నిరాహారదీక్ష విరమణపై కేంద్రానికి సోనమ్‌ వాంగ్‌చుక్‌ లేఖ | Sonam Wangchuk APPEAL Govt regarding breaking fast | Sakshi
Sakshi News home page

నిరాహారదీక్ష విరమణపై కేంద్రానికి సోనమ్‌ వాంగ్‌చుక్‌ లేఖ

Jul 22 2026 5:23 PM | Updated on Jul 22 2026 7:01 PM

Sonam Wangchuk APPEAL Govt regarding breaking fast

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ లేఖ రాశారు. విద్యార్థులపై కేసులు పెట్టబోమని స్పష్టమైన హామీ ఇస్తే నిరాహారదీక్ష విరమిస్తానని తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌కు లేఖ రాసి సోనమ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.  

‘‘నిన్న రాత్రి ఆసుపత్రికి వచ్చి నన్ను కలిసినందుకు, నా నిరాహార దీక్షను విరమించాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసినందుకు ధన్యవాదాలు. మన చర్చ సందర్భంగా ఈ కింది అంశాలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని మీరు నాకు హామీ ఇచ్చారు.

ప్రశ్నపత్రం లీక్ తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం అందించాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాను కూడా పరిశీలిస్తూ, జవాబుదారీతనం నిర్ధారించేలా పార్లమెంట్‌లో అర్థవంతమైన చర్చ జరపాలి. 2026 జులై 20న జరిగిన "చలో సంసద్" ర్యాలీ.. పోలీసులు అమానుషంగా వ్యవహరించినా, అధిక బలప్రయోగం చేసినా ప్రశాంతంగానే సాగింది. 

నిరసనకారుల సహనం, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాలన్న అంకితభావాన్ని దేశం, ప్రపంచం చూసింది. ఈ ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసులు పెట్టడం, వేధింపులకు గురిచేయడం, ప్రతీకార చర్యలకు దిగడం వంటివి చేయొద్దు. ప్రజాస్వామ్య సంస్థలపై వారి నమ్మకం దెబ్బతినకూడదని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను.

మీరు నన్ను కలిసిన తర్వాత, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన దాదాపు 65 మంది పార్లమెంట్ సభ్యులు నాకు లేఖలు రాశారు. కొందరు ఇప్పటికే వచ్చి కలిశారు. మరికొందరు ఈ సాయంత్రం రానున్నారు. దేశ సేవలో నేను ఇంకా ఎన్నో పనులు చేయాల్సి ఉందని గుర్తుచేస్తూ, నిరాహార దీక్షను విరమించాలని వారంతా కోరారు. వారి మాటతో నేను ఏకీభవిస్తున్నాను. నేను జీవించాలనుకుంటున్నాను. నా విద్యార్థుల వద్దకు, విద్యా రంగంలోకి, నా జీవితాన్ని అంకితం చేసిన పనిలోకి తిరిగి వెళ్లాలనుకుంటున్నాను. అయితే, ఈ ఉద్యమం ప్రారంభానికి కారణమైన యువత ప్రయోజనాలను పక్కనపెట్టి అలా చేయలేను.

Wangchuk: నిరాహార దీక్ష విరమిస్తా.. కానీ డిమాండ్లు నెరవేర్చాలి

అందువల్ల, ఈ ఉద్యమంలో పాల్గొన్న యువ నిరసనకారులపై ఎలాంటి శిక్షాత్మక చర్యలు, ప్రతీకార చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని గౌరవపూర్వకంగా కోరుతున్నాను. న్యాయమైన, జవాబుదారీతనం ఉన్న విద్యా వ్యవస్థను కోరుతూ తమ గొంతు వినిపించడమే వారు చేసిన ఏకైక "తప్పు".

అలాంటి హామీ వస్తే, ప్రభుత్వం నా విజ్ఞప్తినే కాదు, లక్షలాది మంది భారత యువత ఆకాంక్షలను కూడా ఆలకించిందన్న నమ్మకంతో నా నిరాహార దీక్షను విరమిస్తాను. అలాంటి హామీ రాకపోతే, నిరవధికంగా నా నిరాహార దీక్షను కొనసాగించక తప్పదు. ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి ఇకపై పోలీసులు అధిక బలప్రయోగం చేయరని కూడా ఆశిస్తున్నాను.

మన ప్రజాస్వామ్య భవిష్యత్తు, తనతో ఏకీభవించే వారితో ఎలా వ్యవహరిస్తుందన్న దానిపై ఆధారపడదు. ధైర్యం, ఆశ, దృఢ విశ్వాసంతో మాట్లాడే యువ పౌరులతో ఎలా వ్యవహరిస్తుందన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది’’ అని సోనమ్‌ వాంగ్‌చుక్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement