2026–27 విద్యా సంవత్సరం నుంచి అమలు
ఇంటర్మీడియట్ సెకండియర్ సిలబస్‌లోనూ మార్పులు చేపట్టారు. వాటిని 2026–27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. జాతీయ విద్యా విధానం–2020 మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్టు గతంలో బోర్డు ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం ఇంటర్ ఫస్టియర్‌లో మార్చిన సిలబస్‌కు అనుగుణంగా సెకండియర్ సబ్జెక్టుల సిలబస్, పాఠ్యాంశాలనూ పునర్ వ్యవస్థీకరించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు చర్యలు చేపట్టారు.
సైన్సు విభాగం సబ్జెక్టులకు ఎన్‌సీఈఆర్టీ సిలబస్ ఆధారంగా మార్పులు చేయనున్నారు. ఆర్ట్స్ అండ్ కామర్స్ విభాగం సబ్జెక్టులకు ఇంటర్మీడియట్ బోర్డు సవరించిన సిలబస్‌ను అమలు చేస్తారు. 2025–26లో సవరించని తెలుగు, ఉర్దూ, తర్కం, పాలన, భూగోళ శాస్త్రాల సిలబస్‌లనూ మార్చను న్నారు. వృత్తి విద్యా కోర్సులను నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ మార్గదర్శకాల ప్రకారం సవరించనున్నారు.


