మంచుతో సమస్య ఉండొచ్చు
రోహిత్, కోహ్లి బాగా ఆడుతున్నారు
ఇక మీదటా ఆడతారు
ఆడినంత సులువుకాదు కామెంట్రీ
న్యూఢిల్లీ: ఐసీసీ మొదలుపెట్టిన తొలి టి20 ప్రపంచకప్‌నే చేజిక్కించుకున్న భారత కెప్టెన్ ధోని. తర్వాత మరో రెండు ఐసీసీ (వన్డే ప్రపంచకప్, చాంపియన్స్) ట్రోఫీలను అందించిన విజయవంతమైన సారథిగా ఘనతకెక్కిన ‘మిస్టర్ కూల్’ ఎమ్మెస్ ధోని శనివారం మొదలయ్యే టి20 ప్రపంచకప్ గురించి వ్యాఖ్యానించాడు.
ఇంకా కొనసాగుతున్న 38 ఏళ్ల రోహిత్ శర్మ, 37 ఏళ్ల విరాట్ కోహ్లి కెరీర్‌పై స్పందన కోరితే ఘాటుగానే జవాబిచ్చాడు. ఎక్కడా తగ్గలేదు. అన్నింటికి తగిన సమాధానాలిచ్చాడు. మైదానంలో వికెట్ల వెనక చురుకైన వికెట్ కీపర్‌గా, తెలివైన కెప్టెన్ వ్యవహరించిన ధోని కామెంట్రీ మాత్రం కష్టమంటున్నాడు. స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోని ఇంకా ఏమన్నాడంటే...

వయసు అడ్డంకి కాదు
రోహిత్, కోహ్లి బాగానే ఆడుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడతారు. అయితే ఏంటి? ఎందుకు ఆడకూడదు? పెరిగిన వయసే అడ్డంకా? నా దృష్టిలో వయసు అసలు ప్రాతిపదికే కాదు. ప్రదర్శనే ప్రామాణికం. ఫిట్‌నెస్సే ప్రధానం. అలాంటప్పుడు వయసును పరిగణించాల్సినపనేంటి చెప్పండి. ఆ వయసులో ఉన్న వారందరూ ఒకటేనా... అందరిని ఒకేలా చూస్తామా? నా విషయమే చెబుతా... నేను 24 ఏళ్ల వయసులో అరంగేట్రం చేశాను.
అప్పుడెవరూ మాట్లాడలేదు. పదేళ్లకు పైగానే భారత్‌కు ఆడాను. 20 ఏళ్లయినా ఇంకా (ఐపీఎల్) ఆడుతున్నాను. ఇప్పుడు ఎవరూ మాట్లాడరు. కానీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి గురించే ఎందుకు ఈ చర్చంతా! ఎంతకాలం ఆడాలనేది వాళ్లకే వదిలేయండి ఆ విషయాన్ని. ఫామ్, ప్రదర్శన బాగున్నంత కాలం ఆడతారు. ఇందులో తప్పేంటి. నొప్పి ఎవరికి?.
ఆ అనుభవం ఒక్క సచిన్‌కే
అనుభవమనేది ఆడుతుంటేనే వస్తుంది. ఒక్క సచిన్ తప్ప 20 ఏళ్లకే అనుభవజు్ఞలైన ఆటగాళ్లుండటం అరుదు. 16, 17 ఏళ్లకు అరంగేట్రం చేస్తేనో రాదు. క్రమంగా ఆడితేనే వస్తుంది. ఒత్తిడిని ఎదుర్కొంటేనే అబ్బుతుంది. పరిస్థితులకు ఎదురొడ్డి నిలిస్తేనే అలవాటవుతుంది. అనుభవమంటే అదే. ఏదో 20, 25 మ్యాచ్‌లు ఆడినంత మాత్రాన అనుభవజు్ఞలైపోరు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలిగే సామర్థ్యం ఉంటుందో అనే అనుభవజ్ఞున్ని చేస్తుంది.
భారత జట్టే ప్రమాదకారి
సొంతగడ్డపై జరిగే టి20 ప్రపంచకప్‌లో మనకు ఎదురుపడే ప్రత్యర్థులకు మనతోనే ముప్పు. ఈ మెగా ఈవెంట్‌లో ప్రమాదకర జట్టు ఏదైనా ఉందంటే అది టీమిండియానే. ఒక మేటి జట్టులో ఏమేమి ఉండాలో అవన్నీ మన బృందంలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫార్మాట్‌నే పరిగణిస్తే మన టీమ్‌కు మంచి అనుభవం ఉంది.
ఈ విశేషానుభవం మన జట్టుకు అదనపు బలంగా పనికొస్తుంది. ఎంతటి ఒత్తిడిలోనైనా ఆడగలిగే స్థయిర్యం అనుభవంతోనే వస్తుంది. అయితే నాకు జట్టుపై ఎలాంటి బెంగా లేదు కానీ మంచుతోనే ఏదైనా సమస్య ఉండొచ్చు. శీతాకాలం కాబట్టి ఇది బాగా ఇబ్బంది పెట్టొచ్చు. దీంతో టాస్ కీలకంగా మారుతుంది.
కామెంట్రీ కష్టం... అందుకే దూరం
మైదానంలో మైక్ పట్టుకొని మాట్లాడటం వేరు. టీవీల్లో మైక్ పట్టుకొని వ్యాఖ్యానించడం వేరు. అందుకే కామెంటరీ కష్టమనే అంటాను. మ్యాచ్ జరుగుతున్నప్పుడు దీన్ని వివరించే ప్రక్రియలో ఆడుతున్న ఆటగాళ్లను విమర్శించే వైనానికి మధ్యలో సన్నని గీత ఒకటి ఉంటుంది. దాన్ని చెరపలేం... అతిక్రమించలేం. వ్యాఖ్యాతగా మాట్లాడుతుంటే ఆ గీత ఒకటుంది అది తప్పని అనిపించదు. మ్యాచ్ వివరించేందుకు ఓ వైపు ఉండటానికే ఇష్టపడతారు.
మ్యాచ్ సమయంలో తప్పని అనిపిస్తే వెంటనే దాన్ని బయటికి చెప్పాల్సి ఉంటుంది. సున్నితంగా విమర్శించగలితే నేర్పుండాలి. హుందాగా వ్యాఖ్యానించాలి. ఎవరినీ లక్ష్యపెట్టకుండా, నొప్పించకుండా వ్యాఖ్యానించగలిగే నైపుణ్యం కూడా ఉండాలి. నాకు ఇవేమీ లేవు. అందుకే కామెంట్రీకి దూరం. అంతెందుకు గణాంకాలు సైతం గుర్తుండాలి. నాకేమో నా గణాంకాలే తెలియవు. కొందరైతే ఇందులోనిష్ణాతులై ఉంటారు. వారైతేనే కామెంటేటర్ పాత్రకు న్యాయం చేస్తారు.
నేనో మంచి స్పీకర్‌ను కాదు
నాకు వినడం మీద ఉన్న శ్రద్ద మాట్లాడటం మీద ఉండదు. వాదించడం నా వల్ల కానేకాదు. అందుకే అనిపిస్తుంది... నేను మంచి స్పీకర్‌ను కాదు. ఎప్పటికీ కాలేను కూడా! నేను మాట్లాడేది చాలా తక్కువ. నాకు అనువైన, నా మాటలు అర్థం చేసుకోగలిగిన వారితోనే మాట్లాడతాను. అందరితోనూ మాట్లాడలేను. కానీ ఎవరు చెప్పినా వినే ఓపికైతే నాకు చాలానే ఉంది. ఎంత సేపయినా వింటాను.


