నగరి: భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవికి అనర్హుడని మాజీ మంత్రి ఆర్‌కే రోజా ధ్వజమెత్తారు. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు(మంగళవారం, మార్చి 3వ తేదీ) నగరిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రోజా మాట్లాడుతూ.. ‘ ఇందు పరువు తీసింది బీఆర్ నాయుడే. నిజం లేకపోతే బాబు, లోకేష్, పవన్‌లకు ఇందు ఎందుకు లేఖ రాశారు. బీఆర్ నాయుడికి మహిళలంటే గౌరవం లేదు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వీడియోలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.
దేశంలో ఏ ఆలయ చైర్మన్‌కు సంబంధించిన వీడియోలు ఇలా బయటపడిన దాఖలాలు లేవు. చైర్మన్‌గా హుందాగా, రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన బాధ్యతను బీఆర్ నాయుడు పాటించలేదు. టీటీడీలో ఆవుల మరణాలు, తొక్కిసలాట ఘటనలు చైర్మన్ వైఫల్యమే.
లడ్డూ వివాదంలో సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగినప్పటికీ మళ్లీ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం అనవసరం.ఇందాపూర్ డెయిరీకి నెయ్యి సరఫరా బాధ్యతలు అధిక ధరలకు కట్టబెట్టడంపై అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ అంశంపై మౌనం వహించడం బాధాకరం’ అని విమర్శించారు.


