breaking news
World Cancer Day
-
క్యాన్సర్ మరణ శాసనం కాదు: చిరంజీవి
హైదరాబాద్: క్యాన్సర్ వ్యాధి అనేది దేవుడు ఇచ్చిన శాపం కాదు. అది మన జీవన విధానంలో మనతోనే మొదలువుతుందన్నారు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి. బుధవారం కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ అనేగానే జీవితం ముగిసినట్లే అనుకుంటున్నారు అంతా.. కానీ ఇక్కడ ఇంత మంది క్యాన్సర్ వ్యాధిని జయించిన వారి చూస్తుంటే డాక్టర్లు ఎంతో కష్టపడుతున్నారో అర్థమవుతుంది. మన జీవనశైలి అధారంగానే మనకు వ్యాధులు వస్తుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. క్యాన్సర్ అనేది మనకు మరణశాసనం కాదు ముందస్తుగా గుర్తిస్తే క్యాన్సర్ ని కూడా జయించి సాధారణ జీవితాన్ని అస్వాధించవచ్చన్నారు. ఇక్కడ ఎంతో మంది చిన్నారులను కూడా చూస్తున్నాం. వారి కూడా క్యాన్సర్ బారిన పడ్డారంటే ఎంతో బాధగా ఉంది. కాబట్టి ప్రతీ ఒక్కరూ కూడా ఈ వ్యాధిపై అవగాహన పెంచుకొని, ఆయా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులు సంప్రదించాలని సూచించారు.అనంతరం కార్యక్రమ నిర్వహాకులు సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డా. ముధు దేవరశెట్టి మాట్లాడుతూ గతంలో 40, 50 సంవత్సరాల పైబడిన వారికే క్యాన్సర్ వ్యాధి వచ్చేది కానీ ఇప్పుడు వయసు సంబంధం లేకుండా చిన్న వయసుల వారు అంటే 5, 10 ఏళ్ల పిల్లలు కూడా క్యాన్సర్ బారీన పడుతున్నారు. దీనికి కారణం జన్యుపరమైన లోపాలు, వంశపరాంపర్యం, రేడియేషన్, రసాయణ పదార్థాలు, ఎరువులు వాడకం, మద్యం, ధూమపానం, ఒత్తిడికి గురై డయాబెటిస్ ఇలా చాలా రకాల కారణాలు ఉన్నాయి.కానీ ప్రజల్లో అవగాన తక్కువ ఉండడంతో క్యాన్సర్ చివరి దశల్లో డాక్టర్ల దగ్గరకి వస్తున్నారు. అవగాహన అనేది చాలా కీలకం, ప్రతి ఒక్కరూ క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందు కోసం కిమ్స్ హాస్పిటల్స్ లో క్యాన్సర్ ఫైట్ సపోర్ట్ గ్రూప్ ని ఏర్పాటు చేశాం. దీని ముఖ్య ఉద్దేశ్యం చికిత్స పొందిన అనంతరం సాధారణ జీవితం గడుపుతున్న రోగులు ఏకమై ముందుకు వచ్చి, క్యాన్సర్ పూర్తిగా నయం అయ్యే వ్యాధేనని, చికిత్స పట్ల భయం అవసరం లేదన్న సందేశాన్ని సమాజానికి చాటి చెప్పాలన్నారు.క్యాన్సర్ చికిత్స కోసం అనేక రకాలైన అత్యాధునికి చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. చికిత్స చేయించుకున్న తర్వాత కూడా ఎక్కువకాలం బ్రతికే అవకాశం ఉందన్నారు. సమాజంలోకి ఈ విషయం వెళ్లాల్సిన అవసరం ఎంతైన ఉందని వ్యాఖ్యానించారు. అలాగే క్యాన్సర్‌ను జయించిన వారు తమ అనుభవాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ డైరెక్టర్ డా. సంబిత్ సాహు, మెడికల్ ఆంకాలజిస్ట్ డా. నరేందర్ కుమార్ తోట మరియు క్యాన్సర్ చికిత్స పొందిన మరియు పొందుతున్న వారు పాల్గొన్నారు. -
క్యాన్సర్ చికిత్స.. వయొలెంట్ కణంపై సైలెంట్ రణం!
ఇప్పటికే క్యాన్సర్ చికిత్సారంగంలో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. ఇక కృత్రిమ మేధ (ఏఐ)ను కనుగొన్న తర్వాత వచ్చిన, వస్తున్న పురోగతులు చెప్పడానికీ, వినడానికీ, చదవడానికే ఆశ్చర్యం కలిగించేలా ఉంటున్నాయి. ఇది ‘సైన్స్ ఫిక్షన్ కాదు... మెడిసిన్’ అని అనుక్షణం నిరూపితమవుతోంది. ఈ ఏడాది క్యాన్సర్ డే థీమ్ ‘యునైటెడ్ బై యునీక్’! ఈ నినాదం అర్థమేమిటంటే... ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగులందరికీ (యునైటెడ్‌గా) చికిత్స అందేలా చేస్తూనే... ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా... వ్యక్తిగతంగా నిర్దిష్టమైన (యూనిక్) చికిత్స అందేలా చూడటం. ఈరోజు ‘వరల్డ్ క్యాన్సర్ డే’.ఈ సందర్భంగా ఈ అంశాలన్నింటితో ప్రత్యేక కథనం...ఒక చిన్న అంశాన్ని ఊహించండి... మన దేహమంతా ఓ నగరం అనుకోండి. అప్పుడు మన ఒంట్లోని ప్రతి కణమూ ఒక ఇల్లవుతుంది. అప్పుడు మన ఇంట్లోని జన్యువు (జీన్) స్విచ్ అనుకుందాం...బాగా పనిచేసే ఆ ‘స్విచ్చు’ ఆన్ చేసినప్పుడల్లా ‘లైట్’ వెలుగుతుంది. అది నార్మల్ పెరుగుదలకు సంకేతం! ∙కొన్నిసార్లు వాటిని ఆన్ చేసినప్పుడు అలారం మోగుతుంది. అంటే రిపేర్లు అవసరమనే సూచన. ∙కొన్ని స్విచ్చులు అవసరాన్ని బట్టి పోలీస్‌ను పిలుస్తాయి. అది కణం మరణం!ఈ పోలికలతో చెప్పాలంటే... క్యాన్సర్ ఎప్పుడు పుడుతుందంటే...?⇒ కొన్ని స్విచ్చులు అలా ఆన్ అయ్యాక ‘స్ట్రక్’ అయిపోయి... ఆఫ్ కాకుండా ఇరుక్కుపోయినప్పుడు... అంటే... ఆన్ అయిన ఆ స్విచ్చు అలాగే జామ్ అయిపోతే... లైట్ అలా కంటిన్యువస్‌గా వెలుగుతూనే ఉంటుంది!... అది అప్రతిహతమైన పెరుగుదల.... ఎంతకూ ఆగకుండా పెరిగే క్యాన్సర్ పెరుగుదల! ∙అలారం మెకానిజం దెబ్బతిని అలారం మోగకుండా పోవడమంటే... కణంలో ఏదో తప్పు జరిగి... అది జరిగిందనే హెచ్చరికలు అందకుండా పోవడం. ⇒ ఇక సెల్ డెత్‌కు కారణమయ్యే పోలీస్ ఇన్స్పెక్టర్ తన పని మానేసి నిశ్శబ్దంగా ఉండిపోయినప్పుడూ... అంటే నార్మల్ కణం కాస్తా క్యాన్సర్ కణంగా మారినప్పుడు... అది మరో నార్మల్ కణానికి అడ్డంకి కాకుండా ఉండేందుకూ, పొరుగుదాన్ని దెబ్బతీయకుండా ఉండటానికి నిశ్శబ్దంగా తనంతట తానే మరణించడం జరగకపోవడం.ఇలా జీన్ అనే స్విచ్చులో ఏవైనా మార్పులు వచ్చి అది ‘జామ్’ అయిపోయిందంటే... అది క్యాన్సర్‌కు దారితీసినట్టేనని తెలుసుకోవాలి. ఇలా కణాల్లోని ‘పీ–53’ అనే ఓ ్రపోటీన్... ఈ స్విచ్చులన్నింటికీ ఓ (మాలెక్యులార్) ‘మాస్టర్ స్విచ్’గా పనిచేస్తుంది. అంటే ఇది మెయిన్‌బోర్డు దగ్గర ఉంటుంది. దీన్నే ‘గార్డియన్ ఆఫ్ జీనోమ్’ గానూ చెప్పవచ్చు. అదే అవసరాన్ని బట్టి డీఎన్ఏ రిపేర్లు జరిగేలా చూస్తుంది. అప్పటికీ పని జరగకపోతే ఆ తప్పుడు కణం తనంతట తానే చనిపోయేలా చూస్తుంది. (దీన్నే ‘్రపోగ్రామ్డ్ సెల్ డెత్’ అంటారు). అలా చేయడం ద్వారా మిగతా దేహాన్ని క్యాన్సర్ బారిన పడకుండా రక్షిస్తుంది.అంటే ఇంట్లో షార్ట్ సర్క్యుట్ అయితే... దానివల్ల ప్రమాదం జరగకుండా మెయిన్ బోర్డు దగ్గరే ఆఫ్ అయిపోయే మాస్టర్ స్విచ్‌లా పనిచేస్తుందన్నమాట. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆవిష్కరణ తర్వాత క్యాన్సర్ చికిత్సా రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ కొత్త ఆవిష్కరణలేమిటో... వాటితో వచ్చిన మార్పులేమిటో చూద్దాం. మొదటి ఆవిష్కరణ: ఆలిగో న్యూక్లియటైడ్ థెరపీగతంలో ఒంట్లోని ఏదైనా స్విచ్ చెడిపోయిం దంటే... డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు డాక్టర్‌గారు తన పరికరాల (కీమోథెరపీ) సహాయంతో ఓ ఎలక్ట్రీషియన్‌లా లేదా ఓ మేసన్ (మేస్త్రి)లా పనిచేస్తూ చెడిపోయిన స్విచ్‌ను రిపేరు చేసేవారు. ఆ క్రమంలోనే బోర్డులో మరికొన్ని స్విచ్చులూ మార్చాల్సి వచ్చేది. కానీ ఇప్పటి తాజా ఆవిష్కరణతో... కణం నుంచి అది చెడిపోయినట్లు సిగ్నల్ రాగానే పేషెంటే ఆ చెడిపోయిన కణానికి సందేశాలు పంపుతాడు. ‘‘చెడిపోయినట్లు వస్తున్న ఆ సిగ్నల్స్‌ను పరిగణనలోకి తీసుకోకు’’ ‘‘నీ సేఫ్టీ రూల్స్‌కు అనుగుణంగా చెడిపోయిన కణాన్ని రిపేర్ చేయ్యి’’ ‘‘ఇలా చేయడం ద్వారా చెడిపోయిన కణం వరకే పరిమితం అవ్వు. దేహంలోని మిగతా కణాలను చెడగొట్టకు’’... లాంటి సందేశాలను కణానికీ, కణంలోని రిపేర్లు చేసే అంశాలకు పంపడం ద్వారా...దేహంలోని మిగతా కణాలన్నీ ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. దాంతో క్యాన్సర్ మిగతా కణాలకు వ్యాపించదు. ఇప్పుడు ఇదెలా జరుగుతుందంటే... మానవ కణాల్లో ‘న్యూక్లియటైడ్స్’ అనే ఇటుకలు (బిల్డింగ్ బ్లాక్స్) ఉంటాయి. అయితే డాక్టర్లు ‘ఆలిగోన్యూక్లియటైడ్స్’ అనే కృత్రిమ ఇటుకలను తయారు చేసి... క్యాన్సర్‌తో చెడిపోయిన ఇటుకల స్థానంలో వీటిని పెట్టి ఈ రిపేర్లు జరుగుతాయి. ఇంకా మరొక పోలిక చెప్పాలంటే... మనకు ఇష్టం లేనిదీ, ఏదో అశ్లీలమైన ఎస్ఎమ్ఎస్ వచ్చిందంటే... చిరాకు పుట్టి ఫోన్‌ను విసిరికొట్టి దాన్ని ధ్వంసం చేయడం కంటే... కేవలం ఆ మెసేజ్ వరకే డిలీట్ చేయడం లాంటిదన్నమాట.రెండో ఆవిష్కరణ: కార్టి / ఎన్కే సెల్ థెరపీఅత్యంత కన్నింగ్ మోసగాడు... ఈ క్యాన్సర్ కణం! ఈ నేపథ్యంలో ‘క్యాన్సర్ కణం’ తాలూకు ఓ గుణాన్ని చూద్దాం. క్యాన్సర్ కణమనేది అత్యంత కన్నింగ్ మోసగాడిలాంటిది. వాడెంత కన్నింగ్ అంటే... ఎక్కణ్ణుంచో ఓ ‘ఆర్మీ యూనిఫామ్’ను కొట్టేసి, ఫేక్ ఐడీ కార్డునొకదాన్ని పట్టేసి... తానూ ఓ రక్షణ కణంలా కనిపించేలా మారువేషం వేసుకుని మరీ ఆరోగ్యకరమైన కణాలను ధ్వంసం చేస్తుంటాడు. అయితే ఇప్పటి సరికొత్త ఆవిష్కరణతో వచ్చిన ఈ అత్యంత నూతన, అధునాతన చికిత్స ప్రక్రియలో ఎన్కే అంటే... ‘నేచురల్ కిల్లర్’ అని అర్థం. ఇలా పిలిచే ఆర్మీ కమాండోస్ లాంటి ఈ ‘ఎన్కే సెల్స్ థెరపీ’లో ఏం జరుగుతుందో చూద్దాం. ∙గతంలోని ఆర్మీ కమేండోలు డేంజర్ సిగ్నల్స్ వచ్చేదాకా ఆగేవి. కానీ ఇప్పటి ఎన్కే సెల్స్ మాత్రం ఎవరి ఆదేశాల కోసం ఆగవు. అనుమానం వచ్చిందంటే చాలు ఆ క్యాన్సర్ సెల్‌ను అప్పటికప్పుడు ధ్వంసం చేసేస్తాయి. ∙⇒ నిశితంగా ఎంచుకుని... నిర్దిష్టంగా కేవలం చెడిపోయిన లేదా క్యాన్సర్ కణంగా మారబోతున్న కణాన్నే తుదముట్టించేస్తాయి. ∙ఇమ్యూనిటీ సెల్స్ అయిన బీ సెల్, టీ సెల్ లా తాను రక్షణ కవచాన్ని అని చెప్పే యూనిఫామ్ వేసుకోవు. సివిల్ డ్రస్‌లో ఉన్న సోల్జర్లా విరుచుకుపడి క్యాన్సర్ కణాన్ని ముట్టడించేస్తాయి. ఈ క్రమంలో అవి యూనిఫామ్ వేసుకుని మోసం చేసే క్యాన్సర్ కణం కన్నింగ్ వేషాల ట్రాప్‌లో పడిపోవు. సదరు క్యాన్సర్ కణాల కుయుక్తులనూ ముందే పసిగట్టేసి... వాటిని తుదముట్టిస్తాయి.మూడో ఆవిష్కరణ: యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్ (ఏడీసీ) «థెరపీ ఓ పొలంలో చీడ పట్టిందనుకోండి. ఆ చీడపురుగులను అంతం చేయడానికి మొత్తం పొలమంతా మందుకొట్టడం మామూలే. అలాగే ఊళ్లో ఉన్న దోమలను తుదముట్టించడానికి అత్యంత ఘాటుగానూ, ఊపిరి పీల్చుకోడానికే ఇబ్బంది పడేలా సఫకేట్ చేసేసే దోమలమందును ఊరంతా కొట్టడం సాధారణంగా జరిగేదే. తాజా ఆవిష్కరణలతో వచ్చిన చికిత్స ఎలాంటిదంటే... ఇది చాలా ఖచ్చితంగా పనిచేసే కొరియర్ బాయ్ లాంటిది. ఆ ఊళ్లో ఆ వీధి ఎక్కడుందో... ఆ వీధిలో ఆ ఇల్లు ఎక్కడుందో కనుక్కుని... బాగా ΄్యాక్ చేసి ఉన్న ఆ ‘క్యాన్సర్ మందు’ను సరిగ్గా ఆ ఇంట్లోకి డెలివరీ చేసే ఓ కొరియర్ బాయ్‌లా పనిచేస్తుంది. ఆ ఇంట్లోవాళ్లు ఆ ΄్యాక్‌ను తెరవగానే మందునంతా చిమ్మేసి క్యాన్సర్‌ను కమ్మేసి సైలెంట్‌గా చంపేస్తుంది. అలా పక్కనున్న ఇంటికి ఏమాత్రం ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడుతుంది. ఈ తరహా కొత్త ఆవిష్కరణ ఫలితంగా బాధితుల్లో సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. దాంతో మునపటి కీమోథెరపీల్లోని వేదనలూ, వెతల్లా కాకుండా చికిత్సను తేలిగ్గా తట్టుకోగలగడం సాధ్యమవుతుంది.నాలుగో ఆవిష్కరణ: కృత్రిమ మేధ + జీనోమిక్స్ఇది కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ప్లస్ జీనోమిక్స్ (జీనోమ్ చికిత్స)... ఈ రెండింటి సమన్వయంతో అందే అత్యంత అధునాతమైన సరికొత్త చికిత్స ప్రక్రియ.ఈ అంశాన్నీ తేలిగ్గా వివరించాలంటే... గతంలో నగరంలో ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగాక ఫైర్ అలారం మోగగానే ఫైర్ బ్రిగేడంతా నిప్పును ఆర్పడానికి ఉపక్రమించేవారు. ఇప్పుడు అలాకాదు.. ⇒ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ సీసీటీవీ లా పనిచేసి... అగ్ని అంటుకునేందుకు అవకాశమున్న చోటిని పసిగట్టినట్టే... క్యాన్సర్ పుట్టే చోటిని ముందే పసిగడుతుంది. ⇒ రక్తం / జెనెటిక్ సిగ్నల్స్... నాయిస్ సెన్సర్ మాదిరిగా పనిచేసి క్యాన్సర్ పుట్టేందుకు అవకాశమున్న ప్రదేశాన్ని ముందే కనిపెట్టేస్తాయి. ∙ఇక్కడ మనుష్యులు ఆ స్వల్పాతి స్వల్పమైన అతి చిన్న తేడాను మిస్ కావచ్చేమోగానీ... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం కారణంగా ఆ అతిచిన్న తేడానూ పసిగట్టే వీలుంది.ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే... ⇒ కుటుంబ చరిత్రలో క్యాన్సర్ ఉండి... హై–రిస్క్ ఉన్న కుటుంబాల్లో. ∙చాలాకాలం నుంచి పొగతాగే అలవాటున్న స్మోకర్లలో. ∙మహిళల్లోనే వచ్చే ఉమన్ క్యాన్సర్లను పసిగట్టే విషయంలో. ∙క్యాన్సర్ వచ్చేందుకు అవకాశమున్న జీవనశైలిని అనుసరించేవారిలో లేదా అలాంటి వాతావరణంలో పనిచేసేవారిలో.ఐదో ఆవిష్కరణ: పర్సనలైజ్డ్ థెరపీ (ప్రెసిషన్ ఆంకాలజీ) గతంలో ఎవరైనా బాధితుడిలో ఒక రకం క్యాన్సర్‌ను కనుగొన్నారంటే... ఆ రకం క్యాన్సర్ వచ్చినవారందరికీ ఇచ్చే మందును లేదా చికిత్స ప్రక్రియను అతడికి కూడా అందించేవారు. కానీ కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ) సహాయంతో ఇప్పుడు అతడిలో క్యాన్సర్ కణం ప్రవర్తించే పద్ధతిని (బిహేవియరల్ మేనర్‌ను) బట్టి, అతడి జీవనశైలి ఆధారంగా, అతడి బ్లడ్ మార్కర్స్, అతడి స్కాన్లూ, అతడికే ప్రత్యేకమైన అతడిలోని ‘పీ–53’ ్రపోటీన్... అంటే... అతడి ‘మాలెక్యులార్ మాస్టర్ స్విచ్’ ఎంత బలహీనంగా ఉందీ, అది ఏ మేరకు పనిచేయడంలేదు... లాంటి అంశాలన్నీ తెలుసుకొని అతడికే ప్రత్యేకమైన, ఎంతో ప్రభావపూర్వకంగా పనిచేసేలా అతడికే వ్యక్తిగతమైన చికిత్స అందించవచ్చు. ఈ అధునిక ఆవిష్కరణలతో లాభాలివి...⇒ చాలా హాస్పిటల్స్‌లో ఇప్పటికే ఈ ప్రయోజనాలను పొందుతున్నారు. ∙తమ జీవన నాణ్యతను (క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ను) మెరుగుపరచుకుంటున్నారు. ∙ఎంతో డబ్బునూ, టైమ్‌నూ ఆదాచేసుకోవడమే కాదు... గతంలో పేషెంట్లకు ఉండే ఎన్నో బాధలూ, వెతలూ, వేదనలకు దూరంగా ఉంచగలగడం సాధ్యమవుతోంది.నిర్వహణ: యాసీన్డాక్టర్ సురేశ్ ఏవీఎస్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్, కన్వీనర్, ఏఐ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ – మెడికల్ సైన్సెస్ -
World Cancer Day: ‘మిస్డ్ కాల్’ క్యాంపెయిన్ ప్రారంభించిన కామినేని ఆసుపత్రి
హైదరాబాద్: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, కుటుంబ చరిత్ర, జన్యుపరమైన అంశాల ఆధారంగా క్యాన్సర్ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించే ఉద్దేశంతో కామినేని ఆసుపత్రి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా ఫిబ్రవరి 4 నుంచి 10వ తేదీ వరకు ప్రజలు 040-6905 9100 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే, క్యాన్సర్ ప్రమాదంపై నిపుణుల ఉచిత సంప్రదింపులు పొందవచ్చని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.కుటుంబంలో ఒకరు, అంతకంటే ఎక్కువ మందికి క్యాన్సర్ ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. వారసత్వ కారణాల వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు తెలిపారు. ఈ క్యాంపెయిన్ కాలంలో వైద్యులు సూచించిన నిర్ధారణ పరీక్షలపై 20 శాతం రాయితీ కూడా అందించనున్నట్లు కామినేని ఆసుపత్రి ప్రకటించింది.సాధారణంగా ఎవరికైనా క్యాన్సర్ వచ్చే అవకాశమున్నప్పటికీ, సుమారు 10 శాతం క్యాన్సర్లు వారసత్వ జన్యు మార్పుల కారణంగా ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్రెస్ట్, ఓవేరియన్, ఎండోమెట్రియల్, ప్రోస్టేట్, కొలొరెక్టల్ క్యాన్సర్లు, తక్కువ వయస్సులో క్యాన్సర్ రావడం, తరతరాలుగా కుటుంబ సభ్యుల్లో క్యాన్సర్ కనిపించడం వంటి అంశాలు జన్యుపరీక్షలకు కీలక సూచికలని వివరించారు. ముందస్తుగా ప్రమాదాన్ని గుర్తించడం ద్వారా లక్ష్యిత స్క్రీనింగ్, నివారణ చర్యలు మరియు వ్యక్తిగత వైద్య సంరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు.కామినేని ఆసుపత్రి జన్యు మరియు మాలిక్యులర్ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్, విభాగాధిపతి డా. అనీ క్యూ హసన్ మాట్లాడుతూ, “కుటుంబ చరిత్ర అనేది వారసత్వ క్యాన్సర్ ప్రమాదానికి తొలి హెచ్చరిక. జన్యు కౌన్సెలింగ్ ద్వారా ప్రమాదాన్ని ఖచ్చితంగా అంచనా వేసి, సమయానికి పర్యవేక్షణ, నివారణ చర్యలు చేపడితే మంచి ఫలితాలు సాధ్యమవుతాయి” అని అన్నారు.కామినేని ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా. గాయత్రి కామినేని మాట్లాడుతూ, “చాలామంది కుటుంబ చరిత్రను నిర్లక్ష్యం చేస్తుంటారు. లక్షణాలు కనిపించిన తర్వాతే ఆసుపత్రికి వస్తున్నారు. ఈ మిస్డ్ కాల్ కార్యక్రమం ద్వారా ప్రజలు ముందుకు వచ్చి, తమ ప్రమాదాన్ని ముందుగానే తెలుసుకుని తగిన నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం” అని తెలిపారు. కామినేని ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జన్యు మరియు మాలిక్యులర్ మెడిసిన్ విభాగం, బోర్డు సర్టిఫైడ్ జన్యు కౌన్సెలర్లతో పాటు ఆంకాలజీ తదితర విభాగాల వైద్యులతో కలిసి సమగ్ర ప్రమాద అంచనా మరియు వ్యక్తిగత చికిత్సా ప్రణాళికలను అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. -
పోరాటానికి సిద్ధం చేసే సైకో ఆంకాలజీ
‘నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్’2024 అధ్యయనం ప్రకారం మన దేశంలో 25 లక్షల మంది క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. గత ముపై ్ప ఏళ్లలో క్యాన్సర్ బాధితుల సంఖ్య 24 శాతం పెరగడమే ఇంత భారీ సంఖ్యకు కారణం. అయితే క్యాన్సర్ నయం చేయడంలో వైద్యంతో పాటు మనసును దృఢం చేయడం కూడా చాలా ముఖ్యం అంటున్నారు సైకో అంకాలజిస్ట్‌లు. క్యాన్సర్ పోరాటంలో బాధితునికి సైకో ఆంకాలజిస్ట్‌లు అందించే సహాయం ఏమిటి?‘ఇటీవల మా అధ్యయనం ఏం చెబుతున్నదంటే క్యాన్సర్ ట్యూమర్‌తో పాటు మనసుకు కూడా వైద్యం చేయడం వల్ల క్లినికల్‌గా మంచి ఫలితాలు వస్తాయని. ఆంకాలజీ విభాగంలో సైకాలజీ ఇక ఎంత మాత్రం ఆప్షనల్ కాదు. తప్పనిసరి అవసరం’ అన్నారు న్యూఢిల్లీలోని ఎంఓసి క్యాన్సర్ కేర్ సెంటర్ వైద్యుడు డాక్టర్ నిఖిల్ హింతాని. ‘అందుకే దేశంలోని క్యాన్సర్ సెంటర్లలో సైకో ఆంకాలజిస్ట్‌ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది’ అన్నారాయన.క్యాన్సర్ బారిన పడటం ఎవరినైనా కుంగదీసే విషయమే. క్యాన్సర్ నిర్థారణ అయ్యాక ప్రతి పేషంట్‌కు తనవైన భావోద్వేగ సవాళ్లు ఉంటాయి. వాటిని ఎదుర్కొనడంతో పాటు వ్యాధిని ఎదుర్కొనాలి... ఈ రెంటి సమన్వయానికి కౌన్సిలింగ్ తప్పనిసరి అంటున్నారు క్యాన్సర్ నిపుణులు. అందుకే ఇప్పుడు క్యాన్సర్ మీద పోరాటంలో సైకో ఆంకాలజిస్ట్‌ల ప్రాధాన్యం పెరిగింది.→ ఎవరీ సైకో ఆంకాలజిస్టులు?క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించే నిపుణులను ‘ఆంకాలజిస్టు’ అంటారని తెలిసిందే. ఆ విభాగంలోనిదే ఈ ‘సైకో–ఆంకాలజీ’. సైకాలజీలో మాస్టర్స్ లేదా పిహెచ్డి చేసి, సైకో ఆంకాలజీని ప్రత్యేకంగా అధ్యయనం చేసిన వారు ‘సైకో ఆంకాలజిస్ట్‌లు’గా విధులకు సిద్ధమవుతారు. ఆంకాలజిస్ట్లతోటి, పేషంట్స్తోటి సమన్వయం చేసుకుంటూ పేషంట్ మనసుకు స్వాంతన ఇస్తూ వారిలో ధైర్యం నూరి పోయడం, క్యాన్సర్‌ను గెలవగలననే భరోసాను ఇవ్వడం వీరి ప్రధాన పని.→ క్యాన్సర్ నయమైన వారికీ అండగా..క్యాన్సర్ నయమైన తర్వాత కూడా క్యాన్సర్ విజేతలకు అనేక ఆందోళనలు ఉంటాయి. చికిత్స వల్ల వారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. వాటిని తట్టుకోలేక కొందరు కుంగి పోతుంటారు. అటువంటి వారికీ ‘సైకో–ఆంకాలజీ’ అండగా ఉంటుంది. తిరిగి మేలైన జీవితాన్ని ఎలా ప్రారంభించాలో, ఎలా సహజంగా జీవించాలో నేర్పుతుంది. మానసిక ప్రశాంతత, ఆరోగ్య సూత్రాలు, ఒత్తిడి లేని జీవనాన్ని పాటించేలా సూచనలు చేస్తారు సైకో–ఆంకాలజిస్టులు. క్యాన్సర్ నయం కాగానే అంతా మామూలై పోయిందని చాలామంది భావిస్తుంటారు. అక్కడి నుంచే అసలైన సవాళ్లు మొదలవుతాయని నిపుణులు అంటున్నారు. ఆ మార్పులకు అనుగుణంగా వారిని సంసిద్ధం చేయడం అత్యవసరమని, దానికి ‘సైకో– ఆంకాలజీ’ తోడ్పడుతుందని అంటున్నారు.→ దశాబ్ద కాలంగా ‘సైకో–ఆంకాలజీ’పై పెరుగుతున్న అవగాహన మనదేశంలో ఎక్కువగా రొమ్ము, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితులు ఉన్నారు. ఇందులో పురుషులు, స్త్రీలు బాధితులుగా ఉంటారు. వీరిలో ఒక్కొక్కరి ఒక్కో నేపథ్యం. పేద, మధ్యతరగతి ప్రజలు క్యాన్సర్ బారిన పడితే ఇక ఆ కుటుంబంలో నెలకొనే ఆందోళన గురించి చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో క్యాన్సర్‌కు గురైన వారు ధైర్యంగా ఉంటే మిగిలినవారూ ధైర్యాన్ని కూడగట్టుకుంటారు. అందుకు ‘సైకో–ఆంకాలజీ’ కీలక భూమిక పోషిస్తుంది. గత పదేళ్లుగా దీనిపై అవగాహన పెరుగుతోంది. ‘క్యాన్సర్‌ని ఎదుర్కొవడం మాత్రమే కాదు, జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలునూ ఎదుర్కునేలా వారిని సిద్ధం చేయడమే మా బాధ్యత’ అంటున్నారు ‘సైకో– ఆంకాలజిస్టులు’.మానసిక ధైర్యమే కొండంత అండసైకో ఆంకాలజీలో పేషంట్‌కు అవసరాన్ని బట్టి ‘కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ’, ‘స్ట్రెస్ రిడక్షన్ టెక్నిక్స్’, ‘యాక్సెప్టెన్స్ అండ్ కమిట్మెంట్ థెరపీ’, ‘స పోర్టివ్ ఎక్స్‌ప్రెసివ్ థెరపీ’, ‘సైకో థెరపీ’, ‘ఫ్యామిలీ అండ్ కపుల్స్ థెరపీ’, ‘ట్రామా ఇన్ఫార్మ్డ్ థెరపీ’... వంటి అనేక థెరపీలు సైకో ఆంకాలజిస్ట్‌లు అందిస్తారు. ఎన్ని మందులు ఉన్నా వైద్యులు ఇచ్చే భరోసా వారిలో కొండంత బలాన్ని నింపుతుంది. క్యాన్సర్ మీద ఉన్న అనేక అ పోహల కారణంగా ఈ వ్యాధికి గురైన వారు తీవ్ర మానసిక వేదనతో పాటు చుట్టూ ఉన్న వారి జాలిచూపులు, చికిత్స సమయంలో నొప్పి, తమకేమవుతుందోనన్న ఆందోళన, డబ్బు కోసం కుటుంబ సభ్యులు పడే ఆరాటం.. వీటన్నింటితో సతమతం అవుతుంటారు. సైకో–ఆంకాలజిస్టులు వారితో మాట్లాడి బతుకు మీద ఆశ కలిగించేందుకు ప్రయత్నిస్తారు. -
క్యాన్సర్‌కు ఆన్సర్!
