పవర్‌ఫుల్‌ పాస్‌పోర్ట్‌ల్లో భారత్‌ స్థానం ఎంతంటే.. | Henley Passport Index 2026 India making notable leap global mobility rankings | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ పాస్‌పోర్ట్‌ల్లో భారత్‌ స్థానం ఎంతంటే..

Feb 13 2026 3:04 PM | Updated on Feb 13 2026 3:10 PM

Henley Passport Index 2026 India making notable leap global mobility rankings

హెన్లీ పాస్ట్‌పోర్ట్ ఇండెక్స్ 2026 విడుదల

పది స్థానాలు ఎగబాకిన భారత్‌

అంతర్జాతీయ ప్రయాణ విభాగంలో భారత పాస్‌పోర్ట్ తన ప్రభావాన్ని చాటుతోంది. తాజాగా విడుదలైన 2026 హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో ఇండియా గతేడాదితో పోలిస్తే ఏకంగా 10 స్థానాలు ఎగబాకి 75వ స్థానానికి చేరుకుంది. భారతీయ పౌరుల అంతర్జాతీయ ప్రయాణ స్వేచ్ఛ గణనీయంగా పెరిగిందని ఈ ర్యాంకింగ్ స్పష్టం చేస్తోంది.

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అనేది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అందించే అధికారిక డేటా ఆధారంగా రూపొందుతుంది. ఒక దేశ పాస్‌పోర్ట్ హోల్డర్లు ముందస్తు వీసా అవసరం లేకుండా ఎన్ని దేశాలకు వెళ్లగలరు అనే అంశంపై ఈ ర్యాంకింగ్స్ ఆధారపడి ఉంటాయి. ప్రస్తుత నివేదిక ప్రకారం, భారతీయ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలకు వీసా-ఫ్రీ, వీసా-ఆన్-అరైవల్ లేదా ఇ-వీసా సౌకర్యంతో సులభంగా ప్రయాణించవచ్చు.

ప్రయాణికులకు ప్రయోజనాలు

ఈ మెరుగైన ర్యాంకింగ్ వల్ల సెలవులు, వ్యాపార పర్యటనలు లేదా సాంస్కృతిక సందర్శనల కోసం విదేశాలకు వెళ్లే భారతీయులకు వీసా అవాంతరాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆసియా, ఓషియానియా, కరేబియన్ దీవులు, ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో భారతీయులకు మెరుగైన ప్రవేశ సౌకర్యాలు లభిస్తాయి.

భారత్ ఈ ర్యాంకింగ్స్‌లో గత దశాబ్ద కాలంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. 2006లో 71వ ర్యాంకులో ఉన్న భారత్ గత ఏడాది 85వ స్థానానికి పడిపోయింది. అయితే, 2026 ప్రారంభంలో 80వ స్థానానికి, ఇప్పుడు ఏకంగా 75వ స్థానానికి చేరుకోవడం గమనార్హం.

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లు..

ర్యాంకుదేశంవీసా రహిత పర్యటన(దేశాల సంఖ్య)
1సింగపూర్192
2జపాన్, దక్షిణ కొరియా187
3స్వీడన్, యూఏఈ186
4జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ (మరో 8 ఐరోపా దేశాలు)185
5ఆస్ట్రియా, గ్రీస్, పోర్చుగల్, మాల్టా184

 

టాప్ 10లో ఇతర దేశాలు..

ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలు టాప్ 10 జాబితాలో కొనసాగుతున్నాయి. అమెరికా పాస్‌పోర్ట్ హోల్డర్లు ప్రస్తుతం 179 దేశాలకు ముందస్తు వీసా లేకుండా ప్రయాణించగలరు.

75వ ర్యాంకు అనేది భారత పాస్‌పోర్ట్ చరిత్రలో అత్యుత్తమ స్థానం కాకపోయినప్పటికీ, గత కొన్నేళ్లుగా కనిపిస్తున్న వృద్ధి రేటు సానుకూల ధోరణిని సూచిస్తోంది. ప్రపంచ దేశాలతో భారత్ కుదుర్చుకుంటున్న ద్వైపాక్షిక ఒప్పందాలు, దౌత్య సంబంధాల మెరుగుదల కారణంగా భవిష్యత్తులో భారత పాస్‌పోర్ట్ మరింత శక్తివంతంగా మారే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: రాజ్‌పాల్‌ యాదవ్‌ గ్యారేజీలోని కార్ల లిస్ట్‌ ఇదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement