దుబాయ్ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇకపై విమానాశ్రయాల్లో ధృవపత్రాల పరిశీలన మరింత సులభం కానుంది. ప్రయాణికులు విమానాశ్రయంలో తమ పాస్‌పోర్ట్‌లు, ఇతర పత్రాలను చూపించకుండానే వెళ్లేందుకు అవకాశం కల్పించనున్నారు అధికారులు. దీని కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. వలస విధానాలను పూర్తి చేసుకునేందుకు వీలు కల్పించే బయోమెట్రిక్ (రెడ్ కార్పెట్) వ్యవస్థను ఈ నెలాఖరు నాటికి అన్ని విమానాశ్రయాల్లో విస్తరించనున్నారు.
దుబాయ్ చేరుకునే టెర్మినల్-3 ప్రయాణీకులకు ఇది అందుబాటులో ఉంటుంది. దుబాయ్ విమానాశ్రయాన్ని ప్రపంచంలోనే అత్యంత అధునాతన కేంద్రంగా మార్చడంలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నారు.
బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్..
ఎమిరేట్స్ యాప్, విమానాశ్రయ కియోస్క్‌ల ద్వారా బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన వారికి ఈ సేవ అందుబాటులో ఉంటుంది. మీరు మొదటిసారి స్మార్ట్ గేట్‌ను ఉపయోగిస్తుంటే.. ఏఐ కెమెరాలు మీ బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరించి భవిష్యత్‌లోనూ వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు. ఇందులో నమోదు చేసుకోవడానికి మీకు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, ఎమిరేట్స్ ఐడీ ఉండాలి. అలా నమోదు చేసుకున్న తర్వాత, మీరు మీ పాస్‌పోర్ట్, బోర్డింగ్ పాస్‌ను చూపించకుండానే స్మార్ట్ కారిడార్ గుండా వెళ్లొచ్చు.