క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి స్థాయి నుంచి దీర్ఘకాలిక వ్యాధి స్థాయికి చేరుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అంతర్జాతీయ వైద్య నిపుణుల అంచనా. డయాబెటిస్, బీపీ మాదిరిగానే క్యాన్సర్‌తో కూడా దీర్ఘకాలిక మనుగడ సాగించవచ్చు.ఏఐ, రోబోటిక్ సర్జరీలు క్యాన్సర్ పని పడుతున్నాయి. టార్గెటెడ్ థెరపీ, నానో మెడిసిన్, ప్రోటాన్ బీమ్ థెరపీలు క్యాన్సర్ కణాలను గురి తప్పకుండా నిర్మూలిస్తున్నాయి. క్యాన్సర్ చికిత్సలో మరిన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి . వీటి ఫలితంగా క్యాన్సర్‌కు ఆన్సర్ దగ్గరలోనే ఉంది.ఇమ్యూనో థెరపీ మరింతగా అభివృద్ధి సాధిస్తుంది. రోగుల శారీరక స్థితిగతులకు అనుగుణంగా రూపొందించే ‘హైపర్ పర్సనల్’ ఔషధాలు, వ్యాక్సిన్లు క్యాన్సర్‌ను మరింత సమర్థంగా ియంత్రించగలుగుతాయి.క్యాన్సర్ నిర్ధారణను, చికిత్సను ఏఐ మరింతగా మెరుగుపరుస్తుంది. చికిత్సకు ముందే ఔషధాల దుష్ప్రభావాలను ఏఐ ఇప్పటికే గుర్తించగలుగుతోంది. దీనివల్ల అతి తక్కువ దుష్ప్రభావాలతో కూడిన ఔషధాలను ఇవ్వడం ద్వారా వ్యాధిని సమర్థంగా అదుపు చేయడం సాధ్యమవుతోంది. ఏఐ సాయంతో సమీప భవిష్యత్తులో అతి తక్కువ దుష్ప్రభావాలు గల ఔషధాల రూపకల్పన కోసం కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి.చాలా రకాల క్యాన్సర్లలో సర్వసాధారణంగా కనిపించే టెలోమెరేస్, సర్వినిన్, పీ53 ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకుని, వాటి ద్వారా వ్యాపించే క్యాన్సర్లను అరికట్టే వ్యాక్సిన్లను రూపొందించడానికి శాస్త్రవేత్తలు ప్రయోగాలు సాగిస్తున్నారు. ఇవి విజయవంతమైతే క్యాన్సర్‌కు దాదాపు ఆన్సర్ దొరికినట్లే!‘క్యాన్సర్‌కు ఆన్సర్ ఉండదు’ అనేది ఇదివరకటి మాట. ఇప్పుడది దాదాపు అపోహ. వైద్యశాస్త్రం శరవేగంగా సాధిస్తున్న అభివృద్ధి క్యాన్సర్ దూకుడుకు కళ్లేలు వేయగలుగుతోంది. పలు రకాల క్యాన్సర్లను సమూలంగా నయం చేయగలుగుతోంది. కొన్ని రకాల క్యాన్సర్లు సోకకుండా వ్యాక్సిన్లను తయారు చేయగలుగుతోంది. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షల్లోను, చికిత్స విధానాల్లోను వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు త్వరలోనే క్యాన్సర్‌కు ఆన్సర్‌గా ముందుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రాణాంతకమైన క్యాన్సర్లను పూర్తిగా అరికట్టగల రోజులు త్వరలోనే వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.క్యాన్సర్ అంటే ఒకప్పుడు ప్రాణాలపై ఆశలు వదిలేసుకునే రోజుల నుంచి క్యాన్సర్‌ను జయించడం ఏమంత కష్టం కాదనేంత వరకు శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందాయి. ఇటీవలి కాలంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరిగాక రకరకాల క్యాన్సర్లను ముందుగానే గుర్తించి, అరికట్టడం సాధ్యమవుతోంది. క్యాన్సర్ నిర్ధారణ కోసం ఒకప్పుడు తప్పనిసరిగా కోతపెట్టి, బయాప్సీ పరీక్షలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు కొన్ని క్యాన్సర్లకు కోతతో పనిలేకుండా, రక్తపరీక్ష ద్వారా జరిపే ‘లిక్విడ్ బయాప్సీ’, శ్వాస ద్వారా క్యాన్సర్ నిర్ధారణ చేయగల ‘బ్రీతలైజర్లు’ వాడుకలోకి వచ్చాయి.క్యాన్సర్ రోగులను యమయాతనకు గురిచేసే కీమో థెరపీ, రేడియో థెరపీ చికిత్స పద్ధతుల్లోనూ విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ‘ఇమ్యూనో థెరపీ’తో చాలామంది క్యాన్సర్ నుంచి విజయవంతంగా కోలుకోవడం సాధ్యం అవుతోంది. వైద్యరంగంలో జరుగుతున్న పరిశోధనల ఫలితంగా సమీప భవిష్యత్తులోనే కొన్ని రకాల క్యాన్సర్లను పూర్తిగా నివారించడం; ఇంకొన్ని రకాల క్యాన్సర్లను పూర్తిగా నయం చేయడం; మరికొన్ని రకాల క్యాన్సర్లను ప్రాణాంతకంగా మారకుండా నియంత్రించడం సాధ్యమవుతుందని అంతర్జాతీయ వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, చికిత్స పద్ధతుల్లో ఇటీవలి కాలంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులను తెలుసుకుందాం...లిక్విడ్ బయాప్సీ‘కోవిడ్–19’ తర్వాతి కాంలలో క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స పద్ధతుల్లో రోగులకు మేలు చేసే కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. వీటిలో ‘లిక్విడ్ బయాప్సీ’ ఒకటి. రక్త నమూనా ద్వారానే క్యాన్సర్‌ను ముందుగా నిర్ధారించే పరీక్ష ఇది. సేకరించిన రక్తనమూనాలోని డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, ప్రొటీన్లను విశ్లేషించి, రోగిలో వ్యాధి లక్షణాలు బయటపడటానికి ముందే క్యాన్సర్ గుర్తించేందుకు ‘లిక్విడ్ బయాప్సీ’ దోహదపడుతుంది. దీని వల్ల త్వరగా చికిత్సను ప్రారంభించి, ఎక్కువగా ఇబ్బంది లేకుండానే క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసేందుకు వీలవుతుంది. కోతపెట్టడం ద్వారా కణజాలం ముక్కను తీసుకునే చేసే బయాప్సీ పరీక్ష కంటే ఇది చాలా తక్కువ నొప్పితో కూడుకున్నది కావడమే కాకుండా, రోగనిర్ధారణలో సమర్థంగా ఉపయోగపడుతుంది.ఏఐ ఆధారిత పాథాలజీక్యాన్సర్ నిర్ధారణకు సీటీ, ఎంఆర్ఐ, పీఈటీ స్కానింగ్, మామోగ్రామ్, హిస్టోపాథాలజీ పరీక్షలు వంటివి చేస్తుంటారు. వీటిని విశ్లేషించి, చికిత్స చేయడం కొత్తేమీ కాదు. వీటి విశ్లేషణ కోసం ఇటీవలి కాలంలో ఏఐ వినియోగం మొదలైంది. ఏఐ వినియోగం వల్ల రకరకాల స్కానింగ్స్ వంటి ఇమేజింగ్ పద్ధతుల విశ్లేషణ చాలా సులభతరంగా మారింది. వ్యాధి నిర్ధారణలో కచ్చితత్వం గణనీయంగా మెరుగుపడింది. ఫలితంగా క్యాన్సర్లను త్వరితగతిన గుర్తించడానికి, తగిన చికిత్స అందించడానికి వీలవుతోంది. ఏఐ ఆధారిత ఇమేజింగ్ పద్ధతుల ద్వారా వైద్యులు మరిన్ని ప్రాణాలను కాపాడగలుగుతున్నారు.మల్టీ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ (ఎంసీఈడీ) పరీక్షలుఇవి కూడా ‘లిక్విడ్ బయాప్సీ’ మాదిరి పరీక్షలే! ఒకే రక్తనమూనాను పరీక్షించడం ద్వారా యాభైకి పైగా క్యాన్సర్లను ముందుగానే గుర్తించే విధానాన్ని ఇటీవలి కాలంలో వైద్య పరిశోధకులు అభివృద్ధి చేశారు. వీటివల్ల రోగులకు ముందుగానే చికిత్స ప్రారంభించి, ఎక్కువ ఇబ్బంది లేకుండానే వ్యాధిని నయం చేసే అవకాశాలు గణనీయంగా పెరిగాయి. ఈ పరీక్షల్లో రోగి నుంచి సేకరించిన రక్తనమూనాల ద్వారా డీఎన్ఏలో వచ్చే మార్పుల ఆధారంగా దాదాపు యాభైకి పైగా రకాల క్యాన్సర్లు సోకే అవకాశాలను గుర్తించడం సాధ్యమవుతోంది. క్యాన్సర్ నిర్ధారణలో ఇదొక విప్లవాత్మకమైన పరిణామం.జీనోమిక్ ప్రొఫైలింగ్– ప్రెసిషన్ ఆంకాలజీక్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు ఇటీవలి కాలంలో అధునాతనమైన మాలిక్యులర్, జీనోమిక్ ప్రొఫైలింగ్ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా జీవకణాల్లోని జన్యువుల్లో క్యాన్సర్‌కు దారితీసే ఉత్పరివర్తనలను ముందుగానే అత్యంత కచ్చితత్వంతో గుర్తించడం సాధ్యమవుతోంది. వీటి ఆధారంగా ఒక్కో రోగికి వారి వారి వ్యాధి పరిస్థితులను బట్టి ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ చికిత్సను అందించగలుగుతున్నారు. ‘ప్రెసిషన్ ఆంకాలజీ’ వల్ల క్యాన్సర్ రోగులను మృత్యువాత పడకుండా కాపాడగలుగుతున్నారు.డిజిటల్ బయో మార్కర్స్ఇటీవలి ఆవిష్కరణల ఫలితంగా క్యాన్సర్ రోగుల నుంచి సేకరించిన రక్తనమూనాలు, బయాప్సీ కోసం సేకరించిన కణజాలం నమూనాలు వంటి ‘బయో మార్కర్స్’ను హైరిజల్యూషన్ డిజిటల్ ఇమేజెస్‌గా మార్చడం వీలవుతోంది. డిజిటల్ బయో మార్కర్స్ ద్వారా క్యాన్సర్ రోగులకు తగిన చికిత్స అందించడానికి, వారి ప్రాణాలు కాపాడటానికి అవకాశాలు బాగా మెరుగుపడ్డాయి. డిజిటల్ బయో మార్కర్స్ ఇమేజెస్‌ను సుదూరంలో ఉన్న నిపుణులకు పంపి, వారి సలహా సంప్రదింపులు పొందడానికి, వారి సూచనల ఆధారంగా మెరుగైన చికిత్స అందించడానికి వీలవుతోంది. దీని వల్ల ఎక్కడి నుంచైనా అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలపై చికిత్స పొందడం సాధ్యమవుతోంది.క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలతో పాటు చికిత్సలోనూ పలు ఆశాజనమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన చికిత్స విధానాలు కొన్ని రకాల క్యాన్సర్లను నయం చేయడానికి, రోగుల జీవితకాలాన్ని పొడిగించడానికి దోహదపడుతున్నాయి. ఇదివరకు క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీ, రేడియోథెరపీ, శస్త్రచికిత్సలు మాత్రమే అందుబాటులో ఉండేవి. కొన్నేళ్లుగా ఇమ్యూనోథెరపీ కూడా విస్తృత వినియోగంలోకి వచ్చింది. ఇటీవలి కాలంలో మరిన్ని క్యాన్సర్ చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయి. వాటి గురించి తెలుసుకుందాం...సీఏఆర్–టీ సెల్ థెరపీలుకీమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా వంటి బ్లడ్ క్యాన్సర్లను అందుబాటులోకి వచ్చిన చికిత్స విధానం ‘కైమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్ టీ–సెల్ థెరపీ’ (సీఏఆర్–టీ సెల్ థెరపీ). ఇది కూడా ఇమ్యూనో థెరపీలో ఒక విధానం. అయితే, ఇది వ్యక్తిగత చికిత్స విధానం. ఈ విధానంలో రోగి శరీరంలో రోగనిరోధకతకు దోహదపడే ‘టీ–సెల్స్’కు జన్యుమార్పులు చేసి, రోగిలోని నిర్దిష్ట క్యాన్సర్ కణాలను ఎదుర్కొనేలా చేస్తారు. ఈ చికిత్స పొందుతూ రోగి సాధారణ జీవితం గడపడానికి వీలవుతుంది.టార్గెటెడ్ థెరపీకీమో థెరపీ, రేడియో థెరపీలలో క్యాన్సర్ కణాలతో పాటు క్యాన్సర్ సోకిన భాగాలకు చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతింటాయి. దీనివల్ల చికిత్స పొందే రోగులకు నొప్పులు, బాధలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితిని అరికట్టే ఉద్దేశంతోనే శాస్త్రవేత్తలు ‘టార్గెటెడ్ థెరపీ’ని అభివృద్ధి చేశారు. టార్గెటెడ్ థెరపీలో వాడే ఔషధాలు నేరుగా క్యాన్సర్ కణాల వ్యాప్తిని మాత్రమే నిరోధిస్తాయి. చుట్టుపక్కల ఉండే ఆరోగ్యకరమైన కణాలకు ఇవి హాని చేయవు. టార్గెటెడ్ థెరపీతో బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ సహా కొన్ని రకాల క్యాన్సర్లను విజయవంతంగా నయం చేయడం సాధ్యమవుతోంది.ప్రెసిషన్ రేడియేషన్ థెరపీరేడియేషన్ చికిత్సలో సాధారణంగా రేడియేషన్‌కు గురిచేసే క్యాన్సర్ కణాలతో పాటు చుట్టుపక్కల ఉండే ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతింటాయి. ప్రెసిషన్ రేడియేషన్ థెరపీలో రేడియేషన్ కిరణాలను కచ్చితంగా క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ప్రసరింపజేస్తారు. దీనివల్ల ఆరోగ్యకరమైన కణాలకు దాదాపుగా నష్టం జరగకుండా ఉంటుంది. ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ, ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ, స్టీరియో టాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ వంటి పద్ధతుల ద్వారా ప్రెసిషన్ రేడియేషన్ థెరపీలో కచ్చితత్వం గణనీయంగా పెరిగి, రోగి శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలకు హాని తగ్గుతోంది. ఫలితంగా రేడియేషన్ వల్ల కలిగే దుష్పరిణామాలు తగ్గి, రోగి కోలుకునే అవకాశాలు కూడా బాగా పెరుగుతున్నాయి.నానో మెడిసిన్క్యాన్సర్ రోగులకు సురక్షితమైన చికిత్సను అందించడంలో నానో మెడిసిన్స్ సత్ఫలితాలనిస్తున్నాయి. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన నానో మెడిసిన్స్‌ను మరింతగా అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. నానో మెడిసిన్స్‌లో 1–100 నానోమీటర్ల పరిమాణం గల ఔషధాలు నేరుగా క్యాన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకుని పనిచేస్తాయి. ఈ ఏడాది నానో మెడిసిన్ రంగం మరింతగా అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. నానో కీమోథెరపీ, నానో మెడిసిన్ బేస్డ్ ఇమ్యూనోథెరపీ, జీన్ థెరపీలో నానో సాంకేతికత వినియోగం మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.రోబోటిక్ క్యాన్సర్ సర్జరీక్యాన్సర్ కణితులను శస్త్రచికిత్స ద్వారా తొలగించడంలో రోబోటిక్ సర్జరీ అత్యంత కచ్చితత్వం సాధిస్తోంది. హైడెఫినిషన్ త్రీడీ కెమెరాల ద్వారా క్యాన్సర్ కణితులను గుర్తించి, తొలగించడంలో రోబో చేతులు మనుషులను మించిన నైపుణ్యంతో పని చేయగలుగుతున్నాయి. తక్కువ కోత లేదా చిన్న రంధ్రం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన కణజాలానికి నష్టం లేకుండా క్యాన్సర్ కణితులను తొలగించగలుగుతున్నాయి. దీనివల్ల రోగులకు తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావంతో శస్త్రచికిత్సలు చేయడం సాధ్యమవుతోంది. ప్రొస్టేట్, కిడ్నీ, లివర్, పేగులు, తల, మెడ, రొమ్ము, ఊపిరితిత్తులు, గర్భాశయం, అండాశయం తదితర భాగాల్లో ఏర్పడే క్యాన్సర్ కణితులను తొలగించడంలో రోబోటిక్ సర్జరీ సత్ఫలితాలను సాధిస్తోంది. ప్రోటాన్ బీమ్ థెరపీరేడియేషన్ చికిత్సలో అధునాతన పద్ధతి ప్రోటాన్ బీమ్ థెరపీ. సర్వసాధారణంగా రేడియేషన్ థెరపీలో క్యాన్సర్ సోకిన కణాలపైకి ఎక్స్–రే రేడియషన్ కిరణాలను ప్రసరింపజేస్తారు. దీనిని ఫోటాన్ థెరపీ అంటారు. ఈ కిరణాలు ఆరోగ్యకరమైన కణాలు ఉన్న శరీర భాగాల నుంచి దూసుకుపోతాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతింటాయి. ప్రోటాన్ బీమ్ థెరపీలో ప్రోటాన్ కిరణాలు అత్యంత కచ్చితంగా క్యాన్సర్ కణితి మీదకు ప్రసరించి, అక్కడ ఆగిపోతాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి హానీ జరగదు. ప్రోటాన్ థెరపీలో ప్రోటాన్ కిరణాల తీవ్రతను, లోతును నియంత్రించడానికి అవకాశం ఉండటం మరో సానుకూలత. దీని వల్ల ఆరోగ్యకరమైన కణాలకు నష్టం లేకుండా, విడతలు విడతలుగా క్యాన్సర్ కణితిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుంది. మెదడు, వెన్నెముక, కన్ను, ప్రొస్టేట్, రొమ్ము తదితర భాగాల్లో ఏర్పడే క్యాన్సర్ కణితులను తొలగించడానికి ప్రోటాన్ బీమ్ థెరపీ అద్భుతంగా పనిచేస్తుంది.మరిన్ని చికిత్స పద్ధతులుక్యాన్సర్ను నయం చేయడానికి, నియంత్రించడానికి మరిన్ని చికిత్స పద్ధతులపై కూడా వైద్య నిపుణులు విస్తృత పరిశోధనలు సాగిస్తున్నారు. వీటిలో ఇప్పటికే ‘ఆంకోలైటిక్ వైరస్ థెరపీ’, ‘ఎపిజెనెటిక్ థెరపీ’ వంటి పద్ధతులపై ప్రయోగాలు జరుపుతున్నారు. ‘ఆంకోలైటిక్ వైరస్ థెరపీ’లో జన్యుమార్పిడి చేసిన వైరస్‌ను రోగి శరీరంలోకి పంపడం ద్వారా క్యాన్సర్‌ను నిర్మూలిస్తారు. ఈ పద్ధతిని మెలనోమా వంటి చర్య క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ‘ఎపిజెనెటిక్ థెరపీ’లో క్యాన్సర్‌కు కారణమయ్యే ఉత్పరివర్తలను లోనైన జన్యువులను గుర్తించి, వాటి డీఎన్ఏను మార్చకుండానే, ఆ జన్యువుల్లో జరిగే ప్రమాదకర ఉత్పరివర్తనలను వెనక్కు మళ్లిస్తారు. లుకీమియా, లింఫోమా వంటి బ్లడ్ క్యాన్సర్ల చికిత్సల్లో ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు.భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్ససమీప భవిష్యత్తులోనే క్యాన్సర్ చికిత్సలో మరిన్ని మార్పులు చోటు చేసుకోనున్నట్లు అంతర్జాతీయ వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు చేపడుతున్న చికిత్స విధానాల్లో రోగులు అందరికీ ఒకే విధమైన ఔషధం అనే పద్ధతులను కొనసాగిస్తున్నారు. త్వరలోనే రోగుల వ్యక్తిగత శారీరక స్థితిగతుల ఆధారంగా ‘హైపర్ పర్సనలైజ్డ్’ ఔషధాలను ఏఐ సాయంతో రూపొందించి, ప్రయోగించే అవకాశాలపై ప్రయోగాలు జరుపుతున్నారు. క్యాన్సర్ చికిత్సలో పలు అధునాతనమైన ఔషధాలు, చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చినా, పలు రకాల క్యాన్సర్లను పూర్తిగా నయం చేయడం ఇంకా సాధ్యం కావడం లేదు. అందువల్ల క్యాన్సర్‌ను దీర్ఘకాలం నియంత్రించగల వ్యాధి స్థాయికి తీసుకొచ్చేలా అందుకు తగిన ఔషధాలను, చికిత్స విధానాలను రూపొందించడంలో వైద్య నిపుణులు ప్రయోగాలు చేస్తున్నారు. క్యాన్సర్‌ను పూర్తిగా నిర్మూలించ లేకపోయినా; డయాబెటిస్, బీపీ వంటి వ్యాధుల మాదిరిగానే దీర్ఘకాలం నియంత్రణలో పెట్టుకోగల స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. క్యాన్సర్‌ను ప్రాణాంతక వ్యాధిగా పరిగణించే పరిస్థితులు లేకుండా చేయవచ్చని చెబుతున్నారు.క్యాన్సర్ వ్యాక్సిన్లుపలు రకాల క్యాన్సర్లను నిరోధించడానికి వీలుగా ఇటీవలి కాలంలో ‘ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్లు’ అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యాక్సిన్లు క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటిని నిర్మూలించేలా రోగ నిరోధక వ్యవస్థను ఆయత్తం చేస్తాయి. నిర్దిష్ట క్యాన్సర్ ప్రొటీన్లకు అనుగుణంగా ఈ ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్లను రూపొందిస్తున్నారు. పర్సనలైజ్డ్ వ్యాక్సిన్లు. ఊపిరితిత్తుల క్యాన్సర్, మెలనోమా, పాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి పలు రకాల క్యాన్సర్లను నిరోధించడంలో ఈ వ్యాక్సిన్లు సత్ఫలితాలను సాధిస్తున్నాయి. -పన్యాల జగన్నాథదాసు -
చివరకు మిగిలేది! ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గుండెలు పగిలే స్టోరీ
ఆరోగ్యమే మహాభాగ్యము అను సామెత మన అందరికి తెలిసిందే. అయినా ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోం. ఆరోగ్యాన్ని మించిన సంపదలేదు..ఆరోగ్యమే ఐశ్వర్యం అన్న పెద్దల మాటను పెడిచెవిన పెట్టి మరీ సంపద వేటలో పరుగులు పెడుతూ ఉంటాం. న్యాయం, అన్యాయం,విలువలన్నీ పక్కన పెట్టేస్తాం. కానీ అనారోగ్యం చుట్టుముట్టినపుడు గానీ ఆరోగ్యం విలువ తెలిసిరాదు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఏ సిరిసంపదలూ వెనక్కి తీసుకు రాలేని అందనంత దూరం వెళ్లిపోతాం. ఏం పాపం చేశాననీ నాకీ అవస్థ అంటూ అంతులేని ఆవేదనలో కూరుకుపోతాం...అనారోగ్యంతో మరణమనే కత్తి అంచున వేలాడుతున్న వారి అవేదన ఇది. ఆ ఆవేదనలోంచే తోటి మనుషులకు నాలుగు మంచి ముక్కలు చెప్పాలనే ఆలోచన వస్తుంది. నాలాగా మీరు కాకండి, మీరైనా జాగరూకతతో మసలుకోండనే సందేశాన్నిస్తారు. అలాంటి వాటిలో ఒకటి మీరు చదవబోయే మరణ సందేశం...!ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్, రచయిత్రి "క్రిస్డా రోడ్రిగ్జ్" కేన్సర్‌తో బాధపడుతూ చనిపోయింది. బ్లాగర్ కూడా ఈమెను క్రిస్డా రోడ్రిగ్జ్, కిర్జాయ్డా రోడ్రిగ్జ్ అని కూడా పిలిచేవారు. 40 సంవత్సరాల వయసులో (2018, సెప్టెంబర్ 9న) కడుపు కేన్సర్‌తో ఆమె చనిపోయింది. అయితే చనిపోయే ముందు ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ తెలిపేలా ఒక వ్యాసం రాసింది. పది పాయింట్లతో ఆమె రాసిన ఈ వ్యాసం పలువుర్ని కదిలించింది. అనేకమందితో కంటతడి పెట్టించింది. డబ్బు, విలాసవంతమైన ఇల్లు, ఖరీదైన కార్లు అన్నీ ఉన్నాయి, కానీ అవేవీ తనను కాపాడలేకపోతున్నాయంటూ హృదయాలు మెలిపెట్టేలా కొన్ని జీవిత సత్యాలను తన వ్యాసంలో పేర్కొంది. ఎన్నో ఖరీదైన బట్టలున్నాయి. కానీ చివరికి ఆస్పత్రిలో బట్టలో తన దేహాన్ని చుడతారు. ఇదే జీవితం. ఈ జీవిత సత్యం చాలామందికి ఇంకా అర్థం కాలేదు. దయచేసి వినయంగా ఉండండి, ఇతరులతో దయగా ఉండండి. చేతనైంత సాయం చేయండి, నలుగురితో శభాష్ అనుపించుకోండి. ఎందుకంటేఅదే కడదాకా నిలిచేది. చివరకు మిగిలేది! అంటూ రాసుకొచ్చింది. వరల్డ్ కేన్సర్ డే సందర్భంగా ఆమె రాసిన పది పాయింట్లు నా గ్యారేజీలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఉంది, కానీ ఇప్పుడు నాకు వీల్‌చైరే ఆధారం.నా ఇంట్లో అన్ని రకాల బ్రాండెడ్ బట్టలు, ఖరీదైన బూట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు నా శరీరం ఆసుపత్రి అందించిన చిన్న గుడ్డలో చుట్టబడి ఉంది.నా దగ్గర బ్యాంకులో చాలా డబ్బు ఉంది. కానీ ఇప్పుడు ఆ డబ్బుతో ఇపుడేమీ లాభం లేదువిలాసవంతమైన కోట లాంటి భవనం ఉంది. కానీ ఇప్పుడు నేను ఆసుపత్రి బెడ్ మీద నిద్రపోతున్నాను. ఫైవ్ స్టార్ హోటల్లో ఉండేదాన్ని. మరి ఇప్పుడు ఒక క్లినిక్ నుండి మరొక క్లినిక్‌కు తిరుగుతూ ఆసుపత్రిలోనేను వందలాది మందికి ఆటోగ్రాఫ్‌లపై సంతకం చేసాను కానీ ఇపుడు, వైద్య రికార్డులే నా సంతకం.నా జుట్టును అందంగా తీర్చిదిద్దుకోడానికి ఏడు రకాల సె లూన్లకు వెళ్లేదాన్ని. కానీ ఇప్పుడు - నా తలపై ఒక్క వెంట్రుక కూడా లేదు.ప్రైవేట్ విమానంలో ఎపుడు కావాలంటే అపుడు, ఎక్కడికైనా ఎగరగలను, కానీ ఇప్పుడు నాకు ఆసుపత్రి గేటు వరకు నడవడానికి ఇద్దరు సహాయకులు అవసరం.చాలా ఆహారం ఉంది. కానీ రోజుకు రెండు మాత్రలు, సాయంత్రం కొన్ని చుక్కల ఉప్పు నీరు ఇపుడిదే నా ఆహారంఈ ఇల్లు, ఈ కారు, ఈ విమానం, ఈ ఫర్నిచర్, ఈ బ్యాంకు, మితిమీరిన కీర్తి ఇవేవీ నాకు అక్కరకు రావు. ఇవేవీ నన్ను శాంతింపజేయవు. ఈ ప్రపంచంలో "మరణం తప్ప నిజమైనది మరేదీ లేదు."అన్నింటికన్నా అతి ముఖ్యమైన విషయం ఆరోగ్యం. ఉన్నదాంతోనే సంతోషంగా ఉండండి. కడుపునిండా భోజనం, పడుకోవడానికి స్థలం ఇంతకంటే ఏం కావాలి ఆరోగ్యంగా ఉండండి అంటూ సందేశాన్నిచ్చింది. డెత్ బెడ్‌పై తన జీవిత దృక్పథాన్ని మార్చుకుంది. భౌతిక ఆస్తుల అశాశ్వతతను వెలుగులోకి తెచ్చింది. ఆరోగ్యం, ప్రాథమిక అవసరాలు ప్రేమ, సంతృప్తి, విశ్వాసం యొక్క అమూల్య మైన విలువను నొక్కి చెప్పింది. డొమినికన్ రిపబ్లిక్కు చెందిన ఆమె న్యూజెర్సీలో ఉండేది. ఫ్యాషన్, స్టైల్, ఫిట్నెస్, పాజిటివిటీ, వెల్నెస్, స్ఫూర్తి లాంటి విషయాలపై రోజువారీ పోస్ట్‌ల ద్వారా అభిమానులతో పంచుకునేది. రోడ్రిగ్జ్ తొలిసారి 2017 నవంబరులో స్టేజ్ 4 స్టమక్ కేన్సర్ సోకినట్టు ప్రకటించింది.ఈ పోరాటంలో కూడా రెగ్యులర్ విషయాలతోపాటు తన అనుభవాలనూ పంచుకునేది. ఇవీ చదవండి: ‘నేనూ.. మావారు’ : క్లాసిక్ కాంజీవరం చీరలో పీవీ సింధుకేరళ ర్యాగింగ్ : ‘నా మేనల్లుడే..’వ్యాపారవేత్త చెప్పిన భయంకర విషయాలు -
కేన్సర్‌ని జయించిన స్టార్లు వీరే..!
-
World Cancer Day 2025: కేన్సర్‌ని ముందే పసిగట్టేద్దాం ఇలా..!
