నా వయస్సు యాభై ఐదు సంవత్సరాలు. మా కుటుంబంలో ఇద్దరికి పూర్వం క్యాన్సర్ వచ్చింది. నాకు రాకుండా ఉండటానికి, లేదా ముందుగా గుర్తించే పరీక్షలు ఈ రోజుల్లో ఉన్నాయని విన్నాను. నిజంగా అలాంటివి ఉన్నాయా? ఎప్పుడు చేయించాలి? – సుమతి, తిరుపతి
ఇప్పటి వైద్య శాస్త్రం ఎంత ముందుకెళ్లిందంటే క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని ముందుగానే అంచనా వేసే పరీక్షలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా కుటుంబంలో క్యాన్సర్ ఉన్నవారికి ప్రమాదం కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, యాభై ఏళ్ల తర్వాత కొన్ని పరీక్షలు తప్పక చేయించుకోవడం మంచిది. ఇప్పుడు రక్తంతో చేసే చిన్న పరీక్షలతోనే శరీరంలో ప్రమాదం ఉందో లేదో తెలుసుకునే విధానాలు వచ్చాయి. వయస్సును బట్టి ప్రమాదం పెరుగుతుంది కాబట్టి తొందరగా తెలుసుకుంటే చికిత్స కూడా త్వరగా మొదలవుతుంది.
పేగు, గర్భసంచి, రొమ్ము, అండాశయాలు, ఊపిరితిత్తులు వంటి అవయవాల్లో వచ్చే క్యాన్సర్‌లను ముందే కనిపెట్టే పరీక్షలు అందుబాటులోనే ఉన్నాయి. గర్భసంచి భాగంలో వచ్చే వ్యాధిని గుర్తించడానికి పాప్ స్మియర్ పరీక్షను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అరవై ఏళ్ల వరకు చేస్తారు. రొమ్ములో వచ్చే వ్యాధిని ముందే తెలుసుకోవడానికి మామోగ్రఫీ పరీక్షను క్రమం తప్పకుండా చేయించుకోవాలి.
క్యాన్సర్ కుటుంబంలో ఉన్నవారికి ఇవి మరింత అవసరం. చాలామంది ‘మన ఇంట్లో ఎప్పుడూ ఎవరికీ రాలేదు కాబట్టి నాకు కూడా రాదేమో’ అని నిర్లక్ష్యం చేస్తారు. కానీ చాలా సందర్భాల్లో ప్రత్యేకంగా లక్షణాలు లేకుండానే వ్యాధి ప్రారంభమై ఉంటుంది. అలాంటి దశలో రొటీన్ పరీక్షలే దాన్ని గుర్తించగలవు. శరీరంలో అకస్మాత్తుగా మార్పులు కనిపిస్తే అలాగే వదిలేయకూడదు.
మలబద్ధకం, మలంలో రక్తం, అసాధారణ రక్తస్రావం, రొమ్ము పరిమాణం లేదా ఆకారం మారడం, వింతగా గట్టిగా మారడం, నెలసరి కాకుండా మధ్యలో రక్తస్రావం, కారణం లేకుండానే శరీరం బరువు తగ్గడం, తిన్నా తిననట్టుగా అనిపించడం, నిరంతరం అలసిపోవడం వంటి మార్పులు కనిపిస్తే వెంటనే నిపుణుడిని కలవాలి. అవసరమైతే వైద్యులు రక్తపరీక్షలు, స్కాన్లు, మరీ అవసరమైతే మరింత వివరమైన పరీక్షలు కూడా సూచిస్తారు.
ముందుగా గుర్తించిన వ్యాధిని పూర్తిగా నయం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే వయస్సు పెరిగిన తర్వాత, ముఖ్యంగా కుటుంబంలో ఇలాంటి వ్యాధి ఉన్నవారు అయితే మరింత జాగ్రత్తగా పర్యవేక్షణ చేయించుకోవడం మంచిది.
-డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్ , హైదరాబాద్


