ఎన్టీఆర్ జిల్లా: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వమే నేరాల్ని ప్రోత్సహిస్తుందని ధ్వజమెత్తారు. మంగళవారం బుగ్గన.. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడారు.
‘కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త సంస్కృతులను తెచ్చారు. జోగి రమేష్ ఇంటిపై దాడి వీడియోలు చూస్తే అర్ధమవుతుంది. దాడి చేస్తున్న వారికి పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చారు. పెట్రోల్, యాసిడ్ బాంబులతో దాడి చేస్తుంటే పోలీసులు చూస్తూ ఉన్నారు. అధికారపార్టీ తరపున మహిళలు కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ దాడులు చేయడం ఎప్పుడైనా చూశామా?
దాడులను మహిళలు లీడ్ చేయడం ఓ కొత్త రకం సాంప్రదాయం. ఎవరో ఒకరు వెనుక ఉండి కోచింగ్ ఇస్తే తప్ప మహిళలు ఇలా చేయరు. నిజంగా పొరపాటు జరిగితే చర్యలు తీసుకోవడానికి కోర్టులు ఉన్నాయి. రాజకీయ పార్టీలకు మీరు ఏం నేర్పిస్తున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కేసు లేకపోయినా కేసును ...ఆధారాలను సృష్టిస్తున్నారు.
ఈ సంస్కృతి ఇక్కడితో ఆగిపోతుందా .. అసలు రాష్ట్రాన్ని ఎటు వైపు తీసుకు వెళ్తున్నారు. మీరు చెప్పుకునే దశాబ్ధాల రాజకీయం దేనికి ఉపయోగపడుతుంది.దాడులు చేసిన వారి పై ఏం చర్యలు తీసుకున్నారు. అంబటి రాంబాబు తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కానీ మీరేం చేశారు..అంబటి పై తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు. దాడులు చేసిన వారిని వదిలేసి బాధితుల పై కేసులు పెట్టడమేంటి. ఎవరూ ఏమీ చూడటం లేదని మీరు అనుకుంటున్నారు ...కానీ ప్రజలు అంతా గమనిస్తున్నారు. మీ అనుభవాన్ని మంచి కోసం ఉపయోగించండి తప్పుడు కేసుల కోసం కాదు’ అని సూచించారు.


