బుధుడి కక్ష్యలో ‘బెపికొలంబో’కు షాక్‌.. మరో గండం! | Bepicolombo Mercury Mission Orbit Change | Sakshi
Sakshi News home page

బుధుడి కక్ష్యలో ‘బెపికొలంబో’కు షాక్‌.. మరో గండం!

Nov 29 2026 11:47 AM | Updated on Nov 29 2026 11:55 AM

Bepicolombo Mercury Mission Orbit Change

బుధ గ్రహంపై పరిశోధనల కోసం ఎనిమిదేళ్ల క్రితం జపాన్‌ ఏరోస్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఏజెన్సీ (జాక్సా), యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ఈఎస్ఏ) సంయుక్తంగా ప్రయోగించిన ‘బెపికొలంబో’ మిషన్‌ ఈ నెల 21న ఆ గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. అయితే ప్రవేశ సమయంలో సాంకేతిక సమస్య ఎదురైంది. ప్రణాళిక ప్రకారం 37 నిమిషాలు మండాల్సిన ఇంజిన్లు 28 నిమిషాలే పనిచేశాయి. దీంతో అవసరమైన వేగ మార్పులో 77 శాతాన్ని మాత్రమే వ్యోమనౌక అందుకోగలిగింది.

ఈ కారణంగా శాస్త్రవేత్తలు నిర్దేశించిన కక్ష్యలోకి కాకుండా మరో కక్ష్యలోకి చేరింది. వాస్తవానికి ప్రతి 58 నిమిషాలకు ఒకసారి బుధుడి చుట్టూ పరిభ్రమించాల్సి ఉండగా.. ప్రస్తుతం ప్రతి 75 గంటలకు ఒకసారి చుట్టివచ్చే కక్ష్యలో ఉంది. బుధుడికి అత్యంత దూరంగా ఉన్నప్పుడు శాస్త్రవేత్తలు అంచనా వేసిన దానికంటే 10 వేల కిలోమీటర్లు ఎక్కువ ఎత్తులో ఉంటుంది. దీంతో పరిశోధనలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

అయితే వ్యోమనౌక ప్రస్తుతం సక్రమంగానే పనిచేస్తుండటం, కొత్త కక్ష్య కారణంగా తదుపరి సమస్యలు పెద్దగా ఉండకపోవచ్చని భావిస్తుండటం శాస్త్రవేత్తలకు కొంత ఊరటనిస్తోంది. ఇదిలా ఉంటే.. డిసెంబరు 9 (జర్మనీ), 10 (జపాన్) తేదీల్లో మరో కీలక ఘట్టం ఎదురుకానుంది. ప్రస్తుతం ఒకే యూనిట్‌గా ఉన్న రెండు ఆర్బిటర్లు ఆ రోజుల్లో విడిపోవాల్సి ఉంది.

జాక్సాకు చెందిన ‘మెర్క్యురీ మాగ్నెటోస్ఫెరిక్‌ ఆర్బిటర్‌’, ఈఎస్ఏకు చెందిన ‘మెర్క్యురీ ప్లానెటరీ ఆర్బిటర్‌’ వేర్వేరు ఎత్తుల నుంచి బుధుడిపై పరిశోధనలు చేపట్టనున్నాయి. అయితే బెపికొలంబో నిర్దేశించిన కక్ష్యలో లేకపోవడంతో ఈ రెండు ఆర్బిటర్లు విడిపోయే ప్రక్రియ సంక్లిష్టంగా మారవచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అనంతరం 2027 ఏప్రిల్‌ 6 నుంచి పూర్తిస్థాయి పరిశోధనలు ప్రారంభం కానున్నాయి.

బుధుడి కక్ష్యలో ప్రవేశ సమయంలో ఎదురైన అనూహ్య పరిణామంతో బెపికొలంబో ముందుజాగ్రత్తగా ‘సేఫ్‌ మోడ్‌’లోకి వెళ్లింది. దీంతో అవసరం లేని కార్యకలాపాలన్నింటినీ నిలిపివేసింది. సుమారు 2 బిలియన్‌ డాలర్లు (రూ.18,600 కోట్లు) వ్యయంతో చేపట్టిన ఈ మిషన్‌ భవిష్యత్తు పరిశోధనలు ఎలా సాగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
- జమ్ముల శ్రీకాంత్

ఇదీ చదవండి: అబ్బురపరిచిన  ఆర్కిటెక్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement