కూటమి నేతల అండతో భూకబ్జాలు పెరిగిపోయాయి: వైఎస్సార్‌సీపీ | YSRCP Huge Rally In Anakapalle To Protest Temple Land Encroachment | Sakshi
Sakshi News home page

కూటమి నేతల అండతో భూకబ్జాలు పెరిగిపోయాయి: వైఎస్సార్‌సీపీ

Mar 3 2026 1:57 PM | Updated on Mar 3 2026 2:06 PM

YSRCP Huge Rally In Anakapalle To Protest Temple Land Encroachment

సాక్షి, అనకాపల్లి: కూటమి నేతల అండతో భూకబ్జాలు పెరిగిపోయాయని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మండిపడ్డారు. అనకాపల్లిలో ఆలయ భూమి కబ్జాను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సనాతన ధర్మం అంటూ భూములు కబ్జా  చేస్తున్నారంటూ అమర్‌నాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘కన్యకా పరమేశ్వరి దేవాలయానికి 100 కోట్లకు పైగా విలువ చేసే భూములను దానంగా  ఇచ్చారు. వందేళ్ల క్రితం రెండు ఎకరాల 49 సెంట్లు భూములను ఇచ్చారు. ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్ కోసం అందులో ఎకరా 38 సెంట్లు తీసుకున్నారు. కన్యకా పరమేశ్వరి దేవాలయానికి ఎకరా 11 సెంట్లు స్థలం మిగిలి ఉంది. ఈ భూమి 100 కోట్లకు పైగా విలువ చేస్తుంది. దేవాదాయ శాఖ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే అధికారం అధికారులకు లేదు. అధికారులు దేవాదాయ భూమిని ప్రైవేటు భూములు అని నివేదిక ఎలా ఇచ్చారు?’’ అంటూ అమర్నాథ్‌ ప్రశ్నించారు.

‘‘రూ.100 కోట్లు భూమి ఇప్పటికే కౌలుదారుల పేరు మీద ఉంది. దేవాలయాలు గురించి మాట్లాడే సనాతన నేతలు ఏమి చేస్తున్నారు. 100 కోట్ల భూమిపై సీబీఐ విచారణ జరపాలి. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో దొంగల ముఠా ఏర్పడింది. దేవాదాయ ప్రభుత్వ భూములను ఈ ముఠా దోచుకుంటుంది’’ అంటూ అమర్నాథ్‌ మండిపడ్డారు.

పూర్తి స్థాయిలో దర్యాపు చేయాలి: ముత్యాల నాయుడు
ఎకరా 11 సెంట్లు భూమి నీ కన్యకా పరమేశ్వరి దేవాలయానికి దానం ఇచ్చారు. దేవాలయ భూములను క్రయ విక్రయాలకు అనుమతి లేదు. దేవాదాయ శాఖ భూమిని అధికారులు జిరాయితీ భూమిగా మార్చారు. 100 కోట్ల భూ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాపు చేయాలి. దీని వెనుక ఉన్న అధికారులు, రాజకీయ నాయకులు మీద చర్యలు తీసుకోవాలి.

భూములను దోచుకుంటున్నారు: మలసాల భరత్
అధికారులు బ్రోకర్లతో కుమ్మకై దేవాదాయ భూములను దోచుకుంటున్నారు. రూ.100 కోట్లు విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. 22సీలో ఉన్న భూములను 22ఏ లోకి కలెక్టర్ ఎలా మారుస్తారు? ఈ కుంభకోణాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. రూ. 100 కోట్లు భూ వ్యవహారంపై కలెక్టర్ ఆర్డీవో వివరణ ఇవ్వాలి

భూములను కబ్జా చేయాలని చూస్తే ఊరుకునేది లేదు: కరణం ధర్మశ్రీ
సర్వే 1539 లో ఉన్న దేవాదాయ భూమి కాజేయాల్ని చూస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ భూమిని కాజేయాలని ప్రయత్నం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు 100 కోట్ల భూమిని కాపాడాం. మళ్లీ కూటమి అధికారంలోకి రావడంతో ఈ భూమి కొట్టేయడానికి ప్రయతిస్తున్నాడు. దేవాదాయ భూములను కబ్జా చేయాలని చూస్తే ఊరుకునేది లేదు.

 

Advertisement
 
Advertisement
Advertisement