కేన్సర్ ఉందని కనుగొనడమే క్యాన్సర్‌ను నయం చేసుకోవడం. ఒకప్పుడు దాదాపు 10 శాతం కేన్సర్లకే చికిత్స అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు 10 శాతం క్యాన్సర్లు మాత్రమే చికిత్సకు లొంగనివి అని చెప్పవచ్చు. మిగతా అన్ని కేన్సర్లనూ దాదాపు నయం చేయవచ్చు. కాకపోతే కేన్సర్‌ను వీలైనంత త్వరగా అంటే... దాని నాలుగు దశల్లో... మొదటి లేదా కనీసం రెండోదశలోనైనా కనుక్కోవాలి. అప్పుడే ‘కేన్సర్ ఉందని కనుగొనడమే... కేన్సర్‌ను నయం చేసుకోవడం’ అనే మాట వర్తిస్తుంది. అయితే కేన్సర్ అంటూ గుర్తించడానికి ప్రత్యేకంగా లక్షణాలుండకపోయినప్పటికీ... ఏయే లక్షణాలను బట్టి కేన్సర్‌ను అనుమానించవచ్చు? అలా ఆ కేన్సర్స్ను ముందుగానే గుర్తించడమెలా? మహిళలకూ, పురుషులకూ లేదా ఈ ఇద్దరిలోనూ వచ్చే సాధారణ కేన్సర్లేమిటి? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోడానికి ఉపయోగపడే ప్రత్యేక కథనమిది.కొన్ని కేన్సర్ లక్షణాలే... మామూలు ఇతర జబ్బుల్లోనూ కనిపిస్తాయి. ఉదాహరణకు బరువు తగ్గడం, దగ్గు లాంటి మామూలు లక్షణాలే కనిపించడం. మరి ముందే... అంటే ప్రారంభ దశల్లోనే కేన్సర్‌ను పసిగట్టడానికి స్క్రీనింగ్ పరీక్షలేమిటి,అవి ఎవరెవరికి ఎప్పుడు చేయించాలో చూద్దాం. మహిళలకే అవసరమైన స్క్రీనింగ్స్ పరీక్షలివి... సర్వికల్ కేన్సర్:... సర్వికల్ రూన్సర్కే ఉన్న ఓ ప్రత్యేకత ఏమిటంటే... ఇది వచ్చేందుకు కనీసం పదేళ్ల ముందుగానే రాబోతోందని గుర్తించవచ్చు. అంటే సుదీర్ఘమైన ప్రీ–కేన్సరస్ దశ దీనికి ఉంటుంది. అందుకే దీన్ని రాకముందే పసిగట్టవచ్చు. అందుకు చేయించుకోవాల్సిందల్లా పాప్ స్మియర్ అనే ఓ మామూలు పరీక్ష. ప్రతి మహిళా 25 ఏళ్లు దాటిన నాటి నుంచి ప్రతి మూడేళ్లకోసారి ఈ పరీక్ష చేయించుకుంటూ ఉండటమే సర్వైకల్ కేన్సర్‌కు స్క్రీనింగ్.రొమ్ము కేన్సర్:(నిజానికి రొమ్ము కేన్సర్ మహిళలతోపాటు పురుషులలోనూ కనిపించినప్పటికీ వారిలో కాస్త అరుదు) రొమ్ము క్యాన్సర్ విషయంలో వయస్సుకూ వ్యాధికీ సంబంధం ఉంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ వ్యాధి వచ్చే అవకాశాలు (రిస్క్) పెరుగుతుంటాయి.రొమ్ము క్యాన్సర్ రిస్క్ ఎవరెవరిలోనంటే... పిల్లలు లేనివాళ్లు ముప్ఫయి ఏళ్లు దాటాక మొదటి బిడ్డను కన్న మహిళలు తమ కుటుంబం ఈ వ్యాధి వచ్చిన వారున్నప్పుడు... పైన పేర్కొన్న వాళ్లంతా రొమ్ము క్యాన్సర్‌కు రిస్క్ గ్రూప్. ఈ రిస్క్ గ్రూపులు ప్రతి నిత్యం మూడు పరీక్షలు చేసుకుంటూ ఉండాలి. అవి... మొదటిది... ఎవరికి వారే చేసుకునే రొమ్ము పరీక్ష. ప్రతి మహిళా తమ రుతుక్రమం ముగిసిన వారం తర్వాత ఎడమరొమ్మును కుడిచేత్తో, కుడిరొమ్మును ఎడమచేత్తో తాకుతూ పరీక్ష చేసుకోవాలి. దాంతో రొమ్ములో ఏ చిన్నమార్పు వచ్చినా డాక్టర్ కంటే ముందే... తమకే తెలిసిపోతుంది. ఫలితంగా ముందస్తు లక్షణాలేమైనా కనిపిస్తుంటే త్వరగా కనిపెట్టగలరు. ఇతరత్రా కాస్తంత తేడా ఏమైనా ఉంటే దాన్ని డాక్టర్/గైనకాలజిస్ట్ దృష్టికి తీసుకెళ్తే అదేమైనా ప్రమాదకారా లేక మామూలు గడ్డా అన్నది చెబుతారు. రెండోది... మామోగ్రఫీ అనే మరో పరీక్షతోనూ రొమ్ము క్యాన్సర్‌ను తేలిగ్గా గుర్తించవచ్చు.ఇది ఎవరికి అవసరం అంటే... ముప్ఫయి ఏళ్లప్పుడు ఓసారి మామోగ్రామ్ చేయించాలి ఆ తర్వాత 35 ఏళ్లప్పుడు ఒకసారి, 40 ఏళ్ల వయసప్పుడు మరోసారి చేయించాలి. ఆ తర్వాత 40 ఏళ్ల నుండి 50వ ఏటి వరకూ ప్రతి రెండేళ్లకోసారి చొప్పున చేయిస్తుండటం మంచిది. ఇక 50 ఏళ్లు వచ్చాక ఏడాది కోమారు చేయించడం మంచిది మరీ ఎక్కువ రిస్క్ ఉన్నవారు తమ డాక్టర్ సలహా మేరకు ఇంకా త్వర త్వరగానే పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. ఇక మూడో రకానికి చెందిన ఈ పరీక్షలు... చాలా చాలా హై రిస్క్ గ్రూపువాళ్లకు... ఈ వ్యాధి వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ అని భావించిన మహిళలకు వాళ్ల డాక్టర్లు... బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 అనే జీన్ మ్యూటేషన్స్ తాలూకు జన్యుపరీక్షలు చేయిస్తుంటారు. తల నుంచి కాలివరకు తొలి దశలోనే గుర్తించేందుకు కొన్ని ప్రాథమిక లక్షణాలివి... తల భాగంలో... ఈ కేన్సర్స్ నోట్లో, దవడ, నాలుక మీద లేదా చిగుళ్లు (జింజివా) మీద ఎక్కడైనా రావచ్చు. ఎరుపు, తెలుపు రంగుల ప్యాచెస్ ఉన్నా, దీర్ఘకాలంగా మానని పుండు (సాధారణంగా నొప్పి లేని పుండు, కొన్ని సందర్భాల్లో నొప్పి ఉండవచ్చు కూడా) ఉంటే క్యాన్సర్ అయ్యేందుకు అవకాశం ఎక్కువ. కొన్నిసార్లు పుండ్లు కూడా ఉండవచ్చు. అదే నాలుక మీద అయితే నాలుక కదలికలు తగ్గవచ్చు. నాలుక వెనక భాగంలో అయితే స్వరంలో మార్పు. మరింత వెనకనయితే మింగడంలో ఇబ్బంది. ఇక స్వరపేటిక ప్రాంతంలో అయితే స్వరంలో మార్పు. మెడ దగ్గరి లింఫ్ గ్రంథుల వాపు.బ్రెయిన్ కేన్సర్‌లో... శరీరంలోని అన్ని భాగాలకు లాగే మెదడుకూ కేన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. తలనొప్పి, అకస్మాత్తుగా మతిమరపు రావడం, విషయాలు గుర్తుంచుకోకపోవడం, కొన్నిసార్లు సాంఘిక, సామాజిక సభ్యత మరచి ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మనిషి మెదడులో మాటకూ, చేతలకు, దృష్టికీ, వినికిడికీ, కాళ్లూ, చేతుల కదలికల నియంత్రణకు... ఇలా వేర్వేరు ప్రతిచర్యలకు వేర్వేరు కేంద్రాలు (సెంటర్స్) ఉంటాయన్న విషయం తెలిసిందే. మెదడులో... కేన్సర్ అభివృద్ధి చెందిన సెంటర్ ఏ అవయవానికి సంబంధించినదైతే ఆ అవయవం చచ్చుబడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.గొంతు భాగంలో... దీన్ని ఓరో ఫ్యారింజియల్ భాగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గొంతులో ఏదో ఉన్న అనుభూతి ఉంటుంది. అన్నవాహిక మొదటి భాగంలో అయితే మింగడంలో ఇబ్బంది. కడుపు (స్టమక్)లో... అదే కడుపు (స్టమక్)లో అయితే మంట పుడుతున్నట్లుగా ఉండే నొప్పి. పొట్టలో మంట. పొట్టలో రక్తస్రావం అవుతుంది కాబట్టి ఆ రక్తం వల్ల విసర్జన సమయంలో మలం నల్లగా కనిపిస్తుంది. రక్తస్రావం వల్ల రక్తహీనత (ఎనీమియా) కూడా కనిపించవచ్చు. దాంతోపాటు కొన్నిసార్లు కొంచెం తినగానే కడుపు నిండిపోయిన ఫీలింగ్. పేగుల్లో... మల మూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు రావడం జరుగుతుంది. రెక్టమ్ కేన్సర్‌లో... మలద్వారం (రెక్టమ్) క్యాన్సర్ విషయంలోనూ మల విసర్జన తర్వాత కూడా ఇంకా లోపల మలం మిగిలే ఉందన్న ఫీలింగ్ ఉంటుంది. దీనికో కారణం ఉంది. విసర్జించాల్సిన పదార్థం మామూలుగా మలద్వారం వద్దకు చేరగానే అక్కడి నాడులు స్పందించి అక్కడ మలం ఉన్నట్లుగా మెదడుకు సమాచారం చేరవేస్తాయి. దాంతో విసర్జించాల్సిందిగా మెదడు ఆదేశాలిస్తుంది. అయితే విసర్జన తర్వాత కూడా అక్కడ క్యాన్సర్ ఓ గడ్డలా ఉండటంతో ఏదో గడ్డ మిగిలే ఉందన్న సమాచారాన్ని నాడులు మెదడుకు చేరవేస్తాయి. దాంతో ఇంకా ఏదో అక్కడ మిగిలి ఉందన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. దాంతోపాటు బంక విరేచనాలు, రక్తంతోపాటు బంక పడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఊపిరితిత్తుల్లో... ఊపిరితిత్తుల కేన్సర్ విషయంలో పొగతాగేవారికి అది వచ్చేందుకు అవకాశం ఎక్కువ. ఈ కేన్సర్ ఉన్నవాళ్లలో దగ్గు, కళ్లెలో రక్తం పడటం వంటì లక్షణాలు కనిపిస్తాయి. ఎక్స్–రే, సీటీస్కాన్ పరీక్ష ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. ఒవేరియన్ కేన్సర్‌లో... దాదాపు 50, 60 ఏళ్ల మహిళల్లో పొట్ట కిందిభాగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఈ భాగానికి కేన్సర్ వస్తే ఏ లక్షణాలూ చూపించకుండానే ప్రమాదకరమైన పరిస్థితులకు తీసుకెళ్తుంది కాబట్టి దీన్ని ‘సైలెంట్ కిల్లర్’గానూ అభివర్ణిస్తుంటారు. టెస్టిస్ కేన్సర్‌లో... పురుషుల్లో వచ్చే ఈ కేన్సర్‌లో వృషణాల సైజ్ పెరగడం, దాన్ని హైడ్రోసిల్‌గా పొరబాటు పడి పెద్దగా సీరియస్‌గా తీసుకోక΄ోవడంతో అది సైజ్‌లో పెరిగి ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలు ఎక్కువ. కిడ్నీ అండ్ బ్లాడర్ కేన్సర్స్‌లో... మూత్ర విసర్జన సమయంలో రక్తం కనిపించడం, మాటిమాటికీ మూత్రం రావడం మూత్రపిండాలు, మూత్రాశయ కేన్సర్లలో కనిపించే సాధారణ లక్షణం. బ్లడ్ కేన్సర్‌లో... రక్తం కూడా ద్రవరూపంలో ఉండే కణజాలమే కాబట్టి... బ్లడ్ కేన్సర్ కూడా రావచ్చు. రక్తహీనత, చర్మం మీద డ, చిగుళ్లలోంచి రక్తం రావడం, బరువు తగ్గడం, జ్వరం రావడం వంటివి బ్లడ్‌కేన్సర్ లక్షణాలు. లింఫ్ గ్లాండ్స్ అన్నవి బాహుమూలాల్లో, దవడల కిందిభాగంలో మెడకు ఇరువైపులా, గజ్జల్లో ఉండే ఈ గ్రంథులకూ క్యాన్సర్ రావచ్చు. దాన్ని లింఫోమా అంటారు. చర్మం కేన్సర్‌లో... చర్మం కేన్సర్‌ను ఏ, బీ, సీ, డీ అనే నాలుగు లక్షణాలతో తేలిగ్గా గుర్తించవచ్చు. శరీరంపై ఏదైనా మచ్చ తాలూకు ఏ– అంటే... ఎసిమెట్రీ (అంటే మచ్చ సౌష్టవం మొదటికంటే మార్పు వచ్చినా, బీ– అంటే... బార్డర్ అంటే అంచులు మారడం, మందంగా మారడం జరిగినా, సీ– అంటే కలర్ రంగు మారినా, దాన్ని చర్మం కేన్సర్ లక్షణాలుగా భావించవచ్చు.హెడ్ అండ్ నెక్ కేన్సర్స్ స్క్రీనింగ్ కోసం... మన దక్షిణ భారతదేశంలోని పురుషుల్లో కోలోరెక్టల్ కేన్సర్ తర్వాత చాలా ఎక్కువగా కనిపించేవి హెడ్, నెక్ కేన్సర్లే. పురుషుల్లో పొగాకు, ఆల్కహాల్ అలవాట్లు చాలామందిలో ఉంటాయి కాబట్టి ఈ క్యాన్సర్లు మగవారిలోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి.ఒకసారి హెడ్ అండ్ నెక్ రూన్సర్ వచ్చిన వారు ఏడాదికోసారి డాక్టర్‌ను కలిసి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ఒకసారి వచ్చి తగ్గినవాళ్లు ఆ మొదటి ఏడాదిలో ప్రతి మూడు నెలలకొకసారి, ఆ తర్వాత నాలుగేళ్ల వరకు ప్రతి ఆర్నెల్లకు ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి. హెడ్ అండ్ నెక్ స్క్రీనింగ్ కోసం పరీక్షల్లో కొన్ని: సాధారణంగా తలకు చేసే ఎమ్మారై, సీటీలతో పాటు కొన్ని రక్తపరీక్షలు, పనోరమిక్ డెంటల్ ఎక్స్–రే, డెంటల్ కోన్ బీమ్ సీటీ, అవసరాన్ని బట్టి పెట్/సీటీ పరీక్షలతోపాటు ఎండోస్కోపీ, బయాప్సీ (తలలో అనుమానం ఉన్నచోటి నుంచి చిన్న ముక్క తీసి పరీక్షించడం). ఊపిరితిత్తుల కేన్సర్... ఇది ముఖ్యంగా మనదేశంలోని పురుషుల్లో చాలా ఎక్కువ. ఇక సిగరెట్ / బీడీ/ చుట్ట / ఇతరత్రా పొగ తాగే అలవాటు ఉన్నవాళ్లలో మరీ ఎక్కువ. తమ పొగతాగే అలవాటునే ఈ క్యాన్సర్‌కు హైరిస్క్‌గా పరిగణించాలి. ఈ అలవాటున్నవాళ్లు తమలో ఎలాంటి అసౌకర్యంగాని, దగ్గు వంటి లక్షణాలుగాని కనిపిస్తే తక్షణం పరీక్షలు చేయించుకోవాలి. సాధారణ చెస్ట్ ఎక్స్–రే, స్ఫూటమ్ సైటాలజీ పరీక్షతోపాటు హై రెజల్యూషన్ సీటీ స్కాన్ ద్వారా దీన్ని కనుగొంటారు. స్టమక్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం... ఈ కింద పేర్కొన్న గ్రూపులు స్టమక్ క్యాన్సర్ రావడానికి మరింత ఎక్కువ ముప్పు కలిగి ఉంటారు. ఈ హైరిస్క్ వర్గాలవారు ఎవరంటే... ‘పర్నీసీయస్ ఎనిమియా’ అనే ఒక తరహా రక్తహీనతతో బాధపడుతూ, కాస్తంత వయసు పైబడ్డవారు. గతంలో అల్సర్‌కు ఆపరేషన్ (గ్యాస్ట్రెక్టమీ) చేయించుకున్నవారు. ‘ఫెమీలియల్ అడెనోమేటస్ పాలింపోసిస్’ తరహా పాలిప్స్ (కండ పెరిగిన) వాళ్లు హెలికోబాక్టర్ పైలోరీ (హెచ్ పైలోరీ) అనే సూక్ష్మజీవి వల్ల ఇన్ఫెక్షన్ వచ్చినవాళ్లు... అవసరమైన స్క్రీనింగ్ పరీక్ష : పైన పేర్కొన్నవాళ్లంతా కడుపులో కేన్సర్ కనుక్కోవడానికి తరచూ ‘డబుల్ కాంట్రాస్ట్ బేరియం’ పరీక్ష, ఎండోస్కోపీ చేయించుకుంటూ ఉండాలి. పై రిస్క్ గ్రూపులతో పాటు ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకునేవాళ్లు, పొగతాగే అలవాటున్నవాళ్లూ, ఆహారంలో విటమిన్ ఏ, విటమిన్ సీ తక్కువగా తీసుకునేవారితో పాటు రబ్బరు పరిశ్రమల్లో, బొగ్గుపని చేసేవాళ్లు ఎక్కువగా తరచూ ఈ పరీక్షలు చేయించుకోవడం మంచిది. కేన్సర్లను గుర్తించేందుకు కొన్ని సాధారణ లక్షణాలు ... కారణం తెలియకుండానే అకస్మాత్తుగా బాగా బరువు తగ్గడం ఆకలి తగ్గడం ఎడతెరిపి లేకుండా దగ్గు లింఫ్ గ్లాండ్స్ (బాహుమూలాల్లో, గజ్జల్లో, గొంతుదగ్గర) వాపు ∙ఆయా అవయవాల్లోంచి రక్తస్రావం... ఇవి సాధారణంగా కనిపించే లక్షణాలు. అయితే ఈ లక్షణాలన్నీ చాలామందిలో సాధారణ సమస్యలకూ కనిపిస్తాయి కాబట్టి ఇవి కనిపించగానే అది క్యాన్సరేనేమో అంటూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాక΄ోతే స్క్రీనింగ్ పరీక్షలను చేయించుకుని, అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకున్న తర్వాత నిశ్చింతగా ఉండవచ్చు. -
క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే మద్యం
ఒక నూతన ఆరోగ్య హెచ్చరికతో ఈ నూతన సంవత్సరం మొదలైంది. మద్యం సేవించడం, క్యాన్సర్ ప్రమాదం పెరగడం మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందంటూ అమె రికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి ఒక ప్రకటనను విడుదల చేశారు. అమెరికాలో క్యాన్సర్‌ను ప్రేరేపించగల మూడో ప్రధాన కారణం ఆల్కహాల్ వినియోగం. ఏ రకమైన ఆల్కహాల్ తీసుకున్నా, అది కనీసం ఏడు రకాల క్యాన్సర్లు (రొమ్ము, పెద్దపేగు, అన్నవాహిక, కాలేయం, నోటి కుహరం, గొంతు, స్వరపేటిక) వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని ఆ ప్రకటన తెలిపింది. అమెరికాలో 16.4 శాతం రొమ్ము క్యాన్సర్ కేసులు ఆల్కహాల్ వినియోగం వల్లే సంభవిస్తున్నాయి. రొమ్ము, నోరు,గొంతు వంటి కొన్ని క్యాన్సర్ల విషయంలో, ‘రోజుకు ఒకటి లేదా అంతకంటే తక్కువసార్లు మద్యం సేవించడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరగవచ్చు’ అని సలహాదారు హెచ్చరిస్తున్నారు. తక్కువ మొత్తంలో మద్యం సేవించడం కూడా కాలేయ మచ్చలు (లివర్ సిర్రోసిస్) వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దోహదం చేస్తుంది. అయితే, మద్యం సేవించడం వల్ల ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం అనేక జీవ, పర్యావరణ, సామాజిక అంశాలపై ఆధారపడి ఉంటుంది.ఎంత తక్కువైనా రిస్కే!శాస్త్రీయ ఆధారాలకు సంబంధించిన క్రమబద్ధమైన మూల్యాంకనం ఆధారంగా, మద్యం సేవించడం వల్ల కలిగే ప్రమాదాలు, హానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) 2023 ప్రకటనను అనుసరించి ఈ సలహా ఇవ్వడమైంది. మద్యం నేరుగా ప్రమాద కరమైన వ్యాధిని కలిగిస్తుంది. మద్యం గణనీయంగా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుంది. ‘ద లాన్సెట్ పబ్లిక్ హెల్త్’లో ప్రచురితమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన, ‘మద్యం వినియోగం విషయానికి వస్తే, ఆరోగ్యాన్ని ప్రభావితం చేయనంతటి తక్కువ మోతాదు అనేది లేనే లేదు’ అని పేర్కొంది.‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్’ సంస్థ, ఆల్కహాల్‌ను ‘గ్రూప్ 1 కార్సినోజెన్’గా 1980లలో వర్గీకరించింది. ఇది పొగాకు, రేడియేషన్, ఆస్బెస్టాస్ వంటి క్యాన్సర్ కలిగించే పదా ర్థాలలో అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ. ఇథనాల్ శరీరంలో ఇంకిపోవడం వల్ల జీవసంబంధమైన విధానాలు క్యాన్సర్‌కు కారణమవుతాయి. అందువల్ల, ఆల్కహాల్ కలిగిన ఏ పానీయం... అది బీర్, వైన్ లేదా విస్కీ ఏదయినా ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఏ రకమైనా హానికరమే!కొన్ని ఆల్కహాల్ పానీయాలను, ముఖ్యంగా రెడ్ వైన్‌ను మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే అపోహను ఈ ఆధారాలు బద్దలు కొడుతున్నాయి. దశాబ్దాలుగా, మద్య పరిశ్రమ కార్డియాలజిస్టులను ప్రోత్సహించి, మితంగా వైన్ తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మంచిదనే భావనను ప్రచారం చేస్తోంది.అలాంటి వాదనలకు ఎటువంటి విశ్వసనీయ శాస్త్రీయ అధ్యయ నమూ లేదని గ్రహించాలి. మరోవైపు, డబ్ల్యూహెచ్ఓ యూరోపియన్ ప్రాంతం నుండి వచ్చిన డేటా ప్రకారం, ఆల్కహాల్ వల్ల వచ్చే క్యాన్సర్లలో సగం వరకు, సాధారణంగా వారానికి ఒక బాటిల్ వైన్ లేదా రెండు బాటిళ్ల బీర్ వంటి ‘తేలికపాటి’, ‘మితమైన’ వినియోగం వల్ల సంభవిస్తు న్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, గుండె జబ్బులు లేదా మధుమేహంపై తేలికపాటి, మితమైన మద్యపానం వల్ల కలిగే ప్రయోజనకరమైన ప్రభావాలను గురించి తెలిపే అధ్యయనాలు లేవు.‘మీరు ఎంత ఎక్కువ తాగితే అంత హానికరం అని మేము కచ్చితంగా చెప్పగలం. మరో మాటలో చెప్పాలంటే, మీరు ఎంత తక్కువ తాగితే అంత సురక్షితం’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థలోని ఆల్కహాల్, అక్రమ మాదకద్రవ్యాల నిపుణురాలు కరీనా ఫెర్రీరా –బోర్జెస్ అన్నారు.హెచ్చరికలు మేలు చేస్తాయా?ఒక వస్తువు వల్ల ప్రభుత్వాలకు గణనీయమైన ఆదాయం వస్తుందని శాస్త్రీయ ఆధారాలు ఉన్నప్పుడు, ఆ వస్తువు ద్వారా కలిగే హానిని తగ్గించడానికి ఉన్న ఎంపికలు ఏమిటి? డబ్ల్యూహెచ్ఓ చేసిన ఆల్కహాల్ ప్రకటన అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాలను ఎత్తిపడుతోంది. అలాగే అందుబాటులో ఉన్న విధాన ఎంపికలను కూడా ప్రభుత్వాలకు అందిస్తోంది. ప్రభుత్వాలు వాటిపై చర్య తీసుకో వలసి ఉంటుంది. మద్యం వినియోగాన్ని తగ్గించడానికి అత్యంత స్పష్టమైన మార్గాలలో ఒకటి ఏమిటంటే, మద్యం సీసాలపై హెచ్చరిక లేబుళ్ల ద్వారా, కలగనున్న హాని గురించి జనానికి అవగా హన కల్పించడం. అమెరికా, కొన్ని యూరోపియన్ దేశాలు ఏమి చేయాలని వివేక్ మూర్తి సూచించిన చర్యలలో ఇది ఒకటి. క్యాన్సర్ ప్రమాదాన్ని లెక్కించడానికి మద్యం వినియోగంపై మార్గ దర్శకాల పరిమితులను తిరిగి నిర్వచించాలని కూడా మూర్తి పిలుపునిచ్చారు.వివిధ దేశాలు పరిశీలిస్తున్న హెచ్చరిక లేబుల్స్ అనేక రకాలుగా ఉన్నాయి. ఆరోగ్యానికి సాధారణ హాని; అధిక వినియోగం, దుర్వి నియోగం వల్ల కలిగే హాని; నిర్దిష్ట సమూహాలకు అంటే తక్కువ వయస్సు గలవారు, గర్భిణులు మొదలైన వారికి వ్యతిరేకంగా సందేశాలు వీటిలో కొన్ని. ఉదాహరణకు, 2026లో ఐర్లాండ్ ప్రవేశ పెట్టాలని భావిస్తున్న హెచ్చరికలో, ‘మద్యం తాగడం వల్ల కాలేయ క్యాన్సర్ వస్తుంది’ అని ఉంది. 2019లో, భారతదేశం హార్డ్ లిక్కర్‌కు ‘మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం’ అనీ, తక్కువ ఆల్క హాల్ పానీయాలకు ‘సురక్షితంగా ఉండండి, తాగి వాహనం నడపవద్దు’ అని చెప్పే సాధారణ హెచ్చరికలను తప్పనిసరి చేసింది.ఇండియా ఇంకా చేయాల్సిందేమిటి?భారతదేశంలో హెచ్చరిక లేబుళ్లతో పాటు, ఆల్కహాల్ మార్కెటింగ్‌పై పరిమితులు కూడా అమలులో ఉన్నాయి. వార్తా పత్రికలు, రేడియో, టీవీల్లో ఆల్కహాల్ ప్రకటనలను నిషేధించారు. అయితే ప్రకటనల నిబంధనలలోని లొసుగులను వాడుకుంటూ వాటిపై ప్రకటనలు మరో రూపంలో కొనసాగుతున్నాయి. ఇటీవలి సంవత్సరాలలో, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రహస్య ప్రకటనలు కొత్త సవాళ్లను కలిగిస్తున్నాయి.పొగాకు లేబుళ్లపై హెచ్చరికల మాదిరిగానే, మద్య పరిశ్రమ, పరిశ్రమ అనుకూల సమూహాలు ఆరోగ్య హెచ్చరిక లేబుళ్లు మద్య వినియోగాన్ని తగ్గించడంలో పెద్దగా ఉపయోగపడవని వాదిస్తు న్నాయి. కానీ, ‘ద లాన్సెట్’లో ప్రచురితమైన ఇటీవలి సమీక్షలో నివేదించినట్లుగా, మద్య ఉత్పత్తులపై హెచ్చరిక లేబుళ్లు అనేక విధాలుగా ఉపయోగకరంగా ఉన్నాయని ఆధారాలు ఎత్తి చూపు తున్నాయి. అవి మద్య సంబంధిత హానిపై అవగాహన పెంచు తాయి, మద్యం వాడకాన్ని సాధారణీకరించకుండా దోహదం చేస్తాయి. పైగా ప్రజలు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయ పడతాయి. తద్వారా ప్రజారోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. హెల్త్ లేబుల్స్ ప్రభావం వాటి రూపకల్పనపై, కంటెంట్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే, ఆరోగ్య హెచ్చరిక లేబుల్స్‌కు ప్రామాణీకరణ లేదు. అంతేకాకుండా వాటి కంటెంట్ చాలా సాధారణమైనది. ఇది వినియో గదారులు ఒక అవగాహనకు రావడానికి ఉపయోగపడకపోవచ్చు.దాదాపు ఐదేళ్లుగా భారతదేశం మద్యం ఉత్పత్తులకు సంబంధించిన హెచ్చరిక లేబుళ్లపై నిబంధనలను అమలు చేస్తోంది. ఇది ఎంత ప్రభావవంతంగా ఉందో మనకు ఇంకా తెలియదు. హెచ్చరిక సందే శాల రూపకల్పన, కంటెంట్, వాటిపై వినియోగదారుల అభిప్రా యానికి సంబంధించి మనకు నిరంతర పరిశోధన అవసరం. పొగాకు ఉత్పత్తుల్లో ఆరోగ్య హెచ్చరికలు ప్యాకేజింగ్‌లో మంచి జాగాతో వివర ణాత్మకంగా ఉంటాయి. దీనికి భిన్నంగా మద్యం సీసాలపై హెచ్చరికలు చిన్న స్థలాన్ని ఆక్రమిస్తాయి, అస్పష్టంగా ఉంటాయి. ఆరోగ్య హెచ్చరికలతో పాటు, హైవేలపై మద్యం అమ్మకాల నియంత్రణ, తక్కువ వయస్సు గల వినియోగదారులకు అమ్మకాలను అరికట్టడం, తాగి వాహనం నడపడం వంటి అదనపు చర్యలను మరింత కఠినంగా అమలు చేయాలి.భారతదేశంలో ఆరోగ్య సంబంధమైన, ఇతర నిబంధనలను నిలిపివేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న పరిశ్రమ లాబీల నుండి జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. మద్యం వల్ల కలిగే ఆరోగ్య సంరక్షణ పెను భారాన్ని తగ్గించడానికి వివేక్ మూర్తి వంటి మరింత మంది ప్రజారోగ్య ఛాంపియన్లు అవసరం. క్యాన్సర్‌కీ పొగాకుకీ ఉన్న సంబంధంపై మొదటి హెచ్చరిక కూడా 1964లో ఒక సర్జన్ జనరల్ నుండే వచ్చిందని గుర్తుంచుకోండి.దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
