ఫిబ్రవరి 4 వరల్డ్ క్యాన్సర్ డే
క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి స్థాయి నుంచి దీర్ఘకాలిక వ్యాధి స్థాయికి చేరుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అంతర్జాతీయ వైద్య నిపుణుల అంచనా. డయాబెటిస్, బీపీ మాదిరిగానే క్యాన్సర్‌తో కూడా దీర్ఘకాలిక మనుగడ సాగించవచ్చు.
ఏఐ, రోబోటిక్ సర్జరీలు క్యాన్సర్ పని పడుతున్నాయి. టార్గెటెడ్ థెరపీ, నానో మెడిసిన్, ప్రోటాన్ బీమ్ థెరపీలు క్యాన్సర్ కణాలను గురి తప్పకుండా నిర్మూలిస్తున్నాయి. క్యాన్సర్ చికిత్సలో మరిన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి . వీటి ఫలితంగా క్యాన్సర్‌కు ఆన్సర్ దగ్గరలోనే ఉంది.
ఇమ్యూనో థెరపీ మరింతగా అభివృద్ధి సాధిస్తుంది. రోగుల శారీరక స్థితిగతులకు అనుగుణంగా రూపొందించే ‘హైపర్ పర్సనల్’ ఔషధాలు, వ్యాక్సిన్లు క్యాన్సర్‌ను
మరింత సమర్థంగా ియంత్రించగలుగుతాయి.
క్యాన్సర్ నిర్ధారణను, చికిత్సను ఏఐ మరింతగా మెరుగుపరుస్తుంది. చికిత్సకు ముందే ఔషధాల దుష్ప్రభావాలను ఏఐ ఇప్పటికే గుర్తించగలుగుతోంది. దీనివల్ల అతి తక్కువ దుష్ప్రభావాలతో కూడిన ఔషధాలను ఇవ్వడం ద్వారా వ్యాధిని సమర్థంగా అదుపు చేయడం సాధ్యమవుతోంది. ఏఐ సాయంతో సమీప భవిష్యత్తులో అతి తక్కువ దుష్ప్రభావాలు గల ఔషధాల రూపకల్పన కోసం కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి.
చాలా రకాల క్యాన్సర్లలో సర్వసాధారణంగా కనిపించే టెలోమెరేస్, సర్వినిన్, పీ53 ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకుని, వాటి ద్వారా వ్యాపించే క్యాన్సర్లను అరికట్టే వ్యాక్సిన్లను రూపొందించడానికి శాస్త్రవేత్తలు ప్రయోగాలు సాగిస్తున్నారు. ఇవి విజయవంతమైతే క్యాన్సర్‌కు దాదాపు ఆన్సర్ దొరికినట్లే!
‘క్యాన్సర్‌కు ఆన్సర్ ఉండదు’ అనేది ఇదివరకటి మాట. ఇప్పుడది దాదాపు అపోహ. వైద్యశాస్త్రం శరవేగంగా సాధిస్తున్న అభివృద్ధి క్యాన్సర్ దూకుడుకు కళ్లేలు వేయగలుగుతోంది. పలు రకాల క్యాన్సర్లను సమూలంగా నయం చేయగలుగుతోంది. కొన్ని రకాల క్యాన్సర్లు సోకకుండా వ్యాక్సిన్లను తయారు చేయగలుగుతోంది. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షల్లోను, చికిత్స విధానాల్లోను వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు త్వరలోనే క్యాన్సర్‌కు ఆన్సర్‌గా ముందుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రాణాంతకమైన క్యాన్సర్లను పూర్తిగా అరికట్టగల రోజులు త్వరలోనే వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
క్యాన్సర్ అంటే ఒకప్పుడు ప్రాణాలపై ఆశలు వదిలేసుకునే రోజుల నుంచి క్యాన్సర్‌ను జయించడం ఏమంత కష్టం కాదనేంత వరకు శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందాయి. ఇటీవలి కాలంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరిగాక రకరకాల క్యాన్సర్లను ముందుగానే గుర్తించి, అరికట్టడం సాధ్యమవుతోంది. క్యాన్సర్ నిర్ధారణ కోసం ఒకప్పుడు తప్పనిసరిగా కోతపెట్టి, బయాప్సీ పరీక్షలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు కొన్ని క్యాన్సర్లకు కోతతో పనిలేకుండా, రక్తపరీక్ష ద్వారా జరిపే ‘లిక్విడ్ బయాప్సీ’, శ్వాస ద్వారా క్యాన్సర్ నిర్ధారణ చేయగల ‘బ్రీతలైజర్లు’ వాడుకలోకి వచ్చాయి.
