భారతీయులకు జర్మనీ శుభవార్త చెప్పింది. తమ దేశంలోని విమానాశ్రయాల మీదుగా ప్రయాణించే భారతీయ పాస్ పోర్ట్ హోల్డర్లకు వీసా రహిత టాన్సిట్ (ప్రయాణ) సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ భారత పర్యటన సందర్భంగా ఒక సంయుక్త ప్రకటనలో ఈ నిర్ణయం ప్రకటించారు.
జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ జనవరి 12 నుంచి 13 వరకు రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఇది మెర్జ్ తొలి భారత పర్యటన కాగా ఫెడరల్ ఛాన్సలర్‌గా ఆయన చేపట్టిన మొదటి ఆసియా పర్యటన కూడా కావడం విశేషం.
ఈ నిర్ణయం ప్రకారం.. జర్మనీ విమానాశ్రయాల ద్వారా ఇతర దేశాలకు ప్రయాణించే భారతీయులకు ప్రత్యేక ట్రాన్సిట్ వీసా అవసరం ఉండదు. అయితే, ప్రయాణికులు విమానాశ్రయం పరిధిని దాటి బయటకు వెళ్లకూడదు. అంటే వీసా లేకుండా జర్మనీలోకి ప్రవేశించడానికి మాత్రం అనుమతి ఉండదు.
ఛాన్సలర్ మెర్జ్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే కీలక అడుగుగా ఆయన అభివర్ణించారు.


