ప్రపంచంలో భారత్‌ స్థాయి తగ్గేలా చేయొద్దు: రాహుల్‌ | "Silence diminishes India's standing in the world": Rahul Gandhi calls on Govt to speak up on Khamenei's killing | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో భారత్‌ స్థాయి తగ్గేలా చేయొద్దు: రాహుల్‌

Mar 3 2026 3:56 PM | Updated on Mar 3 2026 4:07 PM

"Silence diminishes India's standing in the world": Rahul Gandhi calls on Govt to speak up on Khamenei's killing

న్యూఢిల్లీ: ఇరాన్‌​ సుప్రీం లీడర్‌ ఖమేనీ హత్య గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. మౌనంగా ఉంటే ఈ తీరు ప్రపంచంలో భారత స్థాయిని తగ్గిస్తుందని అన్నారు. ఈ మేరకు రాహుల్‌ గాంధీ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. 

‘ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు.. అశాంతి నెలకొన్న ఆయా ప్రాంతాలను అతిపెద్ద ఘర్షణ వైపు నడిపిస్తున్నాయి. దాదాపు కోటి మంది భారతీయులు సహా కోట్లాది మంది ప్రజలు అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. భద్రతా పరమైన ఆందోళనలు వాస్తవమే అయినా, సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే దాడులు సంక్షోభాన్ని మరింత పెంచేస్తాయి.

ఇరాన్‌పై జరుగుతున్న ఏకపక్ష దాడులను, అలాగే ఇతర పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులను ఖండించాలి. హింస హింసనే పుట్టిస్తుంది. చర్చలు, సంయమనం పాటించడమే శాంతికి ఏకైక మార్గం. ఈ పరిస్థితుల్లో భారత్‌ నైతికంగా స్పష్టమైన రీతితో ఉండాలి. అంతర్జాతీయ చట్టాలు, మనుషుల ప్రాణాలను కాపాడడంలో భారత్‌కు స్పష్టంగా మాట్లాడే ధైర్యం ఉండాలి.

వివాదాలకు శాంతియుత పరిష్కారం చూపడానికి కృషి చేయడం మన విదేశాంగ విధానం, సార్వభౌమత్వంలో ఉంది. అది స్థిరంగా ఉండాలి. ప్రధాని మోదీ మాట్లాడాలి. ప్రపంచ క్రమాన్ని నిర్వచించే మార్గంగా ఒక దేశాధినేతను హత్య చేస్తే ఆయన మద్దతు ఇస్తున్నారా? నిశ్శబ్దం ఇప్పుడు ప్రపంచంలో భారత్‌ స్థాయిని తగ్గిస్తుంది’ అని రాహుల్‌ గాంధీ అన్నారు. 

కాగా, అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో పశ్చిమాసియా దేశాలపై ఇరాన్‌ ప్రతీకారదాడులకు దిగడంతో అమెరికా మళ్లీ భీకరదాడులు చేస్తామని హెచ్చరించింది. 

Advertisement
 
Advertisement
Advertisement