పాక్‌తో ఉద్రిక్తతల నడుమ ఐసీసీ చరిత్రాత్మక నిర్ణయం | ICC does damage control to lure Pakistan Cricket, Announces historic move | Sakshi
Sakshi News home page

పాక్‌తో ఉద్రిక్తతల నడుమ ఐసీసీ చరిత్రాత్మక నిర్ణయం

Feb 5 2026 1:01 PM | Updated on Feb 5 2026 1:09 PM

ICC does damage control to lure Pakistan Cricket, Announces historic move

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేసుకున్న విషయంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు-ఐసీసీ మధ్య అగాధం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పీసీబీపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుందని అంతా అనుకుంటుండగా, ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. అందరూ అనుకున్నట్లు ఐసీసీ పాక్‌పై చర్యలు తీసుకోకపోగా.. ఆ దేశ క్రికెట్‌ అభిమానులకు ఓ బంపరాఫర్‌ ఇచ్చింది.

ప్రపంచకప్‌లో పాక్‌ ఆడే మ్యాచ్‌లకు పూర్తిస్థాయి ఉర్దూ వ్యాఖ్యానాన్ని అందిస్తామని ప్రకటించింది. ఐసీసీ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఈ ప్రత్యేక ఫీడ్‌ను ఐసీసీ స్వయంగా తయారు చేసి పాకిస్తాన్‌ స్థానిక ఛానల్‌ PTVలో ప్రసారం చేయనుంది. అదనంగా Myco, Tamasha, Tapmad, ARY Zapp వంటి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా అందుబాటులో ఉంచనుంది. 

ఇప్పటి వరకు పాక్‌ అభిమానులు ఎక్కువగా ఇంగ్లీష్ ఫీడ్ లేదా పరిమిత స్థానిక కవరేజ్‌పై ఆధారపడ్డారు. తాజాగా ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం పాక్‌తో అనుబంధాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా తీసుకున్నదిగా తెలుస్తుంది. ఐసీసీ తొలిసారి అందించనున్న పూర్తి ఉర్దూ వ్యాఖ్యానం పాక్‌ ఆడబోయే వార్మప్‌ మ్యాచ్‌కు కూడా వర్తిస్తుంది.

ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం భారత అభిమానులకు మింగుడుపడటం లేదు. పాక్‌ ఇన్ని డ్రామాలాడుతున్నా, ఆ దేశ అభిమానుల కోసం ఇలాంటి సౌకర్యాలెందుకని ప్రశ్నిస్తున్నారు. ఐసీసీ ఛైర్మన్‌గా భారతీయుడు (జై షా) ఉండి కూడా పాక్‌కు అనుకూలమైన ఇలాంటి కొత్త సంప్రదాయాలకు తెరలేపడమేంటని నిలదీస్తున్నారు. 

ఒప్పందాలకు విరుద్దంగా భారత్‌తో మ్యాచ్‌ రద్దు చేసుకోవాలని చూస్తున్న పాక్‌పై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇలాంటి ఆఫర్లు ఏంటని పెదవి విరుస్తున్నారు. తక్షణమే పాక్‌పై చర్యలు తీసుకొని, ఆ జట్టు ప్రపంచకప్‌ మొత్తం నుంచే తప్పించాలని డిమాండ్లు చేస్తున్నారు.

కాగా, భారత్‌తో గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ మినహా మిగతా ప్రపంచకప్‌ మ్యాచ్‌లన్నిటినీ ఆడతామని ఇటీవల పాక్‌ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వారు తీసుకున్న ఈ నిర్ణయం ఐసీసీ మరియు ప్రపంచకప్‌ ప్రసారకర్తలకు పెద్ద సమస్యగా మారింది. 

ఈ మ్యాచ్‌ రద్దు కావడం వల్ల ఐసీసీకి, ప్రసారక్తలను ఆర్దికంగా చాలా నష్టం వస్తుంది. ఈ నష్టాన్ని నివారించడం కోసమే ఐసీసీ పాక్‌ అభిమానులను టార్గెట్‌ చేస్తూ ఉర్దూ వ్యాఖ్యానం అస్త్రాన్ని ప్రయోగించిందని తెలుస్తుంది. ఒకవేళ పాక్‌ ఇప్పుడు కూడా తగ్గకుండా భారత్‌తో మ్యాచ్‌ ఆడమని భీష్మించుకు కూర్చుంటే ఐసీసీ ఏం చేస్తుందో చూడాలి.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement