యువ భారత్‌ను ఆపతరమా! | India will play its second semi final against Afghanistan today | Sakshi
Sakshi News home page

యువ భారత్‌ను ఆపతరమా!

Feb 4 2026 3:58 AM | Updated on Feb 4 2026 3:58 AM

India will play its second semi final against Afghanistan today

నేడు అఫ్గానిస్తాన్‌తో రెండో సెమీఫైనల్‌

మధ్యాహ్నం 1 గంట నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

హరారే: అండర్‌–19 ప్రపంచకప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న యువ భారత్‌ ఇదే జోరుతో ఫైనల్‌ చేరాలని ఆశిస్తోంది. నేడు జరిగే రెండో సెమీఫైనల్లో భారత జట్టు అఫ్గానిస్తాన్‌తో తలపడుతుంది. ఫామ్‌ పరంగా చూసినా, మొత్తం టీమ్‌ ప్రదర్శన చూసినా ఆయుశ్‌ మాత్రే సారథ్యంలోని భారత్‌ను అడ్డుకోవడం అఫ్గాన్‌కు సాధ్యమయ్యే పనైతే కాదు. 

అండర్‌–19 ప్రపంచకప్‌ల చరిత్రలోనే ఐదు టైటిళ్లతో అత్యంత విజయవంతమైన జట్టుగా నిరూపించుకున్న యువ భారత్‌... 2000, 2008, 2012, 2018, 2022 సరసన ఈ ఏడాదిని కూడా చేర్చాలని ఆరాటపడుతోంది. మన కుర్రాళ్లు ఆడుతున్న తీరు, గెలుస్తున్న వైనం చూస్తుంటే ఇదేమంత కష్టం కానేకాదు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ తిరుగులేని విజయాలు సాధించింది. 

ఇలాంటి దుర్బేధ్యమైన భారత సేనను ఎదుర్కోవాలంటే అఫ్గానిస్తాన్‌ పెద్ద కసరత్తే చేయాలి. ఇక గెలవాలంటే మాత్రం ఓ సంచలనం నమోదవ్వాలి. అయితే ప్రత్యేకించి ఈ టోర్నీలో అఫ్గానిస్తాన్‌ కూడా బాగా ఆడింది. భారత కుర్రాళ్లు ఐదు గెలిస్తే... అఫ్గాన్‌ కేవలం ఒకటి ఓడి, నాలుగు విజయాలతో సత్తా చాటుకుంది. ఇలాంటి మేటి ప్రదర్శన కనబరిచిన అఫ్గాన్‌ను తక్కువ అంచనా వేయకూడదని ఆయుశ్‌ బృందానికి బాగా తెలుసు. 

ఆదమరుపు లేకుండా ఎప్పటిలాగే మరో మ్యాచ్‌ విజయం కోసం చెమటోడ్చాలని యువ బృందం పట్టుదలతో ఉంది. టీనేజ్‌ సంచలనం, ఓపెనింగ్‌ హిట్టర్‌ వైభవ్‌ సూర్యవంశీ సహా టాపార్డర్‌ బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్ల భరతం పడుతున్నారు. ఆల్‌రౌండర్‌ విహాన్‌ మల్హోత్రా బ్యాట్‌తో, కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే బంతితో ప్రత్యర్థి జట్ల పని పడుతున్నారు.

 వీరితో పాటు పేసర్లు హేనిల్‌ పటేల్, అంబరీశ్‌ నిప్పులు చెరుగుతుండటం బౌలింగ్‌ దళానికి వెన్నుదన్నుగా ఉంది. అఫ్గానిస్తాన్‌ కూడా మ్యాచ్‌మ్యాచ్‌కు రాటుదేలుతున్నప్పటికీ భారత్‌లాంటి ఆల్‌రౌండ్‌ సామర్థ్యమున్న జట్టును ఓడించాలంటే సర్వశక్తులు ఒడ్డినా సరిపోదేమో!

ఆ్రస్టేలియాపై గెలిచి ఫైనల్లో ఇంగ్లండ్‌
మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ 27 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాను ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మొదట ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది. కెప్టెన్ థామస్‌ ర్యూ (107 బంతుల్లో 110; 14 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ సాధించాడు. 

అనంతరం 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా అండర్‌–19 జట్టు 47.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్  ఒలివర్‌ పీక్‌ (88 బంతుల్లో 100; 10 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. భారత్, అఫ్గానిస్తాన్‌ మధ్య రెండో సెమీఫైనల్‌ విజేతతో శుక్రవారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్‌ తలపడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement