క్రికెట్ నియమావళిలో మార్పులు
ఈ అక్టోబర్ నుంచి అమలు
లండన్: క్రికెట్ నియమావళి మారింది. కొత్త మార్పులు ఈ ఏడాది నుంచే అమలవుతాయని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) వెల్లడించింది. నియమావళిలో ఏకంగా 73 సవరణలు జరిగినప్పటికీ ప్రధానంగా టెస్టుల్లో ఇకపై ఆఖరి ఓవర్‌ను తప్పనిసరిగా పూర్తి చేయాలన్న నిబంధన అమలుకానుంది. దశాబ్దాలుగా సంప్రదాయ ఫార్మాట్‌లో ఆ రోజు చివరి ఓవర్లో వికెట్ పడితే అక్కడితోనే ఆట ముగిస్తున్నారు.
మరో బ్యాటర్ రావడం... మిగతా బంతులు ఆడటం జరగట్లేదు. బ్యాడ్‌లైట్ లాంటి ప్రతికూల వాతావరణం లేకుంటే ఇకపై బ్యాటర్ క్రీజులోకి రావాల్సిందే... మిగిలిన బంతులు ఆడాల్సిందేనని ఎంసీసీ సవరించిన నియమావళి చెబుతోంది. ఆఖరి ఓవర్ డ్రామాను అర్ధంతరంగా ముగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కొత్త మార్పులు, నియమావళిని ఈ అక్టోబర్ నుంచి అమలు చేయనున్నట్లు ఎంసీసీ పేర్కొంది.
ల్యామినేటెడ్ బ్యాట్లకు సై
పురుషులు ఆడే క్లబ్ క్రికెట్‌లో ఇకపై ల్యామినేటెడ్ బ్యాట్లను అనుమతిస్తారు. ల్యామినేటెడ్ బ్యాట్లకు దూరంగా ఉన్న ఎంసీసీ తొలిసారిగా 2017లో జూనియర్ క్రికెట్‌లో అనుమతించింది. ఇప్పుడు సీనియర్ క్రికెట్‌లో సై అంటున్నారు. బంతిని ఆడే క్రమంలో బ్యాటర్ తనను తాను నియంత్రించుకోకుండా వికెట్లను తగిలితే హిట్ వికెట్‌గా అవుట్ ఇస్తారు. ఇది యథాతథం. అయితే బ్యాటర్ ప్రమేయం లేకుండా ఫీల్డర్ల పొరపాటు వల్ల వికెట్లను తాకితే ఇకమీదట ఆ బ్యాటర్‌ను హిట్ వికెట్‌గా పెవిలియన్‌కు పంపించరు.