World Cancer Day: గట్ బయోమ్లాగే... క్యాన్సర్ బయోమ్ ట్యూమరమ్మతు
మానవుల జీర్ణవ్యవస్థ (గట్) లో ప్రతి చదరపు సెంటీమీటరుకు కోటానుకోట్ల సూక్ష్మజీవులు నివసిస్తుంటాయి. మనిషి దేహం మొత్తంలో 30 ట్రిలియన్ కణాలుంటాయని అంచనా వేస్తే గట్‌లో నివాసముండే సూక్ష్మజీవుల సంఖ్య 38 ట్రిలియన్లు! ఈ సూక్ష్మజీవుల సముదాయాన్ని డాక్టర్లు ‘మైక్రోబియమ్’ గా చెబుతుంటారు. ఈ సూక్ష్మ జీవజాలపు సమతౌల్యతే మనిషి ఆరోగ్యాన్ని కాపాడుతుంటుంది. మంచి జీర్ణక్రియకు దోహదపడుతుంటుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) సమర్థంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. మానవుల మూడ్స్‌ను సైతం ఈ మైక్రోబయోమ్ ప్రభావితం చేస్తుంది. అలాంటి సూక్ష్మజీవుల సముదాయమే క్యాన్సర్ గడ్డ (ట్యూమర్)లోనూ ఉంటుందని తెలుసుకున్నారు పరిశోధకులు. గట్‌లో ఉండేవి ‘గట్ బయోమ్’ అయితే ట్యూమర్లో ఉండేవి ‘ట్యూమర్ బయోమ్’!! ట్యూమర్ పెరుగుదలనూ, చికిత్స సమయంలో ట్యూమర్ ప్రతిస్పందించే తీరునూ ఈ ‘ట్యూమర్ బయోమ్’ ప్రభావితం చేస్తుంది. నేడు (ఫిబ్రవరి 4న) ‘వరల్డ్ క్యాన్సర్ డే’ సందర్భంగా చికిత్సతో పాటు అనేక అంశాలను ప్రభావితం చేసే ఈ ‘ట్యూమర్ సూక్ష్మక్రిముల’ గురించి తెలుసుకుందాం.ఆరోగ్య స్పృహ ఉన్న వర్గాల్లో గట్ బయోమ్ గురించి బాగానే తెలుసు. కానీ అదే తరహాలో క్యాన్సర్ గడ్డలోనూ సూక్ష్మజీవుల సముదాయాలుంటాయన్న విషయం చాలామందికి పెద్దగా తెలియకపోయినప్పటికీ ఇది వాస్తవం. నిజానికి ఈ ‘బయోమ్’ ఎంత ప్రభావశీలమైనదంటే... క్యాన్సర్ కణం ఎలా ప్రవర్తించాలన్న అంశాన్నీ ఇది ప్రభావితం చేస్తుంది. ట్యూమర్ ఇన్ఫ్లమేషన్ను ఇది పెంచనూవచ్చు, తగ్గించనూవచ్చు.జెనెటిక్స్‌తో మరింత తోడ్పాటు... ట్యూమర్ మైక్రోబయోమ్ సహాయంతో క్యాన్సర్ చికిత్సలను మరింత ప్రభావవంతంగా అందించడానికి జెనెటిక్స్ (జన్యుశాస్త్రం) మంచి తోడ్పాటును అందిస్తుంది. జన్యుశాస్త్ర సహాయంతో ట్యూమర్‌లోని మైక్రోబయోమ్ మనకు అనుకూలంగా పనిచేస్తోందా లేక ప్రతికూలంగా ఉందా, దాని బట్టి ఎలాంటి చికిత్స అందిస్తే మంచి ఫలితాలొస్తాయి వంటి అంశాలను అధ్యయనం చేస్తూ, మైక్రోబయోమ్నూ జెనెటిక్ ప్రోఫైలింగ్నూ సమన్వయం చేసుకోవడం వల్ల మరింత ప్రభావవంతమైన చికిత్సను అందించవచ్చు. ఇలా చేయడం వల్ల వచ్చే ఫలితాలూ అద్భుతంగా ఉంటాయి. అక్కడి సూక్ష్మజీవుల జన్యుపటలాల అధ్యయన విశ్లేషణలతో అవెలా మనుగడ సాగిస్తున్నాయీ, వాటిని ఎదుర్కొనేలా బాధితులకు సరిగ్గా సరిపడేలా వ్యక్తిగతమైన మందుల రూపకల్పన ఎలా అన్న విషయాలను తెలుసుకోవచ్చు. దాంతో క్యాన్సర్ చికిత్సలను మరింత సమర్థంగా జరిగేలా చూడవచ్చు. ఫలితంగా బాధితుల్లో వ్యాధిని పూర్తిగా నయం చేయడానికీ, వారు కోలుకుని మంచి నాణ్యమైన జీవితాన్ని అనుభవించడానికీ ఈ అధ్యయనాలు తోడ్పడతాయి.జీవక్రియలు ఓ సింఫనీ అనుకుంటే... జీవనశైలీ, ఆహారాలతో ప్రయోజనాలివి... మానవ జీవితంలోని జీవక్రియలను ఓ సింఫనీతో పోల్చవచ్చు. సింఫనీ అంటే అనేక మంది గాయకులు ఒకే స్వరంతో స్వరం కలిపి ఒకే లయలో పాడటం. అప్పుడు ఓ అద్భుత సంగీతం (మెలొడీ) ఆవిష్కృతమవుతుంది. ఇందులో కణాలన్నీ మంచి గాయకులనుకుంటే మంచి మైక్రోబియమంతా లయాత్మకంగా వాద్యాలను వాయించే అద్భుత సంగీతకారులు (మ్యూజీషియన్స్). అప్పుడు వినిపించేదంతా హాయినిగొలిపే ‘ఆరోగ్య’కరమైన సంగీతం. ఈ హెల్దీ సంగీత లహరి అలా హాయిగా సాగిపోతుండగా మనం తీసుకునే అనారోగ్యకరమైన, పోషకరహితమైన ఆహారం కారణంగా వినిపించే కొన్ని అనారోగ్యల అపస్వరాల ఆలాపాల వల్ల కలిగే అనర్థాలు! ఇక ఈ పోలికలో ట్యూమర్ అనేది చక్కగా సాగే సింఫనీని చెడగొట్టేలా అన్నీ అపస్వరాలతో గట్టిగా గానాన్ని వినిపించే సోలో గాయకుడూ, అలాగే ‘ట్యూమర్’లోనూ ఉన్న మైక్రో బయోమ్ కూడా వినిపించే అందరూ సమన్వయంతో పాడుతుండగా వినిపించే ఈ అపస్వరాల అనారోగ్యం కర్ణ కఠోరంగా వినిపించే ‘రుగ్మత’.ఇలాంటి సమయాల్లో మనం తీసుకునే పోషకాలతో కూడిన మంచి ఆహారంలోని ఫైబర్ పుష్కలంగా ఉండే న్యూట్రిషన్, ప్రొబయాటిక్స్, యాంటీ ఆక్సిడెంట్లూ ఇవన్నీ ఆ అపస్వరాలను అధిగమిస్తూ, వాటిని కప్పేస్తూ గట్టిగా వినిపించే సుస్వరాలు. అనుసరించే అద్భుతారోగ్యకరమైన జీవనశైలి (లైఫ్‌స్టైల్) కూడా అదనంగా వినిపిస్తుండే ఆర్కెస్ట్రైజేషన్! ఇలా చేస్తున్నప్పుడు సమన్వయంతో సాగే సింఫనీలో పూర్తిగా అపస్వరాలే పైచేయి సాధించకుండా కనీసం వాటిని కప్పేస్తూ తప్పులను దొర్లనివ్వకుండా, దొరకనివ్వకుండా చేసే ‘కోకఫోనీ’! అంటే... ఈ పోలికను క్యాన్సర్ జబ్బుతో అన్వయించినప్పుడు... మంచి చికిత్స, మంచి ఆహారం, మంచి లైఫ్‌స్టైల్‌తో జబ్బు మరింత పెరగదు. అనర్థాలు కనిపించవు. అపస్వరాలను డామినేట్ చేసేలా చికిత్స, ఆహారనియమాలూ, జీవనశైలి సాగితే క్రమంగా అపస్వరాలే వినిపించనివ్వకుండా చేసేలా మనకు మేలు చేసే మంచి మైక్రోబియమ్ పెరుగుతుంది. ఆ చెడు మైక్రోబియమ్ను అది డామినేట్ చేసి మరీ చికిత్సతో క్యాన్సర్ నయం చేయడానికి సహాయపడుతుందని ఈ పోలిక చెబుతోంది. ఈ ఏడాది థీమ్ ‘యునైటెడ్ బై యునీక్’ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా వచ్చే రెండేళ్ల పాటు (అంటే 2025 నుంచి 2027 వరకు) అమల్లో ఉండే ‘థీమ్’... ‘యునైటెడ్ బై యునీక్’! ప్రతి క్యాన్సర్ బాధితుడూ ఓ ప్రత్యేక వ్యక్తి. ఈ బయోమ్ కారణంగా అతడిలోని జబ్బు అతడికే ప్రత్యేకం. అందుకే ఒక వ్యక్తిలో క్యాన్సర్ ప్రవర్తించే తీరును బట్టి వ్యక్తిగతంగా అతడికే ప్రత్యేకమైన మందుల రూపకల్పనకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి ఎంతోమంది ప్రత్యేక వ్యక్తులంతా ఐక్యంగా కలిసి క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలన్నదే ఈ థీమ్ అర్థం. తెలుగులో చెప్పుకోవాలంటే... ఇది ‘ప్రత్యేకుల ఐక్యత’! అంటే ప్రత్యేకమైన వ్యక్తిత్వాలన్నీ ఏకమై క్యాన్సర్‌ను తుదముట్టించేందుకు ప్రయత్నించాలంటూ ఈ ప్రత్యేకమైన థీమ్ పిలుపునిస్తోంది. కొన్ని ట్యూమర్ బయోమ్తో సమర్థమైన ఇమ్యూనో చికిత్స సాధ్యం...క్యాన్సర్‌కు అందించే చికిత్సల్లో కీమో, రేడియేషన్, శస్త్రచికిత్సలతో పాటు ఇమ్యూనో థెరపీ అన్నది కూడా ఓ ప్రభావవంతమైన చికిత్స. ప్రతి వ్యక్తిలో ప్రతిరోజూ 200 నుంచి 1000 క్యాన్సర్ కణాలు పుడుతుంటాయి. మనందరిలో ఉండే వ్యాధి నిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) వాటిని తుదముట్టిస్తుంది. ఆ వ్యవస్థ విఫలమైనప్పుడు అలా తుదముట్టించే ప్రక్రియలో ఒక్క క్యాన్సర్ కణమైనా తప్పించుకుని బతికితే అప్పుడు బాధితులకు క్యాన్సర్ వ్యాధి వస్తుంది. ఈ ఇమ్యూనో థెరపీలో బాధితుల వ్యాధి నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తారు. ఫలితంగా క్యాన్సర్ రాకముందు వ్యాధినిరోధక వ్యవస్థ రోజూ పుట్టే క్యాన్సర్ కణాలను మట్టుబెట్టే ప్రక్రియే ఈ ఇమ్యూనోథెరపీలోనూ జరుగుతుంది. ఈ థెరపీ సమయంలో క్యాన్సర్ ట్యూమర్లోనూ, ఆ పరిసరాల్లోనూ ఉండే సూక్ష్మజీవుల సముదాయం మానవులకు మేలు చేసేదైతే ఈ చికిత్సకు ఆ బయోమ్ మరింత దోహదపడి ట్యూమర్‌ను తగ్గించడానికి దోహదం చేస్తుంది.ట్యూమర్‌కు కీడు చేసే బయోమ్తో బాధితుడికి మేలు...గట్ బ్యాక్టీరియమ్లో మేలు చేసేవి ఎక్కువగా ఉన్నప్పుడు అవి మంచి ఆరోగ్యాన్నిస్తూ, చెడు బయోమ్ పెరిగినప్పుడు ఆరోగ్యం చెడిపోయినట్టే... క్యాన్సర్ ట్యూమర్లోనూ... ఆ గడ్డకు సహాయం చేసే బయోమ్ పెరిగితే అది చికిత్సను అడ్డుకుంటుంది. ట్రీట్మెంట్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. అలాగే... ఇక దానికి చేటు చేసే బయోమ్ పెరిగినప్పుడు... ఆ సూక్ష్మజీవుల సముదాయం క్యాన్సర్ గడ్డ పెరుగుదలకు అడ్డుకట్ట వేస్తుంది. ట్యూమర్ చుట్టూ అలాంటి బయోమ్ ఉన్నప్పుడు పేషెంట్స్‌కు అందించే చికిత్సకు... ముఖ్యంగా ‘కీమో’ చికిత్సకు బాధితులు సానుకూలంగా స్పందిస్తుంటారు. అలా ట్యూమర్ మైక్రోబయోమ్కూ క్యాన్సర్ చికిత్సకూ మధ్య పరస్పరం ప్రతిస్పందనలు కొనసాగుతుంటాయి.క్యాన్సర్ ‘ఏ టు జడ్’ స్క్రీనింగ్స్ ఇలా! చాప కింది నీరులా వ్యాపిస్తున్నప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. అయితే క్యాన్సర్‌ను వీలైనంత త్వరగా అంటే... దాని నాలుగు దశల్లో... మొదటి లేదా రెండోదశలోనైనా కనుక్కోగలిగితే క్యాన్సర్‌ను నయం చేసుకోవడం కష్టమేం కాదు. అయితే క్యాన్సర్స్‌ను ముందుగానే గుర్తించడమెలా, మహిళలకూ, పురుషులకూ లేదా ఈ ఇద్దరిలోనూ వచ్చే సాధారణ క్యాన్సర్లేమిటి... ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోడానికి ఉపయోగపడే ప్రత్యేక కథనాన్ని సాక్షి హెల్త్ ప్లస్‌లో చూడవచ్చు.ట్యూమర్ బయోమ్తో ఉపయోగాలు→ ఈ బయోమ్ కనుగొనడంతో క్యాన్సర్‌కు మరింత సమర్థమైన చికిత్సలు సాధ్యం → మైక్రోబయోమ్ ప్రతిస్పందనలకు అనుగుణంగా కొత్త మందుల రూపకల్పన→ జన్యుశాస్త్ర, బయోమ్‌ల సమన్వయాలతో సరికొత్త థెరపీలు కనుగొనే వీలుడా‘‘ ఏవీఎస్ సురేశ్,సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ -
World Cancer Day 2025 : లక్షలాదిమంది బిడ్డలు అనాథలుగా; ముందుగా గుర్తిస్తే!
ప్రపంచ కేన్సర్ దినోత్సవాన్నీ ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 4న జరుపుకుంటారు. ఈ ఏడాది థీమ్ "యునైటెడ్ బై యునిక్". కేన్సర్ కారకాలు, సంరక్షణపై దృష్టి సారించి, సంరక్షణలో మార్పు తీసుకురావడానికి కొత్త మార్గాలను అన్వేషించాలనేది దీని లక్ష్యం. వ్యక్తిగతీకరించిన చికిత్సలు, మద్దతుపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతుంది. 2000లో యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) ఈ రోజును ప్రారంభించింది. కేన్సర్ వ్యాధి సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు, సంఘాలు, సంస్థలను సమీకరించే ఈ కార్యక్రమానికి మరింత ఆదరణ పెరిగింది. కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స, అందరికీ సంరక్షణలో మెరుగుదల చూడాలనే సంకల్పంతో కేన్సర్ సమాజం ఐక్యంగా ఉంది అని UICC అధ్యక్షురాలు, స్వీడిష్ కేన్సర్ సొసైటీ సెక్రటరీ జనరల్ ఉల్రికా అరెహెడ్ అన్నారు.దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండె జబ్బులది కాగా, తరువాతి కేన్సర్దే. 2050 నాటికి కేసులలో 77 శాతం పెరుగుదల అంచనా. ఫలితంగా 1.32 కోట్ల మరణాలు సంభవించనున్నాయని ఆందోళన వ్యక్తమౌతోంది. 2022లో 90.6 లక్షల మంది మరణించారు. ప్రతీ ఏడాది 10 లక్షల మంది పిల్లలు తమ తల్లిని కోల్పోతున్నారు. 10.4 లక్షల మంది పిల్లలు తమ తండ్రిని కోల్పోతున్నారు. నోటి కేన్సర్, రొమ్ము కేన్సర్, గర్భాశయ కేన్సర్, ఊపిరితిత్తుల కేన్సర్, కడుపు కేన్సర్, లివర్ కేన్సర్ ప్రధానంగా ఉన్నాయి.సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు నియంత్రణ కోల్పోయి, చాలా వేగంగా, అస్తవ్యస్తంగా విభజన చెంది, ట్యూమర్, కణితి, గడ్డలుగా మారే స్థితినే కేన్సర్ అని పిలుస్తారు. అయితే ఈ వ్యాధి ముందస్తుగా గుర్తించడం వల్ల చాలావరకు ప్రాణహాని నుంచి బయటపడవచ్చు. ఇది శరీరానికి సంబంధించిన వ్యాధి మాత్రమే కాదు కాదు, బాధిత వ్యక్తి, ఆ కుటుంబానికి చెందిన మానసిక, భావోద్వేగాలకు సంబంధించి కూడా. అయితే వివిధ రకాల అపోహలతోపాటు అవగాహన లేక పోవడం, భయం వల్ల ఈ వ్యాధి నిర్ధారణ ఆలస్యం అవుతోంది. చాలా కేసుల్లో వ్యాధి ముదిరిన తరువాతే గుర్తిస్తుండటంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అనట్టు ఏ వ్యాధికైనా చికిత్సకంటే ముందస్తుగా గుర్తించడం కీలకం. ఈ సూత్రం కేన్సర్ విషయంలో ఇంకా కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు.కేన్సర్‌ను గుర్తించేందుకు ముఖ్యమైన లక్షణాలుఉన్నట్టుండి అనూహ్యంగా బరువు తగ్గడం. ఎలాంటి కారణం అంటే, డైటింగ్, వ్యాయామం, లేకుండానే నెలకు ఐదు కేజీలకంటే ఎక్కువ బరువు తగ్గితే ప్రమాద సంకేతమని గుర్తించాలి. సుదీర్ఘం కాలం పాటు జ్వరం వేధించడం. కేన్సర్ కణాలు శరీరంలో వ్యాప్తి చెందేటప్పుడు జ్వరం, బాడీ పెయిన్స్ లాంటివి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. గాయాలు త్వరగా మానకపోవడం. సాధారణంగా ఎలాంటి గాయమైనా మూడు నాలుగు వారల్లో నయం కావాలి. అలా కాని పక్షంలో అనుమానించాలి. గాయం తగ్గకపోగా, లక్షణాలు పెరుగుతుంటే వైద్యులను సంప్రదించాలి.నోట్లో ఎంతకీ మానని పుండ్లు. నోట్లో పుండ్లు ఏర్పడి చాలాకాలం తగ్గకుండా ఉంటే వైద్యులను సంప్రదించాలి. పొగాకు, గుట్కా, పాన్ నమలడం లాంటి అలవాట్లున్నవారు మరింత జాగ్రత్తపడాలి.అకారణంగా అలిసిపోవడం కేన్సర్‌లో మరో ప్రధాన కారణం. విపరీతమైన అసలట. నీరసం, ఓపిక లేకుండా అయిపోవడం. ఏ పని మీదా ధ్యాస పెట్టలేకపోవడం. నిస్సత్తువగా అనిపించడం. ప్రధానంగా లుకేమియా కేన్సర్ సోకిన వారిలో ఈ లక్షణం కనిపిస్తుంది. విపరీతమైన రక్తహీనత. రక్తంలో హిమగ్లోబిన్ శాతం గణనీయంగా తగ్గిపోవడం.శరీరంపై కొత్తగా మచ్చలు పుట్టుకు రావడం, పుట్టుమచ్చలు పెరిగి, వాటి నుంచి రక్తం కారడం. శరీర రంగు నల్లగా మారిపోవడం (హైపర్ పిగ్మెంటేషన్)ఆహారాన్ని మింగడం లేదా నీటిని తాగడం వంటి వాటిల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, విపరీతమైన దగ్గు లేదా గొంతు బొంగురు పోవడంలాంటి సమస్యలున్నా జాగ్రత్తపడాలి. సుదీర్ఘకాలం పాటు,వాంతులు వేధించడం, తిన్నది సరిగ్గా అరగకపోవడం, మలబద్ధకం లాంటి లక్షణాలు పెద్దపేగు కేన్సర్ వల్ల కావచ్చునేమో అనుమానించాలి.రొమ్ముల్లో, వృషణాల్లో, గొంతులో ఏదైనా గడ్డలు తగిలితే అనుమానించాలి. రొమ్మునుంచి రక్తం, చీము లాంటి స్రావాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి. అలాగే పురుషాంగం లేదా యోనిపై మానని పుండ్లు ఉండే సాధారణ ఇన్ఫెక్షన్ అవునా? కాదా నిర్ధారించుకోవాలి. మూత్రంలో మంట, నొప్పి, రక్తం పడటం, మూత్రం రంగు మారడం, పదే పదే మూత్రానికి వెళ్లాలని పించడం, లేదా అసలే నీరుడు బంద్ కావడం లాంటి లక్షణాలు బ్లాడర్ లేదా ప్రొస్టేట్ కేన్సర్లకు దారి తీయవచ్చు.మలంలో విపరీతంగా రక్తం, రంగు మారడం పెద్ద పేగు కేన్సర్‌కు సంకేతం కావొచ్చు.ఈ పైన చెప్పిన లక్షణాలు మూడు లేదా నాలుగు వారాలకు మించి కొనసాగుతుంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. దానికి కారణాలను నిర్ధారణ చేసుకొని, తగిన చికిత్స తీసుకోవాలి. సైలంట్ కిల్లర్కేన్సర్ను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే లక్షణాలు కొన్ని నెలలు లేదా సంవత్సరాలు దాకా గుర్తించడం కష్టం. మరో విధంగా చెప్పాలంటే.. దాదాపు నాలుగో స్టేజ్‌లో బయటపడతాయి. ఊపిరితిత్తులు, ప్యాంక్రియాటిక్ , అండాశయ కేన్సర్ లాంటి నిశ్శబ్దంగా చుట్టుముడతాయి. ఈ మహమ్మారికి చిన్నాపెద్దా, ముసలీ ముతకా, స్త్రీ, పురుష అనే దయాదాక్షిణ్యాలేవీ ఉండవు. అందుకే అవగాహన, అప్రమత్తత అవసరం. -
గిరిజనులకు ఆధునిక కేన్సర్ పరీక్షలు
ప్రపంచ కేన్సర్ డే సందర్భంగా ఒడిశా రాష్ట్రం మయూర్భంజ్ జిల్లా కుసుమి తెహశీల్ ప్రాంతంలోని గిరిజన ప్రాంతాల్లో (పహాడ్‌పూర్, ఉపర్బేడా) కేన్సర్ స్క్రీనింగ్, సికిల్‌సెల్ అనీమియా నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ ప్రకటించింది. గ్లోబల్ గ్రేస్ హెల్త్ (జీజీహెచ్) సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమం చేపట్టామని, ఎస్ఎల్ఎస్ ట్రస్ట్, సికిల్ సెల్‌కు సంబంధించిన పరికరాలను తయారు చేసే సంస్థ కూడా తన వంతు సహకారం అందించిందని గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ తెలిపింది. ఈ ఉచిత పరీక్షలు ఫిబ్రవరి ఇరవయ్యవ తేదీ నుంచి మార్చి ఒకటవ తేదీ వరకూ కొనసాగుతాయని, మారుమూల ప్రాంతాల్లోని వారికీ ఆధునిక వైద్య పరీక్షలను అందుబాటులోకి తేవాలన్న తమ లక్ష్యం ఈ విధంగా నెరవేరుతోందని వారు వివరించారు. పహాడ్‌పూర్ గ్రామం పరిసరాల్లోని ఐదు కిలోమీటర్ల పరిధిలో సుమారు 5800 మంది జనావాసమున్న పదకొండు గ్రామాలున్నట్టు ఫౌండేషన్ తెలిపింది. కేన్సర్‌పై పోరుకు ముందస్తు నిర్దారణ చాలా కీలకమని ఫౌండేషన్ విశ్వసిస్తోందని, అట్టడుగు వర్గాల ప్రజలకు ఆరోగ్య సేవలను విస్తరించాలన్న ఆశయంతో తాము పనిచేస్తున్నామని వివరించింది. గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందడం కష్టమవుతున్న పరిస్థితుల్లో ఇతర సంస్థల సహకారంతో తాము చేపట్టిన ఈ కార్యక్రమం కేన్సర్, సికిల్‌సెల్ అనీమియా పరీక్షల్లోని వివక్షను తొలగించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ రెండు వ్యాధులను ఎంత తొందరగా గుర్తిస్తే అంత మెరుగైన ఫలితాలు ఉంటాయని గుర్తు చేసింది. ఈ కార్యక్రమం ద్వారా వ్యాధుల ముందుగానే గుర్తించడం ద్వారా ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడవచ్చునని గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ సుంకవల్లి చిన్నబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఎల్ఎస్ ట్రస్ట్ సికిల్‌సెల్ అనీమియా ఎక్విప్మెంట్ కంపెనీ, ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందితో కలిసి పనిచేసే అవకాశం లభించడంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన... కేన్సర్, సికిల్ సెల్ అనీమియా పరీక్షలను అందరికి మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సామాజిక, భౌగోళిక అంతరాలను దాటుకుని అందరికీ ఈ పరీక్షలు అందేలా చేయడమే తమ లక్ష్యమన్నారు. ఉచిత స్క్రీనింగ్ పరీక్షల కార్యక్రమం ద్వారా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోనూ కేన్సర్‌పై అవగాహన పెరుగుతుందని, తద్వారా తమ ఆరోగ్య ప్రాథమ్యాలను నిర్ణయించుకునే సాధికారత వారికి లభిస్తుందని డాక్టర్ సుంకవల్లి చిన్నబాబు వివరించారు. -
క్యాన్సర్ నివారణకు ప్రత్యేక శ్రద్ధ.. రూ.400 కోట్లతో చికిత్స..
అమరావతి: ప్రజలకు క్యాన్సర్ నివారణ, చికిత్స అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం.టి క్రిష్ణబాబు అన్నారు. అంతర్జాతీయ క్యాన్సర్ నివారణ దినం సందర్భంగా ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అమెరికన్ అంకాలజీ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన వాకథాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాకథాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ళ క్రితం సాంక్రమిక వ్యాధులతో(సీడీ) ప్రజలు ఎక్కువగా మరణించే వారని, మారిన జీవన శైలి, పరిస్థితుల్లో ఇప్పుడు అసాంక్రమిక వ్యాధుల(ఎన్సీడీ) కారణంగా ఎక్కువ మంది మృత్యువాత పడుతున్న విషయాన్ని గమనించాలన్నారు. సాంక్రమిక వ్యాధులకు సంబంధించి అత్యాధునిక వైద్య చికిత్సలు, ఔషధాలు అందుబాటులోకి రావటంతో ఆ మరణాల సంఖ్యగణనీయంగా తగ్గిందన్నారు. జీవనశైలి, ఆహారపు అలవాట్ల మార్పు కారణంగా సోకుతున్న క్యాన్సర్, మధుమేహం (డయాబెటిస్), రక్తపోటు (బీపీ) వంటి అసాంక్రమిక వ్యాధులతో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయన్నారు. 20 ఏళ్ల క్రితం ఈ మరణాల సంఖ్య 30 శాతం లోపు వుండగా, ఇప్పుడది 60 శాతానికి పైగా పెరిగిందన్నారు. ఇందుకు ముఖ్యంగా జన్యుపరమైన కారణాల కంటే మన జీవన శైలి లో మార్పే కారణమని ఆయన స్పష్టం చేశారు. ప్రాణాంతకమైన అలవాట్ల వల్ల నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వంటి వాటికి ఎక్కువగా గురవుతున్నారన్నారు . క్యాన్సర్ వ్యాధుల కారణంగా 9 శాతం మంది ప్రజలు మృత్యువాత పడుతున్నారని తాజా అంచనాల ద్వరా తెలుస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏటా దాదాపు 35 వేల మందికి పైగా క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారన్నారు. మరో 70 వేల మంది కొత్తగా క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారని ఆయన చెప్పారు. ఈ వ్యాధికి ప్రస్తుతం మన వద్ద ఉన్న చికిత్సా విధానాలు కేవలం జీవన కాలాన్ని పెంచటానికి తప్ప, వ్యాధి నివారణకు, వ్యాధిని తగ్గించటానికి పనికిరావటం లేదన్నారు. భవిష్యత్తులో క్యాన్సర్ వ్యాధికి పూర్తి స్థాయి చికిత్స అందుబాటులోకి వస్తుందని తాను ఆశిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గత ఏడాది క్యాన్సర్ చికిత్సకు రూ..430 కోట్లు ఖర్చు చేశామని క్రిష్ణబాబు వెల్లడించారు. నెట్వర్క్ ఆస్పత్రులలో క్యాన్సర్‌ను ప్రధాన వ్యాధిగా చేర్చి అనేక వైద్య విధానాలను ప్రవేశపెట్టామని, దేశంలో మరెక్కడా లేని విధంగా స్టేజ్ 1 నుండి స్టేజ్ 4 వరకూ పాలియేటివ్ కేర్ వంటి వైద్య విధానాలను అందుబాటులోకి తెచ్చి ప్రజలకు వ్యాధి బారి నుండి సాంత్వన కలిగించే ప్రయత్నం చేశామన్నారు. వ్యాధిగ్రస్తులకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించటంతో పాటు స్టేజ్ 4 దాటిన వారికి గౌరవ ప్రదమైన మరణాన్ని పొందేందుకు వెసులుబాటు కల్పించామన్నారు. ఈ అంశాలపై సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. క్యాన్సర్ చికిత్సలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారుగా నియమించారని, ఆయన సహకారంతో క్యాన్సర్ వ్యాధికి సమగ్ర చికిత్సనందించేందుకు అనువైన ప్రణాళిక రూపొందిస్తున్నామని క్రిష్ణబాబు వెల్లడించారు. అదే విధంగా మన రాష్ట్రంలో వున్న 11 వైద్య కళాశాలల్లో క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన సదుపాయాలను మెరుగుపర్చుకునేందుకు రూ.400 కోట్లు ఖర్చు పెట్టి కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. క్యాన్సర్ సోకిన తరువాత మనం చేసేది ఏమీ లేనప్పటికీ జీవన నాణ్యత, ప్రమాణాలను పెంచేందుకు అనువైన చికిత్సను అందించగలుగుతున్నామని చెప్పారు. చదవండి: పచ్చ పార్టీ.. పచ్చ కుట్రలు.. ఎల్లో మీడియా ఫేక్ స్టోరీలతో శునకానందం.. -
వీరు క్యాన్సర్‌ను జయించారు
World Cancer Day 2022: క్యాన్సర్‌ను జయించాలంటే మూడు కావాలి. మొదటిది ఆత్మవిశ్వాసం. రెండు కుటుంబం, స్నేహితుల సపోర్ట్. మూడు వైద్యం. వైద్యం ఎలాగూ మేలు చేస్తుంది. కాని కూడగట్టుకోవాల్సింది మొదటి రెంటినే. బాలీవుడ్లో నటీమణులు చాలామంది క్యాన్సర్‌ను ఎదుర్కొన్నారు. గెలిచారు. గ్లామర్ ఫీల్డ్ అయినా దాచకుండా తమ పోరాటాన్ని తెలియచేశారు. వైద్యం చాలా ఆధునికం అయ్యింది. భయం లేదు. గెలుపు ఉంది. క్యాన్సర్‌పై పోరాడాలి. గెలవాలి. ‘మనం అస్సలు ఊహించని విషయాలతో జీవితం మన మీద ఒక మలుపును విసురుతుంది’ అని నటి సోనాలి బెంద్రె 2018లో ట్విటర్లో రాసింది. అప్పటికే ఆమెకు ‘హైగ్రేడ్ క్యాన్సర్’ బయటపడింది. ‘ఏదో కొంత నొప్పి, ఇబ్బంది ఉండేసరికి పరీక్షలు చేయించుకున్నాను. క్యాన్సర్ బయటపడింది. వెంటనే నా కుటుంబం, మిత్రులు బిలబిలమంటూ నా పక్కన చేరారు నాకు సపోర్ట్ ఇవ్వడానికి. డాక్టర్లు వెంటనే వైద్యం మొదలెడదామన్నారు. న్యూయార్క్‌లో నాకు చికిత్స మొదలైంది. నేను ఇప్పుడు క్యాన్సర్‌ను ఎదుర్కొంటున్నాను’ అని రాసిందామె. క్యాన్సర్‌కు ఇవాళ ఆధునిక జీవితానికి పట్టిన మహా భూతంలా మారింది. ఒకప్పుడు దానికి ఎటువంటి వైద్య విధానాలు లేవని వైద్యం చెప్పేది. ఇప్పుడు ఎటువంటి మొండి క్యాన్సర్‌ను అయినా ఎదుర్కొనే ఆధునిక పద్దతులు వచ్చాయి. క్యాన్సర్ బారిన పడినవారు ఆ ఆధునిక పద్ధతులు వాడుకునేందుకు వీలుగా ధైర్యంగా ఉండటమే కావాల్సింది. కుంగిపోకపోతే అదే సగం బలం. బలమే పోరాటం. ఆరోగ్యం. రెండేళ్లు క్యాన్సర్‌కు వైద్యం తీసుకున్నాక సోనాలి బెంద్రే స్వస్థత పొందింది. ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతోంది. హైగ్రేడ్ క్యాన్సర్‌ను ఆమె జయించగా లేనిది మిగిలిన వారు కూడా ఎందుకు జయించలేరు? ఆమెలాగే అందరూ మామూలు మనుషులే. ఆమె వృత్తిరీత్యా నటి మాత్రమే. తేడా ఏమిటంటే ఆమె పోరాడాలని నిశ్చయించుకుంది. 2021 ఏప్రిల్‌లో నటి కిరణ్ ఖేర్ బ్లడ్ క్యాన్సర్ బారిన పడింది. కాని ఆమె భయపడలేదు. క్యాన్సర్‌ను ఎదుర్కొనడానికి ట్రీట్మెంట్కు సహకరించాలనుకుంది. భర్త అనుపమ్ ఖేర్ ‘ఆమెకు ఏమీ కాదు. ఆమె ఆరోగ్యం పొందుతుంది’ అని ధైర్యం చెప్పాడు. ముంబైలో కిరణ్ ఖేర్‌కు వైద్యం జరిగింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ ఆమె తాను పాల్గొంటున్న ఒక టీవీ షోలో జడ్జ్‌గా తిరిగి వచ్చి కూచుని క్యాన్సర్ దారి క్యాన్సర్‌దే మన పని మన పనే అన్నట్టుగా స్ఫూర్తినిస్తోంది. మరో సీనియర్ నటి నఫీసా అలీ కూడా చర్మ సంబంధ క్యాన్సర్ బారిన పడ్డారు. అయినప్పటికీ ఆమె కుంగిపోక పోరాడింది. కీమో థెరపీ తీసుకుని ఆమె క్యాన్సర్‌ను జయించింది. కీమో థెరపీ చేయించుకుంటూ నవ్వుతూ ఉన్న ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పెట్టింది. అలాగే శిరోజాలను ముండనం చేసుకున్న ఫొటో కూడా. ఇవన్నీ క్యాన్సర్‌ను అన్ని జబ్బుల్లాగే చూడటానికి స్ఫూర్తినిస్తున్నాయి. ఇక మనిషా కోయిరాలా 2012లో ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడటం పెద్ద సంచలనం అయ్యింది. అభిమానులు తీవ్ర నిరాశలో పడ్డారు. ఆమె కూడా ఇది తనకు అశనిపాతంగా భావించింది. అయినప్పటికీ క్యాన్సర్ మీద పోరాడి గెలవాలని నిశ్చయించుకుందామె. న్యూయార్క్‌లో ఉండి వైద్యం తీసుకుంది. సుదీర్ఘకాలం వైద్యం కొనసాగినా బెదరక, చెదరక క్యాన్సర్‌ను జయించింది. తిరిగి సినిమాల్లో నటిస్తూ ఉంది కూడా. వీరి కంటే ముందు కెరీర్ పీక్‌లో ఉండగా మోడల్ లీసారే క్యాన్సర్ బారిన పడింది. శిరోజ ముండనంతో ఆమె ఫొటోలు చూసి అభిమానులు తల్లడిల్లారు. కాని ఆమె క్యాన్సర్‌తో బహిరంగంగా పోరాడింది. తన పోరాటాన్ని ఎప్పటికప్పుడు లోకంతో పంచుకుంది. అంతే కాదు ఆ పోరాట సారాన్ని ‘క్లోజ్ టు ది బోన్: ఏ మెమొయిర్’ పేరుతో పుస్తకంగా రాసింది. ఒకప్పటి స్టార్ నటి, ‘ఆప్ కీ కసమ్’, ‘ఆయినా’ సినిమాల హీరోయిన్ ముంతాజ్ తన 54వ ఏట 2000 సంవత్సరంలో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడింది. ‘చావు కూడా నన్ను సులువుగా ఓడించలేదు. క్యాన్సర్ ఎంత’ అనే స్ఫూర్తితో పోరాడి గెలిచింది. ఇప్పుడు ఆమె వయసు 74. హాయిగా ఉంది. అలాగే మన తెలుగు నటి హంసా నందిని కూడా ఇప్పుడు క్యాన్సర్‌పై గట్టి పోరాటం చేస్తూ ఉంది. క్యాన్సర్‌పై పోరాడండి. గెలవండి. పోరాడితే పోయేదేమి లేదు క్యాన్సర్ తప్ప. -
వరల్డ్ రోజ్ డే: ఈరోజు గెలిచాను.. జీవిస్తున్నాను అనే అనుభూతి పొందండి
క్యాన్సర్‌తో పోరాడుతూ ఏటా వేలాదిమంది చనిపోతున్న సంగతి మనకు తెలియంది కాదు. ప్రముఖులు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ ప్రాణాంతక వ్యాధి బారినపడిన వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదేమో!. గతంతో పోలిస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీ సాయంతో క్యాన్సర్‌ని మొదటి దశలో గుర్తించి బయట పడే మార్గాలు ఉన్నాయి. రోగులు కూడా త్వరితగతిన కోలుకోగలుగుతున్నారు. కానీ ఈ వ్యాధిని జయించాలంటే కావల్సింది మెరుగైన వైద్యమే కాక మనోధైర్యం అత్యంత ముఖ్యం. క్యాన్సర్ అనగానే జీవితం మీద ఆశ వదులుసుకునేంతగా అందర్నీ భయబ్రాంతులకు గురు చేస్తుందనడంలో సందేహం లేదు. అందుకే ప్రపంచ దేశాలన్ని ముందుకు వచ్చి క్యాన్సర్‌ని జయించే విధంగా ప్రజలకు మనోధైర్యంతో పాటు చైత్యవంతులను చేసే విధంగా అడుగులు వేయాలని సంకల్పించాయి. దానిలో భాగంగానే ఐక్యరాజ్యసమితి వరల్డ్ రోజ్ డే అనే ప్రతిపాదన తీసుకువచ్చింది. దీంతో ప్రతి ఏడాది సెప్టెంబర్ 22న ప్రపంచ గులాబీ దినోత్సవం (వరల్డ్ రోజ్ డే)ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. (చదవండి: జీ7 పన్నుల ఒప్పందం అమలుతో పురోగతి సాధించగలం: బోరిస్ జాన్సన్) దీని వెనుక ఉన్న చరిత్ర: కెనడియన్ అమ్మాయి మెలిండా రోజ్ గౌరవార్థం క్యాన్సర్ రోగుల కోసం ప్రపంచ గులాబీ దినోత్సవం జరుపుకుంటారు. ఆమె కేవలం 12 సంవత్సరాల వయసులో అరుదైన బ్లడ్ క్యాన్సర్(రక్త క్యాన్సర్) అయిన అస్కిన్స్ ట్యూమర్‌తో బాధపడింది. ఆమె కొన్ని వారాలు మాత్రమే జీవించగలదు అని వైద్యులు చెప్పారు. కానీ ఆమె తన అచంచలమైన మనోధైర్యంతో ఆరేళ్లు జీవించగలిగింది. అంతే కాదు తనలా క్యాన్సర్‌తో బాధపడుతున్నవారిని తన కవితలతో, సందేశాత్మకమైన ఉత్సాహపూరిత మాటలతో, సందేశాలతో ప్రోత్సాహించింది. వారిలో ఈ ప్రాణాంతక వ్యాధితో పోరాడగలిగే మనోశక్తిని, ధైర్యాన్ని నింపడమే కాక చనిపోయేంత వరకు సంతోషంగా ఎలా ఉండాలో చేసి చూపించింది. తాను అంత చిన్న వయసులో ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ మరోవైపు తనలా బాధపడుతున్న వారి పట్ల ఆమె కనబర్చిన గుండె నిబ్బరానికి గుర్తుగా ప్రతి ఏటా ఆమె పేరుతో వరల్డ్ రోజ్ డే(ప్రపంచ గూలాబీ దినోత్సవం) దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. క్యాన్సర్ రోగుల్లో ఆమె స్ఫూర్తిని నింపేలా ప్రతి ఏడాది ఒక సరికొత్త థీమ్‌తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది థీమ్: "జీవించే సమయం తగ్గిపోవచ్చు.. ప్రతి రోజు ఉదయించే సూర్యుడిని చూసినప్పుడల్లా.. మీరు ఈ రోజు గెలిచాను జీవిస్తున్నాను అనే అనుభూతిని పొందండి. అలా ఆ రోజుని ఆనందంగా గడపండి, ఆస్వాదించండి." ఈ వ్యాధి బారినపడిని కొందరి ప్రముఖుల మనోభావాలు... మీరు ఏదో కోల్పోతున్నాను అనుకునే కంటే మీరు చనిపోతున్నారు అనే విషయాన్ని గుర్తించుకోవటమే ఉత్తమమైన మార్గం. ఈ సమయం మీ మనస్సుకు దగ్గరగా ఉండి నచ్చినవి చేసి ఆనందంగా గడిపే క్షణాలుగా భావించండి. - స్టీవ్ జాబ్స్ క్యాన్సర్ మీ జీవితాన్ని మారుస్తుంది. మీరు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. మీరు ద్వేషించిన వాళ్లను, ప్రేమించిన వాళ్ల పట్ల కనబర్చిన ప్రతీది మీకు గుర్తుకు రావడమే కాక ఏం చేసుంటే బాగుండేది అనేది కూడా తెలుస్తుంది. అంతేకాదు సమయాన్ని వృధా చేయరు. మీకు ఇష్టమైన వ్యక్తులతో ప్రేమిస్తున్నానే విషయాన్ని చెప్పడానికి కూడా వెనుకడుగు వేయరు. -జోయెల్ సీగెల్ మీకు ఏదైనా నచ్చకపోతే దాన్ని మార్చండి. ఒకవేళ దానిని మార్చలేనిదైత మీరే మీ వైఖరిని మార్చుకోండి. - మాయ ఏంజెలో క్రికెటే నాజీవితం. క్యాన్సర్‌కు ముందు నేను సంతోషంగా ఉండేవాడిని. ఎప్పుడైతే ఈ వ్యాధి భారినపడ్డానో అప్పుడే నాలో ఆందోళన, భయం మొదలైయ్యాయి. నాలా బాధపడుతున్న వాళ్లని చూసినప్పుడు దీన్ని ఏ విధంగానైనా ఎదిరించి జీవిచడమే కాక తనలా బాధపడేవాళ్లకు తన వంతు సాయం చేయాలనే తపన మొదలైంది. మళ్లీ నా జీవితం నాకు తిరిగి లభించినందుకు సంతోషంగా ఉంది. - క్రికెటర్ యువరాజ్ సింగ్ (చదవండి: పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో తొలి హిందూ మహిళగా సనా) -
మహిళల్లో ప్రధాన క్యాన్సర్ అదే.. వారికే రిస్క్
కొన్ని క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు మహిళల్లోనే ఎక్కువ. సర్వికల్ క్యాన్సర్ మహిళల్లో మాత్రమే వస్తుంది. అలాగే రొమ్ముక్యాన్సర్ చాలా అరుదుగా పురుషుల్లో కనిపించినా... మహిళల్లోనే అది ఎక్కువ. రొమ్ము క్యాన్సర్ అవగాహన కోసం సంక్షిప్తంగా కొన్ని ప్రధాన విషయాలివి.. రొమ్ము క్యాన్సర్ క్యాన్సర్లలో వయస్సుకూ వ్యాధికీ దగ్గరి సంబంధం ఉంది. అంటే... వయస్సు పైబడుతున్న కొద్దీ వ్యాధి వచ్చే అవకాశాలు అంతగా పెరుగుతుంటాయన్నమాట. మరీ వివరంగా చెప్పాలంటే 80 ఏళ్లు పైబడ్డ ప్రతి 10 మందిలో ఒకరికి ఇది తప్పక కనిపిస్తుంది. దీని విస్తృతి ఇంత ఎక్కువ కాబట్టే మహిళల్లో దీని గురించి ఆందోళన కూడా ఎక్కువే. అయినప్పటికీ దీని గురించి అంతగా బెంగపడాల్సినక్కర్లేదు. రిస్క్ గ్రూప్ ఎవరంటే : కుటుంబ చరిత్రలో ఈ వ్యాధి వచ్చిన వారు రక్తసంబంధీకులలో ఈ వ్యాధి వచ్చిన వారు ఉన్నప్పుడూ పిల్లలు లేని వాళ్లలో మొదటిసారి గర్భం ముప్ఫయి ఏళ్లు దాటాక వస్తే ఐదేళ్లకు పైబడి హార్మోనల్ చికిత్స తీసుకుంటూ ఉంటే... వీళ్లకు ఈ రకం క్యాన్సర్ వచ్చే అవకాశాలెక్కువ. కాబట్టి అలాంటివాళ్లు అప్రమత్తంగా ఉండాలి. ఈ రిస్క్ గ్రూపులు పరీక్షలు చేయించుకోవాలి. ►మొదటిది ఎవరికి వారే చేసుకునే రొమ్ము పరీక్ష. ప్రతి మహిళా తమ రుతుక్రమం ముగిసిన వారం తర్వాత ఎడమ రొమ్మును కుడి చేత్తో, కుడి రొమ్మును ఎడమ చేత్తో తాకుతూ పరీక్ష చేసుకోవాలి. దాంతో వాళ్లకు తమ రొమ్ము ఎలా ఉంటుందన్న అంశంపై అవగాహన పెరుగుతుంది. ఫలితంగా అందులో ఏ చిన్నమార్పు వచ్చినా అర్థమైపోతుంది. లక్షణాలేమైనా కనిపిస్తుంటే త్వరితంగా గుర్తించగలరు. దాన్ని మీ డాక్టర్/గైనకాలజిస్ట్ దృష్టికి తీసుకెళ్తే అదేమైనా ప్రమాదకారా లేక మామూలు గడ్డా అన్నది చెబుతారు. ►మమోగ్రఫీ అనే మరో పరీక్షతోనూ రొమ్ము క్యాన్సర్‌ను తేలిగ్గా గుర్తించవచ్చు. (చదవండి: వివిధ రకాల క్యాన్సర్లు: లక్షణాలు ఇవే) చాలా హై రిస్క్ ఉంటే... కొందరిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువ అని డాక్టర్లు అనుకుంటే... వాళ్లకు రొమ్ము క్యాన్సర్ వచ్చేదే లేనిదీ... జన్యుపరీక్షల ద్వారా– బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 అనే జీన్ మ్యూటేషన్స్ ఉన్నాయా లేవా అన్న దాన్ని బట్టి కనుక్కోవచ్చు. ఓ చిన్ని రక్తపరీక్ష ద్వారా దీన్ని కనుక్కోవడం చాలా సులభం. మంచి చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రొమ్ము క్యాన్సర్ విషయంలోనూ ఇప్పుడు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. సర్విక్స్ క్యాన్సర్... దక్షిణ భారతదేశంలోని తీరప్రాంతాల్లోని మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్ ఇది. రుతుస్రావం సమయంలో గాక మధ్యలోనూ రక్తం రావడం, రుతుస్రావం ఆగిపోయిన (మెనోపాజ్) మహిళల్లో అసాధారణంగా రక్తస్రావం కావడం, మహిళల్లో సెక్స్ తర్వాత రక్తస్రావం (పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్), ఎరుపు, తెలుపు డిశ్చార్జీ వంటివి దీని లక్షణాలు. -
వివిధ రకాల క్యాన్సర్లు: లక్షణాలు ఇవే
శరీరంలోని ఏదైనా ఒక కణం... నిరాటంకంగా, నిర్విరామంగా, నిరుపయోగంగా పెరుగుతూ పోయేదే క్యాన్సర్. అలా పెరిగాక రోగిని నిస్సత్తువగా చేసేస్తుంది. అలా ఓ పరిమితీ పాడూ లేకుండా అనారోగ్యకరంగా, అసాధారణమైన పెరిగే ఈ క్యాన్సర్ కణం మొదట ఒకే కణంతోనే మొదలవుతుంది. అది రెట్టింపు అయ్యే ప్రక్రియలో 20వ సారి రెట్టింపు అయ్యే సమయంలో ఒక మిలియన్ కణాలుగా వృద్ధిచెందుతుంది. మిలియన్ కణాల సముదాయంగా పెరిగిన ఆ సమయంలోనూ దాన్ని కనుక్కోవడం కష్టసాధ్యం. అదే 30వసారి రెట్టింపు అయ్యే సమయంలో అందులో బిలియన్ కణాలుంటాయి. ఆ సమయంలో దాన్ని ఓ గడ్డ (లంప్)లా గుర్తించడం సాధ్యం. అంటే... చేత్తో గడ్డను తాకి గుర్తించే సమయంలో అందులో బిలియన్ కణాలుంటాయన్నమాట. ఇక 40వ సారి రెట్టింపయ్యాక అందులో ఒక ట్రిలియన్ కణాలుంటాయి. అప్పటికీ చికిత్స లభించక 42–43వ సారి రెట్టింపయినప్పుడు రోగి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తాడు. అన్ని రెట్టింపులు కాకముందే... అంటే కేవలం 20వ సారి రెట్టింపయ్యే లోపు కనుక్కోగలిగితే నయం చేసే అవకాశాలు చాలా ఎక్కువే. మరి ఆ దశలో కనుక్కోవడం ఎలా? తల నుంచి మన దేహంలోని కింది భాగాల్లోని ఏదైనా అవయవంలో క్యాన్సర్‌ను ముందే ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం. క్యాన్సర్ లక్షణాలు అవయవానికీ అవయవానికీ మారిపోతాయి. అయితే క్యాన్సర్ రోగులందరిలో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యవంతుల్లోనూ అప్పుడప్పుడూ కనిపించేవి కావడంతో వాటిని గుర్తించడం కష్టం. క్యాన్సర్‌ను గుర్తించేందుకు కొన్ని సాధారణ అంశాలు... ఆకలి తగ్గడం కారణం తెలియకుండా / ఏ కారణమూ లేకుండా బరువు తగ్గడం ఎడతెరిపి లేకుండా దగ్గు లింఫ్ గ్లాండ్స్ (బాహుమూలాల్లో, గజ్జల్లో, గొంతుదగ్గర) వాపు (కొన్నిసార్లు కొన్ని అవయవాలలో మాత్రమే) అవయవాలనుంచి రక్తస్రావం... ఇవి సాధారణంగా కనిపించే లక్షణాలు. అయితే ఈ లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌వే కానక్కర్లేదు. కాబట్టి వీటిలో ఏదో ఒకటి కనిపించిన మాత్రాన అందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ప్రాథమిక చికిత్స తీసుకున్న తర్వాత కూడా, అదేపనిగా కనిపిస్తున్నప్పుడు మాత్రం ఒకసారి డాక్టర్‌చేత పరీక్ష చేయించుకుని అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకొని నిశ్చింతగా ఉండాలి. తల నుంచి శరీరం కింది భాగం వరకు ఆయా అవయవభాగాల్లో తొలి దశలోనే క్యాన్సర్‌ను గుర్తించేందుకు కొన్ని ప్రాథమిక లక్షణాలివి... బ్రెయిన్ క్యాన్సర్... తలనొప్పి, అకస్మాత్తుగా మతిమరపు రావడం, కొన్నిసార్లు సామాజిక సభ్యత మరచి ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మనిషి మెదడులో మాట్లాడటానికీ, దృష్టికీ, వినికిడి కీ, కాళ్లూచేతుల కదలిక ల నియంత్రణకు... ఇలా వేర్వేరు ప్రతిచర్యలకు వేర్వేరు కేంద్రాలు (సెంటర్స్) ఉంటాయన్న విషయం తెలిసిందే. క్యాన్సర్ అభివృద్ధి చెందిన సెంటర్ దేనికి సంబంధించినదైతే ఆ అవయవం చచ్చుబడటం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఇవీ ఆయా అవయవాలకు సంబంధించి తొలిదశలో క్యాన్సర్‌కు లక్షణాలు. గొంతు భాగంలో... దీన్ని ఓరో ఫ్యారింజియల్ భాగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గొంతులో ఏదో ఇరుక్కుని ఉన్న భావన ఉంటుంది. అన్నవాహిక మొదటి భాగంలో అయితే మింగడంలో ఇబ్బంది. కడుపు (స్టమక్)లో... అదే కడుపు (స్టమక్)లో అయితే మంట పుడుతున్నట్లుగా ఉండే నొప్పి. పొట్టలో మంట. కొన్నిసార్లు పొట్టలో రక్తస్రావం అయినప్పుడు ఆ రక్తం వల్ల విసర్జన సమయంలో మలం నల్లగా కనిపిస్తుంది. రక్తస్రావం వల్ల రక్తహీనత (ఎనీమియా) కూడా కనిపించవచ్చు. దాంతో పాటు కొన్ని సార్లు కొద్దిగా తినీతినగానే కడుపునిండిపోయిన ఫీలింగ్. తల భాగంలో... ఈ క్యాన్సర్స్ నోటిలో, దడవ మీద, నాలుక మీద లేదా చిగుళ్లు (జింజివా) మీదా ఇలా తలభాగంలో ఎక్కడైనా రావచ్చు. ఆయా భాగాల్లో ఎరుపు, తెలుపు రంగుల ప్యాచెస్ ఉన్నా, దీర్ఘకాలంగా మానని పుండు (సాధారణంగా నొప్పి లేని పుండు, కొన్ని సందర్భాల్లో నొప్పి ఉండవచ్చు కూడా) ఉంటే క్యాన్సర్ అయ్యేందుకు అవకాశం ఎక్కువ. అదే నాలుక మీద అయితే నాలుక కదలికలు తగ్గవచ్చు. నాలుక వెనక భాగంలో అయితే స్వరంలో మార్పు. మరింత వెనకనయితే మింగడంలో ఇబ్బంది. ఇక స్వరపేటిక ప్రాంతంలో అయితే స్వరంలో మార్పు. మెడ దగ్గరి లింఫ్ గ్రంధుల వాపు. సర్విక్స్ క్యాన్సర్... దక్షిణ భారతదేశంలోని తీరప్రాంతాల్లోని మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్ ఇది. రుతుస్రావం సమయంలో గాక మధ్యలోనూ రక్తం రావడం, రుతుస్రావం ఆగిపోయిన (మెనోపాజ్) మహిళల్లో అసాధారణంగా రక్తస్రావం కావడం, మహిళల్లో సెక్స్ తర్వాత రక్తస్రావం (పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్), ఎరుపు, తెలుపు డిశ్చార్జీ వంటివి దీని లక్షణాలు. రొమ్ము క్యాన్సర్... మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ రకం క్యాన్సర్‌లో... రొమ్ములో ఓ గడ్డ చేతికి తగలడం, రొమ్ము పరిమాణంలో మార్పు, రొమ్ము మీది చర్మం ముడతలు పడటం, రొమ్ము చివర (నిపిల్) నుంచి రక్తంతో కలిసిన స్రావం లాంటివి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు. ఊపిరితిత్తులు... పొగతాగేవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. ఈ క్యాన్సర్ ఉన్నవాళ్లలో దగ్గు, కళ్లెలో రక్తం పడటం వంటì లక్షణాలు కనిపిస్తాయి. ఎక్స్–రే, సీటీ స్కాన్ పరీక్ష ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. రెక్టమ్ క్యాన్సర్‌లో... మలద్వారం (రెక్టమ్) క్యాన్సర్ విషయంలోనూ మల విసర్జన తర్వాత కూడా ఇంకా లోపల మలం మిగిలే ఉందన్న అనుభూతి ఉంటుంది. దీనికో కారణం ఉంది. విసర్జించాల్సిన పదార్థం మామూలుగా మలద్వారం వద్దకు చేరగానే అక్కడి నాడులు స్పందించి అక్కడ మలం పేరుకుని ఉన్నట్లుగా మెదడుకు సమాచారమిస్తాయి. దాంతో దాన్ని విసర్జించాల్సిందిగా మెదడు ఆదేశాలిస్తుంది. కానీ విసర్జన తర్వాత కూడా అక్కడ క్యాన్సర్ ఓ గడ్డలా ఉండటంతో ఏదో గడ్డ మిగిలే ఉందన్న సమాచారాన్ని నాడులు మెదడుకు మళ్లీ మళ్లీ చేరవేస్తుంటాయి. దాంతో ఇంకా అక్కడేదో ఉందన్న భావన కలుగుతూ ఉంటుంది. ఈ లక్షణంతో పాటు కొందరిలో బంక విరేచనాలు, రక్తంతో పాటు బంక పడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఒవేరియన్ క్యాన్సర్... దాదాపు 50, 60 ఏళ్ల మహిళల్లో పొట్ట కింది భాగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఈ భాగానికి క్యాన్సర్ వస్తే ఒక్కోసారి ఏ లక్షణాలూ కనిపించకుండానే ప్రమాదకరంగా పరిణమించవచ్చు. టెస్టిస్ క్యాన్సర్... పురుషుల్లో వచ్చే ఈ క్యాన్సర్‌లో వృషణాల సైజ్ పెరగడం, దాన్ని హైడ్రోసిల్‌గా పొరబాటు పడటం వల్ల పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోవడంతో అది సైజ్‌లో పెరిగి ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలు ఎక్కువ. ప్రోస్టేట్ క్యాన్సర్... సాధారణంగా 50, 60 ఏళ్లు దాటిన పురుషుల్లో తరచూ కనిపించే క్యాన్సర్ ఇది. దాదాపు లక్షణాలు ఏవీ పెద్దగా కనిపించకుండా వచ్చే ఈ క్యాన్సర్‌లో రాత్రివేళల్లో మూత్రవిసర్జనకు వెళ్లాల్సిన అవసరం ఎక్కువగా ఉండవచ్చు. పీఎస్ఏ అనే పరీక్ష ద్వారా దీన్ని తేలిగ్గా గుర్తించవచ్చు. కిడ్నీ అండ్ బ్లాడర్ క్యాన్సర్స్... మూత్ర విసర్జన సమయంలో రక్తం కనిపించడం, మాటిమాటికీ మూత్రం రావడం మూత్రపిండాలు, మూత్రాశయ క్యాన్సర్లలో కనిపించే సాధారణ లక్షణం. చర్మ క్యాన్సర్... చర్మ క్యాన్సర్‌ను ఏ,బీ,సీ,డీ అనే నాలుగు లక్షణాలతో తేలిగ్గా గుర్తించవచ్చు. శరీరంపై ఏదైనా మచ్చ తాలూకు ఏ– అంటే... ఎసిమెట్రీ (అంటే మచ్చ సౌష్టవం మొదటికంటే మార్పు వచ్చినా, బీ– అంటే... బార్డర్ అంటే అంచులు మారడం, మందంగా మారడం జరిగినా, సీ– అంటే కలర్ రంగు మారినా, డీ అంటే డయామీటర్... అంటే వ్యాసం (సైజు) పెరిగినా దాన్ని చర్మం క్యాన్సర్ లక్షణాలుగా భావించవచ్చు. కొంతమందిలో తమ తాత తండ్రుల్లో, పిన్ని వంటి దగ్గరి సంబంధీకుల్లో క్యాన్సర్ ఉన్నప్పుడూ, అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారూ... ఇక జన్యుపరంగా అంటే... జీరోడెర్మా, న్యూరోఫైబ్రమాటోసిస్ వంటి వ్యాధులున్నవారిలో క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి హైరిస్క్ వ్యక్తులంతా మిగతావారికంటే మరింత అప్రమత్తంగా ఉంటూ, మరింత ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించాలి. అందరూ గమనించాల్సిన అంశం ఏమిటంటే... ఇక్కడ ప్రస్తావించిన లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌కు సంబంధించినవే అని ఆందోళన వద్దు. కాకపోతే తొలిదశలో తేలిగ్గా గుర్తిస్తే క్యాన్సర్ తగ్గుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి. అందుకే ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందకుండా ఒకసారి డాక్టర్ల సూచన మేరకు పరీక్ష చేయించుకోవాలి.ఇక అది క్యాన్సర్ కాదని నిర్ధరించుకొని నిశ్చింతగా, నిర్భయంగా ఉండండి. బ్లడ్ క్యాన్సర్స్... రక్తం కూడా ద్రవరూపంలో ఉండే కణజాలమే కాబట్టి... బ్లడ్ క్యాన్సర్ కూడా రావచ్చు. రక్తహీనత, చర్మం మీద పొడలా (పర్ప్యూరిక్ ప్యాచెస్) రావడం, చిగుళ్లలోంచి రక్తం రావడం, బరువు తగ్గడం, జ్వరం రావడం వంటివి బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు. లింఫ్ గ్లాండ్స్ అన్నవి బాహుమూలాల్లో, దవడల కింది భాగంలో మెడకు ఇరువైపులా, గజ్జెల్లో ఉండే ఈ గ్రంథులకూ క్యాన్సర్ రావచ్చు. దాన్ని లింఫోమా అంటారు. -
ఆ సీన్లలో నటించడం తగ్గించేశా: సుమంత్
సాక్షి, హైదరాబాద్: వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా హైటెక్ సిటీ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆస్పత్రి నిర్వహించిన అవగాహన ర్యాలీని హీరో సుమంత్ ప్రారంభించారు. తాతగారు చివరి దశలో క్యాన్సర్‌తో పోరాడటం బాధ కలిగించిందన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చాడు. తన సినిమాల్లో కూడా పొగ తాగడం వంటి సీన్లను తగ్గించేశానని చెప్పుకొచ్చాడు. ఎవరైనా సిగరెట్ తాగే సీన్ చెప్పగానే అవసరమా అని వారిస్తున్నానని పేర్కొన్నాడు. కాకపోతే కొన్నిసార్లు పాత్ర డిమాండ్ మేరకు అలాంటి సీన్లలో నటించక తప్పదని తెలిపాడు. (చదవండి: ట్రైలర్: 'కపటధారి'ని సుమంత్ కనుక్కుంటాడా?) తన ఫ్యామిలీలో చాలామంది క్యాన్సర్ వల్ల చనిపోయారని, మరి కొందరు దాన్ని జయించారని చెప్పుకొచ్చాడు. మొదటి దశలోనే క్యాన్సర్‌ను కనిపెట్టగలిగితే దాన్నుంచే బయటపడే అవకాశం ఉందన్నాడు. యువత ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని సూచించాడు. కాగా సుమంత్ ప్రస్తుతం "కపటధారి" సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్‌పై డా.జీ.ధనంజయన్, లలిత ధనంజయన్ నిర్మిస్తున్నారు. మరోవైపు మురళీకృష్ణ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఐమా కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో మధునందన్, ధన్‌రాజ్, హైపర్ ఆది తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. గుజ్జు రాము సమర్పణలో శర్మ చుక్కా నిర్మిస్తున్నారు. (చదవండి: హీరో సుమంత్ అశ్విన్ పెళ్లి డేట్ ఫిక్స్) -
రౌడీ క్యాన్సర్లను రఫ్ఫాడించేద్దాం రండి!
సమాజంలో రకరకాల మనుషులుంటారు. దేహంలో కణాలూ అంతే. వాటిల్లో ఎన్నెన్నో రకాలు. సమాజంలోని వ్యక్తులంతా సమాజం విధించిన నియమ నిబంధనలను పాటిస్తూ, చట్టాన్ని గౌరవిస్తూ ఉంటారు. దేహంలోని కణాలూ అంతే. జీవక్రియల విషయంలో తమకు అస్పగించిన విధులను నిర్వర్తిస్తూంటాయి. అయితే సమాజంలోని కొందరు వ్యక్తులు మాత్రం సామాజిక నియమనిబంధనలను లెక్కచేయరు. వారెంతో బలంగా మారతారు. ఎవరికీ లొంగరు. తమ బలం తో చట్టాలను అతిక్రమిస్తారు. వారినే ‘రౌడీ‘లనీ, సంఘవ్యతిరేక శక్తులనీ అంటాం. సమాజంలో వారెలాగో... కణాల్లోనూ జీవక్రియల నియమ నిబంధనలను అతిక్రమించే రౌడీకణాలే క్యాన్సర్ కణాలనుకోవచ్చు. ఈరోజు ‘వరల్డ్ క్యాన్సర్ డే’ సందర్భంగా క్యాన్సర్ అంటే ఏమిటో చాలా తేలిగ్గా అర్థం చేసుకునేందుకు... క్యాన్సర్‌ను సమాజం లోని సంఘవిద్రోహశక్తులతో పోలుస్తూ ఇస్తున్న ప్రత్యేక కథనమిది. రోడ్డు మీద అందరూ ఎడమపక్కనే నడవాలి. రెడ్‌లైట్ పడితే ఆగాలి. గ్రీన్‌లైట్ పడ్డప్పుడు జీబ్రాక్రా సింగ్ దగ్గర రోడ్డు దాటాలి. ఇవి సామాజిక నియమాలు. వీటిని పాటిస్తే ప్రమాదాలే జరగవు. రౌడీ కుర్రాళ్లు రెడ్‌లైట్ పడ్డాక కూడా బైక్‌ను దాటిస్తారు. జీబ్రాక్రాసింగ్ వద్ద జనాలు వెళ్తున్నప్పుడే వాళ్ల మీదికి వాహనాన్ని తీసుకెళ్తారు. ఏమాత్రం నియమ నిబంధనలను పాటించరు. అచ్చం ఇలాగే దేహంలోని క్యాన్సర్ కణం కూడా. నిశ్చితంగా ఒకేవిధంగా విభజితం కావాల్సిన కణాలు అలా కావు. నిర్దిష్టంగా పెరగాల్సిన ఒకవేపునకు పెరగవు. ఇష్టం వచ్చినట్లు దేహమంతా పాకేస్తాయి. ఆరోగ్య కణాలమీదికి దాడి చేస్తాయి. దోపిడీలూ, కబ్జాలు చేసే రౌడీ క్యాన్సర్ కణాలు M. G. Naga Kishore Chief Surgical Oncologist, Omega Hospitals, Guntur Ph: 0863 2223300 సమాజంలో మామూలు వ్యక్తులు దొంగతనాలు చేయగలరా? దోపిడీలకు పాల్పడగలరా? కబ్జాలు చేయగలరా? వారికా ధైర్యం ఉంటుందా? ఉండదు. కేవలం రౌడీతనంతో వ్యవహరించే వారే ఈ పనులన్నీ చేయగలరు కదా. అలాగే కణాల్లోనూ రౌడీ కణాల్లాంటి ఈ క్యాన్సర్ కణాలు దోపిడీలూ, కబ్జాలూ, మోసాలు చేస్తాయి. అదెలాగో చూద్దాం. దేహకణాల మనుగడకు ఆహారం, ఆక్సిజన్ కావాలి. ఇది రక్తం ద్వారా అందుతుంది. ఏ కణానికి ఎంత అవసరమో ఆయా కణాలు అంతే తీసుకుంటాయి. కానీ క్యాన్సర్ కణాలు తమకు కావాల్సిన ఆహారం, ఆక్సిజన్ కోసం రౌడీయిజమ్ చేస్తాయి! కబ్జా చేస్తాయి!! అదెలాగంటే... తమవైపు ఎక్కువగా రక్తం ప్రవహించేందుకు వీలుగా... మరిన్ని ఎక్కువ రక్తనాళాలను ఏర్పాటు చేసుకుని ఆహారాన్ని కబ్బా చేస్తాయి. సాధారణ కణాలు అన్ని కణాలకూ రక్తం అందేందుకు రక్త రవాణా వ్యవస్థను ఒక నిర్దిష్టమైన క్రమపద్ధతిలో నిర్మించుకుంటాయి. దానిపేరే ‘యాంజియోజెనెసిస్’. సాధారణంగా రక్తనాళంలోని లోపలి పొర అయిన ఎండోథీలియమ్ నుంచి ఈ రహదారులు ఏర్పడుతుంటాయి. ఇలా ప్రతి సాధారణ కణానికి రక్తనాళాలు ఏర్పడే ప్రక్రియను ‘నార్మల్ యాంజియోజెనెసిస్’ అంటారు. కానీ రౌడీలు దారిదోపిడీ చేసినట్లుగానూ, సామాన్యుల ఆస్తులను కబ్జా చేసినట్లుగానూ వ్యవహరింస్తూ ఆహార కబ్బాలకోసం అనుసరించే మార్గాన్ని వైద్యపరిభాషలో ట్యూమర్ యాంజియోసిస్ అంటారు. ఈ ‘ట్యూమర్ యాంజియోజెనెసిస్’ మార్గంలో పొరుగు ఆరోగ్యకణాలపై రౌడీయిజం చేసి, వాటిని ఎలా కొల్లగొట్టి కబ్జా చేస్తాయో కాస్త విపులంగా చూద్దాం. సాధారణ కణాలూ తమలోకి రక్తం ప్రవహించేందుకు రహదారి పడేలా సిగ్నల్స్ పంపుతాయి. సరిగ్గా అలాంటి సిగ్నల్స్‌నే ఈ క్యాన్సర్ కణాలు కూడా పంపుతాయి. అంతేకాదు.. పక్కన ఉండే హెల్దీ కణాలకు అందే రక్తం కూడా తమకే అందేలా ఆరోగ్యకరమైన కణం మీద దౌర్జన్యం చేస్తాయి. అలా పొరుగుకణాన్ని నాశనం చేస్తాయి. మోసాల... దొంగవేషాల కేడీలివి... Dr. Y Venkata Rami Reddy Medical Director, Omega Hospitals Kurnool, +91 6281066155 క్యాన్సర్ కణాలు చేసే మోసాల తీరు అచ్చం మన సమాజంలోని కేడీలు చేసినట్లుగానే ఉంటాయి. అదెలాగో చూడండి. సాధారణంగా మన దేహంలో నాలుగు ప్రధాన రకాల కణాలుంటాయి. అవి ఎపిథీలియల్, కనెక్టివ్, కండర (మజిల్ టిష్యూ), నాడీకణజాలాలు (నర్వ్ టిష్యూ). సాధారణంగా ఏ అవయవానికైనా... పైవైపున ఉండే కణజాలం ఎపిథీలియల్ కణాలనే కణజాలంతో నిర్మితమై ఉంటుంది. క్యాన్సర్గడ్డకు పైభాగంలో ఉండే ఎపిథీలియల్ కణజాలం కూడా తాను వ్యాధినిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునేందుకు ఒక దొంగవేషంతో మోసం చేస్తుంది. అదేలాగంటే... క్యాన్సర్ కణపు ఎపిథీలియమ్ కణజాలం కాస్తా... అకస్మాత్తుగా కనెక్టివ్ టిష్యూగా మారిపోతుంది. అంటే ఇక్కడ ఎపిథీలియన్ కణాలన్నీ కనెక్టివ్ కణాలుగా మారువేషం వేస్తాయన్నమాట. చాలా సంక్లిష్టంగా జరిగే ఆ ప్రక్రియను కాస్త మనకు అర్థమయ్యే తేలిక భాషలో చెప్పుకుందాం. ఓ పామును పట్టుకుంటే అది తన పైకుబుసాన్ని మన చేతిలో వదిలేసి, కింద కొత్త కుబుసంతో తప్పించుకుని జారిపోయినంత తేలిగ్గా ఈ పని జరుగుతుంది. దీన్నే నిపుణులు ‘ఇన్‌యాక్టివేషన్ ఆఫ్ మాలెక్యులార్ స్విచ్’ అంటారు. రౌడీలకు మద్యంలా ... క్యాన్సర్‌కు చక్కెర మన సినిమాల్లో రౌడీవిలన్లు ఎప్పుడూ చేతిలో మద్యం గ్లాసు పట్టుకుని కనిపిస్తుంటారు కదా. వారికి మద్యం ఎలా ఇష్టమో రౌడీక్యాన్సర్ కణానికి చక్కెర అలా ఇష్టం. వాటి పెరుగుదలకు శక్తి కావాలి. మిగతాక ణాల నుంచి కబ్జా చేసి పొందే ఆ శక్తి గ్లూకోజ్ రూపంలో క్యాన్సర్ కణాలకు అందుతుంటుంది. అనేక పోషకాలూ గ్లూకోజ్, ఆక్సిజన్‌తో కలిసి అందే ఆ శక్తిని పొందే చర్యంతా ‘సెల్ రెస్పిరేషన్’ అనే పేరున్న సంక్లిష్ట ప్రక్రియలో జరుగుతుంది. ఈ శక్తి (ఎనర్జీ)ని అందుకున్న క్యాన్సర్ కణం దాన్ని ఉపయోగించుకొని, మరింత అనియంత్రితంగా పెరుగుతుంది. ఇందుకు అవసరమైన గ్లూకోజ్ (చక్కెర) కోసం అది రౌడీలు మద్యం కోసం వెంపర్లాడినంతగా అన్నమాట! సాధారణ ఆరోగ్యకరమైన కణజాలాలు తమకు అందే గ్లూకోజ్ నుంచి ‘గ్లైకాలసిస్’ అనే ప్రక్రియ ద్వారా శక్తిని తయారు చేసుకుంటాయి. కానీ క్యాన్సర్ కణం ఇలా గ్లైకాలసిస్ను నమ్ముకోదు. పైన చెప్పిన ప్రక్రియ కారణంగా క్యాన్సర్ కణంలోని మైటోకాండ్రియా దెబ్బతింటుంది. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 మద్యం తాగిన వాడు ఆ మత్తులో ఎవరినీ లెక్క చేయడు. ఆ మద్యం ప్రభావంతో ఒక్కోసారి పోలీసులనూ ఎదిరిస్తుంటాడు కదా. అలాగే పైన చెప్పిన అక్రమ ప్రక్రియలో మద్యంలా ఎనర్జీ ని తాగేసి పుంజుకున్న బలంతో ఈ క్యాన్సర్ రౌడీ కణాలు... తమ పాలిటి పోలీస్ అయిన కీమోథెరపీని సైతం ధిక్కరిస్తూ ఉంటాయి. ఆరోగ్యకరమైన సమాజంలో రౌడీలూ, ఉగ్రవాదులు ఉండరు. సమాజం ఆరోగ్యకరంగా లేనప్పుడే అలాంటి సంఘవిద్రోహులు పుట్టుకొస్తారు. అలాగే దేహం ఆరోగ్యంగా లేనప్పుడూ ఆరోగ్యకరమైన క్యాన్సర్ కణంగా మారేందుకూ... వాటి నుంచి మరిన్ని క్యాన్సర్ కణాలు ఉద్భవించేందుకు ఆస్కారం ఉంది. అందుకే సమాజంలాగే దేహాన్నీ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకోసం మనం ఆరోగ్యకరమైన జీవనశైలితో, మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. కాలుష్యపూరితమైన వాతావరణానికి దూరంగా ఉండాలి. ప్రతిరోజూ ఎంతో కొంతసేపు దేహశ్రమ, వ్యాయామం చేస్తూ వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవాలి. మన దేహం బాగుంటే మనందరమూ ఆరోగ్యంగా ఉంటే సమాజమూ బాగుంటుంది. అందరూ హాయిగా, హ్యాపీగా ఉంటారు. సాధారణ కణానికీ... రౌడీ కణానికీ తేడా చూద్దామా! సాధారణ జీవకణాలన్నీ కొన్ని నియమాలను పాటిస్తుంటాయి. అవి నిర్ణీత క్రమంలో విభజితమై పెరుగుతుంటాయి. కణజాలంలోని ఒక కణానికీ, మరో కణానికీ మంచి కమ్యూనికేషన్స్‌తో ఉంటాయి. ప్రోటీన్ల రూపంలో ఉండే సెల్కెమికల్స్ ద్వారా సిగ్నల్స్‌తో పలకరించుకుంటూ, పరస్పరం సహకరించుకుంటూ ఉంటాయి. ఇలా గుండెలో ఉండేవి అక్కడి విధులూ, మెదడు కణాలు వాటి విధులూ, కాలేయకణాలు తమకు నిర్దేశించిన పనులూ చేసుకుంటూ ఉంటాయి. అవి ఎంత క్రమశిక్షణతో వ్యవహరిస్తుంటాయంటే... తమ పనులు తాము చేసుకుంటూ ఉండటమే కాదు... ఒక్కోసారి ఒకవేళ తమకు ఏదైనా కారణంగా అనారోగ్యం కలిగితే.. తమ జబ్బు తమకు మాత్రమే పరిమితం చేసుకునేందుకూ, పక్క కణాలకు అంటకూడదని ‘సెల్‌డెత్’ పేరిట తమను తాము నాశనం చేసుకుంటాయి. అచ్చం సమాజంలోని ఆరోగ్యకరమైన వ్యక్తులు క్వారంటైన్లో ఉండి తమ వ్యాధి ఇతరులకు పాకకుండా ఉన్నట్లుగా అవీ వ్యవహరిస్తాయి. కానీ క్యాన్సర్ పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తుంది! ఉదాహరణకు మన చర్మంలోని కణాలు నిత్యం కొత్తవి పుడుతూ పాతవి చనిపోతూ ఉంటాయి. అలా కొత్తవి పుట్టినప్పటికీ చర్మం ఎప్పటిలా ఒకేలా ఉంటుంది. కానీ క్యాన్సర్ కణాలు పుడుతున్న కొద్దీ ఇష్టమొచ్చినట్టు పెరుగుతూ పోతాయి. అసహ్యకరమైన గడ్డల్లా అడ్డదిడ్డంగా పెరుగుతాయి. అవే క్యాన్సర్ ట్యూమర్లు. దొంగదారుల్లో దాక్కునే ఉగ్రవాదులాంటివి... సమాజంలోని రౌడీలు దొంగదారులు తొక్కుతారు. పోలీసులను తప్పించుకునేందుకు దొంగవేషాలు వేస్తారు. అచ్చం ఇలాగే ఈ క్యాన్సర్ కణాలూ దొంగవేషాలు వేస్తాయి. మన దేహంలో ఉండే వ్యాధినిరోధక వ్యవస్థ ఓ పోలీస్ వ్యవస్థలాంటిదే. రౌడీలూ, దొంగలూ పోలీసులను తప్పించుకునేందుకు అండర్ గౌండ్స్‌లో దాక్కోవడం, మారువేషాలతో మోసాలు చేయడం చూస్తుంటాం కదా. రౌడీ క్యాన్సర్ కణాలూ ఇలాగే చేస్తుంటాయి. అదెలాగో చూద్దాం. మన దేహంలో మనకు మేలు చేసే లింఫ్‌నోడ్స్ ఒక ప్రోటీన్‌ను రూపొందించుకుంటాయి. ఈ ట్యూమర్ కణాలు కూడా అచ్చం అలాంటి ప్రోటీన్‌నే రూపొందించుకుంటాయి. ఇది ఎలా ఉంటుందంటే... ఒక్కోసారి దొంగలే పోలీస్ డ్రస్సులతో వచ్చి వారిని బోల్తా కొట్టించినట్లుగా అవి కూడా తప్పించుకుంటాయి. తమపైని ప్రోటీన్‌ను... అచ్చం ఓ దొంగ ఐడీ కార్డులా, నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్ లా సృష్టించి వాడుకుంటాయి. ఆరోగ్యాన్ని కాపాడే ఈ వ్యాధినిరోధక వ్యవస్థ ఆ ఐడీలను చూసి ఆ కణాలు కూడా తమలాంటి ‘లింఫ్ టిష్యూ’లేమోనని పొరబడి వాటిని వదిలేస్తాయి. అలా రోగనిరో«ధక శక్తుల్లాంటి పోలీస్ వ్యవస్థ కనుగప్పి తప్పించుకోవడమే గాకుండా... క్యాన్సర్లన్నీ ఒంట్లో వివిధ ప్రదేశాలకూ, వేర్వేరు అవయవాలకూ పాకి.... అక్కడా ఆహారం, ఆక్సిజన్‌లాంటి వనరుల కబ్జా, దోపిడీలకు మళ్లీ పాల్పడుతుంటాయి. ఇదొక సైకిల్ కొనసాగుతూ ఇలా నిరంతరం జరిగిపోతుంటుంది. చికిత్సను తప్పించుకోడానికి రౌడీలు, ఉగ్రవాదులు ఒక్కోసారి కూంబింగ్ ఆపరేషన్స్‌నుంచి తప్పించుకునేందుకు... తాము ఉండటానికి ఎవరూ అనుమానించని చోటికి వెళ్లి దాక్కుంటారు. బయట సమాజంలో దాన్ని సేఫ్ షెల్టర్ జోన్ గా అంటుంటారు. అలాగే ఈ మోసకారి కణాలు కూడా సేఫ్ జోన్లలాంటి పక్క కణజాలాల్లోకి దూరిపోయి అక్కడ షెల్టర్ తీసుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు కొన్ని రకాల లూకేమియాలకు కీమోథెరపీ చికిత్స తో ‘కూంబింగ్’ చేసే సమయంలో ఈ ఉగ్ర–క్యాన్సర్ కణాలు పక్కనే ఉండే ఎముకల్లోకి దూరిపోయి తమను తాము రక్షించుకుంటుంటాయి. -
కష్టం వస్తే కన్నీరు కారుస్తారు.. మరి కేన్సర్ వస్తే
హీరోకు కష్టం వస్తే ప్రేక్షకులు కన్నీరు కారుస్తారు. హీరోకు కేన్సర్ వస్తే భరించగలరా? తెలుగు సినిమాకే కాదు భారతీయ సినిమాకు కూడా ‘కేన్సర్’ ఒక హిట్ ఫార్ములాగా నిలిచింది. ‘కేన్సర్’ అని తెలిశాక జీవితాన్ని చూసే పద్ధతి, చేసే త్యాగం, పోరాడే తెగువ, నిలుపుకునే ఆశ... ఇవన్నీ సినిమా కథలుగా మారి బాక్సాఫీస్ హిట్‌గా నిలిచాయి. నేడు ‘వరల్డ్ కేన్సర్ డే’ సందర్భంగా ఆ సినిమాల తలపులు... జ్ఞాపకాలు... పూర్వం తెలుగు ప్రేక్షకులకు గుండెపోటు మాత్రమే తెలుసు. అది కూడా గుమ్మడి వల్ల. ఆయనే గుండె పట్టుకుని చనిపోతూ ఉండేవారు సినిమాలో. కేన్సర్ చాలా ఆధునిక జబ్బు. దానికి కొత్తల్లో తగిన చికిత్స లేకపోవడం విషాదం. ప్రాణరక్షణకు గ్యారంటీ ఉందని చెప్పలేని స్థితి. మృత్యువు దాపున ఉన్నట్టే అన్న భావన ఉంటుంది. ఇది తెలుగు సినిమా కథకు డ్రామా తీసుకురాగలదని సినిమా దర్శకులు కనిపెట్టారు. పూర్వం టి.బి వంటి వ్యాధుల మీద సినిమాలు ఉన్నా కేన్సర్‌లో ఉండే తక్షణ ప్రాణ భయం సినిమా కథల్లో మలుపులకు కారణమైంది. ప్రేమాభిషేకం పాత ‘దేవదాసు’లో దేవదాసు తాగి తాగి చనిపోతాడు. పార్వతిని వదులుకోవాల్సి రావడమే కారణం. ‘ప్రేమాభిషేకం’లో హీరోయిన్ను వదలుకోవడానికి పాతకాలం కాదు. ఆధునిక కాలం. ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవచ్చు. కాని కేన్సర్ కథను మలుపు తిప్పింది. తనకు కేన్సర్ వచ్చిందన్న కారణంతో అక్కినేని తాను ప్రేమించిన శ్రీదేవిని దూరం పెడతాడు. ఆమెను మర్చిపోవడానికి తాగుతాడు. బంగారం లాంటి భవిష్యత్తు ఒక జబ్బు వల్ల బుగ్గిపాలు అవుతుంది. డాక్టర్లు కాపాడలేని ఈ రోగం ఒక ప్రేమికుడి త్యాగానికి కారణమవుతుంది. దర్శకుడు దాసరి అల్లిన ఈ కథ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. సామాన్య ప్రేక్షకుడికి కేన్సర్ అనే వ్యాధి ఉన్నట్టు తెలియచేసింది. ‘ప్రేమాభిషేకం’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అందులోని పాటలు, మాటలు జనం నేటికీ మర్చిపోలేదు. ‘ఆగదు ఏ నిమిషము నీ కోసము’ అని పాట. మనం ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ జాగ్రత్త గా ఉండాల్సిందే. మనకు అనారోగ్యం వస్తే అయ్యో అని లోకం ఆగదు. మన జీవితమే స్తంభిస్తుంది. గీతాంజలి హీరో హీరోయిన్లలో ఒకరికి కేన్సర్ వస్తేనే ప్రేక్షకులు ఆ సినిమాను చూడాలా వద్దా అని ఆలోచిస్తారు. ఇక ఇద్దరికీ కేన్సర్ వస్తే చూస్తారా? ఫ్లాప్ చేస్తారు. కాని దర్శకుడు మణిరత్నం ఈ కథను చెప్పి హిట్ కొట్టాడు. గిరిజకు, నాగార్జునకు కేన్సర్ వచ్చిందని చెప్పి వారు కొద్దిరోజుల్లో చనిపోతారని చెప్పి ఏడుపులు పెడబొబ్బలు లేకుండా కథ నడిపించాడు. మృత్యువు ఎవరికైనా రావాల్సిందే... వీరికి తొందరగా రానుంది... ఈలోపు అన్నింటినీ కోల్పోవడం కంటే జీవితంలో ఉండే ప్రేమను, తోడును ఆనందించ వచ్చు కదా అని కథను చెప్పాడు. ‘గీతాంజలి’ మొదటగా స్లోగా ఎత్తుకున్నా మెల్లగా క్లాసిక్ రేంజ్‌కు వెళ్లింది. ఇళయరాజా పాటలు, వేటూరి సాహిత్యం... ‘రాలేటి పువ్వులా రాగాలలో’... అని ఒక అందమైన ప్రేమకథను చెప్పింది. గిరిజ ఈ ఒక్క సినిమా కోసమే పుట్టిందని ప్రేక్షకులు అనుకున్నారు. మళ్లీ ఆమె నటించలేదు. సుందరకాండ దర్శకుడు కె.భాగ్యరాజ్ కొత్త కొత్త కథలు కనిపెట్టడంలో మేధావి. ఒక స్టూడెంట్‌కు కేన్సర్ వస్తే తాను సుమంగళిగా చనిపోవాలని తన లెక్చరర్నే ప్రేమించి తాళి కట్టించుకోవాలని అనుకుంటుంది. అయితే ఇదంతా చివరలో తెలుస్తుంది. మొదట అంతా ఆ స్టూడెంట్ ఆ లెక్చరర్ వెంట పడితే అమాయకుడు, మంచివాడు అయిన ఆ లెక్చరర్ ఎలా తిప్పలు పడ్డాడో నవ్వులతో చెబుతాడు దర్శకుడు. తమిళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా వెంకటేశ్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో అంతే పెద్ద హిట్ అయ్యింది. ‘సుందరాకాండకు సందడే సండది’ అని కలెక్షన్ల సందడి సృష్టించింది. ఈ సినిమాలో కూడా స్టూడెంట్ పాత్ర వేసిన అపర్ణ ఆ తర్వాత ఇతర చిత్రాల్లో చేసిన ఒకటి రెండు పాత్రల కంటే ఈ ఒక్క పాత్రతోనే అందరికీ గుర్తుండిపోయింది. కేన్సర్‌కు లేడీస్ సెంటిమెంట్‌కు ముడిపెట్టడంతో ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చిందని అనుకోవాలి. ‘నీ మజిలీ మూడునాళ్లే ఈ జీవయాత్రలో... ఒక పూటలోనే రాలు పూలు ఎన్నో’ అని తాత్త్వికంగా వేటూరి రాసిన పాట మనల్ని గాంభీర్యంలో పడేస్తుంది. మృత్యువు సమీపిస్తేనే జీవితం రుచి తెలుస్తుంది. అది గమనికలో పెట్టుకుని అందరినీ ప్రేమించమని తాత్త్వికులు చెబుతుంటారు. మాతృదేవోభవ కన్నీరు... కన్నీరు.. కన్నీరు.. కారిన ప్రతి కన్నీటిబొట్టు కాసులను కురిపించడం అంటే ఏమిటో ఈ సినిమా చెప్పింది. ఇందులో నలుగురు పిల్లలు ఉన్న తల్లిదండ్రుల్లో తండ్రి నాజర్ అనుకోకుండా చనిపోతాడు. కుటుంబం కష్టాల్లో పడింది అనుకుంటే తల్లికి కేన్సర్ వస్తుంది. ఇప్పుడు ఆ పిల్లలు ఏం కావాలి? ఆ తల్లి ఆ పిల్లలకు ఒక నీడ కోసం సాగించే అన్వేషణ గుండెల్ని పిండేస్తుంది. నటి మాధవి చేసిన మంచి పాత్రల్లో ఇది ఒకటి. ఈ సినిమా చూసినవారు కష్టాల్లో ఉన్న కుటుంబాలకు కొద్దో గొప్పో సాయం చేయాలని ఏ దిక్కూ లేని పిల్లలను ఎలాగోలా ఆదుకోవాలని అనుకుంటారు. అంత ప్రభావం చూపుతుందీ సినిమా. ‘వేణువై వచ్చాను భువనానికి... గాలినైపోతాను గగనానికి’ అని వేటూరి రాశారు. అందరం ఏదో ఒకనాడు గాలిగా మారాల్సిందే. కాని ఈ గాలిని పీల్చి బతికే రోజుల్లో కాసిన్నైనా మంచి పరిమళాలు వెదజల్లగలిగితే ధన్యత. చక్రం.. జానీ.. హిందీ ‘ఆనంద్’ స్ఫూర్తితో ‘చక్రం’ తీశారు డైరెక్టర్ కృష్ణవంశీ. కాని అప్పటికే మాస్ సినిమా ఇమేజ్ వచ్చిన ప్రభాస్ కేన్సర్‌తో బాధపడటం ప్రేక్షకులు అంతగా మెచ్చలేకపోయారు. మృత్యువు అనే ఒక పెద్ద వాస్తవానికి తల వొంచితే రోజువారి చిన్న చిన్న స్పర్థలు, పట్టుదలలు, పంతాలు నిలువవనీ వాటికి అతి తక్కువ విలువ ఇస్తామని ఈ సినిమా చెబుతుంది. ‘జగమంత కుటుంబం నాదీ... ఏకాకి జీవితం నాది’ పాట ఈ సినిమా నుంచి వచ్చి నిలిచింది. ‘జానీ’ సినిమా కూడా కేన్సర్ కథాంశం ఉన్నా జనం మెప్పు పొందలేకపోయింది. భార్య కేన్సర్ బారిన పడితే హీరో ఆమె చికిత్సకు కావాల్సిన డబ్బు కోసం ఫైట్స్ చేస్తుంటాడు. ఈ ‘యాక్షన్–సెంటిమెంట్’ సరైన తాలుమేలుతో లేదు. ఆ తర్వాత వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో తల్లికి కేన్సర్ వస్తే పిల్లలు బాధ్యతను ఎరగడం చూపించాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ప్రతిరోజూ పండగే... ఇటీవల కేన్సర్‌ను మెయిన్ పాయింట్‌గా చేసుకుని హిట్ కొట్టిన సినిమా ‘ప్రతిరోజూ పండగనే’. ఇంటి పెద్దకు కేన్సర్ వస్తే పిల్లలు ‘ముసలాడు ఎప్పుడు పోతాడా’ అన్నంత మెటీరియలిస్టులుగా మారడంలోని బండతనాన్ని, అమానవీయతను నవ్వులలో పెట్టి ప్రశ్నించడం వల్ల ఈ సినిమా నిలిచింది. సత్యరాజ్ ఈ పాత్రను పండించడం, తండ్రి గొప్పదనాన్ని మర్చిపోయిన కొడుకుగా రావు రమేశ్ సెటైర్లు సినిమాకు ప్లస్ అయ్యాయి. బహుశా రాబోయే రోజుల్లో కేన్సర్ కథలు ఉండకపోవచ్చు. కథలు ఇకపై మారవచ్చు. మనిషి ఇవాళ డిజిటల్ ప్రపంచంలో పడి ఒంటరితనం అనే కేన్సర్‌లో పడటం సినిమా కథ కావచ్చు. సమయాన్ని ఫోన్లో కూరేస్తూ ఇంట్లోని సభ్యులు కూడా మాట్లాడుకోకపోవడానికి మించిన కేన్సర్ లేదని చెప్పే కథలే ఇకపై రావచ్చు. వాటి అవసరం ఉంది కూడా. బహుశా రాబోయే రోజుల్లో కేన్సర్ కథలు ఉండకపోవచ్చు. కేన్సర్‌ను దాదాపుగా జయించే దారిలో మనిషి ఉన్నాడు. కనుక కథలు ఇకపై మారవచ్చు. మనిషి ఇవాళ డిజిటల్ ప్రపంచం వల్ల ఒంటరితనం అనే కేన్సర్‌లో పడటం సినిమా కథ కావచ్చు. మొత్తం సమయాన్ని ఫోన్లో కూరేస్తూ ఇంట్లోని సభ్యులు కూడా మాట్లాడుకోకపోవడానికి మించిన కేన్సర్ లేదని చెప్పే కథలే ఇకపై రావచ్చు. వాటి అవసరం ఉంది కూడా. – సాక్షి ఫ్యామిలీ -
క్యాన్సర్ రహిత దేశాన్ని నిర్మించుకోవాలి: బ్రహ్మనందం
సాక్షి, తూర్పుగోదావరి : క్యాన్సర్ రహిత భారత దేశాన్ని దూపొందించుకోవాల్సిన అవసరం ఉందని పద్మశ్రీ పురస్కార గ్రహీత, హస్యనటుడు బ్రహ్మనందం తెలిపారు. పిబ్రవరి 4 (మంగళవారం) ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ గురించి అందరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. పొగాకు మన సంస్కృతి కాదని, విదేశీయులకు ఉన్న పొగతాగే అలవాటును మనం నేర్చుకున్నామని తెలిపారు. ఈ మధ్య కాలంలో విదేశీ ప్రభావం ఎక్కువ అవడం వల్ల వారి అలవాట్లు బాగా నేర్చుకున్నామన్నారు. మంచి ఆరోగ్యం ఒక వరమని.. అలాంటి వరాన్ని అందరూ పొందాలని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో గుండె, క్యాన్సర్ రోగాలు ఎక్కువగా వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చారని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఉచిత వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. -
క్యాన్సర్‌పై పోరు ఓ యుద్ధతంత్రం
యుద్ధాన్ని గెలవాలంటే యుద్ధతంత్రాన్ని అనుసరించాలి. క్యాన్సర్‌పై పోరాటం కూడా యుద్ధమే. దానికీ ఓ తంత్రం కావాలి. స్టెమ్‌సెల్ థెరపీ, లైట్‌తో ఇచ్చే ఫోటో డైనమిక్ థెరపీలు, అతివేడి లేదా అతి చల్లటి ఉష్ణోగ్రతలతో చేసే చికిత్సలు, మెట్రానమిక్స్ లాంటి కొత్త కొత్త ప్రక్రియలెన్నో ఉన్నా... మనందరికీ తెలిసినవి కీమో, రేడియేషన్, శస్త్రచికిత్స, టార్గెట్ థెరపీ, ఇమ్యూనోథెరపీ లాంటివి. ఈ ఐదింటిలోనూ దీన్నెప్పుడు, ఎలా, ఏ మోతాదులో వాడాలన్నదే ‘చికిత్సాయుద్ధ(పంచ)తంత్ర’మనుకోవచ్చు. ఇక చిన్నప్పుడు పంచతంత్ర కథలను మనందరం చదివాం కదా. రాజుగారి కొడుకులకు తేలిగ్గా లోకరీతులపై అవగాహన కలిగించడం కోసం విష్ణుశర్మ రాసిందే పంచతంత్రం. క్యాన్సర్‌పై యుద్ధతంత్రాలను మనం కూడా అంతే తేలిగ్గా అచ్చం పంచతంత్ర కథల్లాగే సులువుగా, తేలిగ్గా తెలుసుకుందాం. అవే క్యాన్సర్–మిత్రలాభం, క్యాన్సర్–మిత్రభేదం, క్యాన్సర్– సంధి, విగ్రహానికి బదులుగా నిగ్రహం కథలు. ఇక చదవండి. అవగాహన పెంచుకోండి. క్యాన్సర్ – మిత్రలాభం లేడిని తినే ఉద్దేశంతో ఓ నక్క దాంతో స్నేహం చేసింది. ఓనాడు లేడి దగ్గరికి వెళ్లి ‘‘దగ్గర్లోని ఓ రైతు పొలంలో రుచికరమైన పచ్చగడ్డి ఉంది. తిందువుగానీ రా’’ అంది. ముందుగా లేడి కాస్త సందేహించినా పచ్చగడ్డి మీద ఆశతో వెళ్లి, అక్కడ రైతు పన్నిన వలలో చిక్కుకుంది. రైతు వచ్చి లేడిని చంపి పారేస్తాడనీ... అప్పుడు దాని మాంసం తాను తినొచ్చని నక్క వేచిచూస్తోంది. తన మిత్రుడైన లేడి కనిపించడం లేదని వెతుకుతూ దాని స్నేహితుడైన కాకి అక్కడికి వచ్చి, పరిస్థితి గ్రహించింది. ‘నువ్వు చచ్చిపడినట్టు నటించు. రైతును నమ్మించడానికి నేను నా ముక్కుతో నిన్ను పొడుస్తున్నట్టు నటిస్తాను. రైతు వల తొలగించగానే పారిపో’ అని ఉపాయం చెప్పింది. ఆ ప్రకారం... లేడి తప్పించుకుంది. ఇప్పుడు మనం ఓ క్యాన్సర్ కథ చెప్పుకుందాం. అది కూడా అచ్చం పై కథలాగే ఉంటుంది. ఓ చిన్నారికి బ్లడ్‌క్యాన్సర్ సోకింది. అంటే... పాత తెల్లరక్తకణాలు పూర్తిగా చనిపోకముందే కొత్తవి పుట్టుకొస్తూ... రక్తం తన పని తాను చేయకుండా అడ్డుపడటమే ఈ బ్లడ్ క్యాన్సర్. ఇలా క్రమపద్ధతిలో కాకుండా తెల్లరక్తకణాలు అదేపనిగా పుట్టడానికి కారణం టైరోసిన్ కైనేజ్ అనే ఓ రసాయనం. అదిలా అడ్డదిడ్డంగా, అదేపనిగా రక్తంలోని తెల్లరక్తకణాలు పుట్టడానికి దోహదపడుతుంది. ఏదైనా ఉపాయంతో ఆ టైరోసిస్ కైనేజ్‌ను ఆపేస్తే? అప్పుడు తెల్లరక్తకణాలు పుట్టడమూ ఆగిపోతుంది. దాంతో రోగి ఎప్పటిలాగే ఆరోగ్యంగా, మామూలుగా ఉంటాడు. మన ఈ కథలో రోగి ... ఓ లేడిలాంటి చిన్నారి. టైరోసిస్ కైనేజ్ నక్క. తెల్లరక్తకణాలు పుట్టేలా చేసే అంశం రైతు. టార్గెట్ థెరపీలో ఇచ్చే ‘ఇమాటనిబ్’ లాంటి కొన్ని మందులు కాకిలాంటివి. ఇప్పుడు ఇమాటనిబ్ లాంటి ఆ మందులు లేడిలాంటి చిన్నారిలోకి ప్రవేశించి, టైరోసిస్ కైనేజ్ నక్కను, ఆ మాటకొస్తే రైతునూ కన్ఫ్యూజ్ చేస్తాయి. దాంతో ఇష్టమొచ్చిన రీతిలో, ఓ క్రమపద్ధతి లేకుండా తెల్లరక్తకణాలను పుట్టించే ప్రక్రియ ఆగుతుంది. దాంతో చిన్నారి లేడికి లేచిందే పరుగులా పరుగెడుతూ మునపటిలాగే ఆరోగ్యంగా ఉంటుంది. మరో కథ చూద్దామా! ఒక చోట ధాన్యపు గింజలు చెల్లాచెదురుగా ఉండటం కొన్ని పావురాలు చూశాయి. అక్కడ పరచి ఉన్న వలను చూడకుండా చిక్కుకుపోయాయి. అవన్నీ ఓ ఉపాయం ఆలోచించాయి. సమష్టిగా ఎగిరిపోయి... ఓ ఎలుక సహాయంతో తమ వలను ఛేదించుకున్నాయి. అంటే... ఇక్కడ పనికి వచ్చింది పావురాలూ–ఎలుకల మిత్రత్వం. అలాగే క్యాన్సర్‌ను ఎదుర్కోవాలంటే కొన్నింటితో స్నేహం చేయాలి. ముందుగా మనం స్నేహం చేయాల్సింది ఆరోగ్యకరమైన జీవనశైలితో, మంచి అలవాట్లతో. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే కూరగాయలూ, తాజాపండ్ల వంటివి తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి చేస్తే... అవి రోగమనే వలను ఎలకల్లా కొరికేస్తాయి. అటు తర్వాత ముందుగానే క్యాన్సర్‌ను తెలుసుకునే కొన్ని వైద్యపరీక్షలతోనూ మిత్రత్వం వహించాలి. మరో ముఖ్యమైన అంశమైన కుటుంబసభ్యుల తోడ్పాటూ, ఇంకో అంశమైన డాక్టర్ సహాయంతో క్రమం తప్పకుండా తీసుకునే చికిత్స ప్రక్రియలూ... వీటన్నింటి సహాయంతో రోగి ధైర్యం చిక్కబట్టుకుని పావురాల్లా ఎగిరితే... మందులూ, రేడియేషన్, సర్జరీ వంటి ప్రక్రియలు మూషిక మిత్రుల్లా జబ్బును కొరికి పేషెంట్‌ను రోగవిముక్తం చేస్తాయి. అలాగే రోగి మరికొన్ని చికిత్స ప్రక్రియలతోనూ క్రమం తప్పకుండా స్నేహం చేయాలి. అవే... ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, బయాప్సీ వంటి పరీక్షలు. కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు ఈ పరీక్షలతో వ్యాధిని అనుమానించాక... మరికొన్ని నిర్ధారణ పరీక్షలనూ చేయించాలి. అవే... నిర్దిష్టమైన కొన్ని రక్తపరీక్షలు, మల, మూత్రపరీక్షలు, సీటీ స్కాన్, పెట్ స్కాన్, ఎమ్మారై వంటివి చేస్తారు. సీటీస్కాన్, ఎమ్మారై పరీక్షలు కణితి ఉన్న ప్రదేశాన్ని, దాని పరిమాణాన్ని నిర్ధారణ చేయడానికి ఉపయోగపడే పరీక్షలు. ఇలాంటి పరీక్షలతో క్యాన్సర్ రోగి ఎప్పుడూ స్నేహం వహించి ఉండి, క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉంటే... వ్యాధి తగ్గాక కూడా తిరగబెట్టకుండా చూసుకుంటూ జీవితాంతం హాయిగా, అసలు ఒకప్పుడు వ్యాధి వచ్చిన దాఖలా కూడా లేకుండా పూర్తిగా నార్మల్ వ్యక్తిలాగే ఉండవచ్చు. క్యాన్సర్ – మిత్రభేదం ఓ దేశంలో శ్వేతకాష్టుడూ... మద్యముడూ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. శ్వేతకాష్టుడు పైకి తెల్లగా, అందంగా ఉంటాడు. నెత్తిచివర కాష్టంలా మండుతూ ఉంటాడు. ఇలా తెల్లగానూ, మండుతూనే ఉండటం వల్ల వాడికి శ్వేతకాష్టుడు అలియాస్ సిగరెట్టుడు అనే పేరూ ఉంది. వీడికీ ఫ్రెండ్స్ చాలామందే ఉంటారు. చుట్టా, బీడీ, జర్దా, ఖైనీ, గుట్కా, ముక్కుపొడి వీళ్లంతా శ్వేతకాష్టుడి క్లోజ్ ఫ్రెండ్స్. ఇక మద్యముడు కూడా బంగారు రంగున్న పానీయరూపంలోనే గాక రకరకాల రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటాడు. ఈ ఇద్దరు మిత్రులంతా దేశంలోని ప్రజల దగ్గరికిపోయి... ‘మిత్రులారా... మీరు స్ట్రెస్సాసురుడూ, టెన్షనుడు అనే రాక్షసుల బారిన పడి నలిగిపోతున్నారు. మమ్మల్ని ఆశ్రయించి... మీరు వారి నుంచి దూరం కావచ్చ’ని చెబుతుంటారు. అలా సదరు స్ట్రెస్సాసురుడూ, టెన్షనుల పీడవిరగడ చేస్తామంటూ...వీళ్లంతా ఆ దేశ అమాయక ప్రజల్ని క్యాన్సరాసురుడికి ఆహారంగా పంపుతుంటారు. అందుకే స్ట్రెస్సాసుర, టెన్షనులను వదిలించుకోవడం కోసం ఈ శ్వేతకాష్టుడు, మద్యములనే ఈ చెడుమిత్రుల స్నేహం నుంచి రక్షించుకోవాలి. ఇందుకోసం మనం రిలాక్సేషన్ ప్రక్రియలూ, యోగా వంటి మంచి మిత్రుల సహాయంతో మిత్రుల రూపంలోని ఆ శత్రువులకు దూరంగా ఉండాలని చెప్పే కథే... క్యాన్సర్–మిత్రభేదం చెప్పే మాట. విగ్రహానికి బదులు నిగ్రహం... పంచతంత్రంలోని విగ్రహానికి బదులు మనం ‘నిగ్రహం’ అనే మరో అంశాన్ని తెలుసుకుందాం. మనం కొన్ని అంశాల పట్ల నిగ్రహం పాటించాలి. ఉదాహరణకు పిజ్జాలు, బర్గర్లలాంటి బేకరీ ఐటమ్స్. ఇవన్నీ చాలా త్వరత్వరగా, రుచిగా తమను తినేయవచ్చంటూ మనల్ని ఊరిస్తుంటాయి. మరికొన్ని ఆహారాల్లోని కలరేటివ్స్ అనే ఆకర్షణీయమైన, అందమైన రంగులు మన కంటిని కట్టిపడేస్తుంటాయి. అప్పటికప్పుడు టెంప్ట్ అయి తినేసేలా మనల్ని ఆకర్షిస్తుంటాయి. ఇంకొన్ని ఆహారాలైతే రుచికరంగా ఉండేందుకూ, చాలాకాలం పాటు నిల్వ ఉండేందుకు కృత్రిమ నెయ్యి, ప్రిజర్వేటివ్స్ రూపంలో రారమ్మని పిలుస్తుంటాయి. అందుకే వాటి నుంచి నిగ్రహం పాటించాలి. మన ఈ పంచతంత్రలోని ‘నిగ్రహం’ శీర్షికలో మనం తెలుసుకోవాల్సిన అంశాలివి. ఇలా ఈ తంత్రాలన్నింటి మనల్ని క్యాన్సర్‌ను దూరంగా ఉంచుతాయి. ఒకవేళ ఇన్ని జాగ్రత్తలూ పాటించినా, క్రమం తప్పకుండా క్యాన్సర్‌ను నివారించే మిత్రులకు దగ్గరగా ఉండి, క్యాన్సర్ కలిగించే వాటిని దూరంగా ఉండి, క్యాన్సర్ వ్యాక్సిన్ల సహాయంతో సంధి చేసుకుని, నిగ్రహం గా క్యాన్సర్‌ను కలగజేసే ఎన్నింటినుంచో దూరంగా ఉన్నప్పటికీ ఒక్కోసారి క్యాన్సర్ రావచ్చు. దురదృష్టవశాత్తూ అలా ఎవరికైనా వ్యాధి వచ్చినా... ఆందోళన పడకుండా మానసిక సై్థర్యం, ధైర్యం కలిగి, చికిత్స చేయించుకుని నిండునూరేళ్లూ జీవించడానికి తోడ్పడే తారకమంత్రాలే పైన చెప్పిన పంచతంత్రాల్లాంటి క్యాన్సర్ యుద్ధతంత్రాలు. క్యాన్సర్ – సంధి ఇక్కడ మన ‘క్యాన్సర్ సంధి’ గురించి కాస్త నేరుగానే తెలుసుకుందాం. కొన్ని క్యాన్సర్లలో అవి వచ్చాక పోరాటం చేయడం కంటే... అవి రాకముందే మనలోని కణాలను కొన్ని రకాల వ్యాక్సిన్లతో సంధి చేసుకునేలా చూడాలి. ఉదాహరణకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్)కు కారణం మనకు కచ్చితంగా తెలుసు. అది హెచ్‌పీవీ అనే వైరస్‌తో వస్తుంది. అది రాకుండా అమ్మాయిలకు ఓ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అమ్మాయిలందరూ ఆ వ్యాక్సిన్‌తో సంధి చేసుకోవాలి. అదెలాగంటే... తొమ్మిదేళ్ల వయసు నుంచి పెళ్లికాని అమ్మాయిలందరూ (అంటే శృంగార జీవితం ప్రారంభం కాకముందు) ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఈ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ అండాశయం, గొంతుక్యాన్సర్లు రాకుండా కూడా చేసే అవకాశముందనీ, 40 ఏళ్లు వచ్చే వరకు మహిళలు ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చని డాక్టర్స్ సలహా ఇస్తుంటారు. అలాగే హెపటైటిస్–బి వస్తే... అది భవిష్యత్తులో కాలేయ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. హెపటైటిస్–బి వైరస్ సోకకుండా వ్యాక్సిన్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని వేయించుకోవడం ద్వారా కాలేయ క్యాన్సర్‌ను నివారించుకోవచ్చు. ఇలా మనం సర్విక్స్, కాలేయ క్యాన్సర్లను నివారించడానికి హెచ్‌పీవీ వ్యాక్సిన్, హెపటైటిస్ వ్యాక్సిన్లతో సంధి చేసుకోవడం ద్వారా... ఆ క్యాన్సర్లను నివారించుకోవచ్చు. ఇలాగే మనం సంధి చేసుకోవడం కోసం మరిన్ని వ్యాక్సిన్లను రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా మన విజ్ఞానవేత్తలూ, వైద్యశాస్త్రజ్ఞులు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు. -
మెరుగవుతున్న మెట్రానమిక్స్ థెరపీ!
ఒక శతాబ్దకాలంగా వైద్యరంగంలో అత్యంత వినూత్యమైన మార్పులు వస్తూ ఉన్నప్పటికీ ప్రపంచంలోనే అత్యంత భయానకమైన వ్యాధుల్లో ఒకటిగా పేరొందిన క్యాన్సర్‌కు మాత్రం ఇంకా మందు కనుక్కోలేకపోయాం. కానీ ఈ రంగంలోని పురోగతే రోగుల జీవితాన్ని మరింత సౌకర్యంగా మారుస్తోంది. అందుకు ఆధునిక విజ్ఞానానికి మనమెంతగానో రుణపడి ఉండాల్సిందే. ఏదైనా ఒక పరిశోధన జరిగిందనుకోండి. అదెంతవరకు సఫలమైందో చెప్పడానికి ఓ అంచనా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశకాలే ఆ పరిశోధనకు గీటురాయి. రోగి పరిస్థితి ఎలా ఉందో అంచనావేసేందుకు... అతడి అంతర్గత అవయవాల కార్యకలాపాలు (ఫిజియలాజికల్ స్టేటస్), రోగి ఎంతగా బాగున్నాడు (ఫిట్నెస్) అనే అంశాలు ఆ పరిశోధన ఏ మేరకు సత్ఫలితాలు సాధించిందో చెబుతాయి. ఈ రకంగా రోగి జీవితం/పరిస్థితి (పర్ఫార్మెన్స్ స్టేటస్) బాగుంటే పరిశోధన విజయవంతమైనట్లే. కానీ క్యాన్సర్‌కు మనం చికిత్స చేసే సమయంలో కొన్ని సందేహాలు మనల్ని (అంటే డాక్టర్లనీ, రోగి కుటుంబ సభ్యులనూ) వెంటాడుతుంటాయి. అవేమిటంటే... ►ఇప్పటికే జబ్బు కారణంగా రోగి శరీరమెంతో కృశించి పోయి ఉంది. ఇలాంటప్పుడు చికిత్స (ఉదాహరణకు కీమోథెరపీలాంటివి) ఇచ్చి అతడిని మరింత కుంగిపోయేలా చేయవచ్చా? దాంతో అతడి జీవితం (పెర్ఫార్మెన్స్ స్టేటస్) బాగుపడేదెంత? ►అమ్మో... ఈ చికిత్స తీవ్రతను రోగి శరీరం తట్టుకోలేదేమో అంటూ అతడికి చికిత్స ఇవ్వకుండా ఉంచడం ఏ మేరకు సరైనది అంటూ కొందరికి చికిత్స అందించడం కంటే అలా వదిలేయడమే మంచిదంటారు. కానీ ►అందరిలాగే అతడికీ ఓ జబ్బులేని జీవితం, సుదీర్ఘకాలం బతికే అవకాశం ఇవ్వద్దా? ఈ ప్రశ్నలకు మనమే అంటే మన భారతీయ సైంటిస్టులే ప్రపంచానికి ఓ జవాబు చెబుతున్నారు. అనాదిగా మనకు తెలిసిన విజ్ఞానాన్ని ఉపయోగించి ‘మెట్రానామిక్స్ థెరపీ’ ద్వారా పై సందేహాలకు సమాధానం చెబుతున్నారు. క్యాన్సర్ చికిత్సలో కొత్తవెలుగు ఒకరికి క్యాన్సర్ వ్యాధి ఉంది. సాధారణంగా క్యాన్సర్ వ్యాధుల్లో అది ఏ మేరకు పాకింది, దాని తీవ్రత ఎంత అన్న అంశం ఆధారంగా స్టేజ్–1, స్టేజ్–2, స్టేట్–3, స్టేజ్–4 అని నాలుగు దశలుగా విభజిస్తారన్న విషయం తెలిసిందే. సాధారణంగా స్టేజ్–1, స్టేజ్–2 వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తారు. స్టేజ్–3, స్టేజ్–4 ఉన్నవారిలో వ్యాధి ముదిరిందనీ, చికిత్స ఇవ్వడం కంటే అలా వదిలేయడమే మంచిదని చాలా సందర్భాల్లో అంటుంటారు. అంటే వారికి చికిత్స ఇవ్వడంలోని బాధలు భరిస్తూ... జీవితాన్ని కొనసాగించడం కంటే... ఆ జీవించి ఉన్న కాలంలోనే అలాంటి బాధలేమీ లేకుండా హాయిగా బతికితే మంచిదంటూ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు. కానీ ఇలాంటి వారికీ ఒక్కోసారి జీవితాన్ని పొడిగిస్తే అది మంచి పరిణామానికి దారితీసే అవకాశాలు ఉండవచ్చు. ఉదాహరణకు బాధాకరమైన చికిత్స ఇవ్వడం ద్వారా ఒకరి జీవితాన్ని కేవలం ఆరు నెలలు మాత్రమే పొడిగించే అవకాశం ఉందనుకుందాం. అలా చేయకపోతే ఏ మూడు నుంచి నాలుగు నెలలు ఎలాంటి బాధా లేకుండా జీవింవచ్చనుకుందాం. అలాంటప్పుడు ఆ అదనపు మూడు నెలల జీవితకాలం కోసం ఆ ప్రాణిని అంతగా బాధపెట్టాలా అన్న భావన చాలామందిలో రావచ్చు. కానీ వైద్యవిజ్ఞానంలో చాలావేగంగా ఇప్పుడు చోటు చేసుకుంటున్న పురోగతి కారణంగా మూడు నెలల చికిత్స తర్వాత ఆ వ్యక్తి మరో మూడు నెలలు అదనంగా బతికిడానుకోండి. ఆ వ్యవధిలో మరేదైనా పురోభివృద్ధి కారణంగా మరో అద్భుతమైన ఔషధమో, ప్రక్రియో అందుబాటులోకి వస్తే ఆ రోగి జీవితకాలాన్ని మరిన్ని ఏళ్లు పొడిగించే అవకాశం దొరుకుతుంది కదా అన్నది ఓ భావన. దానికి ఉపయోగపడేదే ఈ మెట్రానమిక్స్ థెరపీ. మెట్రానమిక్స్ థెరపీ అంటే... ఇందులో కీమోథెరపీకి ఇచ్చే మందులనే... వాటి దుష్ప్రభావాలు పడనంతటి చిన్న చిన్న మోతాదుల్లో ఇస్తారు. ఇలా చిన్న చిన్న మోతాదుల్లో ఇవ్వడం అన్నది దానికోసం ఇచ్చే సాధారణ షెడ్యూల్‌కు అనుగుణంగా కాకుండా చాలా సుదీర్ఘకాలం పాటు కొనసాగిస్తూ ఉంటారు. దీని ప్రభావం కేవలం క్యాన్సర్ కణం మీద మాత్రమే గాక... ఆ క్యాన్సర్ కణాలుండే ప్రాంతపు పరిసరాల (మైక్రో ఎన్విరాన్మెంట్) మీద కూడా పడుతుంది. దాంతో ఈ మందు అక్కడి ఎండోథీలియన్ కణజాలం మీద కూడా పనిచేస్తూ అక్కడ యాంటీ–యాంజియోజెనిక్ ప్రభావం చూపుతుంది. అంటే... ఉదాహరణకు ఎండోథీలియమ్ అంటే ఒక రక్తనాళమో ఏదైనా పైప్లాంటిదో ఉందనుకోండి. అలాంటి దానికింద ఏర్పడే ఒక పొరలాంటిది అనుకోవచ్చు. ఏదైనా క్యాన్సర్ కణం... పొరుగునున్న కణజాలం కంటే ఎక్కువ ఆహారాన్ని లాక్కోవడం కోసం కొత్త కొత్త రక్తనాళాలను పుట్టించుకుంటూ... ఆ కొత్త రక్తనాళమార్గాల ద్వారా మరింత ఆహారాన్ని, పోషకాలను గ్రహిస్తుంటాయి. ఈ చిన్నమోతాదుల్లో ఇచ్చే మందులు ఆ యాంజియోజెనిక్ ప్రక్రియను ఆపేయడం ద్వారా కొత్త రక్తనాళాలు పుట్టడానికి ఆస్కారమివ్వవు. ఇలా కొత్తరక్తనాళాలను పుట్టనివ్వని ప్రక్రియనే ‘యాంటీ–యాంజియోజెనిక్’ ప్రభావంగా చెప్పవచ్చు. ఈ మెట్రానమిక్ థెరపీలో వాడే మందులు కేవలం యాంటీ–యాంజియోజెనిసిస్‌ను మాత్రమేగాక చాలావరకు రోగిలోని రోగనిరోధక శక్తిని పెంచే పనిని కూడా చేస్తుంటాయి. ఈ ఇమ్యునలాజికల్ యాక్షన్ వల్ల రోగిలో క్యాన్సర్ వ్రణం క్రమంగా తన తీవ్రతను తగ్గించుకుంటూ పోతుంటుంది. ఇలాంటి సమయంలో ఈ మెట్రానమిక్ థెరపీలో వాడే మందులకు తోడుగా... నిర్దిష్టంగా కణాన్నే లక్ష్యంగా ఎంచుకుని తుదముట్టించే టార్గెట్ థెరపీ మందులనూ, రోగనిరోధక శక్తిని పెంచే మందులనూ కలిపి ఇవ్వడం ద్వారా రోగి జీవితకాలాన్ని పెంచవచ్చు. గత పదిహేనేళ్ల వ్యవధిలో చాలా రకాల క్యాన్సర్లకు ఇవ్వాల్సిన మెట్రానమిక్థెరపీ మీద చాలా అధ్యయనాలే జరిగాయి. అయితే దురదృష్టవశాత్తు... ఒక మందు తాలూకు ప్రభావాన్ని నిర్ణయించే రెండు అంశాలైన... అంతర్గత అవయవాల కార్యకలాపాలు (ఫిజియలాజికల్ స్టేటస్), రోగి ఎంతగా బాగున్నాడు (ఫిట్నెస్) అనేవి అంతగా మెరుగ్గా కనిపించలేదు. దుష్ప్రభావాలూ దాదాపుగా ఉండవు... అయితే మెట్రానమిక్ థెరపీలో వాడే మందుల మోతాదు చాలా స్వల్పం కావడం వల్ల వాటి దుష్ప్రభావాలు (సైడ్ఎఫెక్ట్స్) సైతం చాలా తక్కువగా ఉండటం లేదా అస్సలు లేకపోవడం జరుగుతుంది. ఇలాంటి మందులకు ఆమోదం (ఎథికల్ అప్రూవల్స్) లభించిన తర్వాత కొందరు యువ సైంటిస్టులు వాటిని రోగుల మీద ప్రయోగించి చూశారు. దాంతో అంతకుముందు తప్పనిసరిగా మరణిస్తారని భావించిన రోగుల్లో దాదాపు 29% మంది తాలూకు జీవితకాలం పెరిగింది. దాంతో వారి ఆయుష్షును పొడిగించినట్లయ్యింది. ఈ రోగుల్లో కొందరైతే వారు బతుకుతారనుకున్న దానికంటే దాదాపు 489 రోజులు అదనంగా జీవించారు. అది కూడా మంచి నాణ్యమైన జీవితాన్ని అనుభవిస్తూ! అందువల్ల పైన పేర్కొన్న రెండంశాలలో ఒక అంశం మాత్రం పూర్తిగా సాధించినట్లయ్యింది. అది కూడా ఎలాంటి తీవ్రమైన చికిత్సా ఇవ్వకుండానే. ఇక దీని విశిష్టత ఏమిటంటే... సాధారణంగా కీమోలో కనిపించే ఎలాంటి అసౌకర్యాలూ, ఇబ్బందులూ ఉండవు. ఈ మందు వాడిన ప్రతి 10 మందిలో ముగ్గురి జీవనం అలా స్థిరంగా గడవడమో లేదా మరింత మెరుగుపడటమో జరిగింది తప్ప మెట్రానమిక్స్ వల్ల ఇతర నష్టాలేమీ లేవు. దీని ఆధారంగా రోగి ఏ మేరకు మెరుగుపడే అవకాశం ఉంది, మరెంత కాలం జీవించేందుకు అవకాశం ఉంది... అనే అంశాలను నిర్ణయించేందుకు ఎన్నెన్నో రకాల క్యాన్సర్లలో ఎన్నెన్నో వేర్వేరు లెక్కలను రూపొందించడం జరుగుతోంది. ఈ రకరకాల క్యాన్సర్లలో ప్రోస్టేట్, పెద్దపేగు/మలద్వార (కోలోరెక్టల్), రొమ్ము క్యాన్సర్లతో పాటు మెలనోమా వంటి చర్మక్యాన్సర్లపై అధ్యయనాలు జరుగుతున్నాయి. అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న ఈ అధ్యయన కాలాన్ని చాలా కీలకమైన సమయంగా ఎంచాలి. అయితే కొంతమంది వ్యక్తులు క్యాన్సర్ రోగులకు కీమో ఇవ్వడం కంటే వారిని అలా ప్రశాంతంగా... ఏ బాధలూ, ఇబ్బందులూ లేకుండా బతికినంత కాలం బతికి చనిపోయేలా చేయడం మంచిదనే శుష్కప్రియాలు చెబుతుంటారు. ఇలాంటి వదంతులూ, వృథాకబుర్లు చెప్పేవారంతా ప్రయోగాత్మకంగా నిర్వహితమవుతున్న ఈ కొత్త ప్రక్రియ గురించి మాట్లాడకుండా ఉంటూ.. తమ పుకార్లను అదుపు చేసుకోవాలనీ, ఈ అధ్యయనాలు ఒక కొలిక్కి వచ్చేవరకు తమ వదంతులకు ఫుల్స్టాప్ వేయాలంటూ శాస్త్రవేత్తలతో పాటు సైంటిఫిక్ కమ్యూనిటీకి చెందిన ఇతర సిబ్బంది ‘‘స్టాప్ మిత్ స్ప్రెడింగ్’’ అంటూ ఆశావాదులంతా పిలుపునిస్తున్నారు. డాక్టర్ ఏవీఎస్ సురేశ్, సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ అండ్ హిమటో ఆంకాలజిస్ట్, సెంచరీ హాస్పిటల్స్, హైదరాబాద్ -
‘ఈ కత్తిగాట్లను నేను గౌరవంగా భావిస్తున్నాను’
వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా నటుడు ఆయుష్మాన్ ఖురానా భార్య తహీరా కశ్యప్ పోస్ట్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ‘ఇవాళ నా రోజు. అందరికీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ రోజును ఘనంగా జరుపుకోవాలి. ముందు మనం ఈ వ్యాధిపై మనకున్న అపోహలను తొలగించుకోవాలి. అందుకే ఈ ఫొటోను పోస్ట్ చేస్తున్నాను. నా ఒంటిపై ఉన్న ఈ కత్తిగాట్లు ఓ గౌరవ చిహ్నంగా భావిస్తున్నాను. నేను రోగాన్ని కాకుండా దానిని ధైర్యంగా ఎదుర్కొన్న తీరును చెప్పడానికి ఈ ఫొటోను పోస్ట్ చేశాను’ అంటూ తహీరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటోను బాలీవుడ్ ప్రముఖులతో పాటు నెటిజన్లు కూడా తెగ లైక్ చేస్తున్నారు. View this post on Instagram Today is my day! Wish you all a happy #worldcancerday and hope each one of us celebrates this day in an embracing way. That we remove any stigma or taboo associated with it. That we spread awareness about it and that we have self love no matter what. I truly embrace all my scars as they are my badges of honour. There is nothing known as perfect. Happiness lies in truly accepting yourself. This was a tough one for me. But this picture was my decision as I want to celebrate not the disease but the spirit with which I endured. To quote my mentor, Diasaku Ikeda, “Leading an undefeated life is eternal victory. Not being defeated, never giving up, is actually a greater victory than winning, not being defeated means having the courage to rise to the challenge. However many times we’re knocked down, the important thing is we keep getting up and taking one step-even a half step- forward” #worldcancerday #breastcancerawareness #breastcancerwarrior #turningkarmaintomission #boddhisatva Thanks @atulkasbekar for this one❤️ A post shared by tahirakashyapkhurrana (@tahirakashyap) on Feb 3, 2019 at 11:32pm PST మీ మాటలు చాలా మందికి ధైర్యాన్ని ఇస్తాయంటూ మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. తహీరా కశ్యప్ తొలిదశ రొమ్ము క్యాన్సర్ (1A)తో బాధపడిన సంగతి తెలిసిందే. చికిత్సలో భాగంగా చాలా సర్జరీలను కూడా చేయించుకున్నారు. ఈ విషయం గురించి తహీరా మాట్లాడుతూ.. ‘ఈ ప్రయాణం చాలా కష్టం. ఇక్కడ పర్ఫేక్ట్గా ఏది ఉండదు. మనల్ని మనలా అంగీకరించడంలోనే నిజమైన సంతోషం ఉంటుంది. ఈ ఫోటోను నేను పడిన బాధను తెలియజేసే చిహ్నంలా కాక క్యాన్సర్‌పై నా గెలుపుకు గుర్తుగా పోస్ట్ చేశాను’ అంటూ చెప్పుకొచ్చారు. -
