బంగారంపై మళ్లీ కియోసాకి ‘భారీ’ కామెంట్‌ | Robert Kiyosaki says Gold silver going to moon | Sakshi
Sakshi News home page

బంగారంపై మళ్లీ కియోసాకి ‘భారీ’ కామెంట్‌

Jul 18 2026 2:11 PM | Updated on Jul 18 2026 2:37 PM

Robert Kiyosaki says Gold silver going to moon

‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి మరోసారి బంగారం, వెండి పెట్టుబడులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ పెట్టుబడిదారుడు జిమ్ రోజర్స్ అభిప్రాయాలను ప్రస్తావిస్తూ, "బంగారం, వెండి ధరలు భవిష్యత్తులో భారీగా పెరిగి 'చంద్రుడి' దాకా వెళ్తాయి" అని ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు.

అయితే ధరలు నేరుగా పెరగవని, మధ్యలో భారీ పతనాలు (రిట్రేస్‌మెంట్లు) కూడా తప్పవని జిమ్ రోజర్స్ చెప్పిన విషయాన్ని కియోసాకి గుర్తు చేశారు. ఇటీవల బంగారం గరిష్ట స్థాయి నుంచి గణనీయంగా తగ్గిందని, వెండి కూడా భారీ కరెక్షన్‌ను ఎదుర్కొందని తెలిపారు.

చాలా మంది ఇన్వెస్టర్లు ధరలు గరిష్ట స్థాయికి చేరినప్పుడు కొనుగోలు చేసి, తర్వాత ధరలు పడిపోగానే భయంతో విక్రయిస్తారని కియోసాకి వ్యాఖ్యానించారు. తాను మాత్రం ఈ ధరల పతనాన్ని అవకాశంగా తీసుకుని మరింత బంగారం, వెండి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.

బంగారం, వెండి ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ఒక స్నేహితుడు అడిగితే, "ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఈ సమస్యలను పరిష్కరిస్తాయనే నమ్మకం నాకు లేదు. నిజానికి అప్పులు, ద్రవ్యోల్బణం వంటి సమస్యలకు వారే కారణం. ఇవి ఇంకా పెరిగే అవకాశమే ఎక్కువ" అని తాను సమాధానం ఇచ్చినట్లు కియోసాకి తెలిపారు.

చివరగా ఇన్వెస్టర్లను ఉద్దేశించి, "ఎక్కువ ధరకు కొనుగోలు చేసి, తక్కువ ధరకు అమ్ముతారా? లేక తక్కువ ధర వద్ద కొనుగోలు చేసి సంపదను సృష్టిస్తారా? బంగారం, వెండి ధరలు ఇంకా భారీగా పెరుగుతాయి" అంటూ తన పోస్టును ముగించారు. అయితే ఇవి ఆయన వ్యక్తిగత పెట్టుబడి అభిప్రాయాలేనని, పెట్టుబడులు పెట్టే ముందు సొంతంగా విశ్లేషించుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement