పెర్ల్‌ ఫెర్నాండెజ్‌ ‘హ్యాట్రిక్‌’ | Indian U 17 team advances to final of U19 Womens Championship | Sakshi
Sakshi News home page

పెర్ల్‌ ఫెర్నాండెజ్‌ ‘హ్యాట్రిక్‌’

Feb 5 2026 3:51 AM | Updated on Feb 5 2026 3:51 AM

Indian U 17 team advances to final of U19 Womens Championship

ఫైనల్లోకి భారత్‌ 

‘శాఫ్‌’ అండర్‌–19 మహిళల చాంపియన్‌షిప్‌ 

పొఖారా (నేపాల్‌): దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) అండర్‌–19 మహిళల చాంపియన్‌షిప్‌లో భారత అండర్‌–17 జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన రౌండ్‌ రాబిన్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 8–0 గోల్స్‌ తేడాతో భూటాన్‌ను చిత్తు చేసింది. ఈ ఏడాది చైనా వేదికగా ఏఎఫ్‌సీ అండర్‌–17 ఆసియా కప్‌ జరగనున్న నేపథ్యంలో... ఈ టోర్నీలో భారత్‌ అండర్‌–17 బాలికల జట్టును బరిలోకి దింపింది. భారత జట్టు తరఫున పెర్ల్‌ ఫెర్నాండెజ్‌ (16వ, 39వ, 41వనిమిషాల్లో) ‘హ్యాట్రిక్‌’ గోల్స్‌తో విజృంభించింది. 

ప్రీతిక బర్మన్‌ (25వ, 90 నిమిషాల్లో) రెండు గోల్స్‌తో సత్తా చాటగా... అలీషా లింగ్డో (6వ నిమిషంలో), అభిష్ట బాస్నెట్‌ (10వ నిమిషంలో),దివ్యాణి లిండా (17వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. బుధవారమే జరిగిన మరో సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ జట్టు 4–0 గోల్స్‌ తేడాతో ఆతిథ్య నేపాల్‌పై నెగ్గింది. నాలుగు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన బంగ్లాదేశ్‌ 9 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... భారత్‌ మూడు మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఒక పరాజయంతో 6 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడనుంది. 

బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ఆట ఆరంభమైనప్పటి నుంచే మన అమ్మాయిలు వరుస దాడులు చేస్తూ విజృంభించారు. ఆరో నిమిషంలో అలీషా గోల్‌ కొట్టడంతో భారత్‌ ఖాతా తెరిచింది. పెర్ల్‌ ఫెర్నాండెజ్‌ ప్రథమార్థంలోనే మూడు గోల్స్‌ కొట్టడంతో మన అమ్మాయిలు పూర్తి ఆధిపత్యం కనబర్చారు. తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్‌ 7–0తో నిలిచింది. రెండో అర్ధభాగంలో భారత్‌ తరఫున ఒక గోల్‌ నమోదు కాగా... భూటాన్‌ మ్యాచ్‌ మొత్తంలో ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయింది.    
 

Advertisement
 
Advertisement
Advertisement