దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సామాజిక ఉద్యమకారుడు, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ సాగిస్తున్న దీక్ష 21వ రోజుకు చేరుకోగా.. ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో నిన్న (శనివారం) ఉదయం బలవంతంగా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.. ఆయన నిరసనలో గీతాంజలి జె ఆంగ్మో కీలక పాత్ర పోషిస్తున్నారు. మూడు వారాలుగా నిరాహార దీక్ష చేసిన వాంగ్‌చుక్‌కు ఆమె నిరంతరం అండగా నిలిచారు. వాంగ్‌చుక్‌ను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆయన ఆశయాల కోసం ఆమె ముందుండి పోరాడుతున్నారు.
గీతాంజలి జె ఆంగ్మో ఎవరు? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏమిటనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది. సోనమ్ వాంగ్‌చుక్ గతంలో రెబెక్కా నార్మన్ అనే అమెరికన్ మహిళను వివాహం చేసుకోగా.. గీతాంజలి ఆయనకు రెండవ భార్య. ఆమె సామాజిక పారిశ్రామికవేత్త, విద్యావేత్త. సోనమ్ వాంగ్‌చుక్‌తో కలిసి ఆమె స్థాపించిన 'హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్, లడఖ్' కో-ఫౌండర్‌గా ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆమె హెచ్‌ఐఏఎల్ సంస్థకు వ్యవస్థాపక సీఈఓ, డీన్‌గా వ్యవహరిస్తున్నారు. హిమాలయ ప్రాంతాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, పర్యావరణ అనుకూల క్యాంపస్‌ల నిర్మాణం, సోలార్ హీటెడ్ భవనాల రూపకల్పన వంటి వాటిపై ఈ సంస్థ పనిచేస్తుంది. 2021లో భారత సైన్యం కోసం ప్రత్యేకంగా సోలార్ హీటెడ్ టెంట్లను కూడా ఈ సంస్థ అభివృద్ధి చేసింది.
ఒడిశాలోని బాలాసోర్‌లోని ఓ పంజాబీ కుటుంబంలో జన్మించిన గీతాంజలి.. ఫకీర్ మోహన్ యూనివర్సిటీ నుండి ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్, భువనేశ్వర్‌లోని ప్రముఖ జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. డెన్మార్క్‌తో పాటు విదేశాల్లో దాదాపు 15 ఏళ్ల పాటు కార్పొరేట్ రంగంలో పనిచేసిన ఆమె.. ఆ తర్వాత భారత్‌కి తిరిగి వచ్చి పారిశ్రామికవేత్తగా మారారు. పూషన్, షాంఘై పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, హెలియోస్ బుక్స్ వంటి పలు సంస్థలను స్థాపించారు.
గీతాంజలి కేవలం విద్యావేత్త మాత్రమే కాదు.. వేదాంతం, భగవద్గీత బోధించే ఆధ్యాత్మిక అన్వేషకురాలు. ప్రతిష్టాత్మక 'చెవెనింగ్ ఫెలో' అయిన ఆమె, భారత ప్రభుత్వం నుండి 'వుమెన్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా' జాతీయ అవార్డును అందుకున్నారు. వీటితో పాటు ఆమె కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు. ఒడిస్సీ, రష్యన్ బ్యాలెట్ నృత్యాలలో ప్రవేశం ఉంది. నాకంటూ ఒక స్వార్థ జీవితం కాకుండా.. సమాజం కోసం ఒక గొప్ప ఆశయంతో బతకాలని అనుకున్నాను. ఒక విద్యా సదస్సులో సోనమ్ వాంగ్‌చుక్‌ను కలిసినప్పుడు నా ఆలోచనలకు తగ్గ తోడు దొరికిందనిపించిందంటూ ఆమె గతంలో ఇంటర్వ్యూలో తెలిపారు.
సాధారణంగా లో-ప్రొఫైల్ మెయింటైన్ చేసే గీతాంజలి.. భర్తకు కష్టం వచ్చిన ప్రతిసారీ కొండంత అండగా నిలబడ్డారు. గత ఏడాది లడఖ్‌కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌లో చేర్చాలనే డిమాండ్‌తో జరిగిన నిరసనల సమయంలో నలుగురు మరణించగా.. వాంగ్‌చుక్‌ను ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టం (NSA) కింద నిర్బంధించిన సంగతి తెలిసిందే.
ఆ కష్టకాలంలో గీతాంజలి సుప్రీంకోర్టును ఆశ్రయించి, రాష్ట్రపతి జోక్యాన్ని కోరుతూ లేఖ రాశారు. దాదాపు 170 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత వాంగ్‌చుక్ విడుదలయ్యారు. ఐదు నెలల పాటు వారానికి రెండు సార్లు కేవలం 60 నిమిషాల ములాఖత్ కోసం ఆమె పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ఇప్పుడు నీట్ పేపర్ లీకేజీ నిరసనల్లో కూడా ఆమె భర్త ఆశయాన్ని భుజానకెత్తుకున్నారు.
ఆసుపత్రిలో ఉన్నప్పటికీ తన భర్త దీక్షను విరమించలేదని.. కేవలం ఉప్పు, నీరు మినహా మరేమీ తీసుకోవడం లేదని గీతాంజలి స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు లేదా ఆయనను పర్యవేక్షిస్తున్న వైద్యుల అనుమతి లేకుండా ఆయనకు ఎలాంటి ద్రవాలను ఇవ్వకూడదని ఆమె నొక్కి చెప్పారు. అంతేకాకుండా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సోమవారం చేపట్టే పార్లమెంట్ మార్చ్‌కు తానే నాయకత్వం వహిస్తానని ప్రకటించారు. ఒకవేళ సోనమ్ వాంగ్‌చుక్ ఈ మార్చ్‌లో పాల్గొనలేకపోతే.. ఆయనకు ప్రతినిధిగా నేనే ముందుండి దీనిని నడిపిస్తానంటూ ఆమె తేల్చి చెప్పారు.


