అన్నంలో పురుగులు... వెంట్రుకలు
రిపేర్లకు డబ్బులు డిమాండ్
విద్యార్థుల మొర ఆలకించని ప్రిన్సిపాల్
కొత్తగూడ: ‘అన్నంలో పురుగులు, వెంట్రుకలు వస్తున్నాయి. నెల రోజులుగా చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఏదైనా రిపేర్లు చేయాల్సి వస్తే మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు. దీంతో గత్యంతరం లేక రోడ్డెక్కాం’అంటూ మహబూ బాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని గాందీనగర్ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థినులు వాపోయారు. గురుకులంలో వసతులు కల్పించాలని గురువారం నాడు గురుకులం గేటు ముందు ధర్నాకు దిగారు.
బాలికల ఆవేదన: గురుకులంలో కనీస వసతులు కూడా లేవని, నలుగురు విద్యార్థులు దుప్పట్లను తెరలాగ అడ్డు పట్టుకుంటే వాటి చాటున మిగతా విద్యార్థులు దుస్తులు మార్చుకుంటున్నామని చెబుతూ బాలికలు కన్నీరు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రూప్‌సింగ్ బాలికలకు ధైర్యం చెప్పి రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో మాట్లాడించారు. వారి బాధలను విన్న సీతక్క ‘ఇంత వరకు ఈ విషయం తెలియదని, యుద్ధ ప్రాతిపదికన వసతులు కల్పిస్తామ’ని హమీ ఇచ్చారు.
సీతక్క హమీతో విద్యార్థులు ఆందోళన విరమించారు. మంత్రి ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాఠశాల మరమ్మతులు మొదలుపెట్టారు. పనులు పూర్తయ్యే వరకు విద్యార్థులకు ఐదు రోజుల హోమ్‌సిక్ సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిని్పపాల్ కల్పన, తనిఖీలు చేయనందున గిరిజన సంక్షేమశాఖ జిల్లా కో ఆర్డినేటర్ అశోక్ పై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం.


