చీకట్లలో తెలంగాణ.. కమీషన్లలో కాంగ్రెస్‌: హరీశ్‌రావు | Unannounced power cuts due to negligence in coal and water management | Sakshi
Sakshi News home page

చీకట్లలో తెలంగాణ.. కమీషన్లలో కాంగ్రెస్‌: హరీశ్‌రావు

Jul 17 2026 3:58 AM | Updated on Jul 17 2026 3:58 AM

Unannounced power cuts due to negligence in coal and water management

రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం 

బొగ్గు, నీటి నిర్వహణలో నిర్లక్ష్యంతో అప్రకటిత కరెంట్‌ కోతలు 

రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వకపోతే బీఆర్‌ఎస్‌ ఉద్యమం 

సాక్షి, హైదరాబాద్‌: బొగ్గు, నీటి నిర్వహణలో దూరదృష్టి లేని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్‌ కోతలు పెరిగాయని బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో రైతులు సబ్‌స్టేషన్ల ఎదుట ధర్నాలు చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. రైతులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు విద్యుత్‌ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో మొత్తం 23 వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం, థర్మల్‌ సామర్థ్యం 7,180 మెగావాట్లు ఉన్నప్పటికీ కేవలం 3,190 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే జరిగిందన్నారు. 

థర్మల్‌ విద్యుత్‌ సామర్థ్యంలో కేవలం 44 శాతం సామర్థ్యాన్నే వినియోగిస్తున్నారని చెప్పారు. గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. కొత్తగూడెం, కాకతీయ, భద్రాద్రి, యాదాద్రి విద్యుత్‌ కేంద్రాల్లో 6–7 రోజులకు మించి బొగ్గు నిల్వలు లేవని, యాదాద్రి ప్లాంట్‌లో రెండు యూనిట్లు, భద్రాద్రి ప్లాంట్‌లో నిర్వహణ లోపాలతో ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. రాష్ట్రంలోని రిజర్వాయర్ల మొత్తం నిల్వ సామర్థ్యం 1,059 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 351 టీఎంసీలే నీరు ఉందని, హైడల్‌ విద్యుత్‌కు నీళ్లు, థర్మల్‌ విద్యుత్‌కు బొగ్గు లేదన్నారు. 

సింగరేణి వెబ్‌సైట్‌ను మూసివేసి బొగ్గు ఉత్పత్తి, సరఫరా వివరాలను దాచిపెడుతోందన్నారు. బొగ్గు, ఇసుక, విద్యుత్, భూముల్లో కుంభకోణాలకు పాల్పడుతూ కాంగ్రెస్‌ పాలన స్కామ్‌ల మయంగా మారిందని హరీశ్‌రావు విమర్శించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించి తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టామన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను మళ్లీ చీకట్లలోకి నెడుతోందని, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఎరువుల సరఫరా, పంట బోనస్, విద్యుత్‌ సరఫరా అన్నింటిలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. 

ఇది ‘కోతలు.. వాతల సర్కారు’గా ఆయన అభివర్ణించారు. గ్రీన్‌ ఎనర్జీ పాలసీ కింద 3 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటం వెనుక కమీషన్ల కక్కుర్తే కారణమన్నారు. థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిని పెంచి, ప్లాంట్లకు తగిన బొగ్గు సరఫరా చేసి, రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించకుంటే  రైతాంగం తరఫున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement