కెనడాలో స్థిరపడిన తెలంగాణ వాసుల ప్రత్యేక సంస్థ తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (TDF - CANADA) రానున్న రెండేళ్ల కోసం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంది. జితేందర్ రెడ్డి గార్లపాటి అధ్యక్షుడిగా, వెంకట్ రెడ్డి పోలు ప్రధాన కార్యదర్శిగా పనిచేయనున్నారు. 2026-27 రెండేళ్ల పాటు ఈ కొత్త కార్యవర్గం పనిచేయనుంది.
కొత్త కార్యవర్గంలో ఫౌండేషన్ కమిటీ చైర్ పర్సన్‌గా అమిత పినికేశి, ఉపాధ్యక్షుడిగా మహేందర్ కీస్రా, సంయుక్త కార్యదర్శిగా అనికేత్ రెడ్డి శామీర్ పేట, ట్రెజరర్‌గా కృష్ణా రెడ్డి చాడ, జాయింట్ ట్రెజరర్‌గా రవీందర్ రెడ్డి కొండం, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్‌గా అర్షద్ ఘోరి, కమిటీ చైర్మన్లుగా బిజినెస్ కౌన్సిల్ చైర్ పర్సన్‌గా ఇందు రెడ్డి, స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్‌గా కె. మహేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.
కెనడాలో స్థిరపడిన తెలంగాణ వాసుల కోసం 2005లో టీడీఎఫ్ కెనడా సంస్థ ఏర్పాటైంది. తెలంగాణ ఉద్యమ సమయంతో పాటు రాష్ట్రం ఏర్పటయ్యాక కూడా ఈ సంస్థ క్రియాశీలకంగా పనిచేస్తోంది. ప్రతీ ఏటా తెలంగాణ నైట్‌ను నిర్వహిస్తూ అక్కడి తెలుగువారిని ఏకం చేసే ప్రయత్నం చేస్తోంది. తంగేడు అనే అనుబంధ సాంస్కృతిక సంస్థ ద్వారా బతుకమ్మ పండగతో పాటు వివిధ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. కెనడాలో స్థిరపడిన వందలాది మంది తెలుగువారు తమ కుటుంబాలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా తమ పిల్లలకు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను తెలిపే ప్రయత్నం చేస్తున్నారు.
అవసరమైన అన్ని సమయాల్లో సమాజ సేవ కార్యక్రమాలను కూడా విసృతంగా ఈ సంస్థ నిర్వహిస్తోంది. టీడీఎఫ్ కెనడా ఆధ్వర్యంలో ఏర్పాటైన క్రికెట్ క్లబ్‌లో వందలాది మంది తెలుగు విద్యార్థులు భాగస్వామ్యులుగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి విద్య కోసం వెళ్లిన విద్యార్థులకు కూడా ఈ సంస్థ తగిన సహాయం అందిస్తోంది.


