ఏటా సాగునీరు ప్రశ్నార్థకం
అసలు పని చేయని 8 మోటార్లు
నిర్లక్ష్య వైఖరి వీడాలి
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎత్తిపోతల పథకాలు ‘ఉత్తి’పోతలుగా కనిపిస్తున్నాయి. పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం మైలవరంలోని తారకరామ ఎత్తిపోతల పథకం. వీటికి నిధులు కేటాయించకుండా.. పంప్‌హౌస్‌ల నిర్వహణను గాలికొదిలేయడమే కాకుండా నిర్మాణ పొడిగింపును ప్రస్తుత రాష్ట్ర పాలకులు తాత్సారం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో హడావుడి చేసిన కూటమి నేతలు ప్రస్తుతం పట్టించుకోకపోవడంతో రైతులు పోరాటానికి సిద్ధమవుతున్నారు.
నిర్లక్ష్యం నీడలో తారకరామ ఎత్తిపోతల పథకం
జి.కొండూరు: మైలవరానికి జీవనాడిగా ఉండాల్సిన తారకరామ ఎత్తిపోతల పథకాన్ని పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రంలో వినియోగించిన నీటిని తిరిగి కృష్ణా నదిలోకి వెళ్లకుండా బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా ఈలప్రోలు వద్ద కుడి, ఎడమ కాల్వలకు మళ్లించి ఎత్తి పోతల పద్ధతిలో మైలవరం నియోజకవర్గానికి సాగుకు నీరందించడమే తారకరామ లక్ష్యంగా ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. దీనిలో భాగంగా కుడికాల్వ పొడవు 25.74 కి.మీ., ఎడమకాల్వ పొడవు 51.27 కి.మీ.గా అప్పట్లో నిర్ధారించారు. ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, విజయవాడ రూరల్ పరిధిలోని 15 గ్రామాలకు చెందిన 12,556 ఎకరాలకు నీరందించడం లక్ష్యంగా 1999–2004 మధ్య మొదటి దశ పనులను పూర్తి చేసి సాగునీరు సరఫరా చేశారు. ఇదే సమయంలో గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, ఆగిరిపల్లి, మండలాలకు నీరందించాల్సిన కుడి కాల్వను సైతం 6.6కిలోమీటర్లు వరకు తవ్వి ఈ కాల్వపై మూడు సబ్ లిఫ్ట్‌లను నిర్మించి వదిలేశారు.
అడుగు ముందుకు పడలేదు
రెండో దశలో జి.కొండూరులోని 8 గ్రామాలకు చెందిన 4,242 ఎకరాలకు నీరందించడం లక్ష్యంగా 2006, మే 10న పనులు ప్రారంభించి 2009కి పూర్తి చేశారు. మూడో దశ పనులు జి.కొండూరు నుంచి మైలవరం నియోజకవర్గంలోని 8,132 ఎకరాలకు నీరందించడానికి నిర్ణయించారు. ఆ తర్వాత ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
పోరాటానికి రైతులు సిద్ధం
ఎత్తిపోతల నిర్వహణకు రూ.5కోట్లు నిధులు మంజూరుతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి మైలవరానికి సాగునీరందించాలని కోరుతూ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ఆయకట్టు రైతులు, రైతు సంఘాల నాయకులు 17మందితో జనవరి 27న కమిటీగా ఏర్పడ్డారు. దీని ఆవశ్యకతను తెలిపేలా బుక్‌లెట్‌ను ప్రచురించి రైతులకు పంపిణీ చేశారు. గత నెల 2వ తేదీన కలెక్టర్ లక్ష్మీశను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ నాలుగు పంప్‌హౌస్‌ల కింద ఆయకట్టుగా ఉన్న 4,820 ఎకరాలు వ్యవసాయ భూమికి ఏటా సక్రమంగా నీరందక సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. నీటి వసతి ఉన్నా ఎత్తిపోసేందుకు మోటార్లు లేక కుడి కాల్వ కింద ఆయకట్టు రైతులు రబీసాగును పూర్తిగా మరిచిపోయారు.
తారకరామపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి నిర్వహణకు నిధులను విడుదల చేయాలి. ఎమర్జెన్సీగా రూ.5కోట్లు కేటాయించి మరమ్మతులు చేపడితే రాబోయే ఖరీఫ్‌కు రైతులకు పుష్కలంగా నీరందుతుంది. బంగారంలాంటి ఎత్తిపోతల పథకాన్ని మరుగున పెట్టి చింతలపూడి, పోలవరం అంటూ ప్రగల్బాలు పలకడం రైతులను మోసం చేయడమే. నూతనంగా ఏర్పడిన కమిటీతో కలిసి తారకరామ ఎత్తిపోతల సాధనకు పోరాడతాం.
–పి.జమలయ్య, ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తారకరామ ఎత్తిపోతల పథకం నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది. ఈ పథకం కుడి కాల్వపై ఉన్న నాలుగు పంప్‌హౌస్‌లలో మోటార్లు సరిగా పనిచేయని పరిస్థితి నెలకొంది. 9.25 కి.మీ. మేర ఉన్న తారకరామ కుడి కాల్వలో ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు, తుమ్మ, జమ్ము, తూటు వంటి వాటితో నిండి కాల్వలో నీరు ముందుకు కదలకు పంపు హౌస్‌లలో ఉన్న మోటార్లకు నీరందడంలేదు. ఈ నాలుగు పంపు హౌస్‌లలో 14మోటార్లు ఉండగా 8మోటార్లు అసలు పూర్తిగా పని చేయడంలేదు. మిగిలిన ఆరు మోటార్లు కూడా విద్యుత్ లోఓల్టేజ్ కారణంగా, మోటార్లకు నీరందక, మరమత్తులకు నోచుకోక అంతంతమాత్రంగానే పని చేస్తున్నాయి.


