breaking news
gajula ramaram
-
గాజుల రామారంలో అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారుల కొరడా
సాక్షి, మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ శివారులో చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన కబ్జాదారులపై హైడ్రా అధికారులు కొరడా ఝులిపించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం, దేవందర్నగర్లలో హైడ్రా ఆధ్వర్యంలో మంగళవారం అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో అక్రమ కట్టడాల తొలగింపు చేపట్టారు.329, 342 సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూముల్లో వెలిసిన సుమారు 51 అక్రమ నిర్మాణాలను తొలగించారు. బాలనగర్ ఏసీపీ హనుమంతరావు సమక్షంలో సూరారం, జగద్గిరిగుట్ట సీఐలు భరత్ కుమార్, క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో సుమారు వందమంది పోలీసుల భద్రతతో మూడు ప్రోక్లైన్లను ఉపయోగించి అక్రమంగా నిర్మించిన గదులను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు.అయితే కూల్చివేతలను ఆక్రమణదారులు అడ్డుకోగా.. వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే, చెరువు కబ్జాలకు పాల్పడితే ఊరుకోమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. ఆక్రమణదారులపై చట్టపరంగా చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. -
టవరెక్కిన మయూరం
హైదరాబాద్: ప్రాణం తీసుకోవాలనుకున్న వాళ్లో.. బెదిరించాలనుకున్న వాళ్లో.. టవరెక్కడం ఈ మధ్య మనం చూస్తేనే ఉన్నాం.. కానీ అనుహ్యంగా తన ప్రాణాలు రక్షించుకోవడం కోసం జాతీయపక్షి నెమలి టవరెక్కింది. ఈ అరుదైన సంఘటనకు నగరంలోని గాజులరామారం వేదికైంది. స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతం నుంచి జన సంచారంలోకి వచ్చిన నెమలిని కాకులు తరమడంతో.. ప్రాణరక్షణ కోసం మేస్త్రీ నగర్లోని హైటెన్షన్ టవరెక్కింది. ఈ దృశ్యాన్ని తమ సెల్ఫోన్లలో బంధించడానికి స్థానికులు ఎగబడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. హైటెన్షన్ వైర్లు కావడంతో పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. నాలుగు గంటల నుంచి ప్రాణాలకోసం పోరాడుతున్న మయూరం ప్రస్తుతం ఒక టవర్ నుంచి మరో టవర్ పైకి దూకూతోంది.