నేనున్నాను నేనుంటాను
‘అయామ్.. ఐ విల్’. ఇదీ ఈ ఏడాది వరల్డ్ క్యాన్సర్ డే నినాదం. మరో రెండేళ్ల పాటు ఇదే నినాదంతో క్యాన్సర్ డే కార్యక్రమాలు ప్రపంచాన్ని చైతన్యవంతం చేస్తాయి. అయితే యు.ఎస్.లో ఉంటున్న రాజ్యలక్ష్మి దంపతులు గత ఐదేళ్లుగా ఇదే నినాదంతో.. ‘నేనున్నాను.. నేనుంటాను’ అంటూ క్యాన్సర్ పేషెంట్లకు భరోసా ఇవ్వడంతో పాటుఆర్థికంగా తోడ్పాటునిస్తున్నారు. ‘‘మేడమ్! మెడిసిన్స్ స్టాక్ తగ్గుతోంది. మరికొంత పంపిస్తారా’’ హోల్‌సేల్ డ్రగ్గిస్ట్ మాధవి నుంచి ఫోన్.‘‘అలాగే మాధవీ! ఈ నెల ఎక్కువ అవసరం పడ్డాయా? సరే, అరేంజ్ చేస్తాను’’ బదులిచ్చారు రాజ్యలక్ష్మి. వెంటనే మందుల తయారీ కంపెనీకి ఫోన్ చేసి తనకు కావాల్సిన మెడిసిన్స్ ఇండెంట్ చెప్పారామె. ఇంతలో మరో ఫోన్... డాక్టర్ నుంచి. ‘‘మేడమ్! ఈ నెల ఎక్కువ మందిని రిఫర్ చేశాను. అంత అవసరం ఏర్పడింది.’’‘‘ఫర్వాలేదు డాక్టర్ గారూ, ఎంతమంది వచ్చినా పంపించండి’’ భరోసా ఇచ్చారు రాజ్యలక్ష్మి.‘‘అంతకు ముందు మందులు కొనుక్కోలేని పేషెంట్లను చూసి ఓ క్షణం బాధపడి, తర్వాత మర్చిపోయేవాళ్లం. ఇప్పుడు పేషెంట్లకు ధైర్యం చెప్పి మీరు అరేంజ్ చేసిన డీలర్ దగ్గరకు పంపిస్తున్నాం. ఇది మీతో ప్రతిసారీ చెప్తున్న మాటే అయినా మళ్లీ మళ్లీ చెప్పాలనిపిస్తోంది. మందులు సబ్సిడీ ధరల్లో దొరుకుతాయని చెప్పినప్పుడు, అసలే కొనలేని వాళ్లకు ఉచితంగా ఇస్తారని చెప్పినప్పుడు పేషెంట్ కళ్లలో కనిపించే సంతోషం ఇంత అని మాటల్లో చెప్పలేను. వ్యాధి నయం అయినట్లే రిలీఫ్ పొందుతుంటారు. వాళ్లందరి తరఫున మరోసారి కృతజ్ఞతలు’’ అన్నారు ఆ డాక్టర్.‘‘చేస్తున్నది నేను కాదు డాక్టర్ గారూ, ఆ భగవానుడే నా చేత చేయిస్తున్నాడు. సేవ అవసరం నాకు తెలియడానికే నాకు వ్యాధిని ఇచ్చి, వ్యాధిని తగ్గించి, మళ్లీ జీవితాన్నిచ్చినట్లున్నాడు. ఇకపై ఈ జీవితం అభాగ్యుల సేవకోసమే. నాకొక్కదానికే ఈ బాధ తెలిస్తే చాలదనుకున్నాడేమో ఆ భగవంతుడు. నాతో పాటు, నా భర్తనూ క్యాన్సర్ బారిన పడేసి, తిరిగి మమ్మల్ని మామూలు మనుషులను చేశాడు. ఖరీదైన క్యాన్సర్ మందులు కొనుక్కోలేని వాళ్లకు సహాయం చేయడానికి డబ్బును కూడా ఆ భగవంతుడే సమకూర్చాడు. ఆ భగవంతుడిచ్చిన డబ్బును అవసరమైన వాళ్లకు చేరుస్తున్న చేతులు మాత్రమే ఇవి’’ అన్నారు రాజ్యలక్ష్మి మృదువుగా. నిజమే.. ఆమె ఎప్పుడూ తాను సహాయం చేస్తున్నానని చెప్పరు. తాను నమ్మే భగవానుడే చేయిస్తున్నాడంటారు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే (గివింగ్ బ్యాక్ టు సొసైటీ) సంకల్పం తనలో కలగడం కూడా ఆ భగవానుని ప్రేరణేనంటారామె. ‘మణీస్ కేఫ్’ వాళ్లమ్మాయి రాజ్యలక్ష్మి ప్లాంజెరీ పుట్టింది, పెరిగింది నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో. అప్పట్లో ప్రసిద్ధి చెందిన మణీస్ కేఫ్ వాళ్లమ్మాయి. తమిళనాడు నుంచి వచ్చి కావలిలో స్థిరపడిన తమిళ కుటుంబం వారిది. కావలిలో న్యాయవాదిగా కెరీర్ మొదలు పెట్టిన రాజ్యలక్ష్మికి నెల్లూరు కోమల విలాస్ వాళ్లబ్బాయి శంకర్‌నారాయణతో వివాహమైంది. కొన్నాళ్లు హైదరాబాద్‌లో ఉన్నారు వాళ్లు. ఆమె హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు కూడా. భర్తకు అమెరికాలో ఉద్యోగం రావడంతో ఆమె ప్రయాణానికి గమ్యం కూడా అమెరికానే అయింది. ప్లాంజెరీ అనేది తమిళనాడులో శంకర్‌నారాయణ పూర్వికుల గ్రామం. ఆ ఊరి పేరే ఇంటిపేరుగా అమెరికాలో స్థిరపడ్డారు వాళ్లు. ఆ సంగతులను యు.ఎస్.నుంచి ‘సాక్షి’తో పంచుకున్నారు రాజ్యలక్ష్మి ప్లాంజెరీ. డాలర్ ఆరు రూపాయల కాలం ‘‘మేము అమెరికా వెళ్లినప్పుడు ఒక డాలర్ ఆరు రూపాయలు. జీవించడానికి, జీవితంలో నిలదొక్కుకోవడానికి మా వారి జీతం సరిపోయేది. మాకు తొలిబిడ్డ అమ్మాయి. ఇంటి వెలుగు అని మురిసిపోయేలోపు పిడుగులాంటి నిజం. పాపాయి స్పెషల్లీ చాలెంజ్డ్ చైల్డ్! వైద్యం చేయించడానికి జీతం సరిపోయేది కాదు. బిడ్డను కాపాడుకోవాలనే ఆరాటంతో ఎనిమిదేళ్లపాటు పోరాటం చేశాం. మన బంధం ఇంతటితో తీరిపోయిందని చెప్పకుండానే మమ్మల్ని విడిచివెళ్లిపోయింది శారద (పాపాయి పేరు). ఆ ఇంట్లో ఉండబుద్ధయ్యేది కాదు. ఎటైనా వెళ్లిపోవాలనిపించేది. తర్వాత పుట్టిన బాబు పనుల్లో మునిగిపోతున్నా కూడా నాకు పాప గుర్తుకొస్తుండేది. ‘మీ డెస్టినేషన్ ఇది’ అని మా వారికి కొరియాలో ఉద్యోగం చూపించాడు భగవంతుడు. కొరియాకు వెళ్లిన తర్వాత కూడా నేను మామూలు మనిషి కాలేకపోయాను. ఊహలకు తప్ప మాటలకు లేని పాపాయి తరచూ గుర్తుకు వస్తుండేది. కొరియాలో సత్య సాయిబాబా స్పిరిచ్యువల్ గ్యాదరింగ్స్ జరిగేవి. ఇండియన్స్ ఎక్కడెక్కడ ఉన్నారా అని వెతికి పట్టుకుని మరీ ఆహ్వానించేవాళ్లు. ఆధ్యాత్మిక సత్సంగాల్లో సాంత్వన దొరికింది. ఆ సత్సంగాలు మా జీవిత గమనాన్నే మార్చేశాయి. సత్యసాయి రప్పించారు యు.ఎస్.నుంచి ఏటా సాయిబాబా దర్శనానికి పుట్టపర్తికి వచ్చేవాళ్లం. ఓసారి బాబా మా వారితో ‘ఇప్పటి వరకు సమాజం నుంచి తీసుకున్నావు. ఇక సమాజానికి చేయాల్సింది చాలా ఉంది. హైదరాబాద్‌లో ఉంటూ నువ్వు చేయాల్సిందంతా పూర్తి చేయి’ అన్నారు. ఆ మాటతో అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చాం. సమాజానికి తిరిగి ఇవ్వడం మొదలైంది. మొదటగా ఇచ్చింది ప్రభుత్వానికే. ఎన్ఆర్ఐకి ఇచ్చే టాక్స్ మినహాయింపును తీసుకోకుండా పూర్తి ట్యాక్స్ కట్టారాయన. అమెరికాలో ఆయన చదువుకోవడానికి స్కాలర్‌షిప్‌తో ఆదుకున్న ఐవోడబ్లు్యఎ యూనివర్సిటీలో ఏటా మూడు మెరిట్ స్కాలర్షిప్లు ఇస్తున్నాం. మా పాపకు స్పెషల్ ట్రీట్మెంట్, ట్రైనింగ్ ఇప్పించడానికి అప్పట్లో మా దగ్గర అంత డబ్బు ఉండేది కాదు. యుఎస్‌లోని రే గ్రాహమ్ అసోసియేషన్ మాకు హెల్ప్ చేసింది. ఆ చారిటీకి మా పాప శారదాదేవి పేరుతో ఫైనాన్షియల్ ఎయిడ్ ఇస్తున్నాం. శారద మెమోరియల్‌తో స్పెషల్లీ చాలెంజ్డ్ కిడ్స్‌కి అవసరమైన సర్వీస్ ఇస్తూ ఉంటే శారద మాకు లేదని అనిపించదు. అప్పటికే ఫోర్త్ స్టేజ్! ఆ భగవంతుడు మా చేత... విద్యకు, స్పెషల్ కిడ్స్‌కే కాదు, వైద్యరంగానికీ సేవ చేయించాలనుకున్నాడో ఏమో తెలియదు. మా భార్యాభర్తలిద్దరినీ మూడు నెలల తేడాతో క్యాన్సర్ బారిన పడేశాడు, ఆనక బతికించాడు. 2011లో మా అబ్బాయికి పెళ్లి చేశాం. ‘అరవై నిండాయి, బాధ్యతల నుంచి రిటైరయ్యాం’ అనుకునే లోపు ఆ ఏడాది ఆగస్టులో నాకు బ్రెస్ట్ క్యాన్సర్ బయటపడింది. అప్పటికే ఫోర్త్ స్టేజ్. మూడు నెలలే అన్నారు డాక్టర్లు. నాకు వైద్యం మొదలైంది. ఆ ఏడాది డిసెంబర్లో మా వారికి స్టమక్ క్యాన్సర్ బయటపడింది. ఇద్దరమూ ట్రీట్మెంట్ తీసుకున్నాం. నాకు మందులతోనే తగ్గిపోయింది. ఇద్దరం కోలుకున్న తర్వాత క్యాన్సర్ నివారణకు ప్రివెంటివ్ మెడిసిన్ రీసెర్చ్‌కి మావంతుగా తిరిగి ఇవ్వాలనిపించింది. హ్యూస్టన్‌లోని ఎండిఎ రీసెర్చ్‌కి, ఆరిజోనాలోని ఫీనిక్స్ నగరంలో హోమియో మెడిసిన్ పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్‌కి మా వంతు సాయం చేస్తున్నాం. ఇండియాలో నేరుగా పేషెంట్‌కే సహాయం చేస్తున్నాం. ఏడాదిలో సగం కాలం అమెరికాలో ఉంటాం. అందుకే క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్లను కలిసి మేము చేయదలుచుకున్నది చెప్పాం. మాధవి అనే హోల్‌సేల్ డీలర్‌తో అనుసంధానం అయ్యాం. ఎనభై వేలు, లక్ష రూపాయలు ఉండే ఇంజక్షన్లను వేయించుకోలేని వాళ్లకు మేము ఆసరా అవుతున్నాం. పేషెంట్లు వాళ్లు భరించగలిగినంత ఖర్చును వాళ్లు భరిస్తారు, మిగిలిన డబ్బు మేమిస్తాం. ఒక్కొక్కరు నలభై వేలు పెట్టుకుంటారు, ఒక్కొక్కరు ఐదు–పది వేలకు మించి భరించలేమంటారు. అసలే ఆధారమూ లేని వాళ్లకు ఫ్రీగా ఇస్తున్నాం. తల్లిగా, గృహిణిగా నా బాధ్యతలు పూర్తయ్యాయి. ఇప్పుడు సోషల్ వర్క్‌లో ఉన్న సంతృప్తిని ఆస్వాదిస్తున్నాను. ఈ జీవితం ఇక సమాజానికి తిరిగి ఇవ్వడానికే. ఏటా ఇంత మొత్తం చదువులకు, ఇంత మొత్తం వైద్యానికి, ఇంత మొత్తం స్పెషల్ కిడ్స్‌కి, ఇంత మా ఇద్దరి మెయింటెనెన్స్‌కి అని విభజించుకుని ఖర్చు చేస్తున్నాం. మా అబ్బాయి ఇక్కడే అమెరికాలో తన ఉద్యోగంలో స్థిరపడ్డాడు. మేము సంపాదించుకున్నదంతా ఇక సమాజసేవకే అంకితం’’ అన్నారు రాజ్యలక్ష్మి. – వాకా మంజులారెడ్డి భయం వద్దు.. ధైర్యం పెంచుకోవాలి నాకు సర్జరీ చేయాల్సిందేనన్నారు డాక్టర్లు. అయితే దేవుడి రూపంలో డాక్టర్ సెంథిల్ ‘మందులతో తగ్గుతుందేమో ప్రయత్నం చేద్దాం’ అన్నారు. మందులు వేసుకుంటూ రోజూ ప్రాణాయామం చేశాను. పచ్చటి చెట్టు కింద కూర్చుని ఉదయం పది నిమిషాలు, మధ్యాహ్నం పది నిమిషాలు, సాయంత్రం పది నిమిషాలు ప్రాణాయామం చేస్తే తగినంత ఆక్సిజెన్ అందుతుంది. దేహం తనను తానే తిరిగి ఆరోగ్యవంతం చేసుకుంటుంది. ఒంటికి రోజూ సూర్యరశ్మి తగలాలి. జీవనశైలిని ఆక్సిజెన్ రిచ్‌గా ఉండేలా చూసుకోవాలి. వైఫై ఎన్విరాన్మెంట్ను తగ్గించుకోవాలి. ముఖ్యంగా బిడ్డల్ని కనాల్సిన వయసులో ఉన్న అమ్మాయిలు మంచి ఆహారం, మంచి గాలిలో జీవించాలి. చేతిలో ఆరోగ్యం ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసి, ఆ తర్వాత ఆరోగ్యం కోసం వెంపర్లాడే పరిస్థితి తెచ్చుకోవద్దనేది నా సూచన. ఇక క్యాన్సర్ బారిన పడిన వాళ్లకు చెప్పే మాట ఒకటే.. ఇప్పుడు మంచి మందులున్నాయి. క్యాన్సర్ ప్రాణాంతకం కాదు. ధైర్యంగా ఎదుర్కోవడమే మనిషిగా మనం చేయాల్సింది. నేను భగవంతుడిలో ధైర్యాన్ని వెతుక్కున్నాను. వేద పఠనం ఓ శక్తి తరంగం మోడరన్ లైఫ్స్టయిల్లో క్యాన్సర్ 35 ఏళ్లకే దాడి చేస్తోంది. బయట నూనెలో వేయించిన ఆహారం, సెల్‌ఫోన్ రేడియేషన్ చాలా ప్రమాదకరం. మాది చాలా డిసిప్లిన్డ్ లైఫ్‌స్టయిలే అయినా, హైదరాబాద్, శ్రీనగర్ కాలనీలో మా ఇంటి దగ్గరలో ఉన్న సెల్ టవర్లే క్యాన్సర్ బారిన పడేశాయి. వేదం, రుద్రం, పంచసూక్త పఠనం చేస్తాను. ఆ వైబ్రేషన్స్ ఒట్టి శబ్ద తరంగాలు కాదు, శక్తి తరంగాలు. మనిషిని ఆరోగ్యవంతం చేస్తాయి. మామూలు వ్యక్తుల్లాగే అన్ని పనులూ చేసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తున్నాం. – శంకర్‌నారాయణ ప్లాంజెరీ, -
హెబ్బా.. స్మైల్ అదిరిందబ్బా..
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం విజయవాడలో 5కే వాక్ నిర్వహించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ రన్లో నటి హెబ్బా పటేల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లబ్బీపేట (విజయవాడతూర్పు) : క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించడం ద్వారా వందశాతం నివారించవచ్చని రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా తానా ఫౌండేషన్, రూట్స్ హెల్త్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో 5కే వాక్ నిర్వహించారు. ఈ వాక్‌లో పెద్ద సంఖ్యలో యువత, వాకర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ నేడు ప్రజలకు సోకుతున్న వ్యాధులన్నీ జీవనశైలి కారణంగానే అని నిర్ధారణ అవుతున్న వేళ, ప్రజల తమ దినచర్యలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జబ్బు చేసిన తర్వాత చికిత్స కోసం పరుగులు పెట్టేదానికన్నా, వ్యాధి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల క్యాన్సర్ కేసులు పెరగడం ఆందోళన కలిగించే విషయంగా పేర్కొన్నారు. ప్రస్తుతం అత్యాధునిక వైద్య పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని, తొలిదశలో క్యాన్సర్‌ను నిర్ధారించే అవకాశం ఉందన్నారు. క్యాన్సర్ వ్యాధి, లక్షణాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని చెప్పారు. క్యాన్సర్‌పై పోరాటం చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, యువజన సర్వీసుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్, మురళీమోహన్, రాష్ట్ర డీజీపీ ఎం.మాలకొండయ్య, నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, నగర మేయర్ కోనేరు శ్రీధర్, శాసన సభ్యులు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, రూట్స్ అధ్యక్షుడు డాక్టర్ పీవీఎస్ విజయభాస్కర్ పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా నిఖిల్, హెబ్బాపటేల్ క్యాన్సర్‌పై అవగాహన కలిగించేందుకు నగరంలో నిర్వహించిన ర్యాలీలో సినీ నటులు నిఖిల్, హెబ్బాపటేల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ఐదు కిలోమీటర్లు నడిచి, వాకర్స్‌లో ఉత్సాహాన్ని నింపారు. ఉచిత నిర్ధారణ పరీక్షలు హైదరాబాద్‌లోని బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉచిత నిర్ధారణ పరీక్షలు, వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 450 మందికిపైగా వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో 63 మందికి అల్ట్రాసౌండ్ స్కానింగ్, 20 మందికి మమ్మోగ్రామ్, 25 మందికి ఎక్స్‌రే, 55 మందికి పాప్‌స్మియర్ టెస్ట్‌లు ఉచితంగా నిర్వహించారు. ఇద్దరిలో క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించడంతో వారికి హైదరాబాద్ ఆస్పత్రికి పంపించారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రవణ కుమారి, డాక్టర్ రవిశంకర్, డాక్టర్ సులోచనరాణి, డాక్టర్ సూర్యప్రకాష్, డాక్టర్ భువనకుమారి బృందం పాల్గొన్నారు. ఈ శిబిరం సోమవారం కూడా కొనసాగనుంది. -
కేన్సర్ విస్తరిస్తోంది.. బహుపరాక్!!
జంట నగరాల్లో రోడ్ల మీద ఎలాంటి మాస్కులు లేకుండా, హెల్మెట్ కూడా పెట్టుకోకుండా ఒక్క గంటసేపు తిరగండి.. తర్వాత కూడా మీరు ప్రశాంతంగానే ఉండగలుగుతున్నారా? హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారా? రెండూ కష్టమే. ఎందుకంటే మన గాలిలో ఒక క్యూబిక్ మీటరుకు 60 మైక్రో గ్రాముల వరకు పర్టిక్యులేట్ మేటర్ (పీఎం) ఉండొచ్చని ప్రమాణాలు చెబుతుంటే, ఇప్పుడు ఉన్నది మాత్రం 95 మైక్రో గ్రాములు! వీటివల్ల ఏమవుతుందో తెలుసా? మామూలు ఆస్తమా నుంచి ఊపిరితిత్తుల కేన్సర్ వరకు, గుండెపోటుతో సహా అనేక రకాల వ్యాధులు వస్తాయి!! ఇదంతా కేవలం పీఎం వల్ల మాత్రమే. అదే ఆటోలు, బస్సులు, ఇతర వాహనాల నుంచి వెలువడుతున్న పొగలో ఉండే కాలుష్యం వల్ల పలు రకాల కేన్సర్లు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు ఈ కాలుష్యం వల్ల బాగా దెబ్బతినే ప్రమాదం కనపడుతోంది. ఇటీవలి కాలంలో లంగ్ కేన్సర్ కేసులు ఎక్కువ కావడానికి ఇదే ప్రధాన కారణమని పల్మనాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. మంగళవారం (ఫిబ్రవరి 4) ప్రపంచ కేన్సర్ దినం. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు.. ఇలా పలు రకాల కారణాలతో కేన్సర్ విస్తృతంగా వ్యాపిస్తోంది. పసి పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ ఒక్కరినీ వదలట్లేదు. దీని బారిన పడిన కుటుంబాలు ఇటు ఆర్థికంగా, అటు మానసికంగా దారుణంగా చితికిపోతున్నాయి. చాలావరకు కేన్సర్లు మూడు, నాలుగో దశలలో తప్ప బయట పడకపోవడం, అప్పటికే వ్యాధి ముదిరిపోవడంతో చికిత్సకు కూడా ఒక పట్టాన లొంగదు. ఒకటిన్నర ఏళ్ల వయసున్న హర్షిత్ చాలా చురుగ్గా ఉండేవాడు. చకచకా అటూ ఇటూ ఇంట్లో పరుగులు తీస్తూ అమ్మానాన్నలను ఒక్కక్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉంచేవాడు. అలాంటిది ఉన్నట్టుండి నడవడం మానేశాడు. భయం భయంగా చూసేవాడు. దాంతో కలవరపడిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్తే, ఎంఆర్ఐ తీయించారు. మెదడుకు సంబంధించిన హైడ్రోకెఫాలస్ అనే వ్యాధి వచ్చిందని, దాంతోపాటు మెదడులో ట్యూమర్లు కూడా ఉన్నాయని వైద్యులు తేల్చారు. ఆ రెండింటికీ శస్త్రచికిత్సలు చేశారు. కానీ, ఆ చిన్నారి కోలుకోలేదు. కోమాలోనే ఉండిపోయాడు!! 78 ఏళ్ల గోపాలకృష్ణ రిటైర్డ్ హెడ్మాస్టారు. ఒక్క దురలవాటు కూడా లేదు. నిత్యం పూజా పునస్కారాలతో నిష్ఠగా జీవితం గడిపేవారు. ఉన్నట్టుండి గొంతు మింగుడు పడటం తగ్గింది. ఏం తినాలన్నా, చివరకు మంచినీళ్లు తాగాలన్నా కూడా ఇబ్బందిగా ఉండేది. కొన్నాళ్లు చూసి, డాక్టర్ల దగ్గరకు వెళ్తే, అనుమానం వచ్చి ఎండోస్కోపీ, బయాప్సీ పరీక్షలు చేయించారు. చూస్తే.. అన్నవాహిక వద్ద కేన్సర్ వచ్చినట్లు తెలిపారు. విషయం తెలిసిన మూడు నెలలకే ఆయన కన్నుమూశారు. చక్కగా తిరుగుతూ ఉండేవాళ్లను కూడా కబళిస్తున్న ఈ కేన్సర్ విస్తృతి వెనుక బహుళజాతి సంస్థల కుట్ర కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆహార పంటలపై విచ్చలవిడిగా ఉపయోగిస్తున్న పురుగు మందులు, రసాయనాలు కూడా నేరుగా శరీరంలోకి వెళ్లిపోయి కేన్సర్‌ను కలగజేస్తున్నాయని అంటున్నారు. వీటన్నింటికీ పరిష్కారం ఎప్పటికి దొరుకుతుందో చూడాలి మరి!! -
నేడు క్యాన్సర్ డే రోజు
-
రేపు ప్రపంచ కేన్సర్ దినం అవగాహనే అసలు మందు!
న్యూఢిల్లీ: కేన్సర్... ఈ పేరు వింటేనే గుండెల్ల్లో రైళ్లు పరుగెడుతాయి. అదే మన సొంతవారికెవరికైనా కేన్సర్ ఉందని తెలిస్తే.. మన గుండె ఆగినంత పనవుతుంది. రోగితోపాటు అతని కుంటుంబం మొత్తం ఇక తమ జీవితం ముగిసిపోయిందన్న భావనలోకి వెళ్లిపోతుంది. ఇలాంటివారికి సంఘీభావం పలికేందుకు, వారిలో ధైర్యాన్ని నూరిపోసేందుకు వేలాదిమంది యువతీయువకులు, నగర ప్రముఖులు సామాజిక కార్యకర్తలు, క్రీడాకారులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రాజ్‌పథ్‌కు వచ్చారు. కేన్సర్ రోగులకు సంఘీభావంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తామూ మద్దతు పలుకుతున్నామని చెప్పారు. ఏడో వార్షిక వాకథాన్‌లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని భారత మహిళా క్రికెట్ జట్లు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా జెండా ఊపి ప్రారంభించారు. కేన్సపోర్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం గురించి ఆ సంస్థ వ్యవస్థాపకులు హర్మలా గుప్తా మాట్లాడుతూ... ‘పశ్చిమ దేశాలతో పోలిస్తే కేన్సర్‌పై భారతీయులకు అవగాహన చాలా తక్కువ. కేన్సర్ ఒకసారి సోకిందంటే అది ఇక వ్యాప్తి చెందుతూనే ఉంటుందని, చివరికి మరణమే శరణ్యమని భావిస్తున్నారు. దాని నుంచి విముక్తి పొందే చికిత్స గురించి అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేస్తున్న చికిత్స చాలామంది రోగులకు అందుబాటులో ఉండడం లేదు. అందుబాటులో ఉన్న చికిత్స గురించి రోగులకు సమాచారం లేదు. అందుకే కేన్సపోర్ట్ సంస్థ కేన్సర్ బాధితులకు అండగా నిలుస్తుంది. ఈ విషయాన్ని చాటిచెప్పేందుకే ఏడో వార్షిక వాకథాన్‌లో కేన్సర్ రోగులకు సంఘీభావం ప్రకటిస్తున్నామ’న్నారు. రోగి ఇంటికే కేన్సర్ చికిత్స కేన్సర్ సోకిన వ్యక్తి మానసికంగా కుంగిపోతాడు. అతని కుటుంబం కూడా అచేతనంగా మారుతుంది. ఇటువంటి సమయంలో రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లడం, చికిత్స చేయించడం వంటివి చాలా కష్టంగా మారతాయి. ముప్పై సంవత్సరాల చిత్రా షా కూడా తన భర్తకు ఊపిరితిత్తుల కేన్సర్ సోకిందని తెలియగానే మానసికంగా బలహీనురాలైపోయింది. అప్పటికే ఇద్దరు పిల్లలు. వారిని పెంచే బాధ్యత, భర్తకు చికిత్స చేయించే బాధ్యతలన్నీ ఆమె భుజాలపైనే పడ్డాయి. అటువంటి పరిస్థితుల్లో ఆమెకు కొండంత బలాన్నిచ్చే ఓ వార్త తెలిసింది. అదే రోగి వద్దకే కేన్సర్ చికిత్స. అదీ.. అందుబాటు ధరలో. హెడ్ మెడికల్ సర్వీస్, హెల్త్ కేర్ ఎట్ హోం సంస్థ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆ సంస్థ ప్రతినిధి గౌరవ్ ఠుక్రాల్ ఈ విషయమై మాట్లాడుతూ... ‘అసలే కేన్సర్ సోకిందనే బాధలో ఉన్న కుటుంబం ఆస్పత్రుల వెంట తిరిగి అనవసర ఖర్చులను భరించాల్సి వస్తుంది. దీంతో వారికి వైద్యం కోసం అయ్యే ఖర్చుతోపాటు ఇతర ఖర్చులు కలిసి తడిసి మోపెడవుతాయి. సమయం లేనివారికైతే చికి త్స చేయించడం ఓ నరకమే. ఇటువంటి వారికోసమే మా సంస్థ ‘రోగుల వద్దకే చికిత్స’ కార్యక్రమంతో ముందుకొచ్చింది. ఇందులోభాగంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండే అన్ని సదుపాయాలను కల్పిస్తాం. కేన్సర్ రోగులకు ఇంజెక్షన్ ద్వారా అందించే కీమోథెరపీని శిక్షణ పొందిన నర్సుల సాయంతో ఇంటివద్దనే అందించడం ద్వారా రోగికి అనవసరమైన వ్యయప్రయాసలను తగ్గించవచ్చు. అంతేకాక ప్రయాణ ఖర్చులు కూడా చాలావరకు తగ్గుతాయి. బయట ఆస్పత్రుల్లో అందిస్తున్నదానికంటే తక్కువ ధరకే ఈ సేవలను అందిస్తామ’ని చెప్పారు.


