సహారన్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై, విపక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో మైక్ తరచూ ఆగిపోవడంతో, సౌండ్ ఆపరేటర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.
సౌండ్ సిస్టమ్ నిర్వహించే వ్యక్తి బీజేపీకి ‘బీ’ టీమ్ అని, సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుదారుడని ఆయన చమత్కరించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, గొంతు నొక్కాలని చూసినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఒవైసీ అన్నారు. సంభల్ వివాదం, అయోధ్య వ్యవహారాలు, మసీదులు, రాంపూర్ జోహార్ విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఒవైసీ తీవ్రంగా తప్పుబట్టారు. కేవలం ఓటు బ్యాంకుగా ముస్లింలను వాడుకుంటున్నారే తప్ప, వారికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో విపక్షాలు విఫలమయ్యాయని ఆరోపించారు.
రాష్ట్రంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని, పేపర్ లీక్ ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతున్నాయని విమర్శించారు. భాగస్వామ్య రాజకీయాల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్న ఆయన, బీజేపీని ఓడించేందుకు ఎన్నికలకు ముందే పొత్తులకు సిద్ధమని ప్రకటించారు. ముస్లింలు తమ స్వంత రాజకీయ నాయకత్వాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.


