కుక్కల్ని లెక్కెట్టండి! | New task for secretariat employees | Sakshi
Sakshi News home page

కుక్కల్ని లెక్కెట్టండి!

Feb 13 2026 5:23 AM | Updated on Feb 13 2026 5:23 AM

New task for secretariat employees

సచివాలయ ఉద్యోగులకు కొత్త టాస్క్‌

సాక్షి, పార్వతీపురం మన్యం/వంగర: చంద్రబాబు ప్రభుత్వంలో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. వివిధ సర్వేలతో పని ఒత్తిడికి గురిచేయడం, సదుపాయాలు సమకూర్చకపో­వడం, వారు చేయాల్సిన పనులు కాకుండా ఇతర పనులు అప్పగించడంతో వారంతా రోడ్లెక్కి ఆందోళనలు చేశారు. వేధింపులు భరించలేక కొందరు తనువు చాలించారు. అయినా పట్టించుకోని ప్రభుత్వం వారికి కొత్తకొత్త పనులు అప్పగిస్తూనే ఉంది. 

తాజాగా.. పార్వతీపురం మున్సిపా­లిటీలో వీధి కుక్కలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టాలంటూ సచివాలయాల్లోని శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు మున్సిపల్‌ ఉన్నతాధికారులు కొత్త టాస్క్‌ ఇచ్చారు. ఈ ఆదేశాలపై వార్డు ఉద్యోగులు భగ్గుమంటున్నారు. తాము చదువుకున్న చదువేమిటి.. చేస్తున్న పని ఏమిటో తెలియక ఉద్యోగులు అసంతృప్తికి లోనవుతున్నారు. ఇదెక్కడి ఉద్యోగం బాబోయ్‌ అంటూ తలలు పట్టుకుంటున్నారు. 

ఇక్కడితో అయిపోలేదు: విజయనగరం జిల్లా వంగర మండలంలోని సంగమేశ్వరస్వామి ఆలయం వద్ద ఏటా శివరాత్రి రోజున జరిగే ఉత్సవాలకు ఈ ఏడాది సచివాలయ ఉద్యోగులకు  డ్యూటీలు వేయడం విమర్శలకు తావిస్తోంది. చీపురుపల్లి ఆర్డీవో ఆదేశాల మేరకు మండల పరిషత్‌ నుంచి 32 మంది, రెవెన్యూ శాఖ నుంచి ఏడుగురు వీఆర్‌ఓలకు సంగాంలో డ్యూటీలు వేశారు. గతంలో ఎన్నడూ వీరిని విధుల్లో వినియోగించకపోగా, తాజాగా ఎంపీడీఓ, తహసీల్దార్‌ 12న ఆర్‌సీ నెం.20–2026–బి పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈ నెల 14నుంచి 21వరకు ఎవరెవెరు ఏఏ షిఫ్టులలో విధులకు హాజరు కావాలో అందులో పేర్కొన్నారు. సచివాలయ మహిళా ఉద్యోగులకు రాత్రి షిప్టులు వేయడంపై భగ్గుమంటున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ నెల 15నుంచి 21 వరకు మహిళా పోలీసులకు విధులు కేటాయించారు. విధులకు డుమ్మా కొడితే బాధ్యతారాహిత్యం కింద చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సచివాలయ ఉద్యోగులకు శివరాత్రి ఉత్సవాల విధులు కేటాయిస్తూ వంగర ఎంపీడీఓ ఇచ్చిన ఉత్తర్వులు 

Advertisement
 
Advertisement
Advertisement