జర్మనీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. జర్మనీలోని బోచుమ్ (Bochum) నగరంలో జరిగిన అపార్ట్మెంట్ అగ్నిప్రమాదంలో కేరళకు చెందిన ముగ్గురు భారతీయులు మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఈ విషాద ఘటనలో మరో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో మరో కేరళ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సంఘటనపై హత్య అనుమానంతో పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
స్థానిక మీడియా ప్రకారం..జర్మనీలోని బోచుమ్ నగరంలో పోస్ట్స్ట్రాసే (Poststrasse) ప్రాంతంలోని ఒక బహుళ అంతస్తుల నివాస భవనంలో తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం సంభవించింది. మృతులను నోవా సాబు (ఇడుక్కి), అంజలి శీలా జాయ్ (కొల్లం), సివిన్ జానీ (ఎర్నాకులం)గా గుర్తించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, కావాలనే నిప్పు పెట్టినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. భవనంలో నివసించే 41 ఏళ్ల రొమేనియా జాతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రమాదంలో పొగ పీల్చడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన మరో ఐదుగురిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

జిమ్ ట్రైనర్, వేర్‌హౌస్ ఉద్యోగి, విద్యార్థి
నోవా సాబు: రిటైర్డ్ సబ్-ఇన్స్పెక్టర్ కేపీ సాబు ,చెంబాకప్పార ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పబ్లిక్ హెల్త్ నర్సుగా పనిచేసే పీఎన్ జ్యోతిల కుమార్తె. ఆమె జూలై 3న జర్మనీకి వెళ్లారు. అక్కడ పార్ట్‌టైమ్ జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు.
సివిన్ జానీ : ఉన్నత చదువుల కోసం జర్మనీకి వెళ్లిన రెండు వారాలకే ఈ ఘటన జరిగింది. అతని సోదరుడు సల్విన్ జర్మనీలో, సోదరి సిమి ఐర్లాండ్‌లో ఉంటున్నారు.
అంజలి షీలా జాయ్: బీఈడీ పూర్తి చేసి, ఉద్యోగం కోసం జూలైలో జర్మనీకి వెళ్లారు. ఆమె అక్కడ ఒక వేర్‌హౌస్‌లో పనిచేస్తున్నారు. జాయ్ బంధువు ప్రసన్న ప్రయాస్ మాట్లాడుతూ, జాయ్‌కు కేరళలో ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే కోరిక ఉండేదనీ, పీఎస్సీ పరీక్షలు చాలాసార్లు రాసినా నీ ఫలితం లేకపోవడంతో విదేశాలకు వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం ఆమె కల అని కంటతడిపెట్టారు.
జాయ్ మామ జాన్సన్ మాట్లాడుతూ, మంగళవారం రాత్రి ఆమె మామూలుగా చేసే ఫోన్ కాల్ రాకపోవడంతో ఆందోళన కుటుంబ కుటుంబ సభ్యులు ఫోన్ చేయడంతో విషయం తెలిసిందన్నారు. దుబాయ్‌లో ఉన్న ఒక స్నేహితుడు వారికి అగ్నిప్రమాదం గురించి చెప్పారనీ, ఉదయానికల్లా, మృతులలో ఆమె పేరు కూడా ఉందంటూ కన్నీరు మున్నీరయ్యారు. జర్మనీలో నివసిస్తున్న ఒక బంధువు సంఘటనా స్థలానికి వెళ్లి స్థానిక పోలీసులతో విషయాన్ని ధృవీకరించారు. మరో మేనల్లుడు ఆస్ట్రియా నుంచి అక్కడికి చేరుకున్నారు.
ఇదీ చదవండి : షాకింగ్ వీడియో : ఇతగాణ్ణి పట్టుకోండి! వీసీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం
మృతుల భౌతికకాయాలను వీలైనంత త్వరగా కేరళకు రప్పించేందుకు కొల్లం ఎంపీ ఎన్.కె. ప్రేమ్‌చంద్రన్ జర్మనీలోని భారత రాయబారి అజిత్ గుప్తేను కోరారు. కేరళ ప్రభుత్వ టూరిజం మంత్రి పి.సి. విష్ణునాథ్ మాట్లాడుతూ, ఎన్.ఓ.ఆర్.కె.ఎ. (NORKA) భారత రాయబార కార్యాలయంతో కలిసి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. జర్మనీలోని మలయాళీ సంఘాలు కూడా మృతదేహాలను స్వదేశానికి రప్పించే ఖర్చులను భరించేందుకు ముందుకు వచ్చాయి.
ఇదీ చదవండి: రూ. 70 కోట్లు : ఇన్ఫ్లూయెన్సెర్కి చుక్కలు చూపించిన COD ఆర్డర్లు


