ప‌వ‌న్‌కు మొండిచేయి.. అందుకే ప‌క్క‌న‌పెట్టారా? | Know Reason Behind Why Pawan Singh Didn't Get BJP Rajya Sabha Ticket, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

అవ‌కాశం ద‌క్కిన‌ట్టు ద‌క్కి.. అయ్యో ప‌వ‌న్‌!

Mar 3 2026 5:14 PM | Updated on Mar 3 2026 7:28 PM

Why Pawan Singh not get BJP Rajya Sabha ticket details inside

రాజ్యసభ ఎన్నికలకు భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌న అభ్య‌ర్థుల‌ను ఖరారు చేసింది. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ నబీన్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే శివేష్ కుమార్ బిహార్ నుంచి బ‌రిలో ఉన్నారు. అసోం రాష్ట్రం నుంచి తేరాష్ గోవాల్లా, జోగెన్ మోహన్‌ల‌ను అభ్య‌ర్థులుగా ప్ర‌క‌టించింది. మన్మోహన్ సమల్, సుజీత్ కుమార్‌ల‌ను ఒడిశా త‌ర‌పున రాజ్య‌స‌భ అభ్య‌ర్థులుగా ఎంపిక‌య్యారు. త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న పశ్చిమ బెంగాల్ నుంచి రాహుల్ సిన్హాకు అవ‌కాశం ద‌క్కింది. లక్ష్మీవర్మ (ఛత్తీస్‌గఢ్), సంజయ్ భాటియా(హ‌రియాణా)ల‌కు కూడా రాజ్య‌స‌భ అభ్య‌ర్థిత్వం దొరికింది.  

ప్ర‌ఖ్యాత‌ భోజ్‌పురి న‌టుడు, గాయకుడు ప‌వ‌న్ సింగ్‌కు క‌మ‌లం పార్టీ మొండిచేయి చూపింది. ఎంపీ కావాల‌కున్న ఆయ‌న ఆశ‌ల‌పై బీజేపీ అధినాయ‌క‌త్వం నీళ్లు చ‌ల్లింది. దీంతో ఆయ‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపిస్తార‌ని వ‌స్తున్న‌ ఊహాగానాలకు తాజాగా తెర‌ప‌డింది. బిహార్ నుంచి నితిన్ న‌బీన్‌తో పాటు సీనియ‌ర్ నాయ‌కుడు శివేష్ కుమార్‌ (Shivesh Kumar) అవ‌కాశం ద‌క్కించుకున్నారు.

తీర‌ని ప‌వ‌న్ క‌ల‌
ఎంపీగా పార్ల‌మెంట్‌లో అడుగు పెట్టాల‌న్న ప‌వ‌న్ సింగ్ కోరిక ఇంకా ఫ‌లించ‌లేదు. ఈసారైనా త‌న‌కు ఎంపీ ద‌క్కుతుంద‌ని భావించినా ఆయ‌న‌కు నిరాశే మిగిలింది. రెండోసారి కూడా అవ‌కాశం ద‌క్కిన‌ట్టు ద‌క్కి చేజారిపోయింది. ఎంపీ కావాల‌న్న ఉద్దేశంతోనే బిహార్ ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న రెండోసారి బీజేపీలో చేరారు. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ‌బెంగాల్‌లోని అస‌న్‌జోల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారిగా ఎంపీగా పోటీలో నిలిచారు. అయితే త‌న పాట‌ల్లో బెంగాలీ మ‌హిళ‌ల‌ను అభ్యంత‌క‌రంగా చిత్రీక‌రించార‌నే విమ‌ర్శ‌లు రావ‌డంతో పోటీ నుంచి ఆయ‌న‌ను త‌ప్పించింది. దీంతో మ‌న‌స్తాపం చెందిన ప‌వ‌న్ సింగ్‌.. బిహార్‌లోని కరకట్ లోక్‌సభ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా నామినేష‌న్ వేశారు. ఫలితంగా బీజేపీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌య్యారు. అయితే ప‌వ‌న్ సింగ్ కార‌ణంగా ప‌లుచోట్ల ఎన్డీఏ అభ్య‌ర్థులు ఓట‌మిపాల‌య్యార‌న్న అభిప్రాయాలు అప్ప‌ట్లో వ్య‌క్త‌మ‌య్యాయి.

'ఎమ్మెల్యే కాదు.. ఎంపీయే'
గ‌తేడాది అక్టోబర్ 1న తిరిగి క‌మ‌లం గూటికి వ‌చ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అప్ప‌టి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ బిహార్ ఇన్‌ఛార్జ్ వినోద్ తవ్డే, క‌ర‌క‌ట్‌లో ఆయ‌న ప్ర‌త్య‌ర్థి ఉపేంద్ర కుష్వాహా సమక్షంలో బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీకి రావ‌డంతో.. ప‌వ‌న్ సింగ్ శాస‌న‌స‌భ‌కు పోటీ చేస్తార‌ని మీడియాలో ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ప‌వ‌న్‌కు ఎమ్మెల్యేగా పోటీ చేసే ఉద్దేశం లేద‌ని, ఎంపీ కావాల‌న్నది ఆయ‌న కోరిక అని బీజేపీ ఎంపీ మ‌నోజ్ తివారీ వెల్ల‌డించారు. బిహార్ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ఎన్డీఏ త‌ర‌పున ప‌వ‌న్ సింగ్ ప్ర‌చారం సాగించారు.

చ‌ద‌వండి: రాజ్య‌స‌భ బ‌రిలో నితీశ్ కుమార్ త‌న‌యుడు?

అందుకే ఇవ్వ‌లేదా?
ఎన్డీఏ కూట‌మి బంప‌ర్ మెజారిటీతో విజ‌యం సాధించ‌డంతో ఆయ‌నకు క‌చ్చితంగా రాజ్య‌స‌భ సీటు ద‌క్కుతుంద‌ని బాగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే బిహార్‌కే చెందిన నితిన్ న‌బీన్ (Nitin Nabin) బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా ఎన్నిక కావ‌డంతో ప‌రిస్థితి మారిన‌ట్టు తెలుస్తోంది. నబీన్ పార్ల‌మెంట్‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకోవ‌డంతో ప‌వ‌న్‌ను ప‌క్క‌న పెట్టాల్సివ‌చ్చింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అటు ప‌వ‌న్ సింగ్ వ్య‌క్తిగ‌త జీవితంపై తీవ్ర విమ‌ర్శలు రావ‌డంతో ఆయ‌న‌కు ఎంపీ సీటు ద‌క్క‌లేద‌న్న వాద‌న‌లు కూడా విన‌బ‌డుతున్నాయి. మ‌రోవైపు ఎప్ప‌టికైనా త‌మ హీరో ఎంపీ అవుతార‌ని ప‌వ‌న్ సింగ్ అభిమానులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement