
సాక్షి, హైదరాబాద్: సెలవు దినాల్లో కూల్చివేతలు చేయొద్దని హైడ్రాకు హైకోర్టు స్పష్టంగా చెప్పిందని.. అయినా హైడ్రా ఆ ఆదేశాలను ఉల్లంఘించి ప్రవర్తిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన తాజా పరిణామాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘‘పేదల ఇళ్లను రేవంత్ రెడ్డి ఆదివారం ఎందుకు కూల్చివేస్తున్నారు?. గతంలో హైకోర్టు సెలవు దినాల్లో కూల్చివేతలు చేయవద్దని స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ, గాజులరామారంలో కోర్టు సెలవు రోజు చూసుకొని మరీ పేదల ఇళ్లను కూల్చివేశారు. గాజులరామారంలో ఇళ్లు కూల్చివేశారు, రేపు జూబ్లీహిల్స్‌లోని బోరబండ బస్తీకి కూడా రేవంత్ రెడ్డి హైడ్రాతో వస్తారు.
.. హైడ్రా బూల్డోజర్ పేదల ఇళ్లపైకే వెళ్తుంది.. పెద్దల ఇళ్లకు వెళ్లదు. ముఖ్యమంత్రి సోదరుడితో పాటు మంత్రులు పొంగులేటి, వివేక్ తదితరులు ప్రభుత్వ స్థలాల్లో, చెరువుల పైన ఇళ్లు కట్టినా వారిని కూల్చివేయలేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. మన ఇళ్లు కూలగొట్టమని కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యానికి లైసెన్స్ ఇచ్చినట్లే. మన పార్టీ కార్యకర్త సర్దార్ ఇంటిని కూల్చివేశారు. కాంగ్రెస్ పార్టీ కూలగొట్టిన ఆ ఇంటిని మళ్లీ కట్టించి ఇచ్చే బాధ్యత నాది. ఈ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల్లో చేసిందేమీ లేదు. కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయింది అని కేటీఆర్ అన్నారు.