12 ఏళ్ల తర్వాత మళ్లీ.. | - | Sakshi
Sakshi News home page

12 ఏళ్ల తర్వాత మళ్లీ..

Mar 3 2026 9:21 AM | Updated on Mar 3 2026 9:21 AM

● దుర్గగుడిలో మహా కుంభాభిషేకానికి భారీగా ఏర్పాట్లు ● మూడు రోజుల ఉత్సవం.. అద్భుత ఘట్టం కుంభాభిషేక విశిష్టత

7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి వివిధ పవిత్ర నదీ, సముద్ర జలాలతో అష్టోత్తర కలశస్థాపన, పూజ, పీఠ పూజలు, మధ్యాహ్నం 12 గంటలకు మూలమంత్ర హవనం, సాయంత్రం 4 గంటలకు మూలమంత్ర హవనం, ప్రదోష కాల పీఠ పూజలు, హారతి, మంత్ర పుష్ప వినియోగం జరుగుతాయి.

8వ తేదీ ఉదయం 7 గంటలకు మంటప పూజలు, మూలమంత్ర హవనం, ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి జరుగుతాయి. ఉదయం 9.34 గంటలకు మేషలగ్నంలో కనకదుర్గమ్మ ప్రధాన ఆలయ శిఖరానికి కుంభాభిషేక క్రతువు జరుగుతుంది. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామిజీ ఆలయ విమాన గోపురానికి కుంభాభిషేకం నిర్వహిస్తారు.

ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు!

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహా కుంభాభిషేకానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. 12 ఏళ్లకు ఒక సారి నిర్వహించే మహా కుంభాభిషేకం వీక్షించే భాగ్యం కోసం భక్తులు భారీగా తరలిరానున్నారు. 2014 ఫిబ్రవరిలో దుర్గగుడిపై మహా కుంభా భిషేకం జరిగింది. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు జరిగే కార్యక్రమానికి నాలుగు లక్షల మంది విచ్చేస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం ఆలయ ప్రాంగణంలో అవసరమైన క్యూలైన్లు, చలువ పందిళ్లు, కూల్‌ పెయింట్లు వేస్తున్నారు. కుంభాభిషేకానికి జరుగుతున్న ఏర్పాట్లపై ఆలయ ఈవో శీనానాయక్‌, చైర్మన్‌ రాధాకృష్ణ ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ ఉత్సవ ఏర్పాట్లపై ఇప్పటికే పరిశీలన చేసి ఆలయ అధి కారులకు పలు సూచనలను ఇచ్చారు.

ఆలయ కలశం ముఖ భాగంలో విష్ణువు, కంఠ భాగంలో శివుడు, మూలభాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో మాతృదేవతలు కొలువై ఉంటారని ప్రసిద్ధి. కలశం లోపల సప్త సముద్రాలు, సప్తదీపాలతో కూడిన భూమండలం, నాలుగు వేదాలు వాటి అంగాలతో సహా పవిత్ర జలంలో నిక్షిప్తమై ఉన్నాయి. కుంభాభిషేకంలో ప్రధానంగా దేశ ఆధ్యాత్మిక శక్తికి చిహ్నాలుగా భావించే పవిత్ర నదులు, తీర్థాలు, సముద్ర జలాలను వినియోగిస్తారు. ఈ పవిత్ర జలాలను కలశాలలో ఉంచి, యాగశాలలో మంత్రయుక్తంగా పూజించిన తర్వాతే కుంభాభిషేకానికి వినియోగిస్తారు. ఆగమ శాస్త్రాలను అనుసరించి 12 ఏళ్లకు ఒక సారి ఆలయంలో దైవికశక్తిని మరింత ఇనుమడింపజేయడానికి ఈ క్రతువును నిర్వహిస్తారు. వేద మంత్రాల పఠనం, ప్రతిష్ఠించిన యంత్రాల శక్తిని పెంచడం(యంత్రం), ఆగమ విహిత క్రియలు(తంత్రం) అన్నీ కలిపి కుంభాభిషేకం ద్వారా ఆలయానికి విశేష శక్తిగా మారుస్తాయి.

మూడు రోజులు..

6వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటలకు యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్షధారణ, పంచగవ్య ప్రాశనం, అఖండ దీపారాధన జరుగుతాయి. సాయంత్రం 4 నుంచి అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠాపన, మూలమంత్ర హవనం, హారతి, రాత్రి 7 గంటలకు మంత్ర పుష్పం జరుగుతుంది.

12 ఏళ్లకు ఒక సారి జరిగే మహా కుంభాభిషేక మహోత్సవానికి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఘాట్‌రోడ్డులోని ఓం టర్నింగ్‌ నుంచి ఆలయానికి 5 వరుసల ప్రత్యేక క్యూలైన్‌ ఏర్పాటు చేయడంతో పాటు ఈ మూడు రోజులు అన్ని దర్శనాలకు ఉచితంగా అనుమతించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement