కర్ణాటకలోని ధార్వాడ్‌లో చోటుచేసుకున్న దారుణ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ వైద్యుడు ఇంట్లోనే హత్యకు గురి కాగా.. ఆయన ఎనిమిదేళ్ల కొడుకు ప్రాణాల కోసం ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే.. ఈ కేసులో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు ఓ షాకింగ్ దృశ్యం కనిపించింది. భర్త శవం, కొడుకు రక్తపు మడుగులో ఉండగా.. ఆ భార్య మాత్రం ఏం జరగలేదన్నట్లు ఫోన్ చూస్తూ తాపీగా కనిపించింది.
ధార్వాడ్‌లోని బారాకోట్రి ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హొన్నన్నవర్ (45) దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఎనిమిదేళ్ల కుమారుడు కూడా తీవ్ర కత్తిపోట్లకు గురయ్యాడు. ప్రస్తుతం బాలుడు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో డాక్టర్ కిరణ్, ఆయన భార్య డాక్టర్ ప్రియాంక, వారి కుమారుడు మాత్రమే ఉన్నారు. భద్రత ఎక్కువగా ఉండే అపార్ట్‌మెంట్‌లోకి బయటి వ్యక్తులు ప్రవేశించిన ఆనవాళ్లు ఇప్పటివరకు లభించలేదని హుబ్లీ-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్. శశికుమార్ తెలిపారు.

ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో వెలుగులోకి..
డాక్టర్ కిరణ్‌కు బంధువులు, స్నేహితులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో ఆయన భార్య ప్రియాంకను సంప్రదించగా.. ఆమె మొదట ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని, ఆ తర్వాత డ్యూటీకి వెళ్లారని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె చెప్పిన సమాధానాలపై అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. అక్కడ ఓ గదిలో డాక్టర్ కిరణ్ రక్తపు మడుగులో పడి ఉండగా.. మరో గదిలో తీవ్ర గాయాలతో బాలుడు కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Shocking, horrifying & ruthless. A woman allegedly killed her doctor husband & stabbed her 8yr old son inside their #Dharwad apartment. As the child lay in a pool of blood fighting for life, mother was scrolling through her phone. @compolhdc rescued the boy & shifted to hospital. pic.twitter.com/RL5GO9fzEV
— Sagay Raj P || ಸಗಾಯ್ ರಾಜ್ ಪಿ (@sagayrajp) July 16, 2026
భార్యపై అనుమానాలు.. విచారణ
ఘటన తర్వాత పోలీసులు డాక్టర్ ప్రియాంకను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనాస్థలిలో ఆమె ఫోన్ చూస్తూ కనిపించిన దృశ్యాలు కూడా చర్చకు దారితీశాయి. అయితే హత్యకు సంబంధించిన పూర్తి కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు చెబుతున్నారు. కుటుంబ కలహాలు ఈ ఘటనకు కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యల తర్వాత ఆమె ప్రవర్తించిన తీరుతో మానసిక స్థితిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే హత్యకు దారితీసిన పరిస్థితులు, దాడి జరిగిన సమయం, ఆయుధం తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రముఖ వైద్య కుటుంబంలో విషాదం
డాక్టర్ కిరణ్ స్థానికంగా పేరున్న వైద్యుడిగా గుర్తింపు పొందారు. ఆయన భార్య ప్రియాంక కంటి వైద్యురాలు. ఇద్దరూ వైద్య వృత్తిలో ఉండగా.. ఇంట్లోనే ఈ దారుణం చోటుచేసుకోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి, ఫోరెన్సిక్ నివేదికలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


