఘటన జరిగింది. ఓ వ్యక్తి భార్యను, ఇద్దరు పిల్లలను హత్య చేసి, తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారంలో నష్టాలే కారణమని అనుమానాలున్నాయి.
వివరాలు... పట్టణంలోని న్యూ మారుతి బరంగాయ్‌కు చెందిన హరీష్ (49), భార్య నిష్ఠ (36), పిల్లలు నిక్షా (12), రక్ష (8)తో నివసిస్తున్నాడు. ఫైనాన్స్, వడ్డీ వ్యాపారం చేసే హరీష్ , మూడు రోజుల క్రితం తన తల్లిని వాళ్ళ అమ్మ ఇంటికి పంపించాడు. సోమవారం రాత్రి కింది అంతస్తులో తన భార్య, పిల్లల ముక్కులకు, నోళ్లకు ప్లాస్టర్ అతికించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత మొదటి అంతస్తుకు వెళ్లి ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో జరిగిందని అనుమానిస్తున్నారు.
ఇరుగుపొరుగు అనుమానంతో..
మంగళవారం ఉదయం 9 గంటలైనా తలుపులు తెరవకపోవడతో ఇరుగుపొరుగు వారు కిటికీలోంచి చూసి ఏదో జరిగిందని కనుగొన్నారు. పట్టణ పోలీసులకు తెలుపగా తలుపులు బద్ధలుకొట్టి లోపలకు ప్రవేశించారు. నలుగురి మృతదేహాలు కనిపించాయి. అక్కడ లభించిన డెత్ నోట్‌ను స్వా«దీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫలానా ఆస్తి పత్రాలు ఎక్కడ ఉన్నాయో, ఎవరికి ఇవ్వాలో అందులో రాశాడు. పూర్తి లేఖ బయటకు రాలేదు. ఇరుకుటుంబాల బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి.


