జడ్జి పదవిలో ఉంటూ సైడ్‌ బిజినెస్‌? | Judge Justice and Gas Agency: LPG Dealership Sparks Ethics Debate | Sakshi
Sakshi News home page

జడ్జి పదవిలో ఉంటూ సైడ్‌ బిజినెస్‌?

Jul 16 2026 12:00 PM | Updated on Jul 16 2026 12:05 PM

Judge Justice and Gas Agency: LPG Dealership Sparks Ethics Debate

న్యాయ పీఠం అంటే కేవలం ఓ పదవి కాదు.. అది విశ్వాసానికి ప్రతీక. రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలతో తీర్పులు చెప్పే న్యాయమూర్తులపై సమాజంలో అత్యున్నత నమ్మకం ఉంటుంది. అందుకే వారి వ్యక్తిగత, ఆర్థిక వ్యవహారాల్లోనూ పారదర్శకత, నైతికతకు పెద్దపీట వేయడం ఆనవాయితీ. అలాంటి విలువలకే ఓ న్యాయమూర్తి తిలోదకాలు ఇచ్చారనే వ్యవహారం ఇప్పుడు న్యాయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. దేశాన్ని కుదిపేసిన నోట్ల కట్టల జడ్జి ఘటన మరువక ముందే వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంలోకి వెళ్తే.. 

మాజీ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి, మణిపూర్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సిద్ధార్థ్‌ మృదుల్‌కు చెందిన ‘కిచెన్‌ ఫ్లేమ్‌’ ఎల్పీజీ డీలర్‌షిప్‌ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. న్యాయమూర్తిగా ఉన్న సమయంలోనూ ఈ డీలర్‌షిప్‌ కొనసాగిందన్న అంశంపై వివాదం రేగింది. జస్టిస్‌ సిద్ధార్థ్‌ మృదుల్‌ 2008లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2023 అక్టోబర్‌లో మణిపూర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి.. 2024 నవంబర్‌లో పదవీ విరమణ చేశారు. దాదాపు 16 ఏళ్ల పాటు రాజ్యాంగబద్ధమైన న్యాయ పదవుల్లో కొనసాగిన సమయంలోనే గ్యాస్‌ ఏజెన్సీ డీలర్‌షిప్‌ కొనసాగిందనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి.

న్యాయ పదవి.. వ్యాపార సంబంధం.. ఏంటి తప్పా?
రాజ్యాంగ కోర్టుల న్యాయమూర్తులు వ్యక్తిగత వ్యాపారాలు, ఆర్థిక ప్రయోజనాలకు దూరంగా ఉండాలన్న నైతిక ప్రమాణాలు ఉన్నాయి. ప్రయోజన సంఘర్షణ (Conflict of Interest)కు అవకాశం లేకుండా వారి ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పాటించాల్సి ఉంటుంది. కానీ, జస్టిస్‌ మృదుల్‌ విషయంలో అందుకు విరుద్ధంగా జరిగిందన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. 

‘కిచెన్‌ ఫ్లేమ్‌’ ఏజెన్సీకి సంబంధించి భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (BPCL)తో డీలర్‌షిప్‌ ఒప్పందాలు పలుమార్లు రెన్యువల్‌ అయ్యాయి. 1995, 2005, 2010, 2015 సంవత్సరాల్లో ఒప్పందాల పునరుద్ధరణతో పాటు 2025లోనూ ఒప్పందం కొనసాగినట్లు సమాచారం. అయితే న్యాయమూర్తిగా పనిచేస్తున్న సమయంలో ఈ వ్యాపార సంబంధం కొనసాగడం నిబంధనలకు విరుద్ధమా? అనే అంశంపై బీపీసీఎల్‌ వివరణ కోరింది.

నోటీసులు.. స్పందన లేక సస్పెన్షన్‌
ఈ వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన బీపీసీఎల్‌.. 2025 డిసెంబర్‌లో వచ్చిన ప్రజా ఫిర్యాదును ఆధారంగా చేసుకుని జస్టిస్‌ మృదుల్‌కు నోటీసులు జారీ చేసింది. న్యాయ పదవిలో ఉన్న సమయంలో ఎల్పీజీ డీలర్‌షిప్‌ కొనసాగించడం, ఆ సమయంలో అవసరమైన అనుమతులు తీసుకున్నారా? డీలర్‌షిప్‌ ఒప్పంద నిబంధనలు పాటించారా? అనే అంశాలపై సంస్థ వివరణ కోరింది. జనవరి 30, ఫిబ్రవరి 26 తేదీల్లోనూ బీపీసీఎల్‌ నుంచి లేఖలు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే నోటీసులకు సమాధానం రాకపోవడంతో.. జూలై 6న ‘కిచెన్‌ ఫ్లేమ్‌’ డీలర్‌షిప్‌ను సస్పెండ్‌ చేసి పారేసింది.

మోనికా పిటిషన్‌.. కొత్త మలుపు
ఈ వ్యవహారంలో మరో కోణం కూడా తెరపైకి వచ్చింది. ‘కిచెన్‌ ఫ్లేమ్‌’ ఎల్పీజీ ఏజెన్సీని నిర్వహిస్తున్న దీపక్‌ యాదవ్‌ మరణం తర్వాత.. ఆయన భార్య మోనికా యాదవ్‌ డీలర్‌షిప్‌ యాజమాన్య మార్పు (reconstitution of proprietorship) కోసం దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తును పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు గతంలో బీపీసీఎల్‌ను ఆదేశించింది. అయితే ఆ తర్వాత ఏజెన్సీని బీపీసీఎల్‌ సస్పెండ్‌ చేయడంతో మోనికా మరోసారి కోర్టును ఆశ్రయించారు. తాను అన్ని నిబంధనలు పాటించినప్పటికీ.. మాజీ యజమాని జస్టిస్‌ మృదుల్‌, బీపీసీఎల్‌ చర్యల కారణంగా తాను నష్టపోతున్నానని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం.

న్యాయవ్యవస్థపై వరుస వివాదాలు
ఈ వివాదంపై జస్టిస్‌ మృదుల్‌ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇదే సమయంలో. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ వ్యవహారం మరోసారి న్యాయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆయన అధికారిక నివాసంలో నగదు కట్టలు బయటపడిన ఘటన అనంతరం.. పార్లమెంట్‌ ద్వారా తొలగింపు ప్రక్రియ(అభిశంసన) ప్రారంభం కావడం, చివరకు ఒత్తిళ్లతో ఆయన జడ్జి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఒకవైపు జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ వ్యవహారం.. మరోవైపు జస్టిస్‌ సిద్ధార్థ్‌ మృదుల్‌ ఎల్పీజీ ఏజెన్సీ వివాదం.. న్యాయమూర్తుల వ్యక్తిగత, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. న్యాయవ్యవస్థకు ప్రజల విశ్వాసమే ప్రధాన బలం. అందుకే ఉన్నత న్యాయ పదవుల్లో ఉన్న వ్యక్తుల ప్రతి అడుగు కూడా నైతిక ప్రమాణాల తూకంలోనే పరిశీలనకు వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement