పెనమలూరు: యనమలకుదురు శ్రీపార్వతీ సమేత శ్రీరామలింగేశ్వరస్వామికి ఓ భక్తురాలు అష్టలక్ష్మి వెండి బిందెను బహూకరించారు. ఆలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో యనమలకుదురుకు చెందిన భక్తురాలు సింహాద్రి పద్మావతి.. 620 గ్రాముల అష్టలక్ష్మి వెండి బిందెను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.భవానికి అందజేశారు. తొలుత స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో అర్చకుడు సాగర్, భక్తులు పాల్గొన్నారు.
ఏడాదికి 125 రోజుల పనిదినాలు కల్పిస్తాం
చిలకలపూడి(మచిలీపట్నం): కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల కోసం సంవత్సరానికి 125 రోజుల పనిదినాలు కల్పించడానికి నూతనంగా వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ – వీబీజీ రాంజీ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశం హాలులో డ్వామా ఆధ్వర్యాన రూపొందించిన వాల్‌పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకం గ్రామీణాభివృద్ధికి దోహదపడుతుందని ఉపాధికి కొత్త హామీగా దీన్ని ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, డ్వామా పీడీ ఎన్‌వీ శివప్రసాద్, మెప్మా పీడీ పి.సాయిబాబు, సమగ్ర శిక్ష ఏపీసీ కుముదినిసింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ ఓపెన్ పరీక్షలు ప్రారంభం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే ఇంటర్మీడియెట్ పరీక్షలు సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. 11 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాటు చేశారు. తొలి రోజు ఇంగ్లిష్ పరీక్షకు 1,288 మంది విద్యార్థులను కేటాయించగా అందులో 1,135 మంది హాజరయ్యారు. 153 మంది గైర్హాజరయ్యారు. హాజరు 88.12 శాతంగా అధికారులు ప్రకటించారు. జిల్లా స్థాయి పరిశీలకులు కృష్ణమోహన్, విజయవాడలోని రెండు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ జిల్లాలోని ఐదు పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. మూడు ఫ్లయింగ్ స్వాడ్ బృందాలు పర్యటించాయి.
ముగ్గురు పట్టివేత
ముగ్గురు అభ్యర్థుల కోసం వేరే వ్యక్తులు పరీక్ష రాయడానికి హాజరు కావడంతో వారిని ఇన్విజిలేటర్లు, స్క్వాడ్ బృందం తనిఖీ చేసి పట్టుకున్నాయి. నందిగామ జెడ్పీ ఉన్నత పాఠశాలలో రూమ్ నంబర్ నాలుగులో పరీక్ష రాస్తున్న విద్యార్థిని గమనించిన ఇన్విజిలేటర్ అనుమానంతో ప్రశ్నిస్తున్న సమయంలో అప్పుడే వెళ్లిన ఫ్లయింగ్ స్క్వాడ్ అతనిని పరిశీలిచి అసలైన అభ్యర్థి కాదని నిర్ధారించారు. అతనిపై నందిగామ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. నందిగామలో శ్రీ విద్య ఉన్నత పాఠశాలలో ఇద్దరు అభ్యర్థుల బదులు వేరే వ్యక్తులు పరీక్ష రాయడానికి రావడంతో వారిని అధికారులు బయటకు పంపేశారు.
నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
మక్కపేట(వత్సవాయి): ‘పది’ పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ సూచించారు. గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా పదో తరగతి విద్యార్థులకు జరుగుతున్న గ్రాండ్ టెస్టును తొమ్మిదో తరగతి విద్యార్థులకు జరుగుతున్న ఎస్‌ఏ–2 పరీక్షలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పాఠశాలకు ఈ ఏడాది కొత్తగా పబ్లిక్ పరీక్షలు రాయడానికి సెంటర్ రావడంతో గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలను పరిశీలించారు. పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పూర్వ విద్యార్థులు పీడీవీ ప్రసాదరావు, అజ్మీరు శ్రీనివాసరావును ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి హెచ్‌ఎం ఎ. శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు దుర్గారావు, డి.శ్రీనివాసరావు, స్వాతి, నాగలక్ష్మి, రమ్య తదితరులు పాల్గొన్నారు.


