ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరులోని నడింపల్లె ఎస్సీహాస్టల్‌లో చదువుకుంటున్న తలారి నరసింహులు (16) ఆదివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మైలవరం మండలంలోని కల్లుట్ల గ్రామానికి చెందిన తలారి ఓబులేసు, గంగాదేవి దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. ఇద్దరు కొడుకులు చదువుకుంటున్నారు. ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తిలో ఉంటున్న గంగాదేవి సోదరి నాగలక్ష్మికి పిల్లలు లేరు. దీంతో ఆమె మూడేళ్ల వయసు నుంచి నరసింహులును పోషించుకుంటోంది.
అతను 6వ తరగతి నుంచి ప్రొద్దుటూరులోని నడింపల్లె హాస్టల్‌లలో ఉంటూ పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాడు. నరసింహులు ప్రస్తుతం పదోతరగతి చదువుకుంటున్నాడు. ప్రతి ఆదివారం పోట్లదుర్తిలో ఉంటున్న తమ పెద్దమ్మ వద్దకు వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో ఈ ఆదివారం కూడా అతను పోట్లదుర్తికి వెళ్లాడు. రాత్రి ఇక్కడే ఉండమని పెద్దమ్మ చెప్పినా వినలేదు. స్టడీ క్లాస్ ఉందని చెప్పి సాయంత్రం ప్రొద్దుటూరుకు వచ్చాడు.
రాత్రి పడుకున్నాడు.. ఉదయం శవమై కనిపించాడు
రాత్రి అందరితో పాటు నరసింహులు చదువుకున్నాడు. భోజనం చేసి తోటి పిల్లలతో సరదాగా కొంతసేపు ఆడుకున్నాడు. అయితే అదరూ 10 గంటలకు పడుకున్నా అతను మాత్రం రాత్రి 11 గంటల వరకు పడుకోకుండా దిగాలుగా కూర్చొని ఉన్నట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. పడుకుందాం రారా అని పిలిచినా అతను రాలేదని అంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 6 గంటల సమయంలో విద్యార్థులు బయటికి రాగా హాస్టల్ ప్రాంగణంలో ఉన్న చెట్టుకు ఉరేసుకొని నరసింహులు వేలాడుతున్నాడు. దీంతో విద్యార్థులు హాస్టల్ వార్డెన్ బ్రహ్మయ్య దృష్టికి తీసుకెళ్లారు. ప్రాణం ఉంటుందేమోనని అందరూ కలిసి చెట్టుకు వేలాడుతున్న నరసింహాలును కిందికి దించారు.
అయితే అప్పటికే అతను చనిపోయాడు. తర్వాత విద్యార్థి తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నరసింహులు మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. విద్యార్థులను దిక్కులేని వారిగా వదిలేశారని, రాత్రి ఒక్కరు కూడా పిల్లలను చూసువడానికి హాస్టల్‌లో ఉండలేదని వాపోయారు. ఏ ఒక్కరు రాత్రి హాస్టల్‌లో ఉన్నా నరసింహులు ప్రాణాలతో ఉండేవాడని తెలిపారు. టూ టౌన్ సీఐ వంశీనాథ్, ఎస్‌ఐ రాఘవేంద్రారెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం తీసుకెళ్లేందుకు విద్యార్థి బంధువులు అంగీకరించలేదు. తర్వాత పోలీసులు వారికి నచ్చచెప్పి మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.
విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపిస్తాం
విద్యార్థి నరసింహులు ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి, జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్, ఎంఈఓలు సావిత్రమ్మ, శోభ పేర్కొన్నారు. వారు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. కాగా విద్యార్థి మృతిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పరీక్షల భయంతో మానసిక ఒత్తిడికి గురై తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి ఓబులేసు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంకా తమ కుమారుడి మరణానికి ఇతర కారణాలు కూడా ఉండొచ్చని అతను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాఘవేంద్రారెడ్డి తెలిపారు.


