ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి: వైఎస్‌ జగన్‌ | YSRCP Chief YS Jagan Gives Direction To MLCs Over Kutami Govt Scams, Corruption And Public Grievances, Watch Video For Details | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి: వైఎస్‌ జగన్‌

Feb 13 2026 4:57 AM | Updated on Feb 13 2026 11:52 AM

YSRCP President YS Jagan gives direction to MLCs

శాసనసభలో ప్రజల గొంతు వినిపించకూడదని ప్రభుత్వం కుట్ర

అందుకే ఏకైక ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్‌సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు 

మండలిలో సంఖ్యా బలం ఉంది కాబట్టి ప్రజా సమస్యలపై గట్టిగా గొంతెత్తాలి 

ఎమ్మెల్సీలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం 

తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టించి దానికి రెక్కలు కట్టారు 

వైఎస్సార్‌సీపీపై నిరంతరం బురదజల్లుతూ దుష్ప్రచారం చేస్తున్నారు 

2024 మార్చి 16న ఎన్నికల కోడ్, మే 13న పోలింగ్‌.. 

మే 15న టీటీడీలో నెయ్యి సరఫరాకు టెండర్లు ఓకే  

జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు.. చంద్రబాబు సీఎం అయ్యాకే నెయ్యి సరఫరా ప్రారంభం 

జూలై 6, 12వ తేదీల్లో వచ్చిన నాలుగు ట్యాంకర్ల నెయ్యి నాణ్యత పరీక్షలో ఫెయిల్‌ 

వాటిని వెనక్కు పంపిన టీటీడీ.. ఆగస్టు, సెప్టెంబర్‌లో తిరిగి అదే నెయ్యి సరఫరా 

తిరస్కరణకు గురైన నెయ్యిని మళ్లీ ఎలా అనుమతించారు? ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది చంద్రబాబే 

సూపర్‌ సిక్స్‌ హామీలు నెరవేర్చకుండా ప్రశ్నించిన వారిపై దాడులు, అక్రమ కేసులు 

వ్యవసాయం, విద్య, వైద్య రంగాలు తిరోగమనం 

పాలనంతా స్కామ్‌ల మయం.. విశాఖలో రూ.5 వేల కోట్ల భూమి ‘గీతం’పరం  

వీటన్నింటినీ గట్టిగా ప్రశ్నించాలి.. ప్రజల తరఫున గొంతు వినిపించాలి

ఎన్నికలప్పుడు ఇంటింటికీ ఇచ్చిన హామీలతో కూడిన బాండ్ల గురించి ప్రశ్నించే వారిపై దాడులు, తప్పుడు కేసులు.. అన్ని రంగాలూ తిరోగమనం.. విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావట్లేదు.. కూటమి ప్రభుత్వం స్కామ్‌ల మయంగా మారింది.. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ సాగుతోంది.. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొత్త నినాదం వినిపిస్తోంది. అదే ‘క్యాషూ.. సూట్‌ కేసూ.. రాజేషు.. లోకేషు..’ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ అంశాలన్నింటిపైనా సభలో గట్టిగా గొంతు వినిపించాలి. గట్టిగా పోరాడాలి.  
– వైఎస్‌ జగన్‌  

సాక్షి, అమరావతి: శాసనసభలో ప్రజల తరఫున మన గొంతు వినిపించకూడదని ప్రభుత్వం కుట్ర చేస్తోందని, అందుకే ఏకైక ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కౌన్సిల్‌ (శాసన మండలి)లో మనకు మంచి సంఖ్యా బలం ఉందని, ప్రజా సమస్యలపై గొంతెత్తి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. ‘అందరూ యుద్ధంలో ఉన్నారు. 

నా కంటే మీకే ఇంకా బాగా తెలుసు. అందుకే మీరు కూడా సమర్థవంతంగా పోరాడతారు. మనకు శాసనసభలో బలం తక్కువ. అక్కడ మన గొంతు వినపడకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ మాత్రమే. అయినా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదు. ఎందుకంటే, మనకు ఆ గుర్తింపును ఇస్తే, విపక్ష నేతకు కూడా సీఎంకు ఎంత సమయం ఇస్తారో దాదాపుగా అంతే సమయం మాట్లాడే అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టే, మన పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా సమస్యలపై గొంతెత్తలేం కాబట్టి, ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్నాం. ఆధారాలతో సహా, అన్నీ వివరిస్తున్నాం’ అన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

మండలిలో గట్టిగా నిలదీద్దాం
కౌన్సిల్‌లో మనకు బలం ఉంది. కాబట్టి మనకు మాట్లాడే అవకాశం వస్తుంది. మనకు మైక్‌ ఇస్తారు కాబట్టి, ప్రజల సమస్యలను గట్టిగా వినిపించే వీలుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీకు తెలుసు. సబ్జెక్టుల వారీగా పూర్తి అవగాహన పెంచుకోండి. అప్పుడే మనం గట్టిగా మాట్లాడగలం. దేనికైనా మంచి ప్రిపరేషన్‌ అవసరం. అవగాహన పెంచుకుంటే బాగా మాట్లాడగలుగుతాం. ఏ అంశంపై మాట్లాడినా తగిన ఆధారాలు, సాక్ష్యాలు చూపి మాట్లాడాలి. అప్పుడే మన గొంతు బలంగా పోతుంది. 

లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని బాబు తట్టుకోలేకపోతున్నారు 
తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు ఒక అబద్ధాన్ని çసృష్టించి దానికి రెక్కలు కట్టారు. అంబటి రాంబాబు, జోగి రమేష్‌ ఇళ్లపై దాడులు, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్‌రెడ్డిలపై దాడులు కానీ, కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై అక్రమ కేసులు.. ఇవన్నీ తిరుమల లడ్డూ వ్యవహారంలో ప్రశ్నించడాన్ని తట్టుకోలేక చంద్రబాబు చేసినవే. చివరకు చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని మనం గుళ్లలో పూజలు చేసినా, చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఏకంగా భౌతిక దాడులు చేస్తున్నారు. ఒక అబద్ధం సృష్టించి, దానికి రెక్కలు కట్టి ప్రచారం చేయడం తొలిసారి చూస్తున్నాం. అసలు కల్తీ నెయ్యి సరఫరాకు, వైఎస్సార్‌సీపీకి ఏమాత్రం సంబంధం లేదు. 

టీటీడీలో నెయ్యి సరఫరాకు ఒక పక్కా విధానం
టీటీడీలో నెయ్యి సేకరణకు ఒక నిర్ధిష్టమైన పటిష్ట విధానం ఉంది. నెయ్యి తెచ్చిన ట్యాంకర్లు కేంద్ర ప్రభుత్వం అక్రిడేటెడ్‌ ల్యాబ్‌ నుంచి సర్టిఫికెట్‌ తీసుకురావాలి. అలా వచ్చిన ట్యాంకర్‌లోని నెయ్యిని మళ్లీ టీటీడీ కూడా పరీక్షిస్తుంది. ఆ రిపోర్టు కూడా పాజిటివ్‌గా ఉంటేనే లోపలికి పంపిస్తారు. ఇదే పద్ధతిలో నాణ్యత లేక మన హయాంలో 18 సార్లు ట్యాంకర్లు వెనక్కు పంపాం. అంతకు ముందు చంద్రబాబు హయాంలో కూడా 2014–19 మధ్య 15 ట్యాంకర్లు వెనక్కు పంపారు. మరి ఇలాంటి పద్ధతి ఉన్నప్పటికీ కూడా దొడ్డిదారిన రిజెక్ట్‌ చేసినవి, తిరిగి టీటీడీకి వచ్చాయంటే, దానికి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా? మరి వీటన్నింటినీ మన పార్టీకి, మన ప్రభుత్వ కాలానికి ఆపాదించి రోజూ బురద చల్లుతున్నారు. వాస్తవానికి సీబీఐ చార్జిషీటులో అభియోగాలు ఎదుర్కొంటున్న కంపెనీలే 2014–19 మధ్య కూడా నెయ్యిని సరఫరా చేశాయి. ప్రీమియర్‌ డెయిరీ 2016, 2017, 2018లో కూడా నెయ్యి సరఫరా చేసింది. కానీ, కేవలం మన ప్రభుత్వానికి ఆపాదించి కుట్రలు చేస్తున్నారు.

హామీలన్నీ గాలికి..
సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రజలను మోసం చేశారు. ఇవన్నీ అమలు చేస్తామంటూ ఎన్నికలప్పుడు ఇంటింటికీ బాండ్లు ఇచ్చారు. అప్పుడు చెప్పిందేమిటి? ఇప్పు­డు చేస్తున్నది ఏమిటి? దారుణంగా మోసాలు చేస్తున్నారు. వాటి గురించి ప్రశ్నిస్తే దాడులు చేస్తు­న్నారు. అక్రమ కేసులు పెడుతూ పోలీస్‌స్టేషన్ల చు­ట్టూ తిప్పుతున్నారు. మొత్తం వ్యవస్థలన్నీ నీరుగా­రిపోయాయి. వ్యవసాయం, విద్య, వైద్య రంగాలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. ఏ పంటకూ గిట్టు­బాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతు­న్నారు. కనీసం యూరియా కూడా దొరకని పరిస్థితి. ఉచిత పంటల బీమాను ఎత్తివేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతు­న్నారు. పొదుపు సంఘాలన్నీ ఢమాల్‌ అంటున్నాయి. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. 

