న్యూఢిల్లీ: భారత పాస్‌పోర్టు బలపడింది. పాస్‌పోర్టుల ర్యాంకింగ్‌లో భారత్ స్థానం 85 నుంచి 80కి ఎగబాకింది. 55 దేశాల్లో వీసాలు లేకుండానే ప్రవేశించే వెసులుబాటు భారతీయులకు దక్కడంతో.. భారత్ పాస్‌పోర్టు బలపడింది. అదేసమయంలో పొరుగుదేశం పాకిస్థాన్ పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. కింది నుంచి ఐదో స్థానం(పైనుంచి 98వ స్థానం)లో పాకిస్థాన్.. కింది నుంచి 8వ స్థానంలో బంగ్లాదేశ్ ఉండడం గమనార్హం..!
2025లో భారత పాస్‌పోర్టు ర్యాంకింగ్ 85గా ఉండేది. తాజాగా విడుదలైన ర్యాంకింగ్‌లో భారత్ 5 స్థానాలను ఎగబాకి.. 80కి చేరుకుంది. ముందస్తు వీసా లేకుండా.. ఆయా దేశాల్లోకి ప్రవేశించే వెసులుబాటు మేరకు ఈ ర్యాంకింగ్‌లను ఇస్తారు. ఈ కోవలో సింగపూర్ పాస్‌పోర్టు వరుసగా రెండోసారి టాప్‌లో నిలిచింది. 227 దేశాలకు గాను సింగపూర్ పౌరులు 192 దేశాలకు వీసా లేకుండా ప్రవేశించగలుగుతారు. దీంతో ఆ దేశ పాస్‌పోర్టు అత్యంత శక్తిమంతంగా మారింది.
రెండోస్థానంలో జపాన్, దక్షిణ కొరియా సంయుక్తంగా నిలిచాయి. ఈ దేశాల పౌరులు ఎలాంటి వీసాలు లేకుండానే 188 దేశాలకు ప్రయాణించగలుగుతున్నారు. డెన్మార్క్, లక్సెంబర్గ్, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్ రాష్ట్రాలు 186 దేశాల్లో ఉచిత వీసా ప్రవేశంతో మూడో స్థానంలో నిలిచాయి. అన్నింటికంటే.. ఆఫ్ఘనిస్థాన్ పాస్‌పోర్టు 101వ ర్యాంకుతో అత్యంత బలహీనంగా ఉంది.


