జాహ్నవి (ఫైల్)
2023లో అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన జాహ్నవి
కందుల జాహ్నవి సొంతూరు కర్నూలు జిల్లా ఆదోని
మూడు రోజుల క్రితం తండ్రి శ్రీకాంత్ గుండెపోటుతో మరణం
కర్నూలు (సెంట్రల్)/ఆదోని సెంట్రల్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారాన్ని వాషింగ్టన్‌లోని సియోటెల్ సిటీ అటార్నీ జనరల్ ఎరికా ఇవాన్స్ అధికారికంగా ప్రకటించారు. ‘‘జాహ్నవి మృతి మా హృదయాలను కలచివేసింది. ఈ ఆర్థికసాయమైనా ఆమె కుటుంబానికి కాస్తంత ఓదార్పు అందిస్తుందని ఆశిస్తున్నాం’’ అని ఇవాన్స్ వెల్లడించారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన జాహ్నవి
కర్నూలు జిల్లా ఆదోనిలోని తిరుమలగిరిలో నివాసం ఉంటున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్, విజయలక్ష్మి దంపతులు కౌతాళం మండలం కుంబళనూరు నుంచి వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు సంతానం. మొదటి కుమార్తె జాహ్నవి ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికా వెళ్లింది. అక్కడి నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ కోర్సులో చేరింది. అయితే 2023 జనవరి 23న జాహ్నవి రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో 100 అడుగుల దూరంలో ఎగిరిపడిన జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయింది.
ఈ ప్రమాదానికి పోలీసు వాహనం నడుపుతున్న కెవిన్ డవే అనే అధికారి కారణమయ్యారు. అయితే ఆమె మృతిపై మరో అధికారి డేనియల్ అడరర్ అత్యంత నిర్లక్ష్యంగా జోకులు వేస్తూ మరో అధికారితో మాట్లాడడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ‘‘ఈమెకు 26 ఏళ్లు ఉంటాయేమో. అయినా సాధారణ వ్యక్తి. ఈమె మరణానికి ఎలాంటి విలువ లేదు’’ అని అడరర్ వ్యాఖ్యానించడం మరో అధికారి బాడీ కెమెరాలో రికార్డయింది. భారత విద్యార్థి మృతి, అధికారి అనుచిత వ్యాఖ్యలపై భారత్ భగ్గుమంది. అమెరికా పౌరులూ డేనియల్ అడరర్ తీరును ఖండించారు. దీంతో అతనిపై వేటు పడింది. విధుల నుంచి పోలీసు ఏజెన్సీ తప్పించింది.
ఈ క్రమంలో సియాటెల్ సిటీ అధికారులే తమ కుమార్తె మరణానికి కారణమని 110 మిలియన్ డాలర్లు పరిహారంగా చెల్లించాలని జాహ్నవి కుటుంబం 2024 సెప్టెంబర్‌లో దావా వేసింది. ఈ క్రమంలో పూర్తి స్థాయి విచారణ జరిపిన వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ సిటీ అటార్నీ జనరల్ ఎరికా ఇవాన్స్ అధికారుల నిర్లక్ష్యం, అలసత్వంతోనే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించి బాధిత కుటుంబానికి పరిహారం ప్రకటించారు. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.262 కోట్ల పరిహారం చెల్లించేలా అగ్రిమెంట్ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే బాధిత కుటుంబానికి భారత ఎంబసీ ద్వారా ఆ పరిహారం అందించేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
మూడు రోజుల క్రితమే జాహ్నవి తండ్రి మృతి
ఆదోనిలోని తిరుమలగిరిలో నివాసం ఉంటున్న జాహ్నవి తల్లిదండ్రులు కుమార్తె మరణంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు చుట్టుపక్కల వారు చెబుతున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితమే తండ్రి శ్రీకాంత్ గుండెపాటుతో మరణించారు. దీంతో తల్లి విజయలక్ష్మీ, చిన్న కూతురు మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో వారికి భారీ పరిహారం అందితే ఎంతో అండగా ఉంటుంది. అయితే ఈ విషయం వారికి తెలియదు. ప్రస్తుతం వారు శ్రీకాంత్ మరణంతో తీవ్ర విషాదంలో ఉన్నారు.


