కక్షతో.. బాత్రూం క్లీన్‌ చేసే రసాయనం తాగించి.. | Government Land Encroachment Case In Gajulararamaram Hyderabad | Sakshi
Sakshi News home page

కక్షతో.. బాత్రూం క్లీన్‌ చేసే రసాయనం తాగించి..

Jul 16 2026 9:42 AM | Updated on Jul 16 2026 9:55 AM

Government Land Encroachment Case In Gajulararamaram Hyderabad

హైదరాబాద్‌, సుభాష్‌నగర్‌: ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసిన మహిళపై దాడికి పాల్పడ్డ వారిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సూరారం పోలీస్‌ స్టేషన్‌లో పేట్‌బషీరాబాద్‌ ఏసీపీ బాలగంగిరెడ్డి వివరాలు వెల్లడించారు. గాజులరామారం కైసర్‌ నగర్‌లోని సర్వేనెంబర్‌ 342 ప్రభుత్వ స్థలంలో కబ్జాలు జరుగుతున్నాయని స్థానికురాలు సల్మా బేగం జూన్‌ 19న రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో కబ్జాదారుడు రత్నాకరం సాయిరాజ్‌ ఆమెపై కక్ష పెంచుకున్నాడు.

సల్మా బేగంపై దాడి చేయాలని స్థానికంగా ఉన్న హేమశ్రీ, సయ్యద్‌ రేష్మ బేగం, సయ్యద్‌ రహీం, షహనాజ్‌ అనే మహిళలను ప్రేరేపించాడు. ఈ నెల 8న సల్మా బేగం ఇంట్లోకి నలుగురు చొరబడి ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అంతేకాకుండా బాత్రూం క్లీన్‌ చేసే రసాయనాన్ని బలవంతంగా తాగించి ప్రాణాపాయ స్థితికి గురి చేశారు. దాడి దృశ్యాలను సల్మా బేగం కూతురు ఫోన్లో చిత్రీకరిస్తుండగా మొబైల్‌ను లాక్కొని నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు.

దీంతో ఈ నెల 8న సల్మా బేగం సూరారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు నలుగురిని అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడైన రత్నాకరం సాయిరాజ్‌ కోసం గాలిస్తున్నామని ఏసీపీ పేర్కొన్నారు. సాయిరాజ్‌పై గతంలో ఆరు కేసులు ఉండగా అతనిపై భూకబ్జా షీటు నమోదు చేస్తున్నామని, అదే విధంగా ఓ మహిళపై గతంలో ఐదు కేసులు ఉండగా, దీనితో కలిపి ఆరో కేసు నమోదు చేసి ఆమెపై కూడా రౌడీ షీట్‌ నమోదు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement