మెదడుతో హలో.. హలో! కొత్త యుగానికి చలో చలో! | Health: Scientists grow mini human brains to power computers | Sakshi
Sakshi News home page

మెదడుతో హలో.. హలో! కొత్త యుగానికి చలో చలో!

Nov 29 2026 1:43 PM | Updated on Nov 29 2026 1:43 PM

Health: Scientists grow mini human brains to power computers

మన మెదడుతో నేరుగా ముచ్చటించేందుకు కృత్రిమ న్యూరాన్లు కూడా సిద్ధమవుతున్నాయి. శాస్త్రవేత్తలు ఏకంగా ల్యాబ్‌లోనే ఈ ‘ఆర్టిఫిషియల్‌ బ్రెయిన్‌ సెల్స్‌’ను ప్రింట్‌ చేసేశారు. ఒకవేళ భవిష్యత్తులో మన ఆలోచనలకూ, టెక్నాలజీకీ మధ్య ఏవైనా ‘తగాదాలు’ వస్తే, ఈ కృత్రిమ న్యూరాన్లే మధ్యవర్తిత్వం వహిస్తాయేమో చూడాలి! ఊహలు ఎలా ఉన్నా, ఈ టెక్నాలజీ ఉపయోగాలు మాత్రం ఊహించలేనన్ని!

న్యూరాన్లను ప్రింట్‌ తీశారు! 
మన శరీరంలో మెదడు నుంచి ఇతర భాగాలకు, ఇతర భాగాల నుంచి మెదడుకు సమాచారాన్ని వేగంగా చేరవేసే నరాల కణాలను, లేదా నాడీ కణజాలాన్ని ‘న్యూరాన్లు’ అంటారు. ఇంకోలా చెప్పాలంటే, మన శరీరంలోని ‘ఎలక్ట్రిక్‌ వైర్లు’ అవి. తాజాగా నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ ఇంజనీర్లు ఏం చేశారంటే, అచ్చంగా అలాంటి న్యూరాన్స్‌నే కృత్రిమంగా ప్రింట్‌ చేసి సంచలనం సృష్టించారు. 

అవి కేవలం నకళ్లు మాత్రమే కాదు. అసలైన మెదడు కణాలతో నేరుగా మాట్లాడగలవు కూడా! అంటే మెదడుతో సంభాషించగలవు. ఈ కొత్త న్యూరాన్‌లు మెత్తగా, వంచడానికి వీలుగా ఉండటమే కాకుండా, సజీవ న్యూరాన్ల మాదిరిగానే విద్యుత్‌ సంకేతాలను ఉత్పత్తి కూడా చేయగలవు. అదీ కారు చౌకగా!! 

మెదడుతో మాట్లాడించారు
ఈ సరికొత్త ఆవిష్కరణను నిరూపించడానికి సైంటిస్టులు ఎలుకల మెదడు కణజాలంపై ప్రయోగాలు నిర్వహించారు. ఈ కృత్రిమ న్యూరాన్లు పంపిన చిన్నపాటి సిగ్నల్స్‌ని ఎలుకలలోని అసలైన మెదడు కణాలు అందుకుని, స్పష్టమైన ప్రతిస్పందనను చూపించాయి. ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌లు, మన జీవ నాడీ వ్యవస్థ ఒకదానితో ఒకటి కలిసి ఎంత చక్కగా పనిచేయగలవో ఈ ప్రయోగం నిరూపించింది. 

భవిష్యత్తులో ఈ అద్భుతమైన టెక్నాలజీ ద్వారా మెదడులో అమర్చే ఇంప్లాంట్స్‌ను మరింతగా మెరుగుపరచవచ్చు. అంతేకాదు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ చేత చాలా తక్కువ శక్తితో పని చేయించవచ్చు.  

భవిష్యత్తుకు బంగారు బాట
ఈ సరికొత్త పరిశోధన భవిష్యత్తులో బ్రెయిన్‌–మెషిన్‌ ఇంటర్‌ఫేస్‌లకు, న్యూరోప్రోస్థెటిక్‌ పరికరాల తయారీకి ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చూపును, వినికిడిని లేదా కదలికలను కోల్పోయిన వారికి సహాయపడే ప్రత్యేక ఇంప్లాంట్స్‌ను తయారు చేయడానికి ఇది మార్గం సుగమం చేస్తుంది. మరింత శక్తిమంతమైన, సమర్థవంతమైన కంప్యూటింగ్‌ భవిష్యత్తుకు బాటలు వేస్తుంది.

ఇంతవరకు మనకు తెలిసిన దానిని బట్టి మెదడే అత్యంత శక్తిమంతమైన, సమర్థవంతమైన కంప్యూటింగ్‌ సిస్టమ్‌. ఇప్పుడిక ఈ కృత్రిమ న్యూరాన్ల ద్వారా, మెదడు సిగ్నల్స్‌ పంపే విధానాన్ని సంబంధిత హార్డ్‌వేర్‌ చక్కగా అనుకరిస్తుంది. దీనివల్ల రాబోయే తరం కంప్యూటర్లు ప్రస్తుత సిస్టమ్స్‌ కంటే చాలా తక్కువ శక్తిని వినియోగించుకుంటూనే అత్యంత క్లిష్టమైన పనులను సులభంగా చేస్తాయి.

కృత్రిమ మేధకు కృత్రిమ ‘మేత’
‘‘మనం ఇప్పుడు ఏఐ యుగంలో ఉన్నాం. ఏఐని మరింత తెలివైనదిగా మార్చడానికి భారీ డేటాతో శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది. ఇది పెద్ద ఎత్తున విద్యుత్‌ వినియోగానికి దారి తీస్తోంది. అలాగే అపరిమితమైన డేటాను, ఏఐని సమర్థవంతంగా నిర్వహించడానికి మరింత మెరుగైన హార్డ్‌వేర్‌ను తయారు చేయాల్సి ఉంటుంది. 

డిజిటల్‌ కంప్యూటర్‌ కంటే మన మెదడు ఐదు రెట్లు ఎక్కువ క్రియాశీలంగా పనిచేస్తుంది కాబట్టి, భవిష్యత్‌ కంప్యూటింగ్‌ కోసం మెదడే మనకు గొప్ప స్ఫూర్తి. అందుకు ఈ తాజా కృత్రిమ న్యూరాన్ల పరిశోధనా ఫలితాలు ఉపయోగపడతాయి’’ అని మార్క్‌ సి. హెర్సామ్‌ అంటున్నారు. 

మెదడును పోలిన ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ప్రముఖ పరిశోధకుడైన మార్క్‌ హెర్సామ్, నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీలో మెటీరియల్స్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌గా; మెడిసిన్‌ అండ్‌ కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ విశేషమైన అధ్యయనానికి మెక్‌కార్మిక్‌ స్కూల్‌లో రీసెర్చ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా ఉన్న వినోద్‌ కె. సంగ్వాన్‌ సహ నాయకత్వం వహించారు.

గతం కంటే ఎంతో మెరుగైనవి
సాధారణంగా కంప్యూటింగ్‌ అవసరాలు పెరిగేకొద్దీ, సంప్రదాయ సిస్టమ్స్‌ ఒకే రకమైన భాగాలను మరిన్ని జత చేయడం ద్వారా ఆ సవాళ్లను ఎదుర్కొంటాయి. ఆధునిక చిప్‌లలో గట్టిగా, బల్లపరుపుగా ఉండే సిలికాన్‌ పలకలపై బిలియన్ల కొద్దీ ట్రాన్సిస్టర్లు అమర్చి ఉంటాయి. వీటిలో ప్రతి ఒక్కటి ఒకే రకమైన పనిని చేస్తుంది, పైగా ఒకసారి వీటిని తయారు చేశాక ఆ వ్యవస్థలలో ఎలాంటి మార్పులు జరగవు.

అయితే మన మెదడు పనిచేసే విధానం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మెదడులో అనేక రకాల న్యూరాన్లు ఉంటాయి, వాటిలో ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన బాధ్యతలను నిర్వర్తిస్తూ మెత్తని, త్రీ–డైమెన్షనల్‌ నెట్‌వర్క్‌లుగా ఉంటాయి. మనం కొత్త విషయాలను నేర్చుకునే కొద్దీ, ఈ నెట్‌వర్క్‌లు నిరంతరం తమను తాము మార్చుకుంటూ, కొత్త కనెక్షన్లను ఏర్పరచుకుంటూ, పాత వాటిని మలుచుకుంటూ ఉంటాయి.

సిలికాన్‌ చిప్‌లు బిలియన్ల కొద్దీ ఒకేలా ఉండే పరికరాల ద్వారా సంక్లిష్టతలను సాధిస్తాయి కానీ అవి అన్నీ ఒకేలా గట్టిగా, మారని విధంగా ఉంటాయి. మన మెదడు మాత్రం దీనికి పూర్తి విరుద్ధమైనది, విభిన్నమైనది. ఎప్పటికప్పుడు మారే స్వభావంతో, త్రీ–డైమెన్షనల్‌ నిర్మాణంతో  ఉంటుంది. పరిశోధకులు దానిని సాధించాలంటే, కొత్త మెటీరియల్స్‌తో పాటు ఎలక్ట్రానిక్స్‌ని నిర్మించడానికి సరికొత్త మార్గాలను కనిపెట్టాలి. 

శాస్త్రవేత్తలు గతంలో కూడా కృత్రిమ న్యూరాన్లను తయారు చేసినప్పటికీ, అవి చాలా సాధారణమైన సిగ్నల్స్‌ను మాత్రమే ఉత్పత్తి చేసేవి, అందువల్ల క్లిష్టమైన పనుల కోసం ఇంజనీర్లు పెద్ద నెట్‌వర్క్‌లపై ఆధారపడాల్సి వచ్చేది. పైగా ఎక్కువ విద్యుత్‌ వినియోగానికి దారితీసేది. 

‘సంభాషణ’ సక్సెస్‌
కృత్రిమ న్యూరాన్లు నిజమైన జీవ వ్యవస్థలతో కలిసి పనిచేయగలవో లేదో తెలుసుకోవడానికి, పరిశోధకుల బృందం అమెరికాలోని సుప్రసిద్ధ ‘వీన్‌బెర్గ్‌’ విశ్వవిద్యాలయ కళాశాలలో న్యూరోబయాలజీ ప్రొఫెసర్‌గా ఉన్న ఇందిరా ఎం. రామన్‌ సహకారం తీసుకుంది. ఆమె బృందం ఎలుకల చిన్న మెదడు భాగాలపై ఈ కృత్రిమ సిగ్నల్స్‌ని ప్రయోగించి పరీక్షించింది. 

ఈ పరీక్షలలో వెలువడిన కరెంట్‌ సిగ్నల్స్‌... సమయం, నిడివి వంటి ముఖ్య విషయాలలో అచ్చంగా సహజమైన న్యూరాన్ల కార్యకలాపాలతో సరిపోలాయని నిర్ధారణ అయింది. అంతేకాకుండా, సహజమైన మెదడు సిగ్నల్స్‌ మాదిరిగానే ఈ కృత్రిమ సిగ్నల్స్‌ కూడా అసలైన న్యూరాన్లను సమర్థంగా ఉత్తేజపరిచి, నాడీ వలయాలను క్రియాశీలం చేశాయి. 

‘‘గతంలో ఇతర ల్యాబ్‌లు ఆర్గానిక్‌ మెటీరియల్స్‌తో కృత్రిమ న్యూరాన్లను తయారు చేయడానికి ప్రయత్నించినప్పుడు అవి చాలా నెమ్మదిగా సిగ్నల్స్‌ పంపాయి. లేదా మెటల్‌ ఆక్సైడ్స్‌ వాడినప్పుడు అవి అవసరానికి మించి వేగంగా పని చేశాయి. 

కానీ మేము తయారు చేసిన న్యూరాన్లు గతంలో ఎన్నడూ సాధ్యం కాని సరైన సమయ పరిధిలో పని చేస్తున్నాయి. సజీవ న్యూరాన్లలా మా ఈ కృత్రిమ న్యూరాన్లు స్పందిస్తున్నాయి. అంటే జీవ కణాలతో నేరుగా సంభాషించడానికి కావలసిన సరైన సమయ వేగంతో పాటు, కచ్చితమైన సిగ్నల్స్‌ను మేము సాధించాం’’ అని ఉద్వేగంగా చెబుతున్నారు హెర్సామ్‌.  

ఏరోసోల్‌ జెట్‌ ప్రింటింగ్‌
కృత్రిమ న్యూరాన్లను, అసలైన న్యూరాన్ల ప్రవర్తనను మరింత ఖచ్చితంగా పోలి ఉండేలా రూపొందించడానికి పరిశోధకులు మృదువైన, ప్రింట్‌ చేయడానికి వీలైన మెటీరియల్స్‌ను వాడారు. వీరు సెమీకండక్టర్‌గా పనిచేసే మోలిబ్డినం డైసల్ఫైడ్‌ (ఎంఒఎస్‌2), కండక్టర్‌గా పనిచేసే ‘గ్రాఫిన్‌’ నానోస్కేల్‌ రేణువులతో ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్‌ ఇంక్‌లను తయారు చేశారు. ఆ తర్వాత ‘ఏరోసోల్‌ జెట్‌ ప్రింటింగ్‌’ అనే పద్ధతి ద్వారా ఈ ఇంకులను వంచడానికి వీలుగా ఉండే ఫ్లెక్సిబుల్‌ పాలిమర్‌ ఉపరితలంపై ముద్రించారు.

గతంలో ఈ ఇంక్‌లలో ఉండే పాలిమర్‌ భాగం కరెంట్‌ ప్రవాహానికి అడ్డు తగలడాన్ని ఒక లోపంగా భావించేవారు, అందుకే ప్రింట్‌ చేసిన తర్వాత సాధారణంగా దాన్ని పూర్తిగా తొలగించేవారు. కానీ ఈసారి రీసెర్చర్లు ఆ పాలిమర్‌నే తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పాలిమర్‌ను పూర్తిగా తొలగించకుండా పాక్షికంగా మాత్రమే విచ్ఛిన్నం చేశారు. ఆ తర్వాత ఆ పరికరం గుండా కరెంట్‌ పంపినప్పుడు పాలిమర్‌ మరింతగా విచ్ఛిన్నం చెందుతుంది. ఈ విచ్ఛిన్న ప్రక్రియ ఒకేలా కాకుండా అక్కడక్కడా మారుతూ జరగడం వల్ల, ఒక సన్నని ప్రదేశంలో కరెంట్‌ అంతా కేంద్రీకృతమై ఒక కండక్టివ్‌ ఫిలమెంట్‌ (కరెంట్‌ ప్రవహించే సన్నని దారి) ఏర్పడుతుంది.

ఈ సన్నని కరెంట్‌ మార్గం వల్ల అచ్చంగా న్యూరాన్‌ ఉత్తేజితమైనప్పుడు వచ్చేలాంటి ఆకస్మిక విద్యుత్‌ ప్రతిస్పందన ఏర్పడుతుంది. దీని ఫలితంగా ఈ కృత్రిమ న్యూరాన్లు అనేక రకాల ప్రవర్తనలు కలిగిన సిగ్నళ్లను ఉత్పత్తి చేయగలవు. ఇవి సరిగ్గా జీవనాడిలో జరిగే సహజమైన నాడీ కార్యకలాపాలను పోలి ఉంటాయి. 