కూటమి ప్రభుత్వం స్కామ్‌ల మయంగా మారింది. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. రూ.5 వేల కోట్ల విలువైన 54 ఎకరాల భూమిని గీతమ్‌ వర్సిటీకి ఇచ్చేశారు. ఏ ముఖ్యమంత్రీ తన సొంత బంధువులకు ఇలా ఇచ్చుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొత్త నినాదం వినిపిస్తోంది. అదే ‘క్యాషు.. సూట్‌కేసు.. రాజేష్‌.. లోకేష్‌..’ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ అంశాలన్నింటిపైనా సభ­లో గట్టిగా గొంతు వినిపించాలి. గట్టిగా పోరా­డాలి. చిత్త­శుద్ధితో కష్టపడి పని చేయండి. కళ్లు మూసి తెరి­చేలోపు మూడేళ్లు గడుస్తాయి. వచ్చేది మన ప్రభు­త్వమే. ఇప్పుడు కష్టపడి పని చేస్తున్న వారందరికీ, తగిన గుర్తింపు ఉంటుంది. పనితీరు ఆధారంగా మీకు మీ పదవులు తిరిగి వస్తాయి. అలాగే ఇంతకన్నా మంచి పదవులు కూడా దక్కే అవకాశం ఉంది.’

ఈ పాపం చంద్రబాబుదే
లడ్డూ వ్యవహారానికి సంబంధించిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే. లెంపలేసుకోవాల్సిందీ చంద్రబాబే. ఒకసారి జరిగిన తీరు చూస్తే, రాష్ట్రంలో 2024 మార్చి 16న ఎన్నికల కోడ్‌ వస్తే, మే 13న పోలింగ్‌ జరిగింది. మే 15న టీటీడీలో నెయ్యి సరఫరాకు సంబంధించిన టెండర్లు ఓకే చేసి, ఏఆర్‌ డెయిరీకి కాంట్రాక్ట్‌ ఇచ్చారు. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వం మారింది. చంద్రబాబు సీఎం అయిన తర్వాతనే నెయ్యి సరఫరా ప్రారంభమైంది.

⇒ జూన్‌ 12న మొదటి ట్యాంకర్‌ వచ్చింది. ఆ తర్వాత జూన్‌ 20, 25వ తేదీల్లో, జూలై 4న మొత్తం నాలుగు ట్యాంకర్లలో ఏఆర్‌ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. అవన్నీ ల్యాబ్‌ పరీక్షల్లో పాస్‌ అయ్యాయి. ఆ తర్వాత జూలై 6, 12వ తేదీల్లో వచ్చిన నాలుగు ట్యాంకర్ల నెయ్యి నాణ్యత పరీక్షలో ఫెయిల్‌ అయింది. జూలై 23న ల్యాబ్‌ రిపోర్టు రావడంతో, జూలై 25న వాటిని వెనక్కు పంపించారు.

⇒ అయితే అవే ట్యాంకర్లను జూలై 27న శ్రీకాళహస్తిలో వైష్ణవి డెయిరీకి సమీపంలో పార్క్‌ చేశారు. ఆ తర్వాత అవే ట్యాంకర్లను మరో డెయిరీ పేరుతో ఆగస్టు, సెప్టెంబర్‌లో తిరిగి టీటీడీకి పంపారు. ఆ తర్వాతే సీఎం హోదాలో  చంద్రబాబు లడ్డూపై తీవ్ర ఆరోపణలు చేశారు.  

⇒ వెనక్కు పంపిన ట్యాంకర్లు తిరిగి టీటీడీలోకి వస్తే.. జరిగిన పరిణామాలు, జరిగిన తేదీలు చూస్తే మొత్తం ఇవన్నీ కూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగాయి. మరి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా? 

⇒ నిజానికి 2014ృ19 మధ్య ప్రీమియర్‌ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. ఆ కంపెనీ 2019లో సరఫరా ఆపేసింది. కానీ, దాన్ని కేవలం మన ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. అంతకు ముందు సరఫరాకు సంబంధించి ప్రస్తావించడం లేదు. అసలు 2014-2019 మధ్య సరఫరా అయిన నెయ్యిపై కూడా విచారణ జరగాలి. 

⇒ ఇప్పుడు చెప్పండి.. ఎవరి హయాంలో ఆ ట్యాంకర్లు వచ్చాయి? ఎవరి హయాంలో టీటీడీ వాటిని అడ్డుకుంది? ఎవరి హయాంలో నెయ్యి శాంపిళ్లు తీసుకున్నారు? వెనక్కు పంపిన ట్యాంకర్లను తిరిగి తీసుకున్నది ఎవరి హయాంలో? ఇవన్నీ కూడా టీడీపీ హయాంలోనే జరిగాయి. ఇదంతా సీబీఐ సిట్‌ చార్జిషీట్‌లోనే ఉంది. మరి దీన్నంతటినీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఆపాదించడం దుర్మార్గం కాదా?  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement