అటెండర్‌ ఖాతాలోకి రూ.2.63 కోట్లు | Mistakenly Rs 2.63 Crores Deposited To Attender Account In Andhra Pradesh, Withdraws ₹40 Lakh and Goes Missing | Sakshi
Sakshi News home page

అటెండర్‌ ఖాతాలోకి రూ.2.63 కోట్లు

Feb 13 2026 4:05 AM | Updated on Feb 13 2026 11:27 AM

Rs 2. 63 crores deposited to attendant account in Andhra Pradesh

రూ.40 లక్షలు విత్‌డ్రా చేసుకుని పరారీ 

కదిరి టౌన్‌: శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట మండల పరిషత్‌ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న మసూద్‌ఖాన్‌ బ్యాంకు ఖాతాలో పొరపాటున రూ.2.63 కోట్లు జమ అయింది. ఈ విషయాన్ని గమనించిన మసూద్‌ఖాన్‌ వెంటనే రూ.40 లక్షలు విత్‌డ్రా చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చెన్నైకు చెందిన ఓ వ్యక్తి బుధవారం స్టేట్‌బ్యాంకు ఖాతాలో రూ.2.63 కోట్లు డిపాజిట్‌ చేయడానికి వెళ్లాడు. తన బ్యాంకు ఖాతా నంబర్‌లో పొరపాటున ఒక సంఖ్య తప్పుగా నమోదు చేశాడు. ఆ విషయాన్ని బ్యాంకు సిబ్బంది కూడా గమనించలేదు.

దీంతో ఆ మొత్తం అటెండర్‌ మసూద్‌ఖాన్‌కు చెందిన కదిరిలోని స్టేట్‌ బ్యాంకు ఖాతాలో జమ అయింది. ఆ విషయాన్ని గ్రహించిన మసూద్‌ఖాన్‌ రూ.40 లక్షలు వివిధ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్‌ చేసి విత్‌ డ్రా చేసుకున్నాడు. తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కాగా రూ.2.63 కోట్లు వేరే ఖాతాకు జమ అయినట్లు కాస్త ఆలస్యంగా గుర్తించిన చెన్నై స్టేట్‌ బ్యాంకు సిబ్బంది కదిరి బ్రాంచ్‌ మేనేజర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో అతని ఖాతాను ఫ్రీజ్‌ చేశారు. అప్పటికే రూ.40 లక్షలు డ్రా చేయడంతో కదిరి స్టేట్‌ బ్యాంక్‌ మేనేజర్‌ విశ్వేశ్వరరావు పట్టణ సీఐ వి.నారాయణరెడ్డికి గురువారం ఫిర్యాదు చేశారు. దీంతో అటెండర్‌ మసూద్‌ఖాన్‌ కుటుంబ సభ్యులను సీఐ నారాయణరెడ్డి పిలిపించి విచారించారు. డ్రా చేసిన డబ్బు రెండు రోజుల్లో తిరిగి చెల్లిస్తామని అటెండర్‌ మసూద్‌ఖాన్‌ సోదరుడు తెలిపాడు. 

Advertisement
 
Advertisement
Advertisement