ప్రతి పరికరం ఇలాంటి సంక్లిష్టమైన సిగ్నల్స్‌ను నిర్వహించగలగడం వల్ల, తక్కువ భాగాలతో భవిష్యత్‌ కంప్యూటింగ్‌ సిస్టమ్స్‌లో శక్తి సామర్థ్యాన్ని భారీగా మెరుగుపరుస్తుంది. హెర్సామ్‌ ప్రయోగశాలలోని ఒక ఏరోసోల్‌ జెట్‌ ప్రింటర్‌. సాగే గుణం గల పాలిమర్‌ ఉపరితలంపై ఈ ప్రింటర్‌ ఎలక్టాన్రిక్‌ సిరాను పూస్తుంది.

డేటా సెంటర్లకు వరం
పరిశోధకుల ఈ తాజా ఆవిష్కరణ పర్యావరణానికి ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. కృత్రిమ న్యూరాన్ల తయారీ ప్రక్రియ చాలా సులభంగా, తక్కువ ఖర్చుతో కూడుకున్నదిగా ఉండటమే కాకుండా, ఇందులో ఉపయోగించే ‘అడిటివ్‌ ప్రింటింగ్‌’ పద్ధతి వల్ల మెటీరియల్స్‌ను కేవలం అవసరమైన చోట మాత్రమే వేస్తారు, దీనివల్ల వృథా చాలా వరకు తగ్గుతుంది. 

నేడు ఏఐ వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ‘శక్తి’ తాలూకు సామర్థ్యాన్ని మెరుగుపరచడం చాలా ముఖ్యం, ఎందుకంటే పెద్ద డేటా సెంటర్లు ఇప్పటికే భారీ మొత్తంలో విద్యుత్‌ను వినియోగిస్తున్నాయి. వాటిని చల్లబరచడానికి విపరీతమైన నీరు అవసరమవుతోంది. ఈ కృత్రిమ న్యూరాన్ల వాడకం వల్ల విద్యుత్‌తో పాటు పరోక్షంగా నీటి వినియోగాన్ని కూడా తగ్గించవచ్చు. 

ఏఐ విద్యుత్‌ అవసరాలను తీర్చడానికి టెక్‌ కంపెనీలు ప్రత్యేకంగా అణు విద్యుత్‌ కేంద్రాలతో నడిచే భారీ గిగావాట్‌ డేటా సెంటర్లను నిర్మిస్తున్నాయి. భవిష్యత్తులో ఒక డేటా సెంటర్‌కు వంద అణు విద్యుత్‌ కేంద్రాలు అవసరమయ్యే పరిస్థితి రాదని చెప్పలేం. అప్పుడు ఆ భారీ విద్యుత్‌ వినియోగం కంప్యూటింగ్‌ వృద్ధిని అడ్డుకుంటుంది. 

మరో ప్రధాన సమస్య ఏమిటంటే, గిగావాట్ల కొద్దీ విద్యుత్‌ ఖర్చయినప్పుడు విపరీతమైన వేడి పుడుతుంది, ఆ డేటా సెంటర్లను చల్లబరచడానికి నీటిని వాడటం వల్ల నీటి వనరులపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. కాబట్టి ఏ కోణంలో చూసినా ఏఐ కోసం తక్కువ శక్తితో పనిచేసే మెరుగైన హార్డ్‌వేర్‌ను మనం కనుగొనాల్సిందే. ‘‘అందుకు ఈ కృత్రిమ న్యూరాన్లు ఉపయోగపడతాయి’’ అని ప్రొఫెసర్‌ హెర్సామ్‌ గట్టి నమ్మకంతో చెబుతున్నారు. 
– సాక్షి స్పెషల్‌ డెస్క్‌

ఇదీ చదవండి: ఎంత పెద్ద మనసు ఆ ‘అమ్మ’ది..! ఒడిలో పసికందు, కళ్లముందు పుట్టెడు దుఃఖం అయినా..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement