కోనేరుసెంటర్: జిల్లాలో మే 1వ తేదీ నుంచి ఇళ్ల జాబితా, గణన కార్యక్రమాన్ని సజావుగా చేపట్టాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ సెన్సస్ చార్జ్ అధికారులను ఆదేశించారు. కృష్ణా విశ్వ విద్యాలయంలో సోమవారం మొదటి దశ ఇళ్ల జాబితా, గణన కార్యక్రమానికి సంబంధించి జిల్లా చార్జ్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలో గణన కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాల్సి ఉందన్నారు. అందులో భాగంగా మొదటి దశలో మే 1 నుంచి ఇళ్ల జాబితాను సేకరించి బ్లాకులుగా విభజించాలన్నారు. రెండవ దశలో ఆ ఇంటిలో ఉన్న వారి వివరాలను సాధారణంగా కాకుండా జాగ్రత్తగా పూర్తి సమాచారంతో వాస్తవాలు ప్రతిబింబించే విధంగా తప్పులు దొర్లకుండా నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇచ్చే వివరాలతో ప్రజలకుగానీ ప్రభుత్వానికిగానీ ఎలాంటి నష్టం రాకూడదన్నారు. ఏ ఒక్క నిర్మాణం తప్పిపోకూడదన్నారు. సరిహద్దులు నిర్ణయించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే గణన సులభం అవుతుందన్నారు. ఏ ఒక్క ఇంటిలోనూ రెండు పరిపాలన యూనిట్లు అంటే మునిసిపాలిటీగానీ, పంచాయతీగానీ కలిసి ఉండకూడదని చెప్పారు. బడ్జెట్ మేరకు ఎన్యూమరేటర్లను నియమించుకుని అందరికీ సమానంగా పని అప్పగించాలన్నారు. ఈ సందర్భంగా సెన్సెస్ డైరెక్టర్ ప్రసన్నకుమార్ బృందం శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణలో విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కూన రాంజీ, డీఆర్వో చంద్రశేఖరరావు, రిజిస్ట్రార్ ఉష, కేఆర్‌ఆర్‌సీఎస్‌డీసీ శ్రీదేవి, మచిలీపట్నం, గుడివాడ ఆర్డీఓలు సాంబశివరావు, బాలసుబ్రహ్మణ్యం, జెడ్పీ సీఈఓ కన్నమ నాయుడు, డీపీఓ అరుణ, సెన్సస్ చార్జ్ అధికారులు, తహసీల్దారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ


