ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు : వాంగ్‌చుక్‌ భావోద్వేగ సందేశం | High Court comments on As Hunger Strike Sonam Wangchuk emotional video | Sakshi
Sakshi News home page

ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు : వాంగ్‌చుక్‌ భావోద్వేగ సందేశం

Jul 16 2026 12:20 PM | Updated on Jul 16 2026 12:58 PM

High Court comments on As Hunger Strike Sonam Wangchuk emotional video

సాక్షి, న్యూఢిల్లీ:  నీట్‌ అవకతవకలు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాలాంటి డిమాండ్లతో  నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ హైకోర్టు గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పౌరుల ప్రాణం చాలా విలువైనది. వారి ప్రాణాలు కాపాడటానికి అధికారులు అన్ని ప్రయత్నాలు చేయాలంటూ హైకోర్టు స్పష్టం చేసింది. సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలను రక్షించడానికి అవసరమైన అన్ని రకాల వైద్య సహాయాలు అందించాలని ఆదేశించింది. ఆయన ఆరోగ్య పర్యవేక్షణ నిమిత్తం ప్రభుత్వ వైద్యులను నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద 'కాక్రోచ్‌ జనతా పార్టీ' (CJP) చేపట్టిన నిరసనల్లో భాగంగా వాంగ్‌చుక్ చేస్తున్న నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. బీపీ, షుగర్‌ ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. వాంగ్‌చుక్ ఇప్పటికే 8.5 కిలోల బరువు తగ్గారు. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర  ఆందోళన నెలకొంది. ఈ సందర్భంగా దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడంతోపాటు, కీలక ఆదేశాలను జారీ చేసింది.

ఇదీ చదవండి: కీలక ఫెడ్ పదవులు : రఘురామ్ రాజన్‌, మరో ఇద్దరు భారతీయ నిపుణులు

ఇప్పటిదాకా ప్రైవేట్ వైద్యులు వాంగ్‌చుక్‌కు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. అయితే ఇకపై ప్రతిరోజూ కేవలం ప్రభుత్వ వైద్యుల చేతే క్రమబద్ధమైన తనిఖీలు చేయించాలని, అవసరమైతే వైద్యపరంగా జోక్యం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. పౌరుల ప్రాణాలు చాలావిలువైనవి, వారిని కాపాడేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరింది. సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలను కాపాడటానికి అవసరమైన చర్యలన్నీ చేపట్టండి అని కేంద్రానికి హైకోర్టు  ఆదేశించింది. రానున్న 48 గంటల్లో ఆయన దీక్ష విరమించకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చని బుధవారం దాఖలైన ఒక పిటిషన్‌పై కోర్టు ఈ విచారణ చేపట్టింది.

సోనమ్‌ భావోద్వేగ వీడియో
మరోవైపు కోర్టు ఉత్తర్వులకు కొన్ని గంటల ముందు సోనమ్ వాంగ్‌చుక్ ఒక భావోద్వేగ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సీనియర్ రాజకీయ నాయకులు దీక్ష విరమించాలని కోరుతున్నప్పటికీ,దీక్ష విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుండి స్పందన రాకుండా వెనక్కి తగ్గితే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు.  తాను నీరస పడినప్పటికీ, గుండె, ఇతర అంతర్గత అవయవాలు ఇంకా బాగానే ఉన్నాయి. ఇంకా కొన్ని రోజులు నడవ గలను అన్నారు. ఈ సందర్భంగా జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరగబోయే నిరసనలో ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సమస్యను ఎంపీల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

కాగా  NEET-UG వంటి పోటీ పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని లేదా ఆయనను తొలగించాలని, అలాగే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి  పరిహారం చెల్లించాలనే డిమాండ్స్‌తో అభిజీత్ నేతృత్వంలోని సీజేపీ ఆందోళనకు దిగింది. ఈ ఉద్యమానికి మద్దతుగానే సోనమ్ వాంగ్‌చుక్ ఈ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement