మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా హస్తినాపురంలో చోటుచేసుకున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్ నిర్వాహకుడు అతుల్ పవార్ (35) మృతి వెనుక అతని భార్య దామిని కుట్ర ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితురాలు తన ప్రియుడు, స్కూల్ డ్రైవర్ తుషార్‌తో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది.
పోలీసుల కథనం ప్రకారం, 2019లో ప్రేమ వివాహం చేసుకున్న అతుల్, దామిని దంపతులు కృష్ణా కిడ్స్ పబ్లిక్ స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. అయితే అతుల్ పేరుపై ఉన్న రూ. 20 లక్షల బీమా సొమ్మును కాజేయాలని, ప్రియుడితో కలిసి జీవించాలని దామిని పథకం పన్నింది. ఇందులో భాగంగా గురువారం రాత్రి అతుల్ తాగే పాలల్లో నిద్రమాత్రలు కలిపి, అతను గాఢనిద్రలో ఉన్నప్పుడు గదిలోకి విషపూరితమైన పామును వదిలారు. ఆ పాము కాటుకు అతుల్ మరణించాడు.
సందేహం రాకుండా ఉండేందుకు భర్త పాము కాటుకు గురయ్యాడని ఆమె నాటకం ఆడింది. అయితే ఘటనా స్థలంలోని పరిస్థితులపై అనుమానం వచ్చిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, కాల్ డేటాను విశ్లేషించగా అసలు నిజం బయటపడింది. నిందితుల ఫోన్లలో పాము ఫొటోలు లభ్యమయ్యాయి. తాము పామును కొనుగోలు చేసినట్లు డ్రైవర్ తుషార్ అంగీకరించాడు. 20 రోజుల క్రితం కూడా కారుతో ఢీకొట్టి అతుల్‌ను చంపేందుకు ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: శరీరంలోకి సర్రున దూసుకెళ్లిన ఇనుప రాడ్లు.. ఆ తర్వాత?


