మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకున్న స్నేక్ మర్డర్ కేసులో భర్తను పాముతో కాటు వేయించి, హత్య చేసిన కేసులో నిందితురాలు దామినిని పోలీసులు విచారిస్తున్నారు. ‘నువ్వు చేసిన పనికి పశ్చాత్తాపం లేదా?’ అని పోలీసులు అని ప్రశ్నించగా, ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనం వహించింది. అయితే, తాను అతుల్‌తో కలిసి ఉండలేనని, తన జీవితం నరకప్రాయంగా మారిందని విచారణలో తెలిపింది. అతుల్, దామినిలకు 2019లో ప్రేమ వివాహం జరిగింది. ఆ తర్వాత పాఠశాల డ్రైవర్ తుషార్‌తో దామినికి సాన్నిహిత్యం పెరిగింది.
సుమారు 20 లక్షల రూపాయల బీమా సొమ్ము, వివాహేతర సంబంధమే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. అతుల్‌ను అడ్డు తొలగించుకునేందుకు తొలుత కారుతో ఢీకొట్టి హత్య చేయాలని ప్రయత్నించగా, హెల్మెట్ ధరించడం వల్ల అతను ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో పథకం మార్చిన నిందితులు ఇంటర్నెట్‌లో అత్యంత విషపూరితమైన పాము గురించి వెతికి, రూ. 15,000 అడ్వాన్స్ ఇచ్చి, పాములు పట్టేవారి సాయంతో పామును తెప్పించి, అతుల్ హత్యకు కుట్ర పన్నారు. ప్రస్తుతం పోలీసులు కాల్ డేటా, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: రాకెట్ సక్సెస్ కాల్‌లో బయటపడ్డ మోదీ ఫోన్ సీక్రెట్ ట్యూన్!


