అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేస్తే.. గల్ఫ్ సముద్ర గర్భంలోని ఇంటర్నెట్ కేబుళ్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించినట్లు రాయిటర్స్ కథనం వెల్లడించింది. అంతేకాదు.. దెబ్బతిన్న కేబుళ్ల మరమ్మతులను అడ్డుకుని అంతరాయాన్ని మరింతకాలం కొనసాగించే యోచనలో ఉన్నట్లు ఇరాన్‌కు చెందిన ఇద్దరు సీనియర్ భద్రతా అధికారులు పేర్కొన్నారు. దీంతో అంతర్జాతీయ ఇంటర్నెట్ సేవలపై ఈ పరిణామాల ప్రభావం ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది.
ప్రపంచ అంతర్జాతీయ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో దాదాపు 99 శాతం సముద్ర గర్భంలోని ఫైబర్ కేబుళ్ల ద్వారానే సాగుతుంది. ఇరాన్, ఒమన్ మధ్య ఉన్న హార్మూజ్ జలసంధి గల్ఫ్ ప్రాంతాన్ని ఒమన్ సముద్రం, అరేబియా సముద్రంతో అనుసంధానిస్తుంది. ఈ మార్గంలో ఆసియా-ఆఫ్రికా-యూరప్-1 (AAE-1), ఫాల్కన్ (FALCON), గల్ఫ్ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ వంటి కీలక కమ్యూనికేషన్ కేబుళ్లు ఉన్నాయి. ఇవి ఆసియా, యూరప్, భారత్, శ్రీలంక, గల్ఫ్ దేశాలు, ఆఫ్రికాలోని పలు ప్రాంతాల మధ్య డేటా రవాణాకు ఉపయోగపడుతున్నాయి.
హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే కేబుళ్లు ప్రపంచ అంతర్జాతీయ బ్యాండ్‌విడ్త్‌లో ఒక శాతం కంటే తక్కువ భాగాన్ని మోస్తాయి. అందువల్ల ఈ మార్గంలోని కేబుళ్లు దెబ్బతింటే ఇంటర్నెట్‌పై ప్రభావం పడుతుంది. అయితే, ఒకేసారి పలు కేబుళ్లు తెగిపోతే గల్ఫ్ ప్రాంతంలో ఇంటర్నెట్ వేగం తగ్గడం, ఆన్‌లైన్ చెల్లింపులు, ఈ-కామర్స్, క్లౌడ్ సేవలకు అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉంది.
IRAN HAS DEVELOPED PLANS TO ATTACK UNDERSEA INTERNET CABLES IN THE PERSIAN GULF IF THE U.S. OR ISRAEL LAUNCHES FURTHER STRIKES, TWO SENIOR IRANIAN OFFICIALS TOLD REUTERS. https://t.co/w5j741E8J7
— Russian Market (@runews) October 23, 2026
భారత్‌కు ఎంత నష్టం?
భారత్ అంతర్జాతీయ ఇంటర్నెట్ కనెక్టివిటీకి సముద్ర గర్భంలోని కేబుళ్లు కీలకం. ట్రాయ్ 2022లో వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో 14 కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల వద్ద సుమారు 17 సబ్‌మెరైన్ కేబుళ్లు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా ముంబై, చెన్నై ప్రాంతాల్లో కేంద్రీకృతమయ్యాయి. హార్మూజ్ మార్గంలోని కేబుళ్లు దెబ్బతింటే భారత్‌లో ఇంటర్నెట్ దెబ్బతినే అవకాశం ఉంది. అయితే, గల్ఫ్ దేశాలతో డేటా అనుసంధానం, అంతర్జాతీయ ఇంటర్నెట్ ట్రాఫిక్‌పై ఒత్తిడి పెరగవచ్చు. కొన్ని ఆన్‌లైన్ సేవలు నెమ్మదించడం, అంతర్జాతీయ డేటా మార్పిడిలో అంతరాయాలు ఏర్పడటం వంటి ప్రభావాలు ఉండనుంది. నష్టం ఎంతవరకు ఉంటుందనేది ఎన్ని కేబుళ్లు దెబ్బతిన్నాయి, ప్రత్యామ్నాయ మార్గాల సామర్థ్యం ఎంత ఉందనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.
మరమ్మతులే అసలు సవాలు
సముద్ర గర్భంలో కేబుళ్లు తెగితే వాటిని బాగు చేయడానికి ప్రత్యేక నౌకలు, సంబంధిత దేశాల అనుమతులు అవసరం. 2024లో కేబుల్ మరమ్మతులకు సగటున 51 రోజులు పట్టినట్లు అమెరికా నేవీ అధికారి వెల్లడించిన వివరాలను రాయిటర్స్ పేర్కొంది. యుద్ధ పరిస్థితుల్లో దాడుల ప్రమాదం, నౌకల కొరత, అనుమతుల్లో జాప్యం కారణంగా మరమ్మతులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మొత్తంగా, ఇరాన్ హెచ్చరించినట్లుగా సముద్ర గర్భంలోని కేబుళ్లపై దాడులు జరిగితే ప్రపంచ ఇంటర్నెట్ పూర్తిగా స్తంభించకపోయినా, గల్ఫ్ ప్రాంతంతో పాటు భారత్ సహా పలు దేశాల అంతర్జాతీయ డేటా కనెక్టివిటీపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: అమెరికాకు కొత్త టెన్షన్.. మిస్టరీ వస్తువుపై ఫోకస్