క్యాన్సర్ రోగులను యమయాతనకు గురిచేసే కీమో థెరపీ, రేడియో థెరపీ చికిత్స పద్ధతుల్లోనూ విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ‘ఇమ్యూనో థెరపీ’తో చాలామంది క్యాన్సర్ నుంచి విజయవంతంగా కోలుకోవడం సాధ్యం అవుతోంది. వైద్యరంగంలో జరుగుతున్న పరిశోధనల ఫలితంగా సమీప భవిష్యత్తులోనే కొన్ని రకాల క్యాన్సర్లను పూర్తిగా నివారించడం; ఇంకొన్ని రకాల క్యాన్సర్లను పూర్తిగా నయం చేయడం; మరికొన్ని రకాల క్యాన్సర్లను ప్రాణాంతకంగా మారకుండా నియంత్రించడం సాధ్యమవుతుందని అంతర్జాతీయ వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, చికిత్స పద్ధతుల్లో ఇటీవలి కాలంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులను తెలుసుకుందాం...
లిక్విడ్ బయాప్సీ
‘కోవిడ్–19’ తర్వాతి కాంలలో క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స పద్ధతుల్లో రోగులకు మేలు చేసే కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. వీటిలో ‘లిక్విడ్ బయాప్సీ’ ఒకటి. రక్త నమూనా ద్వారానే క్యాన్సర్‌ను ముందుగా నిర్ధారించే పరీక్ష ఇది. సేకరించిన రక్తనమూనాలోని డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ, ప్రొటీన్లను విశ్లేషించి, రోగిలో వ్యాధి లక్షణాలు బయటపడటానికి ముందే క్యాన్సర్ గుర్తించేందుకు ‘లిక్విడ్ బయాప్సీ’ దోహదపడుతుంది. దీని వల్ల త్వరగా చికిత్సను ప్రారంభించి, ఎక్కువగా ఇబ్బంది లేకుండానే క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసేందుకు వీలవుతుంది. కోతపెట్టడం ద్వారా కణజాలం ముక్కను తీసుకునే చేసే బయాప్సీ పరీక్ష కంటే ఇది చాలా తక్కువ నొప్పితో కూడుకున్నది కావడమే కాకుండా, రోగనిర్ధారణలో సమర్థంగా ఉపయోగపడుతుంది.
ఏఐ ఆధారిత పాథాలజీ
క్యాన్సర్ నిర్ధారణకు సీటీ, ఎంఆర్‌ఐ, పీఈటీ స్కానింగ్, మామోగ్రామ్, హిస్టోపాథాలజీ పరీక్షలు వంటివి చేస్తుంటారు. వీటిని విశ్లేషించి, చికిత్స చేయడం కొత్తేమీ కాదు. వీటి విశ్లేషణ కోసం ఇటీవలి కాలంలో ఏఐ వినియోగం మొదలైంది. ఏఐ వినియోగం వల్ల రకరకాల స్కానింగ్స్ వంటి ఇమేజింగ్ పద్ధతుల విశ్లేషణ చాలా సులభతరంగా మారింది. వ్యాధి నిర్ధారణలో కచ్చితత్వం గణనీయంగా మెరుగుపడింది. ఫలితంగా క్యాన్సర్లను త్వరితగతిన గుర్తించడానికి, తగిన చికిత్స అందించడానికి వీలవుతోంది. ఏఐ ఆధారిత ఇమేజింగ్ పద్ధతుల ద్వారా వైద్యులు మరిన్ని ప్రాణాలను కాపాడగలుగుతున్నారు.
