నన్ను కొట్టారు.. సోనం సర్‌ను ఈడ్చుకెళ్లారు! | Explosive Claims By CJP Chief After Police Move Sonam Wangchuk To Hospital Amid Jantar Mantar Tension, Watch Video Inside | Sakshi
Sakshi News home page

నన్ను కొట్టారు.. సోనం సర్‌ను ఈడ్చుకెళ్లారు!

Jul 18 2026 9:21 AM | Updated on Jul 18 2026 10:08 AM

CJP Chiefs Explosive Claim After Jantar Mantar Drama

సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సోనం వాంగ్‌చుక్‌ నిరాహార దీక్ష భగ్నం అయిన వేళ.. జంతర్‌ మంతర్‌ వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ పోలీసులు ఆయనను శనివారం ఉదయం ఆస్పత్రికి తరలించారు. ఈ పరిణామంపై కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బలవంతంగా వాంగ్‌చుక్‌ను తరలించారని ఆరోపించారు.

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే సంచలన ఆరోపణలు చేశారు. తనపై పోలీసులు దాడి చేశారని, తనను కొట్టి అదుపులోకి తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. జంతర్‌ మంతర్‌ నిరసన ప్రదేశానికి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇది జరిగిందని చెప్పారు. ‘‘నన్ను కొట్టి అదుపులోకి తీసుకున్నారు. జంతర్‌ మంతర్‌లో పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ప్రజలను కొడుతున్నారు. సోనం సర్‌ను బలవంతంగా ఈడ్చుకెళ్లారు’’ అంటూ ఆయన సోషల్‌ మీడియా వేదికగా ఆరోపించారు. అయితే పోలీసులపై చేసిన ఈ ఆరోపణలను అధికారులు ధ్రువీకరించలేదు.

21వ రోజు దీక్ష.. ఆస్పత్రికి వాంగ్‌చుక్‌
నీట్‌ పరీక్షలో అవకతవకలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ.. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సోనం వాంగ్‌చుక్‌ జంతర్‌ మంతర్‌లో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయనతో పాటు పలువురు విద్యార్థులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు.

దీక్ష 21వ రోజుకు చేరుకోవడంతో వాంగ్‌చుక్‌ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఆయనను సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన స్పృహలో ఉన్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి.

కోర్టు ఆదేశాల మేరకే చర్యలు: పోలీసులు
వాంగ్‌చుక్‌ ఆరోగ్యం విషమిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ప్రతిరోజూ వైద్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన వైద్య సహాయం అందించాలని.. మరీ అవసరమైతే బలవంతంగా ఆహారం అందించాలని అధికారులను ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాలు, వైద్య నిపుణుల సలహా మేరకే వాంగ్‌చుక్‌ను ఆస్పత్రికి తరలించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా నిరసనకారులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడిందని, అయితే పోలీసులు సంయమనం పాటించారని న్యూఢిల్లీ డీసీపీ కార్యాలయం వెల్లడించింది.

అభిజిత్‌ దీప్కే అదుపులో.. CJP ఆగ్రహం
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కేను అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు ధ్రువీకరించారు. అయితే తమ నేతను అక్రమంగా అడ్డుకున్నారని ఆయన మద్దతుదారులు ఆరోపించారు. వాంగ్‌చుక్‌ చేస్తున్న నిరసనను అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, శాంతియుత ఆందోళనకు ఆటంకాలు కల్పిస్తున్నారని పార్టీ నేతలు ఆరోపించారు.

ఇంతకు ముందు దాడి!
ఇదే సమయంలో జంతర్‌ మంతర్‌ వద్ద వాంగ్‌చుక్‌పై గతంలో కొందరు వ్యక్తులు దాడికి ప్రయత్నించారని కూడా అభిజిత్‌ దీప్కే ఆరోపించారు. ఒక వస్తువు విసిరినా ఆయనకు ఎలాంటి గాయం కాలేదని తెలిపారు. నిరసనను భగ్నం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

జంతర్‌ మంతర్‌ వద్ద టెన్షన్‌
వాంగ్‌చుక్‌ ఆస్పత్రికి తరలింపు అనంతరం.. నిరసనకారులను అక్కడి నుంచి ఖాళీ చేయాలని పోలీసులు కోరారు. అందుకు వాళ్లు నిరాకరించడంతో.. తీవ్ర వాగ్వాదం నడుమ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నాం లోపు ఖాళీ చేయాలని పోలీసులు నిరసనకారులకు అ‍ల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జంతర్‌ మంతర్‌ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement