తల నుంచి కాలి వరకూ క్యాన్సర్‌ను ముందే పట్టేయండి

Types Of Cancers In Humans Symptoms Ways To Recognize - Sakshi

శరీరంలోని ఏదైనా ఒక కణం... నిరాటంకంగా, నిర్విరామంగా, నిరుపయోగంగా పెరుగుతూ పోయేదే క్యాన్సర్‌. అలా పెరిగాక రోగిని నిస్సత్తువగా చేసేస్తుంది. అలా ఓ పరిమితీ పాడూ లేకుండా అనారోగ్యకరంగా, అసాధారణమైన పెరిగే ఈ క్యాన్సర్‌ కణం మొదట ఒకే కణంతోనే మొదలవుతుంది. అది రెట్టింపు అయ్యే ప్రక్రియలో 20వ సారి రెట్టింపు అయ్యే సమయంలో ఒక మిలియన్‌ కణాలుగా వృద్ధిచెందుతుంది. మిలియన్‌ కణాల సముదాయంగా పెరిగిన ఆ సమయంలోనూ దాన్ని కనుక్కోవడం కష్టసాధ్యం. అదే 30వసారి రెట్టింపు అయ్యే సమయంలో అందులో బిలియన్‌ కణాలుంటాయి. ఆ సమయంలో దాన్ని ఓ గడ్డ (లంప్‌)లా గుర్తించడం సాధ్యం.

అంటే... చేత్తో గడ్డను తాకి గుర్తించే సమయంలో అందులో బిలియన్‌ కణాలుంటాయన్నమాట. ఇక 40వ సారి రెట్టింపయ్యాక అందులో ఒక ట్రిలియన్‌ కణాలుంటాయి. అప్పటికీ చికిత్స లభించక 42–43వ సారి రెట్టింపయినప్పుడు రోగి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తాడు. అన్ని రెట్టింపులు కాకముందే... అంటే కేవలం 20వ సారి రెట్టింపయ్యే లోపు కనుక్కోగలిగితే నయం చేసే అవకాశాలు  చాలా ఎక్కువే. మరి ఆ దశలో కనుక్కోవడం ఎలా? తల నుంచి మన దేహంలోని కింది భాగాల్లోని ఏదైనా అవయవంలో క్యాన్సర్‌ను ముందే ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం. క్యాన్సర్‌ లక్షణాలు అవయవానికీ అవయవానికీ మారిపోతాయి. అయితే క్యాన్సర్‌ రోగులందరిలో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యవంతుల్లోనూ అప్పుడప్పుడూ కనిపించేవి కావడంతో వాటిని గుర్తించడం కష్టం.  

క్యాన్సర్‌ను గుర్తించేందుకు కొన్ని సాధారణ అంశాలు... 

  • ఆకలి తగ్గడం
  • కారణం తెలియకుండా / ఏ కారణమూ లేకుండా బరువు తగ్గడం
  • ఎడతెరిపి లేకుండా దగ్గు 
  • లింఫ్‌ గ్లాండ్స్‌ (బాహుమూలాల్లో, గజ్జల్లో, గొంతుదగ్గర) వాపు
  • (కొన్నిసార్లు కొన్ని అవయవాలలో మాత్రమే) అవయవాలనుంచి రక్తస్రావం... 

ఇవి సాధారణంగా కనిపించే లక్షణాలు. అయితే ఈ లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌వే కానక్కర్లేదు. కాబట్టి వీటిలో ఏదో ఒకటి కనిపించిన మాత్రాన అందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ప్రాథమిక చికిత్స తీసుకున్న తర్వాత కూడా, అదేపనిగా కనిపిస్తున్నప్పుడు మాత్రం ఒకసారి డాక్టర్‌చేత పరీక్ష చేయించుకుని అది క్యాన్సర్‌ కాదని నిర్ధారణ చేసుకొని నిశ్చింతగా ఉండాలి.  తల నుంచి శరీరం కింది భాగం వరకు ఆయా అవయవభాగాల్లో తొలి దశలోనే క్యాన్సర్‌ను గుర్తించేందుకు కొన్ని ప్రాథమిక లక్షణాలివి... 

బ్రెయిన్‌ క్యాన్సర్‌... 
తలనొప్పి, అకస్మాత్తుగా మతిమరపు రావడం, కొన్నిసార్లు సామాజిక సభ్యత మరచి ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మనిషి మెదడులో మాట్లాడటానికీ, దృష్టికీ, వినికిడి కీ, కాళ్లూచేతుల కదలిక ల నియంత్రణకు... ఇలా వేర్వేరు ప్రతిచర్యలకు వేర్వేరు కేంద్రాలు (సెంటర్స్‌) ఉంటాయన్న విషయం తెలిసిందే. క్యాన్సర్‌ అభివృద్ధి చెందిన సెంటర్‌ దేనికి సంబంధించినదైతే ఆ అవయవం చచ్చుబడటం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఇవీ ఆయా అవయవాలకు సంబంధించి తొలిదశలో క్యాన్సర్‌కు లక్షణాలు.  

గొంతు భాగంలో... 
దీన్ని ఓరో ఫ్యారింజియల్‌ భాగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గొంతులో ఏదో ఇరుక్కుని ఉన్న భావన ఉంటుంది. అన్నవాహిక మొదటి భాగంలో అయితే మింగడంలో ఇబ్బంది. 

కడుపు (స్టమక్‌)లో... 
అదే కడుపు (స్టమక్‌)లో అయితే మంట పుడుతున్నట్లుగా ఉండే నొప్పి. పొట్టలో మంట. కొన్నిసార్లు పొట్టలో రక్తస్రావం అయినప్పుడు ఆ రక్తం వల్ల విసర్జన సమయంలో మలం నల్లగా కనిపిస్తుంది. రక్తస్రావం వల్ల రక్తహీనత (ఎనీమియా) కూడా కనిపించవచ్చు. దాంతో పాటు కొన్ని సార్లు కొద్దిగా తినీతినగానే కడుపునిండిపోయిన ఫీలింగ్‌. 

తల భాగంలో... 
ఈ క్యాన్సర్స్‌ నోటిలో, దడవ మీద, నాలుక మీద లేదా చిగుళ్లు (జింజివా) మీదా ఇలా తలభాగంలో ఎక్కడైనా రావచ్చు. ఆయా భాగాల్లో ఎరుపు, తెలుపు రంగుల ప్యాచెస్‌ ఉన్నా, దీర్ఘకాలంగా మానని పుండు (సాధారణంగా నొప్పి లేని పుండు, కొన్ని సందర్భాల్లో నొప్పి ఉండవచ్చు కూడా) ఉంటే క్యాన్సర్‌ అయ్యేందుకు అవకాశం ఎక్కువ. అదే నాలుక మీద అయితే నాలుక కదలికలు తగ్గవచ్చు. నాలుక వెనక భాగంలో అయితే స్వరంలో మార్పు. మరింత వెనకనయితే మింగడంలో ఇబ్బంది. ఇక స్వరపేటిక ప్రాంతంలో అయితే స్వరంలో మార్పు. మెడ దగ్గరి లింఫ్‌ గ్రంధుల వాపు. 

సర్విక్స్‌ క్యాన్సర్‌... 
దక్షిణ భారతదేశంలోని తీరప్రాంతాల్లోని మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్‌ ఇది. రుతుస్రావం సమయంలో గాక మధ్యలోనూ రక్తం రావడం, రుతుస్రావం ఆగిపోయిన (మెనోపాజ్‌) మహిళల్లో అసాధారణంగా రక్తస్రావం కావడం, మహిళల్లో సెక్స్‌ తర్వాత రక్తస్రావం (పోస్ట్‌ కాయిటల్‌ బ్లీడింగ్‌), ఎరుపు, తెలుపు డిశ్చార్జీ వంటివి దీని లక్షణాలు. 

రొమ్ము క్యాన్సర్‌... 
మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ రకం క్యాన్సర్‌లో... రొమ్ములో ఓ గడ్డ చేతికి తగలడం, రొమ్ము పరిమాణంలో మార్పు, రొమ్ము మీది చర్మం ముడతలు పడటం, రొమ్ము చివర (నిపిల్‌) నుంచి రక్తంతో కలిసిన స్రావం లాంటివి రొమ్ము క్యాన్సర్‌ లక్షణాలు. 

ఊపిరితిత్తులు...  
పొగతాగేవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువ.  ఈ క్యాన్సర్‌ ఉన్నవాళ్లలో దగ్గు, కళ్లెలో రక్తం పడటం వంటì  లక్షణాలు కనిపిస్తాయి. ఎక్స్‌–రే, సీటీ స్కాన్‌ పరీక్ష ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. 

రెక్టమ్‌ క్యాన్సర్‌లో... 
మలద్వారం (రెక్టమ్‌) క్యాన్సర్‌ విషయంలోనూ మల విసర్జన తర్వాత కూడా ఇంకా లోపల మలం మిగిలే ఉందన్న అనుభూతి ఉంటుంది. దీనికో కారణం ఉంది. విసర్జించాల్సిన పదార్థం మామూలుగా మలద్వారం వద్దకు చేరగానే అక్కడి నాడులు స్పందించి అక్కడ మలం పేరుకుని ఉన్నట్లుగా మెదడుకు సమాచారమిస్తాయి. దాంతో దాన్ని విసర్జించాల్సిందిగా మెదడు ఆదేశాలిస్తుంది. కానీ విసర్జన తర్వాత కూడా అక్కడ క్యాన్సర్‌ ఓ గడ్డలా ఉండటంతో ఏదో గడ్డ మిగిలే ఉందన్న సమాచారాన్ని నాడులు మెదడుకు మళ్లీ మళ్లీ చేరవేస్తుంటాయి. దాంతో ఇంకా అక్కడేదో ఉందన్న భావన కలుగుతూ ఉంటుంది. ఈ లక్షణంతో పాటు కొందరిలో బంక విరేచనాలు, రక్తంతో పాటు బంక పడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. 

ఒవేరియన్‌ క్యాన్సర్‌... 
దాదాపు 50, 60 ఏళ్ల మహిళల్లో పొట్ట కింది భాగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఈ భాగానికి క్యాన్సర్‌ వస్తే ఒక్కోసారి ఏ లక్షణాలూ కనిపించకుండానే ప్రమాదకరంగా పరిణమించవచ్చు. 

టెస్టిస్‌ క్యాన్సర్‌... 
పురుషుల్లో వచ్చే ఈ క్యాన్సర్‌లో వృషణాల సైజ్‌ పెరగడం, దాన్ని హైడ్రోసిల్‌గా పొరబాటు పడటం వల్ల పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోవడంతో అది సైజ్‌లో పెరిగి ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలు ఎక్కువ. 

ప్రోస్టేట్‌ క్యాన్సర్‌... 
సాధారణంగా 50, 60 ఏళ్లు దాటిన పురుషుల్లో తరచూ కనిపించే క్యాన్సర్‌ ఇది. దాదాపు లక్షణాలు ఏవీ పెద్దగా కనిపించకుండా వచ్చే ఈ క్యాన్సర్‌లో రాత్రివేళల్లో మూత్రవిసర్జనకు వెళ్లాల్సిన అవసరం ఎక్కువగా ఉండవచ్చు. పీఎస్‌ఏ అనే పరీక్ష ద్వారా దీన్ని తేలిగ్గా గుర్తించవచ్చు. 

కిడ్నీ అండ్‌ బ్లాడర్‌ క్యాన్సర్స్‌..
మూత్ర విసర్జన సమయంలో రక్తం కనిపించడం, మాటిమాటికీ మూత్రం రావడం మూత్రపిండాలు, మూత్రాశయ క్యాన్సర్లలో కనిపించే సాధారణ లక్షణం. 

చర్మ క్యాన్సర్‌... 
చర్మ క్యాన్సర్‌ను ఏ,బీ,సీ,డీ అనే నాలుగు లక్షణాలతో తేలిగ్గా గుర్తించవచ్చు. శరీరంపై ఏదైనా మచ్చ తాలూకు ఏ– అంటే... ఎసిమెట్రీ (అంటే మచ్చ సౌష్టవం మొదటికంటే మార్పు వచ్చినా, బీ– అంటే... బార్డర్‌ అంటే అంచులు మారడం, మందంగా మారడం జరిగినా, సీ– అంటే కలర్‌ రంగు మారినా, డీ అంటే డయామీటర్‌... అంటే వ్యాసం (సైజు) పెరిగినా దాన్ని చర్మం క్యాన్సర్‌ లక్షణాలుగా భావించవచ్చు. 

కొంతమందిలో తమ తాత తండ్రుల్లో, పిన్ని వంటి దగ్గరి సంబంధీకుల్లో క్యాన్సర్‌ ఉన్నప్పుడూ, అలాగే స్మోకింగ్, ఆల్కహాల్‌ వంటి అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారూ... ఇక జన్యుపరంగా అంటే... జీరోడెర్మా, న్యూరోఫైబ్రమాటోసిస్‌ వంటి  వ్యాధులున్నవారిలో క్యాన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి హైరిస్క్‌ వ్యక్తులంతా మిగతావారికంటే మరింత అప్రమత్తంగా ఉంటూ, మరింత ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించాలి. 

అందరూ గమనించాల్సిన అంశం ఏమిటంటే... ఇక్కడ ప్రస్తావించిన లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌కు సంబంధించినవే అని ఆందోళన వద్దు. కాకపోతే తొలిదశలో తేలిగ్గా గుర్తిస్తే క్యాన్సర్‌ తగ్గుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి. అందుకే ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందకుండా ఒకసారి డాక్టర్ల సూచన మేరకు పరీక్ష చేయించుకోవాలి.ఇక అది క్యాన్సర్‌ కాదని నిర్ధరించుకొని నిశ్చింతగా, నిర్భయంగా ఉండండి. 

బ్లడ్‌ క్యాన్సర్స్‌... 
రక్తం కూడా ద్రవరూపంలో ఉండే కణజాలమే కాబట్టి... బ్లడ్‌ క్యాన్సర్‌ కూడా రావచ్చు. రక్తహీనత, చర్మం మీద పొడలా (పర్ప్యూరిక్‌ ప్యాచెస్‌) రావడం, చిగుళ్లలోంచి రక్తం రావడం, బరువు తగ్గడం, జ్వరం రావడం వంటివి బ్లడ్‌ క్యాన్సర్‌ లక్షణాలు. లింఫ్‌ గ్లాండ్స్‌ అన్నవి బాహుమూలాల్లో, దవడల కింది భాగంలో మెడకు ఇరువైపులా, గజ్జెల్లో ఉండే ఈ గ్రంథులకూ క్యాన్సర్‌ రావచ్చు. దాన్ని లింఫోమా అంటారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top