మల్టీ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ (ఎంసీఈడీ) పరీక్షలు
ఇవి కూడా ‘లిక్విడ్ బయాప్సీ’ మాదిరి పరీక్షలే! ఒకే రక్తనమూనాను పరీక్షించడం ద్వారా యాభైకి పైగా క్యాన్సర్లను ముందుగానే గుర్తించే విధానాన్ని ఇటీవలి కాలంలో వైద్య పరిశోధకులు అభివృద్ధి చేశారు. వీటివల్ల రోగులకు ముందుగానే చికిత్స ప్రారంభించి, ఎక్కువ ఇబ్బంది లేకుండానే వ్యాధిని నయం చేసే అవకాశాలు గణనీయంగా పెరిగాయి. ఈ పరీక్షల్లో రోగి నుంచి సేకరించిన రక్తనమూనాల ద్వారా డీఎన్‌ఏలో వచ్చే మార్పుల ఆధారంగా దాదాపు యాభైకి పైగా రకాల క్యాన్సర్లు సోకే అవకాశాలను గుర్తించడం సాధ్యమవుతోంది. క్యాన్సర్ నిర్ధారణలో ఇదొక విప్లవాత్మకమైన పరిణామం.
జీనోమిక్ ప్రొఫైలింగ్– ప్రెసిషన్ ఆంకాలజీ
క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు ఇటీవలి కాలంలో అధునాతనమైన మాలిక్యులర్, జీనోమిక్ ప్రొఫైలింగ్ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా జీవకణాల్లోని జన్యువుల్లో క్యాన్సర్‌కు దారితీసే ఉత్పరివర్తనలను ముందుగానే అత్యంత కచ్చితత్వంతో గుర్తించడం సాధ్యమవుతోంది. వీటి ఆధారంగా ఒక్కో రోగికి వారి వారి వ్యాధి పరిస్థితులను బట్టి ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ చికిత్సను అందించగలుగుతున్నారు. ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ వల్ల క్యాన్సర్ రోగులను మృత్యువాత పడకుండా కాపాడగలుగుతున్నారు.
డిజిటల్ బయో మార్కర్స్
ఇటీవలి ఆవిష్కరణల ఫలితంగా క్యాన్సర్ రోగుల నుంచి సేకరించిన రక్తనమూనాలు, బయాప్సీ కోసం సేకరించిన కణజాలం నమూనాలు వంటి ‘బయో మార్కర్స్’ను హైరిజల్యూషన్ డిజిటల్ ఇమేజెస్‌గా మార్చడం వీలవుతోంది. డిజిటల్ బయో మార్కర్స్ ద్వారా క్యాన్సర్ రోగులకు తగిన చికిత్స అందించడానికి, వారి ప్రాణాలు కాపాడటానికి అవకాశాలు బాగా మెరుగుపడ్డాయి. డిజిటల్ బయో మార్కర్స్ ఇమేజెస్‌ను సుదూరంలో ఉన్న నిపుణులకు పంపి, వారి సలహా సంప్రదింపులు పొందడానికి, వారి సూచనల ఆధారంగా మెరుగైన చికిత్స అందించడానికి వీలవుతోంది. దీని వల్ల ఎక్కడి నుంచైనా అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలపై చికిత్స పొందడం సాధ్యమవుతోంది.
క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలతో పాటు చికిత్సలోనూ పలు ఆశాజనమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన చికిత్స విధానాలు కొన్ని రకాల క్యాన్సర్లను నయం చేయడానికి, రోగుల జీవితకాలాన్ని పొడిగించడానికి దోహదపడుతున్నాయి. ఇదివరకు క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీ, రేడియోథెరపీ, శస్త్రచికిత్సలు మాత్రమే అందుబాటులో ఉండేవి. కొన్నేళ్లుగా ఇమ్యూనోథెరపీ కూడా విస్తృత వినియోగంలోకి వచ్చింది. ఇటీవలి కాలంలో మరిన్ని క్యాన్సర్ చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయి. వాటి గురించి తెలుసుకుందాం...
సీఏఆర్–టీ సెల్ థెరపీ
లుకీమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా వంటి బ్లడ్ క్యాన్సర్లను అందుబాటులోకి వచ్చిన చికిత్స విధానం ‘కైమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్ టీ–సెల్ థెరపీ’ (సీఏఆర్–టీ సెల్ థెరపీ). ఇది కూడా ఇమ్యూనో థెరపీలో ఒక విధానం. అయితే, ఇది వ్యక్తిగత చికిత్స విధానం. ఈ విధానంలో రోగి శరీరంలో రోగనిరోధకతకు దోహదపడే ‘టీ–సెల్స్’కు జన్యుమార్పులు చేసి, రోగిలోని నిర్దిష్ట క్యాన్సర్ కణాలను ఎదుర్కొనేలా చేస్తారు. ఈ చికిత్స పొందుతూ రోగి సాధారణ జీవితం గడపడానికి వీలవుతుంది.
టార్గెటెడ్ థెరపీ
కీమో థెరపీ, రేడియో థెరపీలలో క్యాన్సర్ కణాలతో పాటు క్యాన్సర్ సోకిన భాగాలకు చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతింటాయి. దీనివల్ల చికిత్స పొందే రోగులకు నొప్పులు, బాధలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితిని అరికట్టే ఉద్దేశంతోనే శాస్త్రవేత్తలు ‘టార్గెటెడ్ థెరపీ’ని అభివృద్ధి చేశారు. టార్గెటెడ్ థెరపీలో వాడే ఔషధాలు నేరుగా క్యాన్సర్ కణాల వ్యాప్తిని మాత్రమే నిరోధిస్తాయి. చుట్టుపక్కల ఉండే ఆరోగ్యకరమైన కణాలకు ఇవి హాని చేయవు. టార్గెటెడ్ థెరపీతో బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ సహా కొన్ని రకాల క్యాన్సర్లను విజయవంతంగా నయం చేయడం సాధ్యమవుతోంది.
ప్రెసిషన్ రేడియేషన్ థెరపీ
రేడియేషన్ చికిత్సలో సాధారణంగా రేడియేషన్‌కు గురిచేసే క్యాన్సర్ కణాలతో పాటు చుట్టుపక్కల ఉండే ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతింటాయి. ప్రెసిషన్ రేడియేషన్ థెరపీలో రేడియేషన్ కిరణాలను కచ్చితంగా క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ప్రసరింపజేస్తారు. దీనివల్ల ఆరోగ్యకరమైన కణాలకు దాదాపుగా నష్టం జరగకుండా ఉంటుంది. ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ, ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ, స్టీరియో టాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ వంటి పద్ధతుల ద్వారా ప్రెసిషన్ రేడియేషన్ థెరపీలో కచ్చితత్వం గణనీయంగా పెరిగి, రోగి శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలకు హాని తగ్గుతోంది. ఫలితంగా రేడియేషన్ వల్ల కలిగే దుష్పరిణామాలు తగ్గి, రోగి కోలుకునే అవకాశాలు కూడా బాగా పెరుగుతున్నాయి.
నానో మెడిసిన్
క్యాన్సర్ రోగులకు సురక్షితమైన చికిత్సను అందించడంలో నానో మెడిసిన్స్ సత్ఫలితాలనిస్తున్నాయి. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన నానో మెడిసిన్స్‌ను మరింతగా అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. నానో మెడిసిన్స్‌లో 1–100 నానోమీటర్ల పరిమాణం గల ఔషధాలు నేరుగా క్యాన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకుని పనిచేస్తాయి. ఈ ఏడాది నానో మెడిసిన్ రంగం మరింతగా అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. నానో కీమోథెరపీ, నానో మెడిసిన్ బేస్డ్ ఇమ్యూనోథెరపీ, జీన్ థెరపీలో నానో సాంకేతికత వినియోగం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
రోబోటిక్ క్యాన్సర్ సర్జరీ
క్యాన్సర్ కణితులను శస్త్రచికిత్స ద్వారా తొలగించడంలో రోబోటిక్ సర్జరీ అత్యంత కచ్చితత్వం సాధిస్తోంది. హైడెఫినిషన్ త్రీడీ కెమెరాల ద్వారా క్యాన్సర్ కణితులను గుర్తించి, తొలగించడంలో రోబో చేతులు మనుషులను మించిన నైపుణ్యంతో పని చేయగలుగుతున్నాయి. తక్కువ కోత లేదా చిన్న రంధ్రం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన కణజాలానికి నష్టం లేకుండా క్యాన్సర్ కణితులను తొలగించగలుగుతున్నాయి. దీనివల్ల రోగులకు తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావంతో శస్త్రచికిత్సలు చేయడం సాధ్యమవుతోంది. ప్రొస్టేట్, కిడ్నీ, లివర్, పేగులు, తల, మెడ, రొమ్ము, ఊపిరితిత్తులు, గర్భాశయం, అండాశయం తదితర భాగాల్లో ఏర్పడే క్యాన్సర్ కణితులను తొలగించడంలో రోబోటిక్ సర్జరీ సత్ఫలితాలను సాధిస్తోంది.
ప్రోటాన్ బీమ్ థెరపీ
రేడియేషన్ చికిత్సలో అధునాతన పద్ధతి ప్రోటాన్ బీమ్ థెరపీ. సర్వసాధారణంగా రేడియేషన్ థెరపీలో క్యాన్సర్ సోకిన కణాలపైకి ఎక్స్–రే రేడియషన్ కిరణాలను ప్రసరింపజేస్తారు. దీనిని ఫోటాన్ థెరపీ అంటారు. ఈ కిరణాలు ఆరోగ్యకరమైన కణాలు ఉన్న శరీర భాగాల నుంచి దూసుకుపోతాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతింటాయి. ప్రోటాన్ బీమ్ థెరపీలో ప్రోటాన్ కిరణాలు అత్యంత కచ్చితంగా క్యాన్సర్ కణితి మీదకు ప్రసరించి, అక్కడ ఆగిపోతాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి హానీ జరగదు. ప్రోటాన్ థెరపీలో ప్రోటాన్ కిరణాల తీవ్రతను, లోతును నియంత్రించడానికి అవకాశం ఉండటం మరో సానుకూలత. దీని వల్ల ఆరోగ్యకరమైన కణాలకు నష్టం లేకుండా, విడతలు విడతలుగా క్యాన్సర్ కణితిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుంది. మెదడు, వెన్నెముక, కన్ను, ప్రొస్టేట్, రొమ్ము తదితర భాగాల్లో ఏర్పడే క్యాన్సర్ కణితులను తొలగించడానికి ప్రోటాన్ బీమ్ థెరపీ అద్భుతంగా పనిచేస్తుంది.
మరిన్ని చికిత్స పద్ధతులు
క్యాన్సర్‌ను నయం చేయడానికి, నియంత్రించడానికి మరిన్ని చికిత్స పద్ధతులపై కూడా వైద్య నిపుణులు విస్తృత పరిశోధనలు సాగిస్తున్నారు. వీటిలో ఇప్పటికే ‘ఆంకోలైటిక్ వైరస్ థెరపీ’, ‘ఎపిజెనెటిక్ థెరపీ’ వంటి పద్ధతులపై ప్రయోగాలు జరుపుతున్నారు. ‘ఆంకోలైటిక్ వైరస్ థెరపీ’లో జన్యుమార్పిడి చేసిన వైరస్‌ను రోగి శరీరంలోకి పంపడం ద్వారా క్యాన్సర్‌ను నిర్మూలిస్తారు. ఈ పద్ధతిని మెలనోమా వంటి చర్య క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ‘ఎపిజెనెటిక్ థెరపీ’లో క్యాన్సర్‌కు కారణమయ్యే ఉత్పరివర్తలను లోనైన జన్యువులను గుర్తించి, వాటి డీఎన్‌ఏను మార్చకుండానే, ఆ జన్యువుల్లో జరిగే ప్రమాదకర ఉత్పరివర్తనలను వెనక్కు మళ్లిస్తారు. లుకీమియా, లింఫోమా వంటి బ్లడ్ క్యాన్సర్ల చికిత్సల్లో ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు.
భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్స
సమీప భవిష్యత్తులోనే క్యాన్సర్ చికిత్సలో మరిన్ని మార్పులు చోటు చేసుకోనున్నట్లు అంతర్జాతీయ వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు చేపడుతున్న చికిత్స విధానాల్లో రోగులు అందరికీ ఒకే విధమైన ఔషధం అనే పద్ధతులను కొనసాగిస్తున్నారు. త్వరలోనే రోగుల వ్యక్తిగత శారీరక స్థితిగతుల ఆధారంగా ‘హైపర్ పర్సనలైజ్డ్’ ఔషధాలను ఏఐ సాయంతో రూపొందించి, ప్రయోగించే అవకాశాలపై ప్రయోగాలు జరుపుతున్నారు. క్యాన్సర్ చికిత్సలో పలు అధునాతనమైన ఔషధాలు, చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చినా, పలు రకాల క్యాన్సర్లను పూర్తిగా నయం చేయడం ఇంకా సాధ్యం కావడం లేదు. అందువల్ల క్యాన్సర్‌ను దీర్ఘకాలం నియంత్రించగల వ్యాధి స్థాయికి తీసుకొచ్చేలా అందుకు తగిన ఔషధాలను, చికిత్స విధానాలను రూపొందించడంలో వైద్య నిపుణులు ప్రయోగాలు చేస్తున్నారు. క్యాన్సర్‌ను పూర్తిగా నిర్మూలించ లేకపోయినా; డయాబెటిస్, బీపీ వంటి వ్యాధుల మాదిరిగానే దీర్ఘకాలం నియంత్రణలో పెట్టుకోగల స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. క్యాన్సర్‌ను ప్రాణాంతక వ్యాధిగా పరిగణించే పరిస్థితులు లేకుండా చేయవచ్చని చెబుతున్నారు.
క్యాన్సర్ వ్యాక్సిన్లు
పలు రకాల క్యాన్సర్లను నిరోధించడానికి వీలుగా ఇటీవలి కాలంలో ‘ఎంఆర్‌ఎన్‌ఏ క్యాన్సర్ వ్యాక్సిన్లు’ అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యాక్సిన్లు క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటిని నిర్మూలించేలా రోగ నిరోధక వ్యవస్థను ఆయత్తం చేస్తాయి. నిర్దిష్ట క్యాన్సర్ ప్రొటీన్లకు అనుగుణంగా ఈ ఎంఆర్‌ఎన్‌ఏ క్యాన్సర్ వ్యాక్సిన్లను రూపొందిస్తున్నారు. పర్సనలైజ్డ్ వ్యాక్సిన్లు. ఊపిరితిత్తుల క్యాన్సర్, మెలనోమా, పాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి పలు రకాల క్యాన్సర్లను నిరోధించడంలో ఈ వ్యాక్సిన్లు సత్ఫలితాలను సాధిస్తున్నాయి. -పన్యాల జగన్నాథదాసు


