సీ షిఫ్ట్‌లో రాత్రి 10 నుంచి 6గంటల వరకు ఉద్యోగానికి వచ్చే స్టీల్‌ప్లాంట్ కారి్మకులపై నిఘా
ప్రతిరోజూ తనిఖీలు చేయాలని అన్ని విభాగాల అధికారులకు ఆదేశాలు
ఇప్పటికే వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న యాజమాన్యం
ఒకవైపు వీఆర్‌ఎస్, మరోవైపు కాంట్రాక్ట్ లేబర్ తొలగింపు
అధికారులకు 12 గంటల పని
రాత్రివేళల్లో తనిఖీలతో కార్మికుల హడల్
ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో నైట్ షిఫ్ట్ విధులపై కట్టుదిట్టమైన నిఘా కోసం యాజమాన్యం ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసింది. స్టీల్‌ప్లాంట్ సీజీఎం (వర్క్స్) రంజన్ మహంతి ఉత్తర్వుల మేరకు 24 మంది జీఎంలతో ప్రత్యేక బృందాన్ని నియమించారు. నైట్ షిఫ్ట్‌లో సిబ్బంది హాజరు, సాంకేతిక క్రమశిక్షణ, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌ఓపీ), భద్రతా ప్రమాణాల అమలును ఈ బృందం పరిశీలించనుంది.
తాజా ఉత్తర్వుల ప్రకారం.. ప్రతిరోజూ టీమ్‌లోని ముగ్గురు సభ్యులు ఆయా విభాగాలను ఆకస్మికంగా సందర్శించి నిర్వహణా ప్రమాణాల ఉల్లంఘనలు, తప్పుడు విధానాలు, భద్రతా లోపాలను పరిశీలించి 12 గంటలలోపు సీజీఎం (వర్క్స్)కు నివేదిక అందజేయాలి. ప్రతిరోజూ వెళ్లాల్సిన ముగ్గురు సభ్యుల సమన్వయాన్ని ప్లాంట్ కంట్రోల్ విభాగం చూసుకుంటుంది.
కార్మికుల్లో ఆందోళన
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పనిచేసే సీ షిఫ్ట్ సిబ్బందిపై ప్రత్యేకంగా ఈ తనిఖీలు జరగనున్నాయి. ఇప్పటికే వేతనాల చెల్లింపులో జాప్యం, స్వచ్ఛంద విరమణ పథకం (వీఆర్‌ఎస్) అమలు, కాంట్రాక్ట్ లేబర్ తొలగింపు, అధికారులకు 12 గంటల పని విధానంతో అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజా నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
రాత్రివేళ ఆకస్మిక తనిఖీలతో సిబ్బంది ఒత్తిడికి గురవుతారని యూనియన్ వర్గాలు అంటున్నాయి. చెకింగుల పేరిట వేధింపులు పెరుగుతాయనే భయం వ్యక్తమవుతోంది. భద్రతా ప్రమాణాల పేరుతో చేపడుతున్న చర్యలు, ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


